9, సెప్టెంబర్ 2014, మంగళవారం

తెలంగాణా ప్రభుత్వ శతదినోత్సవం


వంద రోజుల పాలనకు వంద మార్కులు సాధించడం నిజానికి ఏ పాలకపక్షానికీ సాధ్యం కాదు. కాకపొతే రానున్న కాలంలో సర్కారు నడకతీరును స్థాలీపులాకన్యాయంగా అంచనా వేయడానికి నూర్రోజుల పనితీరు ఒక ప్రాతిపదికగా ఉపకరిస్తుంది.

మంగళవారంతో అంటే ఈనెల తొమ్మిదోతేదీతో ముఖ్యమంత్రి కేసీయార్ నాయకత్వంలో జూన్ రెండో తేదీన ఏర్పడిన నూతన  తెలంగాణా రాష్ట్రం తొలిప్రభుత్వం తన వంద రోజుల పాలన పూర్తిచేసుకుంది. వాస్తవానికి కొత్త రాష్ట్రం తెలంగాణాకు సయితం ఇది వంద రోజుల పండుగే.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్ళనుంచే టీ.ఆర్.యస్.  ప్రత్యర్ధులు, ప్రత్యేకించి  తెలంగాణా టీడీపీ  నాయకులు తమ విమర్శలకు పదును పెడుతూ వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నకొన్ని నిర్ణయాలు చర్చనీయాంశాలుగా మారడం వారికి కలిసివచ్చింది. కాంట్రాక్ట్  ఉద్యోగుల సర్వీసులను  ఖాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణా విద్యార్దులలోనే అలజడులు రేపింది. అలాగే, రెండు ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణా కేబులు టీవీ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం కావాలని ఉదాసీన  వైఖరి అవలంబిస్తోందని కొన్ని జర్నలిష్టు సంఘాలు చేస్తున్న విమర్శలు జాతీయ స్థాయిలో  కూడా ప్రకంపనలకు దారితీయడం  కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇక కేసీయార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఇంటింటి  సర్వే కూడా  ప్రతికూల పవనాలను సృష్టించింది. కాకపొతే ఈ సర్వే వల్ల సర్వత్రా కొంత ప్రతికూలత కనబడ్డప్పటికీ,  పరిపాలన విషయంలో సర్కారు తీసుకునే నిర్నయాలపట్ల సామాన్య జనాలకున్న భయం భక్తీ  తేటతెల్లం అయ్యాయి. ఈ సర్వే వల్ల సాధించింది ఏవిటన్నది తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. కానీ, రాజకీయ ప్రత్యర్దులపై బాణాలు ఎక్కుపెట్టడానికి కేసీయార్ ఎంతమాత్రం వెనుకాడరన్న అభిప్రాయం కలిగించడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారనే చెప్పొచ్చు. కాకపోతే,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకానేక అసాధ్య వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కొత్త ప్రభుత్వం వేస్తున్న కప్పదాట్లు ముందు ముందు గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.    
అయితే, పుష్కర కాలానికి పైగా తెలంగాణా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా నిభాయించుకుంటూ వచ్చిన చంద్రశేఖర రావుగారికి ఇలాటి విమర్శలను ఖాతరు చేయకపోవడం కొత్తేమీ కాదు. వీటిని ఆయన తన సహజసిద్ధ ధోరణిలోనే కొట్టిపారవేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. టీ.ఆర్.యస్.  అనే దీపానికి  తెలంగాణావాదం  చమురు లాటిది. ఈ విషయం కేసీయార్ కి పూర్తిగా తెలుసు. తెలంగాణా రావడంతోనే తెలంగాణా వాదానికి విలువ లేకుండా పోయిందనే వాదాన్ని ఆయన విశ్వసించరు. ఆ వాదం కొడిగట్టిపోకుండా  చూసుకోవడం యెంత అవసరమో ఆ ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి అవగాహన  వుంది.  అందుకే ఆయన చేసే ప్రతి ఆలోచనలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో అది రగులుతూనే ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా, ఏ పధకం అయినా దాని వెనుక తెలంగాణా స్పూర్తి ఉండేలా చూసుకోవడం కేసీయార్ కి వెన్నతో పెట్టిన విద్య,   
ఆయన తరచుగా మాట్లాడే మాటలను బట్టి ఒక విషయం నిర్ధారణగా అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పాటు అన్న కల సాకారమైన తరువాత, ఆ కొత్త తెలంగాణాను ఏ రూపంలో ఆవిష్కరించుకోవాలి అనేదానిపై ఒక నిర్దిష్టమైన అవగాహనకు ఆయన వచ్చినట్టు కనబడుతోంది. 'బంగారు తెలంగాణా' అని పదే పదే చెప్పడంలో కొంత రాజకీయ వ్యూహం, ప్రయోజనం ఉన్నప్పటికీ, కొత్త విధానాలు, కొత్త వ్యవస్తతోనే తెలంగాణా భవిష్యత్ చిత్రపఠం తయారుచేయాలన్న తాపత్రయంతోనే కేసీయార్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పాత పద్దతులను అనుసరిస్తూపొతే,  తాను  అనుకున్న అడుగులు అనుకున్నట్టు వేయలేనన్న ఉద్దేశ్యంతోనే, కొంత  ఆలస్యం అయినా కొత్త బాట పట్టడానికే ఆయన కృతనిశ్చయంతో వున్నట్టు ఆయన చేతలు తెలుపుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తోసిరాజని ఇంటింటి సర్వే నిర్వహించిన తీరు, గవర్నర్ ను కలిసి బడ్జెట్ సమావేశాలను అక్టోబర్ వరకు వాయిదా వేయించిన విధానం ఇందుకు అద్దం పడుతున్నాయి. కొంత మొండిగా అనిపించినా ఈ ఆలోచనల్లో హేతుబద్ధత లేకపోలేదు. సవాలక్ష  సమస్యల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త ఇల్లు సదురుకోవడం ఒక ఎత్తయితే, పాత కాపురం కొనసాగింపుగా మిగిలిన సమస్యలు మరికొన్ని. రాజకీయంగా అస్తిర పరిస్తితులు లేకున్నా, పొంచి వున్న రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుగడల నడుమ,  అత్తెసరు మెజారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం కత్తి మీద సాము అన్న ఎరుక కలిగిన రాజకీయ దురంధరుడు కేసీయార్. ముందు ముందు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు చూపుతో, నైతికం అనైతికం  అన్న వాదనలను లెక్కపెట్టకుండా, అన్ని పార్టీలనుంచి స్థానికంగా బలంగా వుండే రాజకీయ నాయకులను టీఆర్ యస్ లోకి రప్పించే అంశానికి ముందు ఆయన పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందిన  అయిదుగురు  ఎమ్మెల్యేలు, పది మంది ఎమ్మెల్సీలు టీఆర్ యస్ తీర్ధం పుచ్చుకునేలా చేయడమే ఇందుకు ఉదాహరణ. అధికారం వుంటే కాని ప్రజాసేవ చేయడం కష్టం అనే అభిప్రాయం పెంచుకుంటున్న రాజకీయ నాయకుల సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతున్నప్పుడు 'ఆకర్ష్' పధకం అమలుచేయడానికి పెద్ద కష్టపడనక్కరలేదన్న విషయం ఆకళింపు చేసుకున్న రాజకీయవేత్త  కేసీయార్. అందుకే, అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ జంప్ జిలానీల సంఖ్య ఈ విధంగా పెరుగుతోంది. తమ పార్టీని బలపరచుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే అవతల పార్టీలను బలహీన పరచడం లేదా నిశ్సేషం  చేయడం ద్వారా తాము బలపడే కొత్త రాజకీయ సంస్కృతి ఇటీవలి కాలంలో బలంగా వేళ్ళూనుకుంటోంది. 'కాంగ్రెస్ రహిత భారతం' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన నినాదంలో దాగున్న నిజం ఇదే. కాబట్టి, అందరూ చేస్తున్నది అదే అయినప్పుడు, 'పదుగురాడుమాట పాడియై ధరజెల్లు'  అన్న వేమన  సూక్తికి తగ్గట్టే ఈ పార్టీ మార్పిళ్లు నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.                                
ఇక వంద రోజుల పాలనలో మంచి చెడులను బేరీజు వేయాల్సివస్తే -
నిజానికి ఏ కోణంలోనుంచి చూసినా,  ఏ కొలమానంతో  ఆలోచించినా,  ఇలా వందరోజుల పాలనపై అంచనాలకు రావడం అంత మంచిపద్ధతి కాదు. అయిదేళ్ళు పరిపాలించమని ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు,  నూరు రోజుల్లో ఏమి సాధించారో చెప్పాలని  ఆయా  ప్రభుత్వాలను నిలదీయడంలో హేతువు  కనిపించదు. సాధారణ పరిస్తితుల్లో ఈ బేరీజు వ్యవహారాన్ని  కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ సారి అలాకాదు. రాష్ట్రం రెండుగా విడిపోయింది. విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అధికారులు ఎవ్వరో తెలియదు. ఏది మిగులు, ఏది తరుగు  అన్న విషయాల్లో సరయిన అంచనాలు లేవు. వాటిని గురించి చెప్పేవారు లేరు. ఈ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి మామూలుగా పట్టే సమయం కంటే మరికొంత వ్యవధానం అవసరమవుతుంది. అయినా వంద రోజుల్లో నూటొక్క నిర్ణయాలు తీసుకున్నట్టు తెలంగాణా సర్కారు చెబుతోంది.  తెలంగాణా సంస్కృతీ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన గోల్కొండ కోటపై పంద్రాగష్టు పండుగ వంటి అనేక నూతన  కార్యక్రమాలను ఉదహరించింది.   చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయంటోంది.  అందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని చెబుతోంది. పిండిని బట్టి రొట్టె కాకుండా,  ఎన్ని రొట్టెలు అవసరమో ముందు  లెక్క తేల్చుకుని ఆ తరువాత యెంత పిండిని  సమీకరించుకోవాలో లెక్కవేసుకుంటామని అంటోంది. సరే సర్కారును ఆ పనిలో ఉండనివ్వండి. కానీ,  ఈ లెక్కలు డొక్కలు తేల్చుకునే క్రమంలో, పాలన కుదురుకోలేదనే నెపంతో  రోజులు వెళ్ళదీసే  ఆలోచన చేయకూడదనే అందరూ కోరుకునేది.

కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కొంత వ్యవధానం ఇవ్వడం  అవసరం.  కానీ విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వాలకు అంతే అవసరం.   (09--9-2014)

8, సెప్టెంబర్ 2014, సోమవారం

యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదు - ఓ డాక్టరుగారి జ్ఞాపకాలు - 3


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఈ వ్యాస పరంపర ఉద్దేశ్యం) 

"మెడిసిన్ చదవడానికి ఖమ్మం నుంచి హైదరాబాదు వచ్చాను. గాంధీ మెడికల్ కాలేజీ.
అనంత్ లాల్  నన్నూ గోపాలరెడ్డిని తన ఇంట్లో వుండమన్నాడు. అనంత్ లాల్, గోపాల్ రెడ్డిది ఇద్దరిదీ ఒకేవూరు. మానుకోటలో చిన్నప్పటినుంచీ కలిసి చదువుకున్నారు. అనంత్ లాల్ చుట్టాలకి బేగంబజారులో ఓ ఇల్లువుంది. మూడో అంతస్తులో  ఆస్బెస్టాస్ రేకులగదిలో ముగ్గురం సర్దుకునేవాళ్ళం. ఒకే ఒక టేబుల్ ఫాన్ వుండేది. కాకపొతే ఆ గది వెలుపల అంతా ఆరుబయలు స్తలం.
ఆ ఏరియా మొత్తం దుకాణాలమయం. ఇరుకిరుకు గొందులు. నానా చెత్తతో రొచ్చురొచ్చుగా వుండేవి. అనంత్ లాల్ రెండో ఏడు పాసయి క్లినికల్ మొదలు పెట్టాడు. మేము వెళ్ళాల్సిన గాంధీ హాస్పిటల్ సికిందరాబాద్ లో వుండేది. బేగంబజారు నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్లు. పొద్దున్నే లేచి సికిందరాబాద్ వెళ్లి మళ్ళీ మధ్యాహ్నానికల్లా థియరీ క్లాసులకోసం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ చేరుకునేవాళ్ళం. మేము రిఫరల్ స్టూడెంట్స్  కావడం వల్ల గదిలోవుండే  చదువుకునేవాళ్ళం. అప్పుడప్పుడూ మాత్రం కాలేజీకి వెళ్లి ప్రాక్టికల్ క్లాసులకు, లెక్చర్స్ కు హాజరవుతూ వుండేవాళ్ళం. ఆబిడ్స్ లో వసంత విహార్ లో భోంచేసేవాళ్ళం. మా తిరుగుడంతా సైకిళ్ళ మీదే. అనంత్ లాల్ ఒక్కడికే ఓ మోటార్ సైకిల్ వుండేది. ఒకరోజు  కింద పెట్టిన నా సైకిల్ ను ఎవరో ఎత్తుకుపోయారు.
అనంత్ లాల్ చుట్టాలు ఎంతో మంచివాళ్ళు. పండగలు పబ్బాలప్పుడు మాకు స్వీట్లు పూరీలు పెడు తుండే వారు.
ఆ ఇంటికింద భాగంలో చాలా దుకాణాలు, లెట్రిన్లు, బాత్ రూములు వుండేవి. పాయిఖానాల లో బొగ్గుపొడి డబ్బాలు పెట్టేవాళ్ళు.  చేతులు కడుక్కోవడానికి ఆ పొడి వాడేవారు. పాత్రలు కడగడానికి కూడా ఆ బొగ్గుపొడే వుపయోగించేవారు. విచిత్రమయిన విషయం  ఏమిటంటే నీళ్ళు లేకుండా కేవలం బొగ్గుపొడే వాడేవాళ్ళు.
సాయంత్రాలప్పుడు, అనంత్ లాల్ మూడ్ కనిపెట్టి గోపాలరెడ్డి అతడి బైక్ అడిగి తీసుకునేవాడు. దానిపై హోటల్ కు వెళ్లి భోంచేసి వచ్చేవాళ్ళం. అనంత్ లాల్ కి సినిమాల పిచ్చి. పాటలంటే చెవికోసుకునేవాడు. అతడి దగ్గర ట్రాన్సిస్టర్ రేడియో వుండేది. అది పెట్టుకుని పాటలు వింటుండేవాళ్ళం. అనంత్ లాల్ కి చిన్నతనంలోనే పెళ్లయింది. అతడూ, సుభాష్ రెడ్డి కలసి కాంతారావు సినిమాలు ఎక్కువగా చూస్తుండే వాళ్ళు.
ఆ రోజుల్లోనే ఒకరోజు అంతా కలసి గండిపేటకు పిక్నిక్ వెళ్ళాం. సరదాగా ఆ రోజంతా గడిపాము. హైదరాబాదుకు గండిపేట నీళ్ళే మంచి నీళ్ళు.
సెకండ్ షో సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి టివోలీ టాకీసులో రెండో ఆట చూసి నడిచి బేగం బజారు వచ్చాము. బస్సులూ, రిక్షాలు కాకుండా ఎక్కువగా కాలినడకన తిరగడమే అలవాటు. ఆ రోజుల్లో ఆటోలు బహు తక్కువ" (ఇంకా వుంది)

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు - 2


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావుగారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు)  


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు) 

"ఖమ్మంలో వున్న సర్కారు దవాఖానాలో ఒకే ఒక్క డాక్టర్ వుండేవాడు. వూరిమొత్తంలో మరో ఇద్దరు క్వాలిఫయిడ్ డాక్టర్లతో పాటు అయిదుగురు ఆర్ ఎం పీలు వుండేవారు. 
వస్తువులు కొనుక్కోవాలన్నా, కోర్టు పనులు పడ్డా, వైద్యం కోసమయినా చుట్టుపక్కల వూళ్లల్లో వుండే మా చుట్టాలు, తెలిసిన వాళ్ళు  ఖమ్మం వస్తుండేవారు. మా ఇల్లు పెద్దది కావడం వల్ల, అల్లా వచ్చినవాళ్ళు నేరుగా మా ఇంట్లో దిగేవాళ్ళు. ఒక్కోసారి రోజుల తరబడి వుండిపోయేవారు. దానికి తోడు  మా నాన్న రాజకీయాల్లో తిరుగుతూ వుండడం వల్ల ఆయన అనుయాయులు, అనుచరులు, నాయకులు ఇంటికి రావడం ఆనవాయితీగా మారింది. రోజూ పదిమందికి తక్కువ కాకుండా ఇంట్లో భోంచేసేవారు. ఇంట్లో పెద్ద పిల్ల వాడిని నేనే. దాంతో ఇంటికి వచ్చే వాళ్ళ పనులు కూడా నేనే చక్కపెట్టాల్సిన పరిస్తితి. అంటే మంచి నీళ్ళు అందించడం, సిగరెట్లు తెచ్చిపెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయించడం, పక్కలు వేయించడంవంటి పనులన్నమాట. 
1949 లో నా చెల్లెలు  లలిత   పుట్టింది. కానీ ఎక్కువ కాలం బతక లేదు. మా తాతగారి వూరు కంభంపాడులో 1954 లో చనిపోయింది. జబ్బుతో వున్న మా తాతయ్య భండారు రాఘవరావు గారిని చూడడానికి మా అమ్మ పిల్లలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళింది. నేను ఖమ్మంలోనే వుండిపోయాను. 
ఆ పల్లెటూళ్ళో ఎందుకో ఒక రోజు వున్నట్టుండి లలితకు వొళ్ళు పెట్లిపోయేలా  బాగా జ్వరం రావడం, కోమాలోకి వెళ్లడం, మరునాడే చనిపోవడం అంతా  గంటల్లో జరిగిపోయింది. మా నాన్న అప్పుడు హైదరాబాదులో వున్నారు. 
లలిత  చనిపోయింది రాత్రిపూట. కబురు అందించడానికి యే సౌకర్యం లేని వూళ్ళో. కొద్ది మైళ్ల దూరంలో వున్న రైలు స్టేషన్ కు మనిషిని పంపించి టెలిగ్రాం ఇప్పించారు. మరునాటి వుదయం అది ఖమ్మం చేరింది.  అది వచ్చినప్పుడు ఇంట్లో నేనొక్కడినే వున్నాను. టెలిగ్రాం ఇంగ్లిష్ లో వుంది. లలిత  ఎక్స్ ఫై ర్డ్  స్టార్ట్ ఇమ్మీడియట్ ట్లీ.  ఎక్స్ ఫైర్డ్ అనే పదానికి అర్ధం తెలియదు. పెద్దవాళ్ళని వాకబు చేస్తే విషయం తెలిసింది. మనసంతా గందరగోళంగావుంది. ఆలోచనలన్నీ లలిత గురించే. ఆ సాయంత్రం నాన్న ఖమ్మం వచ్చారు. ఇద్దరం కలసి  పాసింజరు రైల్లో బోనకల్లు వెళ్ళాము. కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణరావుగారి వూరు. మా బంధువు కూడా. విషయం తెలుసుకున్న ఆయన మమ్మల్ని చూడడానికి స్టేషనుకు వచ్చి పరామర్శించారు. పది మైళ్ల  దూరంలో వున్న వత్సవాయి వెళ్ళడానికి అప్పటికప్పుడు ఓ ప్రయివేటు బస్సు ఏర్పాటుచేశారు. వెంట తోడుగా ఒక మనిషిని ఇచ్చారు. తినడానికి భోజనం, చీకటి పడితే ఇబ్బంది అని టార్చ్ లైట్ పట్టుకొచ్చారు. భోజనం ముగించుకుని  బస్సులో వత్సవాయి చేరుకున్నాము. వాన పడుతోంది. చీకటిలోనే నడుచుకుంటూ బయలుదేరాము. బాట సరిగాలేదు. కీచురాళ్ళ చప్పుళ్ళ మధ్య ఆ బురద బాటలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అర్ధరాత్రి కంభంపాడు చేరుకున్నాము. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. మమ్మల్ని చూడగానే అంతా భోరుమన్నారు. చిన్నారి లలితను తలచుకుంటూ ఒకరి నొకరు సముదాయించుకుంటూ రాత్రి గడిపాము. మర్నాడు తెలతెలవారుతూనే లలితను పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళాము. ఆమె జ్ఞాపకాలను వెంటబెట్టుకుని ఖమ్మం తిరిగివచ్చేసాము. 

చక్కటి తెలివితేటలు, ఎంతో మంచి భవిష్యత్తు వున్న లలిత  ఎలాటి వైద్య సదుపాయం లభించకుండా అలా కన్ను మూయడం నా మనసును కలచివేసింది. నా చిట్టి చెల్లెలు లలిత  మాదిరిగా ఇంకా ఇలా  ఎంతమంది సరయిన వైద్యం సరయిన సమయంలో దొరక్క చనిపోతున్నారో అన్న దిశగా నాలో ఆలోచన మొదలయింది. ఇంగ్లాండ్ లో పై చదువులు ముగించుకుని తిరిగి వచ్చిన తరవాత గవర్నమెంటు డాక్టరుగా ఖమ్మంజిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి బహుశా ఈ ఆలోచనే ప్రేరణ అయిందేమో. (ఇంకా వుంది)

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. ప్రస్తుతం జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడే వారికి తక్షణ వైద్యసాయం అందించే పధకం అమల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
తీరికసమయాల్లో ఇంగ్లీష్ లో రాసుకున్న జ్ఞాపకాల్లో  కొన్నింటిని ఏరి పోస్ట్ చేస్తున్నాను. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఉద్దేశ్యం)    
ఖమ్మంలోని , మామిళ్ళగూడెంలో కట్టుకున్న మా కొత్త ఇంటి గృహప్రవేశం 1950 లో జరిగింది. పూజా పునస్కారాలు రోజల్లా సాగాయి. అసలు గృహ ప్రవేశం అర్ధరాత్రో తెల్లవారు ఝామునో జరిగింది. మేము అప్పటివరకు వుంటున్న అద్దె ఇంటినుంచి మేళ తాళాలతో  వూరేగింపుగా బయలుదేరి కొత్త ఇంటికి వెళ్ళాము. వెంట తీసుకు వెళ్ళిన కపిల ఆవుని ఇల్లంతా తిప్పి, అది  పేడ వేసేవరకు లోపలే వుంచారు. కొత్త ఇంటిలో ఆవు పేడ  వేస్తె శుభప్రదమని ఓ నమ్మకం. ఇంటి వాకిలిపై బూడిద గుమ్మడి కాయను వేళ్ళాడదీశారు. పూజ బాగా జరిగింది. చుట్టపక్కాలతో కొత్త ఇల్లు పెళ్ళిల్లు  మాదిరిగా కళ కళ లాడింది. వూరబంతి పెట్టిన గుర్తు. అంటే వూరిలో తెలిసినవారినీ, బీదాబిక్కీని పిలిచి భోజనాలు పెట్టడం అన్నమాట. కొత్త గడపలో ఎన్ని విస్తళ్ళు లేస్తే అంత మంచిదనేవాళ్ళు. 
1950  వ సంవత్సరంలో ఖమ్మంలోని గవర్న్ మెంట్   హై స్కూల్ లో చేరాను. నన్ను ఐదో క్లాసులో చేర్చుకున్నారు.  కాకపొతే, మాది బ్రాంచ్ స్కూలు. మెయిన్ స్కూలుకు కొంత ఎడంగా వుండేది. ఆ రోజుల్లో తాలూకా మొత్తానికి ఒకే ఒక  హై స్కూలు, అదీ ఖమ్మంలో వున్న మా స్కూలే. మిగిలినవన్నీ మిడిల్ స్కూళ్ళు.
మేముండే మామిళ్ళ గూడెంలో హై స్కూలుకు వెళ్ళేవాళ్ళం  మొత్తం పదిమందిమి. పొద్దున్న తొమ్మిదికల్లా టంచనుగా నడుచుకుంటూ స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూలుకు వెళ్లి సాయంత్రం అయిదుకు ఇళ్లకు చేరేవాళ్ళం. 
మా ఇల్లు వూరికి దూరంగా పొలిమేరల్లో వుండేది.(ఇప్పుడది ఖమ్మంలో పెద్ద సెంటరు) అగ్గిపెట్టె కావాలన్నా కిలోమీటరు నడిచి వెళ్ళాలి. సరయిన రోడ్డు కాదుకదా దారిమధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు ఉండేవి.  వీధిలో అక్కడక్కడా కర్ర గుంజలు పాతి వాటికి వీధి దీపాలు తగిలించేవాళ్ళు.  ఇంట్లో పెద్దపిల్లాడిని కావడంతో చిన్నా చితకా పనులన్నీ నాపైనే పడేవి. ఆరోజుల్లో మా చుట్టపక్కాలు  అందరికంటే మామిళ్ళగూడెంలో ముందు కట్టింది మా ఇల్లే. 
ఖమ్మానికి ఇరుగుపొరుగు గ్రామాలనుంచి బస్సులు నడిచేవి. రైలు సౌకర్యం ఎప్పటినుంచో వుంది.

(ఇంకావుంది)

6, సెప్టెంబర్ 2014, శనివారం

అలనాటి బెజవాడ - 3


బెజవాడ అంటేనే బ్లేజ్ వాడ. అంటే మండే నగరం. ఇక్కడ ఎండలు అలా మండిపోతుంటాయి. ఎండల్ని గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికీ బెజవాడ ఎండలతో పోల్చి చెప్పడం కద్దు. ఎండల కారణంగా బెజవాడకు రావాల్సిన  ఆంధ్ర విశ్వ విద్యాలయం రాకుండా పోయిందనే ఒక వాదన ప్రచారంలో వుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు బెజవాడ ఎండలకు భయపడే వాల్తేర్ ను ప్రత్యామ్నాయంగా సూచించారని అంటారు. ఈ ఒక్క కారణంగా బెజవాడ వాసులు ఇప్పటికీ ఆయన్ని క్షమించరని అనే వాళ్లు కూడా వున్నారు. (ఏమైతేనేం, అరవై ఏళ్ళ తరువాత బెజవాడకు రాజధాని యోగం సిద్దించింది)

నిద్రపోని నగరంగా బెజవాడ గురించి చెప్పుకుంటారు. ఉత్తర దక్షిణ భారతాలను కలిపే రైళ్ళు అన్నిటికీ కూడలి కావడం వల్ల అర్ధరాత్రీ  అపరాత్రీ అని లేకుండా ప్రయాణీకుల రాకపోకలు నిరంతరం సాగుతూనే వుంటాయి. అలాగే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు. సినిమాలకు వెళ్ళే జనం కూడా ఎక్కువే. వీటికి తోడు ప్రధానమయిన తెలుగు దినపత్రికలన్నింటికీ బెజవాడే ప్రచురణ కేంద్రం. పత్రికల్లో పనిచేసి అర్ధరాత్రో, తెల్లవారుఝామునో ఇళ్లకు చేరుకునే మా బోంట్లకు హోటళ్ళలో తాజాగా వేడి వేడిగా దొరికే కాఫీ పలహారాలే దిక్కు. ఈ విషయంలో  ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాంధీ నగరంలోని బాబాయి హోటలు. సినిమా తారలతో సహా పెద్ద పెద్ద  వాళ్లు అనేకమంది ఈ హోటలుకు  వస్తుంటారు. అలాగే కౌతా సెంటరులో వున్న రాములు కిల్లీ కొట్టు కూడా అంతే  ప్రసిద్ధం. అక్కడ దొరికే కిళ్ళీల కోసం జనం బారులు తీరేవారు. (సమాప్తం)
( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)  

అలనాటి బెజవాడ -2


దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినా, ఒక్క నవరాత్రులను మినహాయిస్తే, గుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.
వేసవి కాలంలో బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలి, వందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.
గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కాని, ఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.
ఒక జీవ నది, మూడు కాలువలు, అనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం. (సశేషం)

( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణమూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)

అలనాటి బెజవాడ



(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతేప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్నిజ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సునుఅనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు -  భండారు శ్రీనివాసరావు )
బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.
జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూ, బిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.
ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పు, పడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమో, పోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.  
ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలు, స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది. (ఇంకా వుంది)

( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)