24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఛ ఛ ....


'ఛ ఛ ....అలా అనకుండా వుండాల్సింది' అన్నాడు రామా రావు
వచ్చిన పావు గంటలో  అతడలా అనడం నాలుగోసారి. అనకుండా వుండాల్సింది అంటాడే కాని అన్నది ఏమిటో చెప్పడు. బహుశా తలచుకోవడానికి కూడా మనస్తాపం  కలిగించే విషయమేమో. అందుకే నేనూ  'విషయం ఏమిటీ' అని రెట్టించి అడగలేదు.
కాసేపయిన తరువాత కాస్త కుదుటపడ్డాడేమో గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టాడు.


'మన సుబ్బారావు లేడూ, ఓహో నీకు తెలవదు కదూ, నేనీ వూరు వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. ఇట్టే కలిసిపోయే రకం. ఇద్దరికీ సంబంధం లేని ఓ పనికిరాని వెషయం మీద మొన్నోరోజు  మాటా మాటా అనుకున్నాం. నిజానికి నాదే తప్పు. కానీ నా మాటే నెగ్గాలనే పంతంలో  నోటికి వచ్చినట్టు ఒక మాటకు పది అనేసాను. పాపం చిన్నబుచ్చుకుని మొహం ఇంత చేసుకుని వెళ్ళాడు. అతడు వెళ్ళిన తరువాత నాకనిపించింది, అతడివాదనలో తప్పేమీ లేదని. అనవసరంగా అతడి మనసుని  కష్టపెట్టానని అనిపించింది. అతడింటికి  వెళ్ళి 'సారీ!  తప్పు నాదే. ఏమనుకోకు, క్షమించు'  అని చెప్పాలని కూడా అనిపించింది. కానీ పోలేదు. ఇప్పుడు పోవాలన్నా పోలేను'
'ఏమిటి ఎందుకని'
'ఎందుకంటే  మేము మాటా మాటా అనుకున్న  రాత్రే గుండెపోటు వచ్చిపోయాడు. మర్నాడు సుబ్బారావు కొడుకు ఫోను చేసి  చెప్పాడు"

'ఛ ఛా....' అనుకున్నాడు రామారావు మరోసారి.
NOTE: Courtesy Image Owner 

22, అక్టోబర్ 2014, బుధవారం

ఆకాంక్ష



మీ గృహ ప్రాంగణంలో
మీ హృదయాంగణంలో
దీపావళి దివ్య కాంతులు
వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ -

- నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు       


20, అక్టోబర్ 2014, సోమవారం

మంచివాళ్ల మౌనం



ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో,  విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ తక్కువ అనే తేడా తప్పితే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారం రేపింది. ఆయన బృందంలో కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.


(లక్ష ద్వీప్ లో రాజీవ్ పరివారం విడిది చేసిన 'బంగారం' దీవి) 


ఆరోజుల్లో నేను హైదరాబాదు చిక్కడపల్లిలో ఉండేవాడిని. మా ఇంట్లో ఒక ఫోను వున్నా అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనకు మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. చాలా సార్లు నా అనుభవం ఏమిటంటే అలా వెళ్ళినప్పుడు ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్ టీ డీ లో మాట్లాడుతుండేది. ఆ సమయంలో ఆ అధికారి నన్ను కూర్చోబెట్టి, విలేకరిని కాబట్టి అ విషయం ఈ విషయం ముచ్చటిస్తూ వుండేవారు. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర. ఇది ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'యెంత ప్రధాన మంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీ లో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన  పండక్కి కొన్న చీరెల రంగులూ, వాటి  అంచులు  గురించిన వివరాలు. వాళ్ళమ్మాయి కొనుక్కున్న చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా  అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే,  ప్రభుత్వ వాహనంలో ఆఫీసు గారి పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి డ్రైవర్ వచ్చాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆయన, వెంటనే సుల్తాన్ బజారో, ఆబిడ్సో వెళ్లి  ఏదో వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య  ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను. ఇలాటి సంఘటనల వల్ల అనండి కారణం ఏదయినా చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుందన్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.
'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి స్వామీజీని  అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది  తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన  తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి.  ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు. 'రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ నా థియరీ. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. ఇలా ఛానళ్లలో పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి  జాబితాలో నా పేరు కూడా కలిపేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి సమర్ధకుడినే కాని 'అవినీతి పరుడిని అనలేదు కదా' అని నన్ను నేనే సముదాయించుకున్నాను.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ  చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ 'అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.
కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల  దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అద్దం పడుతోంది.

ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!

ఇక అసలు విషయానికి వద్దాం. మా పక్కింటి ఆఫీసరు ఆగ్రహానికీ, పత్రికల్లో విమర్శాత్మక కధనాలకు దారితీసిన రాజీవ్ గాంధి విహార యాత్ర గురించి చెప్పుకుందాం.
1987లో కారణం ఇదీ అని చెప్పలేము కాని ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకుల  'బుర్రలు వేడెక్కిపోయి' వాటిని చల్లబరచుకోవడానికో ఏమో విహార యాత్రలకు  వరుస కట్టారు. ఆనాటి సోవియట్ యూనియన్ అధినేత మిహాయిల్ గోర్భచేవ్ రష్యాలోని నల్లసముద్ర తీరంలో విడిది చేయడానికి వెడితే, అమెరికా అద్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంటా బార్బరా వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. రాజీవ్ గాంధి లక్షద్వీప్ లో గడిపారు. ముప్పయ్యారు దీవుల సమూహం అయిన లక్షద్వీప్ లో 'బంగారం' అనే ఒక చిన్న దీవిలో నిర్మించిన అతిచిన్న కాటేజీలో భార్య సోనియా, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక లతో కలిసి మెదడు వేడెక్కించే రాజకీయాలకు, అలసట కలిగించే దినవారీ ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ప్రధాని సేదతీరారు.
ప్రధానమంత్రి విశ్రాంతిగా గడిపే ప్రాంతాన్ని అధికారులు అతి గోప్యంగా ఉంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, 'రవి కాంచని చోట రవి కాంచును' అన్న చందాన పత్రికా విలేకరులు మాత్రం పనిగట్టుకుని  ప్రధాని విహార యాత్రావిశేషాలను ఏరోజుకారోజు బాహ్య ప్రపంచానికి ఫొటోలతో సహా తెలియచేసారు. 


(ఉల్లాసంగా ఉత్సాహంగా రాజీవ్ బృందం) 
    

సోనియా తల్లిగారు, అమితాబ్ ఆయన భార్య జయాబాధురి,  రాజీవ్ అతిధులుగా ఈ విహారయాత్రలో పాల్గొన్నారు. మనుష్య సంచారం లేని ఆ దీవిలో రాజీవ్ పరివారం చాలా హాయిగా, ఉల్లాసంగా  గడిపారు. సముద్రంలో ఈతలు కొట్టారు. వెచ్చని ఇసుకలో పడుకుని  సూర్యరశ్మితో  చలికాగారు. చేపలవేట, ఇసుకతిన్నెలపై విందు భోజనాలు, తీరంలో షికార్లు ఇలా స్వేచ్చగా రోజులు గడిపారు. రాజీవ్, రాహుల్, ప్రియాంకలు సముద్ర జలాల్లో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడితే,  ఆస్తమా వున్న సోనియా మాత్రం - అడుగు భాగంలో అద్దాలు బిగించిన పారదర్శక  పడవుల్లో తిరుగుతూ అపురూపమైన జలచరాలను చూస్తూ కాలక్షేపం చేసారు. తీరంలో కొబ్బరి చెట్ల  నీడన కూర్చుని, కొబ్బరి నీళ్ళు తాగుతూ  జయా బచ్చన్ తో కబుర్లు చెబుతూ గడిపారు. రాజీవ్ గాంధీ మాత్రం ఆ ప్రదేశాలతో చిరకాల పరిచయం వున్నవాడిలా అన్ని ప్రాంతాలను కలయ తిరిగారు. గాయపడి వొడ్డున పడివున్న ఒక డాల్ఫిన్ ని కాపాడి దాన్ని తిరిగి సముద్రజలాల్లోకి చేర్చారు.
ఈ విహారయాత్రలో రాజీవ్ దంపతులు, ఆయన బృందంలోని ఇతర సభ్యులు  యెంత ఉల్లాసంగా గడిపి యెంత సంతోషాన్ని మూటగట్టుకున్నారో తెలియదు కానీ ఆ తరువాత రోజుల్లో ఈ యాత్ర గురించి పత్రికల్లో వచ్చిన ఆసక్తికర ఊహా  కధనాలు, రాజకీయ ప్రత్యర్ధుల విమర్శలు వారిని అంతకంటే ఎక్కువ బాధించి వుంటాయి.
ఆ ఊహాగాన వివరాలు కొన్ని ఇలావున్నాయి.
"ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో ఖరీదైన విదేశీ, స్వదేశీ మద్యం సీసాలు అక్కడికి తరలించారు. అగట్టీ అనే చోట ఏకంగా ఓ కోళ్ల ఫారాన్నే ఏర్పాటుచేశారు. పళ్ళూ ఫలాలు లెక్కలేకుండా అక్కడికి చేర్చారు. పిల్లలు ఇష్టపడి తినే ఖరీదైన చాకొలెట్లు, బిస్కెట్లు కొదవలేకుండా సప్లయి  చేసారు. అప్పటికప్పుడే సముద్రంలో వేటాడి పట్టుకున్న చేపలు, లక్షద్వీపుల్లో మాత్రమే  దొరికే అరుదయిన ఫలాలు, తాజా కాయగూరలు, కిలోలకొద్దీ బాస్మతీ బియ్యం, దేనికీ కొదవలేకుండా, కొరత రాకుండా అక్కడికి చేర్చారు. ఇక యాత్రకు అయిన ఖర్చు తలచుకుంటే బెంబేలెత్తేలా వుంది" అంటూ ఎవరికి తోచిన అంచనాలు వాళ్ళు రాసారు.  లక్షద్వీప్ అధికారి ఒకరు ఈ ఊహాగానాలపై స్పందిస్తూ,  ఒక మాట చెప్పారు. 'ప్రధాని విహార యాత్రకు మేము ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఆయన్నీ  ఆయన పరివారాన్నీ బంగారం దీవిలో వొదలడం  వరకే మా బాధ్యత. ఆ తరువాత అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసుకున్నారు. ఖర్చుచేసిన దానికి చెల్లింపులు జరపడానికి బిల్లులను  రాజీవ్ గాంధీ పేరున పంపమన్నారు'


మొత్తం మీద రాజీవ్ గాంధీ విహారయాత్ర ఆ విధంగా విమర్శలతో ముగిసింది. కాకపొతే, ఈ దుమారం వల్ల కలిగిన ప్రచారంతో, లక్షద్వీప్ దీవులకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగిపోయిందని పర్యాటక శాఖవారు సంబరపడిపోయారు.

19, అక్టోబర్ 2014, ఆదివారం

పనికొచ్చిన సలహా


ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటి మాటో.
పారిశ్రామికవేత్త జె.ఎన్.టాటా ఓసారి జర్మనీ ప్రయాణం పెట్టుకున్నారు. ఓడలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఆయనతో పాటు అనేక గోనే సంచులు. వాటిల్లో దేశంలో వివిధ ప్రాంతాలనుంచి సేకరించి తెచ్చిన మట్టి. వాటిని జర్మనీలో శాస్త్రవేత్తలకు చూపించి ఇనుము లేదా ఇతర లోహాలు వుంటే  కనుగొని ఆయా ఖనిజాల తవ్వకం చేపట్టాలన్నది టాటా మహాశయుల ప్రయత్నం.
అదే ఓడలో కింద భాగంలో స్వామీ వివేకానంద  వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ని గురించి అప్పటికే కర్ణాకర్ణిగా విన్న టాటా తనకు తానుగా వెళ్ళి స్వామిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. మాటల్లో తన ప్రయాణం లక్ష్యాన్ని కూడా స్వామికి వివరించారు.
స్వామి వెలిబుచ్చిన ఓ అనుమానం టాటాని ఆలోచనలో పడవేసింది. దేశం నుంచి తీసుకు వెళ్ళిన మట్టి నమూనాల్లో నిజంగా ఖనిజాలు వున్నట్టు కనుగొప్పటికీ,  విదేశీ శాస్త్రవేత్తలు నిజాయితీగా ఆ విషయం తెలియచెప్పకపోవచ్చన్నది స్వామికి కలిగిన సందేహం.
"ఒక పని చేయండి. భారత దేశంలో మేధావులయిన యువకులకు కొదవ లేదు. దురదృష్టం ఏమిటంటే వారికి సరయిన అవకాశాలు లేక వారి ప్రజ్ఞాపాటవాలన్నీ నివురుగప్పిన నిప్పులా వుండిపోతున్నాయి. మీరు దేశానికి తిరిగివచ్చిన తరువాత మైసూరు మహారాజు చామరాజ వడయారును కలవండి. ఆయన బ్రిటిష్ పాలకులకి విధేయుడే. కానీ దేశం అంటే ప్రేమ కలిగినవాడు. చక్కటి పరిశోధనాసంస్థను ఏర్పాటు చేయడంలో మీకు తోడ్పడుతాడు' అని సలహా ఇచ్చారు.

టాటా జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత స్వామి వివేకానంద సలహా ప్రకారం వెళ్ళి మైసూరు మహారాజును కలుసుకున్నారు. పరిశోధనాసంస్థ ఏర్పాటు గురించిన తన ప్రతిపాదన గురించి చెప్పారు. చామరాజ వడయార్ ఎలాటి సంకోచం వ్యక్తం చేయకుండా వెంటనే 370 ఎకరాల భూమిని సంస్థ ఏర్పాటుకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఆవిధంగా ఏర్పాటయిందే దేశంలో తొలి పరిశోధనాసంస్థ - "The Indian Institute Of Science".  మహానీయుల సంకల్పబలం ఆవిధంగా వుంటుంది.

18, అక్టోబర్ 2014, శనివారం

అమెరికా ప్రెసిడెంట్ అయితేనేం ఎవరయితేనేం రూలంటే రూలే ఆ దేశంలో


నిజమా! నిజంగా నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం  బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
కిందటి నెలలో న్యూ యార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా ఆ నగరం వెళ్ళారు. ఓ రోజు వీలుచేసుకుని  భార్యను వెంటబెట్టుకుని హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు. మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్  కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్  కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు.   పక్కన భార్య ఉండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. ఇది జరిగింది గత నెల 24 వ తేదీన. ఇది బయట పడింది  నిన్న శుక్రవారం. క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, మాటవరసకు ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం  మీడియాలో హుషారుగా గింగిరాలు తిరుగుతోంది.
ఒబామా గారు భార్యతో కలిసి భోజనం చేయడానికి ఇతర సాధారణ పౌరుల మాదిరిగానే హోటల్ కు వెళ్ళారు. ఇది ఎవరికీ పట్టలేదు. అలాగే బిల్లు కట్టడానికి క్రెడిట్ కార్డు ఇచ్చారు. బిల్లులు కట్టడం అలవాటులేని రాజకీయ నాయకులను కన్న కర్మ భూమి కాబట్టి ఆ విషయానికీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎంతసేపూ అమెరికా ప్రెసిడెంటు క్రెడిట్ కార్డు క్లోనింగుకు గురయిందని ఒకటే ఊదర.

ఈ సంఘటన నుంచి మన రాజకీయ నాయకులు, మీడియా నేర్చుకోవాల్సింది ఎంతో వుంది అంటే అపార్ధం చేసుకోరు కదా! 

NOTE : Courtesy Image Owner 

ఈరోజు అంజయ్యగారి వర్ధంతి - ఒక జ్ఞాపకం

ఆంధ్ర ప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానంతిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కానిఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అందిముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగంఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ. మీలో కొందరికి తెలియని విషయం ఏమిటంటేఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని ఆయనకు నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  అంజయ్య గారికి క్షణం తోచేది కాదు. శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట. (18-10-2014)

(అంజయ్య గారు - నేనూ - నా రేడియో టేప్ రికార్డర్ )

17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఓ నీతి కధ


సీ.ఈ.ఓ. ఏకాంబరం కారు దిగుతున్నాడని తెలిస్తే చాలు ఆఫీసు ఆఫీసంతా నిశ్శబ్దం. ఎవరి పనుల్లోకి వాళ్ళు దూరిపోతారు. ఎవరన్నా ఖాళీగా వున్నట్టు కనబడితే చాలు ఇక అంతే  సంగతులు. ఆఫీసులో అదే ఆఖరి రోజనుకోవాలి. ఒకరోజు ఆయన మెట్లు దిగివస్తుంటే ఒకడు వరండాలో  దిక్కులు చూస్తూ కనబడ్డాడు. ఏకాంబరం కోపం నషాళానికి అంటింది. 'నీ ఫేస్ నచ్చలేదు. నీ తరహా నచ్చలేదు. ఒక్క క్షణం ఇక్కడ వుంటానికి వీల్లేదు' అంటూ, 'నీ జీతం యెంత' అని అడిగాడు.  వాడు బిక్కు బిక్కుమంటూ 'ఐదువేలు' అన్నాడు. ఏకాంబరం  మేనేజర్ని పిలిచాడు. మూడు నెలలు జీతం పదిహేను వేలు అప్పటికప్పుడే అతడి చేతిలో పెట్టించాడు. వాడు దణ్ణాలు పెడుతూ వెళ్ళిన తరువాత అడిగాడు ఏకాంబరం- 'వాడు ఎవడు, ఏ డిపార్ట్ మెంటులో పనిచేస్తాడ'ని. వచ్చిన సమాధానం విని ఏకాంబరం బిక్కచచ్చి పోయాడు.
ఆ వచ్చిన వాడు, ఎంచక్కా పదిహేనువేలు పట్టుకెళ్ళిన వాడు అసలు ఆ ఆఫీసు ఉద్యోగే కాదు. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాడు.
నీతి:  "అయినచోటా  కాని చోటా వూరికే ఎగిరెగిరి పడడం అంత మంచిది కాదు"
(పార్ధసారధి గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం)