10, అక్టోబర్ 2014, శుక్రవారం

సాయంత్రం ఖాళీయేనా?


ఎర్రబడ్డ మొహంతో బాస్ గదిలోనుంచి బయటకు వచ్చింది.
బుద్ధిలేని మనిషి, ఆడవాళ్ళతో ఇలాగానేనా మాట్లాడేది
లోపల ఏం జరిగిందేవిటి?”
ఈ సాయంత్రం ఖాళీగా వుంటావా? వేరే ఏదన్నా పని ఉందా?’ అని అడిగాడు
నువ్వేమన్నావు
ఖాళీగానే వుంటాను అని చెప్పాను
అతనేమన్నాడు?”
ఏవన్నాడా? ఇవిగో ఈ కాగితాలన్నీ చేతికిచ్చి టైప్ చేయమన్నాడు



NOTE: Courtesy Image Owner 

అవును కదా!



ఎదుగుదలలో కూడా ఇబ్బందులు వుంటాయి. అభివృద్ధిలో కూడా కొత్తసమస్యలు పుట్టుకొస్తాయి. ఒక రహదారిని బాగుచేయాలని అనుకుంటే కొన్నాళ్ళు ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తప్పవు. తప్పవు కదా అని రోడ్డు బాగుచేయకుండా అలాగే  వొదిలేస్తే కుదరదు కదా. అలాగే నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకు రావడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోగలిగితేనే సకాలంలో అనుకున్న లక్ష్యాలను సాధించడం వీలుపడుతుంది. అలాకాకుండా సమస్యలను పక్కన బెట్టి అభివృద్ధి సాధించాలనుకుంటే అది అరకొర ప్రయత్నమే అవుతుంది. ఉదాహరణకు హైదరాబాదులో రహదారుల విస్తరణ కార్యక్రమం తీసుకుంటే బహుశా మరే ఇతర నగరంలో లేనట్టుగా ఈ కార్యక్రమాన్ని ఈ నగరంలో పెద్దఎత్తున చేపట్టారు. అనేక ప్రధాన రహదారులు చాలా విశాలమైన రూపును సంతరించుకున్నాయి. అయితే ఈ క్రమంలో జరిగిన పొరబాట్లవల్ల విస్తరణ పధకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది. మూడునాలుగు వరసలుగా వాహనాలు పోగలిగిన తీరులో విస్తరించిన రహదారులు హఠాత్తుగా  కుంచించుకు పోయి ఒకటి రెండు వరసలకే పరిమితమయిపోవడం అనేక చోట్ల కానవస్తుంది. అంతవరకూ సజావుగా సాగిన వాహనాల కదలికకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడినట్టు అవుతుంది. వీటికి కారణం రోడ్ల విస్తరణలో ఎదురయిన న్యాయపరమయిన చిక్కులు కావచ్చు మరో మరో సహేతుక కారణం కావచ్చు. కారణం ఏదైనా విస్తరణ ప్రయోజనం ఆ దారిలో లేకుండా పోయినట్టే. 


ముంబై సంగతి చూడండి. అక్కడి రోడ్లు హైదరాబాదుతో పోల్చి చూస్తె వెడల్పులో తక్కువే కావచ్చు. కానీ వున్నట్టుండి కుంచించుకుపోయే అవకాశం లేనందువల్ల కాస్త వేగం మందగించినా వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్ళే అవకాశాలు అక్కడ వున్నాయి. మన దగ్గర అలాకాదు, వీలున్న చోట కుందేలు పరుగు, లేనిచోట  తాబేలు నడక.  సరయిన ప్రణాలికలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడితే ఎలాటి చిక్కులు ఎదురవుతాయో అన్నదానికి హైదరాబాదు రోడ్ల విస్తరణ కార్యక్రమం సరైన ఉదాహరణ. (10-10-2014)

9, అక్టోబర్ 2014, గురువారం

నవ్వుకున్నవాళ్ళకు నవ్వుకున్నంత - నవ్వురానివాళ్లకు నవ్వు రానంత


ఏకాంబరం ప్రియురాలిని అడిగాడు, ఎలాటి పుస్తకాలు ఇష్టమని. ఆమె తటాలున జవాబు చెప్పింది 'చెక్ బుక్స్'

