9, సెప్టెంబర్ 2014, మంగళవారం

తెలంగాణా ప్రభుత్వ శతదినోత్సవం


వంద రోజుల పాలనకు వంద మార్కులు సాధించడం నిజానికి ఏ పాలకపక్షానికీ సాధ్యం కాదు. కాకపొతే రానున్న కాలంలో సర్కారు నడకతీరును స్థాలీపులాకన్యాయంగా అంచనా వేయడానికి నూర్రోజుల పనితీరు ఒక ప్రాతిపదికగా ఉపకరిస్తుంది.

మంగళవారంతో అంటే ఈనెల తొమ్మిదోతేదీతో ముఖ్యమంత్రి కేసీయార్ నాయకత్వంలో జూన్ రెండో తేదీన ఏర్పడిన నూతన  తెలంగాణా రాష్ట్రం తొలిప్రభుత్వం తన వంద రోజుల పాలన పూర్తిచేసుకుంది. వాస్తవానికి కొత్త రాష్ట్రం తెలంగాణాకు సయితం ఇది వంద రోజుల పండుగే.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్ళనుంచే టీ.ఆర్.యస్.  ప్రత్యర్ధులు, ప్రత్యేకించి  తెలంగాణా టీడీపీ  నాయకులు తమ విమర్శలకు పదును పెడుతూ వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నకొన్ని నిర్ణయాలు చర్చనీయాంశాలుగా మారడం వారికి కలిసివచ్చింది. కాంట్రాక్ట్  ఉద్యోగుల సర్వీసులను  ఖాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణా విద్యార్దులలోనే అలజడులు రేపింది. అలాగే, రెండు ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణా కేబులు టీవీ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం కావాలని ఉదాసీన  వైఖరి అవలంబిస్తోందని కొన్ని జర్నలిష్టు సంఘాలు చేస్తున్న విమర్శలు జాతీయ స్థాయిలో  కూడా ప్రకంపనలకు దారితీయడం  కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇక కేసీయార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఇంటింటి  సర్వే కూడా  ప్రతికూల పవనాలను సృష్టించింది. కాకపొతే ఈ సర్వే వల్ల సర్వత్రా కొంత ప్రతికూలత కనబడ్డప్పటికీ,  పరిపాలన విషయంలో సర్కారు తీసుకునే నిర్నయాలపట్ల సామాన్య జనాలకున్న భయం భక్తీ  తేటతెల్లం అయ్యాయి. ఈ సర్వే వల్ల సాధించింది ఏవిటన్నది తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. కానీ, రాజకీయ ప్రత్యర్దులపై బాణాలు ఎక్కుపెట్టడానికి కేసీయార్ ఎంతమాత్రం వెనుకాడరన్న అభిప్రాయం కలిగించడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారనే చెప్పొచ్చు. కాకపోతే,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకానేక అసాధ్య వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కొత్త ప్రభుత్వం వేస్తున్న కప్పదాట్లు ముందు ముందు గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.    
అయితే, పుష్కర కాలానికి పైగా తెలంగాణా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా నిభాయించుకుంటూ వచ్చిన చంద్రశేఖర రావుగారికి ఇలాటి విమర్శలను ఖాతరు చేయకపోవడం కొత్తేమీ కాదు. వీటిని ఆయన తన సహజసిద్ధ ధోరణిలోనే కొట్టిపారవేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. టీ.ఆర్.యస్.  అనే దీపానికి  తెలంగాణావాదం  చమురు లాటిది. ఈ విషయం కేసీయార్ కి పూర్తిగా తెలుసు. తెలంగాణా రావడంతోనే తెలంగాణా వాదానికి విలువ లేకుండా పోయిందనే వాదాన్ని ఆయన విశ్వసించరు. ఆ వాదం కొడిగట్టిపోకుండా  చూసుకోవడం యెంత అవసరమో ఆ ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి అవగాహన  వుంది.  అందుకే ఆయన చేసే ప్రతి ఆలోచనలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో అది రగులుతూనే ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా, ఏ పధకం అయినా దాని వెనుక తెలంగాణా స్పూర్తి ఉండేలా చూసుకోవడం కేసీయార్ కి వెన్నతో పెట్టిన విద్య,   
ఆయన తరచుగా మాట్లాడే మాటలను బట్టి ఒక విషయం నిర్ధారణగా అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పాటు అన్న కల సాకారమైన తరువాత, ఆ కొత్త తెలంగాణాను ఏ రూపంలో ఆవిష్కరించుకోవాలి అనేదానిపై ఒక నిర్దిష్టమైన అవగాహనకు ఆయన వచ్చినట్టు కనబడుతోంది. 