11, మార్చి 2015, బుధవారం

బడ్జెట్లు


ఒక టీవీ చానల్ డిబేట్ లో నాతొ పాటు పాల్గొన్న ప్రొఫెసర్ హర గోపాల్ చెప్పారు. గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాల పొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్త పన్నులు పడితే పాత రేటుకు కొన్న సరకులు కొత్త రేట్లకు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న రోజులవి. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గాస్ సిలిండర్  ధరలు, పెట్రోలు ధరలు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, ఫ్రిజ్  ల ఖరీదులు పెరిగాయా అనే ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పెద్ద ప్రభువులకు ఆనడం లేదు. మిగులు రాష్ట్రం కనుక కొన్నేళ్ళు పరవాలేదేమో. కానీ, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని అంటారు. కాస్త కళ్ళెం బిగబట్టడం అవసరమేమో.  (11-03-2015)    

సిగరెట్లు మానడం ఎలా?



(ఈరోజు 'నో స్మోకింగ్ డే')
ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశానుఅనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు నా గురించి చెప్పుకునేమాట వేరు. శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడుఅన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడుఅనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు మాటామంతీలేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 


(అలనాటి మా మాస్కో అపార్ట్ మెంట్లో)

2004లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలుఅని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.  మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో  విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ  ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు  కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు.  కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమని సలహా ఇచ్చారు.  కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా   ముందుకు వొంగి,  ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారుఅని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి,  నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో  ఇంతమందిని చూసానుఅంటూ,  ‘అదంత తేలిక కాదని ఆయనే చెబుతూ,  నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి,  ‘రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మొగుడు  నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మాఅని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన  మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.          
 (11-03-2015)
  


10, మార్చి 2015, మంగళవారం

ఏవిటి పరిష్కారం? ఇదా పరిష్కారం?

(Published by 'SURYA' Telugu Daily in it's Edit Page on 12-03-2015,THURSDAY)

పైకి విభిన్నంగా కనిపిస్తూ, సారూప్యం కలిగిన  కొన్ని వార్తలు గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్నాయి. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ శక్తి, మహిళా సాధికారత, వారి భద్రత గురించి రాజకీయ  నాయకులు చేసిన ప్రసంగాలు,  అంతకు కొద్ది రోజులముందు బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' సృష్టించిన అలజడి, అత్యాచార నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టడం పట్ల హైకోర్టు ఆగ్రహం, నాగాలాండ్ లో ఒక బాలికను లైంగికంగా వేధించాడన్న ఆరోపణతో జైల్లో వున్న నిందితుడిపై  ఆగ్రహోదగ్రులైన దిమాపూర్ ప్రజలు తీసుకున్న పాశవిక ప్రతీకార చర్య, ఇవన్నీ పెను సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి.
మహిళా దినోత్సవం యధావిధిగా ఒక తంతులా ముగిసింది. పత్రికల్లో ప్రత్యెక వ్యాసాలు, మీడియాలో ప్రత్యెక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో వినుతికెక్కిన వనితా మణులకు సర్కారు సత్కారాలు, మహిళల గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ప్రసంగాలు, స్త్రీలకు చేయబోయే సేవలను వివరిస్తూ వాగ్దానాలు ఇవన్నీ, బుల్లి తెరలపై  చూసీ, వినీ  ఆడంగులందరూ తిరిగి తమ పనిపాటల్లో పడిపోయివుంటారు. బహుశా ఈ జన్మకు ఇంతే అని కూడా మనస్సులో అనుకునివుంటారు.
నిజమే కావచ్చు.  ఒకప్పటి కంటే ఈనాటి మహిళలు  కొంత మెరుగయిన స్వేచ్చను అనుభవిస్తూ ఉండవచ్చు. మగవారికి దీటుగా ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తూ, రాజకీయాల్లో రాణిస్తూ ఉండవచ్చు. కానీ,  అతివల  అభ్యున్నతికి చదువొక్కటే కొలమానం అయితే, ఆర్ధిక స్వావలంబన ఒక్కటే గీటురాయి అయితే, చదువుకున్న మహిళలు, సంపాదిస్తున్న ఆడవారు ఈనాటికీ పైకి చెప్పుకోలేని అభద్రతాభావంలోనే వుండిపోవడానికి కారణం ఏమిటి?  రోజురోజుకూ వారిపై  పెరిగిపోతున్న అత్యాచారాలకు హేతువు ఏమిటి? స్త్రీలు సంచరించే చోట దేవతలు నర్తిస్తారు అనే పుణ్యభూమిలో నరరూప రాక్షసుల వికృత పోకడలకు అర్ధం ఏమిటి?
మహిళా దినోత్సవం సందర్భంగా చక్కటి స్పూర్తిదాయకమైన లఘు చిత్రం రూపొందించాలని బీబీసీ వంటి ప్రసిద్ధ ప్రసార మాధ్యమం తలపెడితే అందులో తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలే ప్రధానాంశంగా తీసుకుని డాక్యుమెంటరీ తీసినా ప్రశ్నించాల్సిన  అగత్యం లేదు.  ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' అత్యాచారం కేసులో శిక్షపడి జైల్లో వున్న ఖైదీని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసినా ఎందుకని అడగాల్సిన అవసరం లేదు. కానీ, మహిళా దినోత్సవం నాటికి కొద్ది ముందుగా యూ ట్యూబ్ లో ఆ పేరుతొ ప్రత్యక్షమైన అంశాలే ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయాలుగా పరిణమించడం ఇందులోని విషాదం.


నాగరిక సమాజం నివ్వెరపడే విధంగా, సిగ్గుతో తలదించుకునే విధంగా  అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి నేరస్తుడిగా జైల్లో వున్న వ్యక్తి -  'ఆ అమ్మాయి సహకరించి వుంటే ఇంతటి దుస్తితి ఆమెకు పట్టేది కాదు' అనే రీతిలో వ్యాఖ్యానించాడు అంటే దాన్ని మరో పెద్ద నేరంగా పరిగణించి శిక్ష విధించాల్సిన చట్టాలు మన దేశంలో లేకుండా పోయినందుకు దేశ ప్రజలు సిగ్గుపడాలి. తమ ముష్కర చర్యలద్వారా, అన్నెం పున్నెం ఎరుగని ప్రజల ప్రాణాలు నిలువునా తీసే ఉగ్రవాదుల దుశ్చర్యలు ఎంతటి ఘాతుకమైనవో, ముక్కూ మొహం తెలియని ఒక అమాయకపు ఆడపిల్ల మానాన్ని దోచుకునే ఇటువంటి నేరస్తుల నీతిమాలిన చర్యలు కూడా అంతే హేయమైనవి. నిజానికి అటువంటి వ్యాఖ్యలు చేసిన నిందితుడికి యావజ్జీవ శిక్షకంటే పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం వుంది. కానీ జరిగింది ఏమిటి? దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. మహిళా సంఘాలు ఖండించాయి. ప్రజాసంఘాలు నిరసించాయి. ప్రభుత్వం కదిలింది. తక్షణం యూ ట్యూబ్ నుంచి ఆ డాక్యుమెంటరీ కి సంబంధించిన ప్రచార భాగాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానికి లభించాల్సిన ప్రాచుర్యం ఇబ్బడి ముబ్బడిగా లభించింది.
మన దేశంలో నిషేధానికి గురయిన ఈ లఘు చిత్రానికి అమెరికాలో లభించిన గౌరవాదరాలు అన్నీ ఇన్నీ కావు. మూడు పర్యాయాలు అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఈ చిత్రం ప్రీమియర్ షోకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 2012 లో ఢిల్లీ లో నడుస్తున్న బస్సులో దారుణంగా అత్యాచారానికి గురయిన ఢిల్లీ యువతి పట్ల గౌరవంతో అసలు పేరు బయట పెట్టకుండా మన మీడియా కొంత మర్యాద పాటిస్తే, అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఆమె అసలు పేరుతోనే నివాళులు అర్పించారు. 'ఆమె భారతీయ తనయ (ఇండియాస్ డాటర్). కానీ ఈరోజు నుంచి ఆమె మన కుమార్తె కూడా' అంటూ వక్తలు మాట్లాడారు. భారతీయ తనయ అయినా అమెరికా అమ్మాయి అయినా ఆ నిర్భాగ్యురాలు వీటన్నిటికీ అతీతంగా మరో లోకానికి తరలి వెళ్ళింది. బహుశా అక్కడివాళ్ళయినా ఆ అభాగ్యురాలిని అక్కున చేర్చుకున్నారేమో తెలియదు.
ఈ డాక్యుమెంటరీ తీసిన బ్రిటిష్ మహిళ లెస్లీ ఉడ్విన్ కూడా ఒకప్పుడు అత్యాచార బాధితురాలే కావడం యాదృచ్చికం కావచ్చు. మహిళలపై పెచ్చు పెరుగుతున్న అత్యాచారాలను ఖండించే  లక్ష్యంతో తీసిన లఘు చిత్రం కావచ్చు. కానీ అసలు విషయం కంటే కూడా నిందితుడు చేసిన అసందర్భ, అవాంఛిత వ్యాఖ్యలకు ఎక్కువ ప్రచారం లభించినట్టయింది.
'గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన యువతులు ఇలా అర్ధరాత్రి, అపరాత్రి  బజార్న పడి తిరగరు. మగవారిని తేలిగ్గా ఆకర్షించే వస్త్ర ధారణ ఆడవారికి అసలు  పనికి రాదు.'
చేసిన నిర్వాకానికి జైల్లో శిక్ష అనుభవిస్తూ, చేసిన పనిని సమర్ధించుకుంటూ ఆ ఖైదీ పలికిన  మాటలు ఇవి.
'అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా ఇంటికి రాగలిగిన నాడే మన దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు లెక్క' అన్న మహాత్మా గాంధీ బోధనలకు, చేసిన పనికి ఇసుమంతయినా పశ్చాత్తాపం  లేకుండా ఆడపిల్లల ప్రవర్తన గురించి ఆ నేరస్తుడు నోటికి  వచ్చినట్టు చెప్పిన  మాటలకు ఏమైనా పొంతనవుందా!'

'స్త్రీలపై లైంగిక దాడులు' అనేవి ఒక్క భారత దేశానికి మాత్రమే   పరిమితం కావు. అన్ని దేశాలను వేధిస్తున్న సమస్య ఇది' అని అమెరికాలో ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ సందర్భంగా నిర్వాహకులు చెప్పారు. నిజమే కావచ్చు. అలాంటప్పుడు, ఇలాటి అత్యాచారాలు జరుగుతున్న మరో దేశం ఏదీ, ఈ చిత్ర నిర్మాణానికి ముందు వారికి కనబడలేదా అన్నది జవాబు రాని, జవాబు లేని ప్రశ్న. (10-03-2015)

7, మార్చి 2015, శనివారం

శాసనసభల సమావేశాలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 08-03-2015, SUNDAY)

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభల సమావేశాలు  మొదలయ్యాయి. ఈ రెండూ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. గతంలో కూడా ఈ రెండు శాసన సభల సమావేశాలు జరిగాయి కాని, అవి వేర్వేరుగా వేర్వేరు తేదీల్లో జరిగాయి. కానీ ఈసారి పూర్తి బడ్జెట్ సమావేశాలు, అవీ ఉభయ సభల సంయుక్త సమావేశాలు  కొన్ని గంటల తేడాతో ఒకే ఆవరణలో జరగడం ఒక విశేషం. అంతే  కాదు, ఉభయ రాష్ట్రాలకు గవర్నర్ గా వున్న శ్రీ నరసింహం, విడివిడిగా  రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 'నా ప్రభుత్వం' అంటూ ఆ రెండు ప్రభుత్వాల ఉద్దేశ్యాలు, కార్యాచరణ  ప్రణాళికలు వివరించారు.  ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర రావులు లోగడ అనేక సందర్భాలలో చెబుతూ వచ్చిన అనేక విషయాలను గుదిగుచ్చి రూపొందించిన ప్రసంగాల మాదిరిగా అనిపిస్తే ఆశ్చర్య పడాల్సింది లేదు. ఎందుకంటె ఆయా  రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గాలు ఆమోదించిన ప్రసంగపాఠాలనే గవర్నర్  శాసన సభల్లో చదువుతూ రావడం అనేది సంప్రదాయం.

గంటల తేడాతో మొదలయిన రెండు రాష్ట్రాల శాసన సభల ప్రారంభ పర్వం కూడా కొంత తేడాగా వుండడం యాదృచ్చికం కాకపోవచ్చు. ముందు మొదలయిన ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగం, ఆదినుంచి తుదివరకు హుందాగా సాగిపోయింది. గవర్నర్ కూడా నింపాదిగా హాయిగా తమ ప్రసంగ ప్రతిని దాదాపు గంటపాటు చదువుకుంటూ పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అనేక సంక్షేమ పధకాలను ఏకరువు పెట్టడంతో పాటు, కొత్త రాజధాని నిర్మాణం, ప్రత్యెక హోదా మొదలయిన అంశాలే కాకుండా 'రాష్ట్ర విభజన జరిగిన తీరు సమంజసంగా లేద'న్న ముఖ్యమంత్రి అభిప్రాయం సయితం గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనకు నోచుకుంది. గవర్నర్ ప్రసంగం ముగియగానే జాతీయ గీతాపలాపన అనంతరం ఆంద్ర ప్రదేశ్ శాసన సభ సోమవారానికి వాయిదా పడింది.
దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణా శాసన సభ సమావేశాలు కాసేపటి తరువాత మొదలయ్యాయి. ప్రసంగం చదువుతున్నప్పుడు  టీవీల్లో గవర్నర్ నరసింహన్ హావభావాలు గమనించినప్పుడు,  సభలో అంతా సజావుగా సాగడం లేదేమో అన్న భావం కలిగింది. త్వరత్వరగా పేజీలు  తిప్పుతూ, గబగబా  చదువుతూ, మొత్తం ప్రసంగాన్ని పదిహేను నిమిషాల్లోనే ముగించిన తీరు చూసినవారికి  సభలో జరగరానిదేదో  జరుగుతోందన్నఅనుమానం తలెత్తింది. అది నిజమేనని ఆ తరువాత మీడియా పాయింటు వద్దనుంచి వివిధ టీవీ ఛానళ్ళల్ల ప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారంలో  మాట్లాడినప్పుడు ధృవపడింది. గవర్నర్ ప్రసంగం మొదలెట్టగానే, కాంగ్రెస్, టీడీపీ సభ్యులు పోడియం ముందుకు దూసుకు వెళ్ళారనీ, ప్రసంగం ప్రతులను చించి గవర్నర్ పై విసిరి వేసే ప్రయత్నం చేసారనీ, కొందరు టీ.ఆర్.యస్. సభ్యులు కూడా ముందుకు  తోసుకురావడంతో ఉభయుల నడుమ తోపులాట జరిగిందనీ విలేకరుల కధనం. సరే! ఆయా రాజకీయ పార్టీలకు చెందిన శాసన సభ్యులు కూడా మీడియా పాయింటు నుంచి మాట్లాడారు. సభలో జరిగినదానిని తమ పార్టీల వైఖరులకి అనుగుణంగా సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. తమ సభ్యులను టీ.ఆర్.యస్. సభ్యులు కిందపడవేసి కొట్టారని టీడీపీ ఆరోపిస్తుంటే, జాతీయగీతాన్ని ప్రతిపక్ష సభ్యులు అగౌరవ పరిచారని టీ.ఆర్.యస్. అంటోంది.  సమావేశాలకు ముందుగానే తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు సభలో అనుసరించబోయే వ్యూహాలను రచించడమే కాకుండా వాటిని బట్టబయలు కూడా చేయడం వల్ల ఇలాటిదేదో జరుగుతుందన్న అభిప్రాయం ముందే ఏర్పడిపోయింది. పార్టీ మార్పిళ్ళ పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దమైనట్టు ఆ పార్టీలు ముందే ప్రకటించాయి. శాసన సభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సమక్షంలో గవర్నర్ ప్రసంగించే సమయాన్ని ఆ పార్టీలు ఇందుకు తగిన తరుణంగా ఎంచుకున్నాయి. ఆ పార్టీలు నిరసన కోసం ఎంచుకున్న అంశం ప్రజాస్వామ్య కోణం నుంచి చూస్తే  చాలా ప్రాముఖ్యత కలిగినదే. సందేహం లేదు. ఒక పార్టీ గుర్తుపై  ఎన్నికైన వ్యక్తి,   ప్రత్యర్ధి పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా మరో పాత్ర పోషించడం చూడడానికి ఎబ్బెట్టుగానే  వుంటుంది. నిజానికి , ఇలాటి సంస్కృతికి  అన్ని పార్టీలు స్వస్తి చెప్పినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగు కాలాలపాటు మనగలుగుతుంది. కానీ, ఇలా తప్పులెన్నే పార్టీలే  తమకు అవకాశం లభించినప్పుడు అదే తప్పును ప్రోత్సహిస్తున్నాయి.  ఇందులోని  విషాదం ఇదే!. రాష్ట్ర విభజన అనంతరం ఇటు తెలంగాణాలో, అటు ఆంద్ర ప్రదేశ్ లో పాలక పక్షాలు  ఈ దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయన్న అపవాదును అవి ఇప్పటికే  మోస్తున్నాయి. తెలంగాణాలో, అనేకమంది  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను  ప్రలోభపెట్టి టీ.ఆర్.యస్. తమలో కలుపుకుందని టీడీపీ లెక్కలు చెబుతుంటే, అటు ఆంద్ర ప్రదేశ్ లో అధికార తెలుగు దేశం పార్టీ  చేర్చుకున్న ప్రత్యర్ధి పార్టీ వారి వివరాలను గోత్ర నామాలతో సహా టీ.ఆర్. యస్.  వెల్లడిస్తోంది. సరిగ్గా, ఈ కారణం వల్లనే, నిస్సిగ్గుగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్లను గట్టి గొంతుకతో  ఖండిస్తున్న పార్టీలకు సరయిన నైతిక బలం చిక్కడం లేదు. 'మేమూ చేసాముకాని, మరీ ఇలా బరి తెగించి చేయలేదు' అనే వాదం వినేవారి విశ్వాసాన్ని పొందడం లేదు.
తెలంగాణా అసెంబ్లీలో తొలి రోజున ఏం జరిగిందన్నదానిపై   ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. అధికారిక వీడియోల్లో  నిక్షిప్తం అయిన దృశ్యాలు  బయటకు వస్తే ఎవరు బాధ్యులో తేటతెల్లం అవుతుంది. దానివల్ల మూల సమస్యకు పరిష్కారం దొరకదు. సభలో వివిధ రాజకీయ పక్షాల వాళ్ళు స్వయం నియంత్రణ ఏర్పరచుకుంటే అంతకంటే కావాల్సింది వుండదు. అయితే నేటి రాజకీయాల తీరుతెన్నులు గమనిస్తున్నవారికి ఈ ఆశ పేరాశగా అనిపించవచ్చు కూడా.  

ఉభయ రాష్ట్రాల శాసన సభల తొలిరోజు ప్రతిపక్ష పార్టీగా వై.యస్.ఆర్.సీ.పీ. ఒక పాయింటు తన ఖాతాలో వేసుకుంది. గవర్నర్ ప్రసంగం సాగుతున్నంత సేపూ ఆ పార్టీ ప్రతినిధులు ఒక పద్దతి ప్రకారం సభ సాగడానికి సహకరించారు. ఇదే వైఖరి ముందు కూడా కొనసాగిస్తే ఆ పార్టీకి దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. దానితోపాటే, సభ గౌరవం ఇనుమడిస్తుంది. (07-03-2015)       

6, మార్చి 2015, శుక్రవారం

స్మృతుల మననంలో స్నేహితులు


'ఒక్క నిమిషం! గవర్నర్ గారు ఇప్పుడే వచ్చారు'
అన్నాడు తుల్జానంద్ సింగ్. తమిళనాడు గవర్నర్ రోశయ్య గారి వ్యక్తిగత కార్యదర్శి. 
'పది నిమిషాలు తీసుకోండి. పరవాలేదు' అన్నాన్నేను.
మామూలుగా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇచ్చిన అప్పాయింట్ మెంట్ సమయానికి ఇవతలవాళ్ళే సిద్ధంగా వుండాలి. అలాంటిది ఒక్క నిమిషంలో పిలుస్తానంటే 'పది  నిమిషాలు ఆగండి' అనడం ఒక రకంగా ఇబ్బందే. సింగ్ కాకుండా వేరెవరయినా అయితే వేరేవిధంగా భావించేవారు. కాకపొతే తుల్జానంద్ హైదరాబాదులో పాత తరం, కొత్త తరం జర్నలిష్టులందరికీ సుపరిచితుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి కార్యదర్శిగా పనిచేసిన వాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులకి సన్నిహితంగా మెలిగినవాడు. అన్నింటికీ మించి స్నేహధర్మం తెలిసినవాడు.
కాసేపు ఆగమనడానికి కారణం వుంది. ఈరోజు రోశయ్యగారిని కలవాల్సింది నేను కాదు. 'మేము'. ఈ 'మేము'లో నాతోపాటు మరికొందరు వయోధిక పాత్రికేయులు వున్నారు. వారికి ఆటో పట్టుకుని, అమీర్ పేటలోని రోశయ్య గారి 'గోకుల్ భవన్' చేరుకోవడానికి కొంత టైం పట్టేట్టు వుంది. మొత్తం మీద వాళ్లు వచ్చేసారు. అందరం ఒకేసారి రోశయ్య గారి గదిలో అడుగు పెట్టాం. చేతికర్ర సాయంతో నడిచివస్తున్న వీ. హనుమంతరావు గారిని అయన వెంటనే గుర్తుపట్టారు. పట్టి అన్నారు. 'హనుమంతరావు గారికంటే నేనే ఏడెనిమిదేళ్లు వయస్సులో చిన్నవాడిని' అని.
పెద్దవాళ్ళు కలుసుకున్నప్పుడు యెంత చిన్నవాళ్ళు అయిపోతారో అప్పుడు చూసాను. పాత విషయాలు వారి మాటల్లో దొర్లాయి. సాధారణంగా రాజకీయ నాయకులు కాస్త సమయం 'మించుతోంది' అనిపించినప్పుడు ఆ భావం వారి మోహంలో కనబడుతుంది. కానీ రోశయ్యగారు హాయిగా మాట్లాడుతూ పోయారు. కాసేపు కూర్చుని  హనుమంతరావు గారిని వెంటబెట్టుకుని మళ్ళీ నేనూ, మరో వయోధిక పాత్రికేయుడు వరదాచారి గారు, వీళ్ళందరికీ 'దండలో దారం' అయిన లక్ష్మణరావు గారు ఇళ్లకు మళ్ళాము. హోలీ పండగ  నాడు రంగులు చల్లుకోకపోయినా వారి మొహాల్లో ఒకరకమైన  సంతృప్తి ఛాయలు ఇంద్రధనుసు రంగుల్లా మెరిసాయి.

           

ఒక వయస్సులో వున్నవారికి కావాల్సింది నిజానికి ఇలాటి ములాఖత్తులే. (06-03-2015)

నేషనలైజేషన్


డాక్టర్ : మీరు ఏ సబ్బు వాడతారు?
ఏకాంబరం : పీతాంబరం సబ్బు.
డాక్టర్ :  మీరు ఏ పేస్టు  వాడతారు?
ఏకాంబరం : పీతాంబరం పేస్టు.
డాక్టర్:  మీరు ఏ షాంపూ వాడతారు?
ఏకాంబరం :  పీతాంబరం షాంపూ
డాక్టర్:  ప్రతిదానికీ  పీతాంబరం పీతాంబరం  అంటున్నారు. ఇంతకీ  ఈ  పీతాంబరం ఏ కంపెనీ? ఎక్కడి కంపెనీ. ఆయుర్వేదమా? అల్లోపతా?
ఏకాంబరం : కంపెనీ కాదు. వాడు నా రూమ్మేటు.




(కార్టూనిస్ట్ వీ.వీ.ఎస్. మూర్తి గారికి కృతజ్ఞతలతో) 

దొందూ దొందే!


భార్య: సగం వింటుంది. అందులో సగమే  అర్ధం చేసుకుంటుంది. దాన్ని గురించి ఆలోచిస్తూ  సమయం పాడు చేసుకోదు. కాకపోతే రెట్టింపుగా  స్పందిస్తుంది. అంతేకాదు,  ఒక్క ముక్క కూడా మరచిపోకుండా మొత్తం గుర్తు పెట్టుకుంటుంది.
ఇక భర్త: విన్నట్టు నటిస్తాడు. ఒక్కటీ  చెవిన పెట్టడు. కానీ అన్నీ అర్ధం చేసుకుంటాడు. వున్నవీ లేనివీ ఆలోచిస్తాడు. కానీ చేసేది పూజ్యం. మరో మంచి గుణం ఏమిటంటే ఏదీ గుర్తుంచుకోడు. గుర్తు పెట్టుకోలేడు.




NOTE: Courtesy Image Owner