"కోతికీ మనిషికీ తేడా ఏమిటి?"
"కోతికి కల్లు తాగించినా అది మనిషిలా ప్రవర్తించలేదు"

"మంచి లాయరుకీ గొప్ప లాయరుకీ తేడా ఏమిటి?"
"మంచి లాయరుకి 'లా'తెలిసుంటుంది. గొప్ప లాయరుకి 'జడ్జ్' తెలిసుంటాడు"

"ఆడవాళ్ళ విషయంలో అర్ధం కాని విషయం ఒకటి చెప్పు"
"మొన్న ఆసుపత్రికి వెడితే అందమైన నర్సు నా చేతిని కాసేపు పట్టుకుని నాడి చూసింది. అదేమిటో చిత్రం, అలా చేయిపట్టుకుని చూసి, పైగా 'నాడి ఎందుకిలా కొట్టుకుంటోంద'ని నన్నే అడిగింది"

ఆఫీసరు కొత్తగా చేరిన ఉద్యోగితో అన్నాడు.
"ఇక్కడ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తాం. నువ్వులోపలకి వచ్చేటప్పుడు డోర్ మ్యాట్ మీద బూట్లు శుభ్రంగా తుడుచుకుని వచ్చావా?"
"అవునండీ!"
"అలానా! మేము మరో విషయంలో  కూడా జాగ్రత్తగా ఉంటాము. ఇక్కడ పనిచేసేవాళ్ళు నిజం చెబుతున్నారా అబద్దం చెబుతున్నారా అని. అసలా గుమ్మం దగ్గర డోర్ మ్యాటే లేదు"

"కుక్కలు ఎందుకు పెళ్లి చేసుకోవు"
"ఇదో ప్రశ్నా! ఎందుకంటె వాటిది అప్పటికే కుక్క బతుకు"

"తల్లికీ భార్యకూ తేడా?"
"తల్ల్లి ఏడుస్తున్న నిన్ను ఈ లోకంలోకి తెచ్చిపడేస్తుంది. రెండో ఆవిడ నువ్వు జీవితాంతం ఆ ఏడుపు ఆపకుండా కనిపెట్టి చూస్తుంది"

"మగ సెక్రెటరీకి ఆడ సెక్రెటరీకి తేడా?"   
 "మగ సెక్రెటరీ ఆఫీసుకు వెళ్ళగానే బాసుకు 'గుడ్ మార్నింగ్' చెబుతాడు. ఆడ సెక్రెటరీ 'ఇక లేవండి బాస్ తెల్లారింది' అంటుంది"    
  


(యధావిధిగా ఇంగ్లీష్ జోకులకు అనువాదం)

ఇల్లాలి ముచ్చట్లు




హోటల్లో మీటింగు కాగానే హ్యాండు బ్యాగు తీసుకుని బయటకు వచ్చాను. వస్తూనే కారు తాళాల కోసం చూసుకుంటే అవి కనిపించలేదు. బ్యాగు తీసి చూసాను, కనిపించలేదు. మీటింగు జరిగిన హాల్లోకి వెళ్ళి వెతికాను. లేవు. అక్కడి సిబ్బందిని వాకబు చేసాను. తెలియదన్నారు.  సడెన్ గా గుర్తుకు వచ్చింది. తాళాలు  కారులోనే వొదిలిపెట్టి వుంటాను. పైగా నాకది  అలవాటు కూడా.  

పొరపచ్చాలు లేని దాంపత్యం మాది. ఈ ఒక్క విషయంలోనే నాకూ ఆయనకూ పడదు.  'తాళాలు కారులో వొదలవద్దు' అని అస్తమానం సతాయిస్తుంటారు. నాకేమో అవి అక్కడ వుంటేనే సేఫ్ అనిపిస్తుంది. కారులోనే తాళాలు వుంచితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టేఅన్నది మావారి థియరీ. కాని ఈ విషయంలో నా దారి నాదే. ఆయన గోల ఆయనదే.
పార్కింగ్ లో చూస్తే కారు కనబడలేదు. మా వారి మాటే కరెక్ట్ అయింది.
కారు పోయిందని తెలియగానే కాళ్ళల్లో వొణుకు మొదలయింది. హోటల్ వాళ్లకు చెప్పి పోలీసులకు ఫోను చేసాను. యేకళన వున్నారో నేను చెప్పినవన్నీ వెంటనే నోటు చేసుకున్నారు. కారు నెంబరు, పోయిన చోటు అన్నీ చెప్పాను. కారులోనే తాళం చేతులు మరచిపోయిన సంగతి కూడా చెప్పేసి, 'ఎవడో పట్టుకుపోయివుంటాడు' అన్న అనుమానం కూడా వెల్లడించాను. దొంగతనం గురించి చెబుతుంటే మా వారు గుర్తుకువచ్చారు. ఆయన సతాయింపు గుర్తుకువచ్చి చెప్పాలా అక్కరలేదా  అనుకుంటూనే మా వారికి ఫోను చేసాను.
హలో హనీ!
ఇలాటి చిక్కు పరిస్థితులు ఎదురయినప్పుడు ఆయన్ని నేను అలానే పిలుస్తాను.
నువ్వు రోజూ చెప్పేదే ఇవాళ నిజమయింది. కారులో తాళాలు పెట్టి మీటింగుకు వెళ్లాను. వచ్చి చూస్తే  పార్కింగులో కారు కనిపించలేదు.
కాసేపు నిశ్శబ్ధం. బహుశా కోపం కొద్దీ లైన్ కట్ చేసివుంటారు.
ఇంతలో ఆయన గొంతు వినిపించింది.
ఇడియట్! నువ్వు కారులో వెళ్ళలేదు. నేనే నిన్ను  హోటల్ దగ్గర డ్రాప్  చేసి వచ్చాను. అది మరచిపోయావా?’
నిజమే. ఇక ఏం చెప్పను. నేను కారు తీసుకురానిమాట నిజమే. అమ్మయ్య అనుకున్నాను.
సరే లెండి. ఏదో మతిమరపు. వెంటనే బయలుదేరి రండి. ఇంటికి పోదాంఅన్నాను. 
యెలా రమ్మంటావు? ఈ కారు మాదే,  దొంగ కారు కాదు మొర్రో  అని ఎంతసేపటి నుంచో మొత్తుకుంటున్నాను. అయినా ఈ పోలీసులు వినిపించుకోవడం లేదే!


(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
NOTE: Courtesy  Cartoonist

8, అక్టోబర్ 2014, బుధవారం

సదస్సులతో సాధించేది ఏమిటి?



హైదరాబాదు  నగరానికి అంతర్జాతీయ సదస్సులు కొత్తకాదు. కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్ర రాజధానిగా హైదరాబాదు నగరం  మొదటిసారిగా ఒక అంతర్జాతీయ సదస్సుకు - 'మెట్రోపాలిస్' మేయర్ల సదస్సుకు ఆతిధ్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు కూడా ఈ సదస్సు నిర్వహణను  ప్రతిష్టామకంగా తీసుకుని  ఏర్పాట్లు చేసినట్టుగా కానవస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. తెలంగాణా కొత్త రాష్ట్రం. డానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నప్పటి నుంచి పధక రచనలు చేస్తూనే వున్నారు. ఇప్పుడీ అంతర్జాతీయ సదస్సును ఉపయోగించుకుని తెలంగాణా రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఏర్పాట్లు చేశారని భావించడానికి అవకాశాలు వున్నాయి. తెలంగాణా సంస్కృతిని, ఆతిధ్యరంగంలో తెలంగాణాకు వున్న ఘన సంప్రదాయాలను విదేశీయులకు ప్రదర్శించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం ప్రస్పుటంగా సదస్సు మొదలయిన మొదటి రోజునే ప్రస్పుటంగా కానవచ్చింది. తెలంగాణా చరిత్ర సంస్కృతీ సంప్రదాయాలను, కళారూపాలను  ప్రతిబింబించే  'ఆర్ట్ ఎట్ తెలంగాణా' అనే  పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని సదస్సు అధ్యక్షుడు జీన్ పాల్ హంకాన్ కు అందచేసారు.  1914 నుంచి 2014 వరకు వందమంది తెలంగాణా కళాకారుల వివరాలు ఇందులో పొందుపరిచారు.  ఈ సదస్సుకు ప్రత్యెక అతిధిగా  హాజరయిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్  కలాం ఈ పుస్తకం పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించడం ఓ విశేషం. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కళాఖండాలు కూడా విదేశీయులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. అబ్దుల్ కలాం  కొద్దిసేపు ఆ చిత్రాలను పరిశీలనగా చూస్తూ అక్కడే గడిపారు.
ఈ క్రమంలోనే,  గాంధీ జయంతి మరుసటి రోజు నుంచి తెలంగాణలో ప్రారంభించిన కల్లు దుకాణాలకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలని ఉద్దేశించారేమో  తెలియదు కానీ, సమావేశం మందిరంలో ప్రత్యేకించి కల్లు కేంద్రం ఏర్పాటు చేసి  తెలంగాణా కల్లును  విదేశీయులకు కూడా రుచి చూపించారు.
తదనంతరం, 'అందరికీ నగరాలు' అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న అబ్దుల్ కలాం - నగరాలు కేవలం అందంగా వుంటే సరిపోదనీ, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే పొర సమాజానికి అవి  ఉపయుక్తంగా ఉంటాయని  అభిప్రాయ పడ్డారు. ఇటీవల రాజకీయ నాయకుల నోట ప్రముఖంగా వినబడుతున్న 'స్మార్ట్ సిటీ' లను గురించి ప్రస్తావిస్తూ, 'స్మార్ట్ సిటీలయినా, ఓవర్ స్మార్ట్ సిటీలయినా జనం ఆరోగ్యంగా  జీవించేందుకు అనువుగా వుండాల'ని పేర్కొన్నారు. 'అద్భుతమైన సమ్మిళిత సంస్కృతికి ఆటపట్టుగా నిలచిన హైదరాబాదు నగరం, పాత సంస్కృతిని పరిరక్షించుకుంటూనే మరో పక్క శాటిలైట్  టౌన్ షిప్ ల నిర్మాణానికి నడుం బిగించాలని ఉద్బోధించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన  గవర్నర్  శ్రీ నరసింహన్,  ముఖ్యమంత్రి కేసీయార్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వలసలతో నగరాలపై పెరిగిపోతున్న  భారానికి తగినట్టుగా వసతులను కూడా  పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు అందుతాయన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ప్రసంగిస్తూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణా జనాభాలో దాదాపు నలభయ్  శాతం పట్టణాల్లోనే ఉంటున్నారని చెప్పారు. హైదరాబాదు సమగ్రాభివృద్ధితో పాటు ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి  ప్రణాలికలు సిద్దం చేస్తున్నట్టు చెప్పారు.  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయగలిగితేనే నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించగలదని చెప్పారు.  
 సరే! అతిధుల ప్రసంగాలు, ఆతిధ్య ప్రభుత్వంపై వారి ప్రసంశలు ఇటువంటి సదస్సులలో షరా మామూలే. వివిధ దేశాలకు చెందిన మేయర్లు, అక్కడి నిపుణులు ప్రసంగాలతో, పత్రాల సమర్పణతో సదస్సు నిర్విఘ్నంగా సాగిపోతుంది. అంతటితో  సరా! వీటివల్ల సాధించేది ఏమైనా ఉందా అనేదే శేష ప్రశ్న.


(క్రికెట్ జట్టుకాదు, సదస్సు భద్రత కోసం తెలంగాణా పోలీసులు)  

ఎటువంటి నేపధ్యంలో ఈ అంతర్జాతీయ సదస్సు హైదరాబాదులో జరుగుతోంది అనేది కూడా ప్రాముఖ్యత కలిగిన అంశమే. రాష్ట్రం రెండుగా విడిపోయి ఎన్నాళ్ళో కాలేదు. హైదరాబాదు నగరానికి నాలుగువందల సంవత్సరాల పైచిలుకు చరిత్ర వుంది  కానీ కొత్తగా ఊపిరిపోసుకున్న తెలంగాణా రాష్ట్రం ఇంకా పసికూనే. ఒక పక్క కరెంటు కష్టాలు, మరోపక్క ఆ కష్టాలను తీర్చడానికి కొత్త ప్రభుత్వం పడుతున్న కష్టాలు. అన్నీ కుదురుగా వున్నప్పుడు జరుపుకోవాల్సిన ఇలాటి వేడుకలు ఇంకా ఏదీ సరిగా కుదురుకోక ముందే జరుగుతూ వుండడం కొంత ఇబ్బందే అయినా కాలంతో పరుగులు పెట్టి సదస్సు జయప్రదం చేయడానికి సంబంధిత అధికారులు, సిబ్బంది   చాలా శ్రమ పడ్డారు. ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు, క్రీడోత్సవాలు జరిగినప్పుడు కొన్ని నిధులు అదనంగా అందుతాయని అంటారు. మరిప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ నగరాన్ని 'పెళ్ళిల్లు' మాదిరిగా అందంగా తయారు చేసారు. రోడ్లు అన్నీ కాకపోయినా కొన్నయినా  కొత్త హంగులను సమకూర్చుకున్నాయి. ఈ సదస్సుకు హాజరయ్యేవారి భద్రత బాధ్యతలు నిర్వహించే పోలీసు సిబ్బంది ఏకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త యూనిఫారాల్తో కనబడుతున్నారు. వారి చేతుల్లో  అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల ప్రతినిధులకు ఇవన్నీ వింత కలిగించకపోవచ్చు కాని, అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలవారు ఈ ఏర్పాట్లు చూసి కొంత ముగ్ధులు కావచ్చు. వాళ్ళ సంగతి సరే! ఇంత పెద్ద సదస్సు నగరంలో జరుగుతుంటే స్థానిక మీడియాను  సదస్సు ప్రాంగణానికి ఓ మోస్తరు దూరం వరకే  అనుమతించే అంశం కొంత కలకలం రేపుతోంది.
ఈ ఏర్పాట్లనన్నింటినీ నగర పౌరులు మాత్రం మౌనంగా గమనిస్తున్నారు. ఎవరో వస్తారని, ఏదో చూస్తారని చేస్తున్న ఈ సదుపాయాలు నగరంలో శాశ్వితంగా లభించే  కాలంకోసం వారు ఎదురు చూస్తున్నారు. రంగవల్లుల మాదిరిగా అందంగా తీర్చిదిద్దిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చట కాకుండా కనీసం కొంతకాలం అయినా మన్నితే చాలని ఆశ పడుతున్నారు. నగరాలు ఎదుర్కునే సమస్యలు ప్రపంచంలో ఎక్కడయినా ఒకే మాదిరిగా వుంటాయి. ఒక్కొక్కచోట అనుసరించే పరిష్కార మార్గాలు మాత్రం విభిన్నంగా వుంటాయి. నలుగురు  కలిసికూర్చుని మాట్లాడుకునేటప్పుడు  ఇటువంటి పరిష్కార మార్గాల అన్వేషణపై దృష్టి సారిస్తే కొంత ఉపయోగం వుంటుంది. వేర్వేరు చోట్ల అనుసరించే విధానాలు స్థానిక సమస్యలకు అన్వయం కుదిరేలా ఆలోచన చేయగలిగితే మరికొంత ప్రయోజనం వుంటుంది. లేకపోతే, విందులు వినోదాలు, ప్రసంగాలు, ప్రశంశలు, ప్రచారాలు, ఆర్భాటాలు వీటితోనే ఈ సదస్సులకు 'శుభం' కార్డు పడుతుంది.   (08-10-2014)

నిదురపోరా తమ్ముడా!


'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -


నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.
ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకాదాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి  అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది. 
అయితే,  'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి  అని మాత్రమే  వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.
నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగంఅని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని  వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు  ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే హెచ్ ఎం ఆర్ ఐ – 104 అనే ఒక సంస్త వుంది. 104 నెంబరుకు ఫోన్ చేస్తే అక్కడ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే డాక్టర్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తారు. రోజుకు దాదాపు యాభయ్ వేల మంది వైద్య సలహాలకోసం ఈ కాల్ సెంటర్ ను సంప్రదిస్తుంటారు. వీరికొచ్చే కాల్స్ లో చాలామంది నిద్రపట్టడం లేదు ఏం చేయాలని అడిగేవారు వుంటున్నారట. బహుశా, రాత్రింబగళ్ళు సలహాలు దొరికే కేంద్రం కావడంవల్ల, అర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా సలహాలు ఇచ్చే వైద్యులు అందుబాటులోవుండడం వల్ల - నిద్రపట్టని వారిపాలిట ఈ కేంద్రం వరంగా మారి వుంటుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం నిద్రలేమితో అనారోగ్యాలబారిన పడుతున్నారని ఈ కేంద్రం సేకరించి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
హెచ్ ఎం ఆర్ ఐ 104 ఉచిత ఆరోగ్య వైద్య సలహా కేంద్రం కొన్నాళ్ళ క్రితం రూపొందించిన విశ్లేషణ ప్రకారం యువతలోనే, ప్రధానంగా నగర ప్రాంతాలలోని యువతీ,యువకుల్లో ఈ నిద్రలేమితనం ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తుపై ఆందోళన, రకరకాల మానసిక వొత్తిళ్ళు ఇందుకు కారణగా అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో 92 శాతం మంది 16 నుంచి 40 ఏళ్ళ మధ్య వారేనని తేలింది. వీరిలో అధిక సంఖ్యాకులు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే వుండడం విశేషం. దాదాపు తొంభయ్ వేలమందికి పైగా వివిధ వయస్కుల వాళ్ళు ఈ కేంద్రానికి ఫోన్ చేసి నిద్ర సంబంధిత రుగ్మతల విముక్తికి సలహాలు తీసుకున్నారంటే ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెలఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన నీలాకాశాన్ని పడక గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ మందు కొడితేనే కానీ నిద్రపట్టదు అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితేవైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.

ముందే చెప్పినట్టు పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.
NOTE: Courtesy Image Owner 

7, అక్టోబర్ 2014, మంగళవారం

టచప్  

పొద్దున్న 10 టీవీ 'న్యూస్ మార్నింగ్' ప్రోగ్రాం కి  వెడుతుంటే మాదాపూర్ రోడ్లు మహ ముచ్చటగా కనిపించాయి. నిగనిగలాడే నల్లటి రోడ్లు, తళతళలాడే తెల్లటి గీతలు, ఓహ్ యెంత బాగున్నాయో అనిపించింది. అయితే ఈ ముచ్చట కాసేపే. ఆర్టీసీ క్రాస్ రోడ్   దగ్గర అంతా షరా మామూలే. మామూలు అలవాటయిన పాత ఇంకుడు గుంతల రోడ్లే.  ఓహో! ఇదంతా  మేయర్ల సదస్సు పుణ్యం కాబోలు. చిన్నప్పుడు ఊళ్ళోకి మంత్రిగారు వస్తే బాటకు (రోడ్లు వుంటే కదా!) ఇరుపక్కలా సున్నం ఒక వరుసగా పోసేవారు. అది చూసి ఎవరో పెద్దాయన వస్తున్నారని అనుకునే వాళ్ళు. పద్దతుల్లో కాస్త తేడా వచ్చింది కానీ మనస్తత్వాలు మాత్రం మారలేదు. వున్నరోడ్డుకే కొంత షోకు చేస్తారు. అన్నట్టు రోడ్డంటే గుర్తుకు వచ్చింది. ఆ మధ్య ఒక అధికారి ఎవరో, మూన్నెళ్ళ తరువాత హైదరాబాదులో   రోడ్లమీద గుంత చూపిస్తే పదివేలు పందెం అన్నట్టు గుర్తు. ఆ అధికారికి గుర్తుందో లేదో! 


(NOTE: COURTESY IMAGE OWNER)