'బంగారు తెలంగాణా' అని పదే పదే చెప్పడంలో కొంత రాజకీయ వ్యూహం, ప్రయోజనం ఉన్నప్పటికీ, కొత్త విధానాలు, కొత్త వ్యవస్తతోనే తెలంగాణా భవిష్యత్ చిత్రపఠం తయారుచేయాలన్న తాపత్రయంతోనే కేసీయార్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పాత పద్దతులను అనుసరిస్తూపొతే,  తాను  అనుకున్న అడుగులు అనుకున్నట్టు వేయలేనన్న ఉద్దేశ్యంతోనే, కొంత  ఆలస్యం అయినా కొత్త బాట పట్టడానికే ఆయన కృతనిశ్చయంతో వున్నట్టు ఆయన చేతలు తెలుపుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తోసిరాజని ఇంటింటి సర్వే నిర్వహించిన తీరు, గవర్నర్ ను కలిసి బడ్జెట్ సమావేశాలను అక్టోబర్ వరకు వాయిదా వేయించిన విధానం ఇందుకు అద్దం పడుతున్నాయి. కొంత మొండిగా అనిపించినా ఈ ఆలోచనల్లో హేతుబద్ధత లేకపోలేదు. సవాలక్ష  సమస్యల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త ఇల్లు సదురుకోవడం ఒక ఎత్తయితే, పాత కాపురం కొనసాగింపుగా మిగిలిన సమస్యలు మరికొన్ని. రాజకీయంగా అస్తిర పరిస్తితులు లేకున్నా, పొంచి వున్న రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుగడల నడుమ,  అత్తెసరు మెజారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం కత్తి మీద సాము అన్న ఎరుక కలిగిన రాజకీయ దురంధరుడు కేసీయార్. ముందు ముందు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు చూపుతో, నైతికం అనైతికం  అన్న వాదనలను లెక్కపెట్టకుండా, అన్ని పార్టీలనుంచి స్థానికంగా బలంగా వుండే రాజకీయ నాయకులను టీఆర్ యస్ లోకి రప్పించే అంశానికి ముందు ఆయన పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందిన  అయిదుగురు  ఎమ్మెల్యేలు, పది మంది ఎమ్మెల్సీలు టీఆర్ యస్ తీర్ధం పుచ్చుకునేలా చేయడమే ఇందుకు ఉదాహరణ. అధికారం వుంటే కాని ప్రజాసేవ చేయడం కష్టం అనే అభిప్రాయం పెంచుకుంటున్న రాజకీయ నాయకుల సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతున్నప్పుడు 'ఆకర్ష్' పధకం అమలుచేయడానికి పెద్ద కష్టపడనక్కరలేదన్న విషయం ఆకళింపు చేసుకున్న రాజకీయవేత్త  కేసీయార్. అందుకే, అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ జంప్ జిలానీల సంఖ్య ఈ విధంగా పెరుగుతోంది. తమ పార్టీని బలపరచుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే అవతల పార్టీలను బలహీన పరచడం లేదా నిశ్సేషం  చేయడం ద్వారా తాము బలపడే కొత్త రాజకీయ సంస్కృతి ఇటీవలి కాలంలో బలంగా వేళ్ళూనుకుంటోంది. 'కాంగ్రెస్ రహిత భారతం' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన నినాదంలో దాగున్న నిజం ఇదే. కాబట్టి, అందరూ చేస్తున్నది అదే అయినప్పుడు, 'పదుగురాడుమాట పాడియై ధరజెల్లు'  అన్న వేమన  సూక్తికి తగ్గట్టే ఈ పార్టీ మార్పిళ్లు నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.                                
ఇక వంద రోజుల పాలనలో మంచి చెడులను బేరీజు వేయాల్సివస్తే -
నిజానికి ఏ కోణంలోనుంచి చూసినా,  ఏ కొలమానంతో  ఆలోచించినా,  ఇలా వందరోజుల పాలనపై అంచనాలకు రావడం అంత మంచిపద్ధతి కాదు. అయిదేళ్ళు పరిపాలించమని ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు,  నూరు రోజుల్లో ఏమి సాధించారో చెప్పాలని  ఆయా  ప్రభుత్వాలను నిలదీయడంలో హేతువు  కనిపించదు. సాధారణ పరిస్తితుల్లో ఈ బేరీజు వ్యవహారాన్ని  కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ సారి అలాకాదు. రాష్ట్రం రెండుగా విడిపోయింది. విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అధికారులు ఎవ్వరో తెలియదు. ఏది మిగులు, ఏది తరుగు  అన్న విషయాల్లో సరయిన అంచనాలు లేవు. వాటిని గురించి చెప్పేవారు లేరు. ఈ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి మామూలుగా పట్టే సమయం కంటే మరికొంత వ్యవధానం అవసరమవుతుంది. అయినా వంద రోజుల్లో నూటొక్క నిర్ణయాలు తీసుకున్నట్టు తెలంగాణా సర్కారు చెబుతోంది.  తెలంగాణా సంస్కృతీ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన గోల్కొండ కోటపై పంద్రాగష్టు పండుగ వంటి అనేక నూతన  కార్యక్రమాలను ఉదహరించింది.   చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయంటోంది.  అందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని చెబుతోంది. పిండిని బట్టి రొట్టె కాకుండా,  ఎన్ని రొట్టెలు అవసరమో ముందు  లెక్క తేల్చుకుని ఆ తరువాత యెంత పిండిని  సమీకరించుకోవాలో లెక్కవేసుకుంటామని అంటోంది. సరే సర్కారును ఆ పనిలో ఉండనివ్వండి. కానీ,  ఈ లెక్కలు డొక్కలు తేల్చుకునే క్రమంలో, పాలన కుదురుకోలేదనే నెపంతో  రోజులు వెళ్ళదీసే  ఆలోచన చేయకూడదనే అందరూ కోరుకునేది.

కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కొంత వ్యవధానం ఇవ్వడం  అవసరం.  కానీ విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వాలకు అంతే అవసరం.   (09--9-2014)

కామెంట్‌లు లేవు: