26, ఆగస్టు 2014, మంగళవారం

ఐస్ బకెట్ సవాల్


ఓ  అరవై  ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో  అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. దానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము,  వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు  అన్నం వొండిపెట్టేవారు. అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునేవాళ్ళు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప,  చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు.
ఈనాడు బహుళప్రచారంలో వున్న 'ఐస్ బకెట్ ఛాలంజ్' గురించి చదువుతున్నప్పుడు జ్ఞాపకాల పొరల్లో దాగుండిపోయిన అన్నదాన సమాజం గుర్తుకువచ్చింది.   
సోషల్ మీడియా సైట్స్ తెరిచి చూస్తె చాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తాయి ఐస్ బకెట్ ఛాలంజ్  వీడియోలు. వాటి తాలూకు  ఫోటోలు, బకెట్ల కొద్దీ ఐస్ నీళ్ళను నెత్తిన దిమ్మరించుకుంటూ, 'చూశారా నేనెంత సాహసం చేశానో, మీరూ చెయ్యండి చూద్దాం' అనే  సవాళ్లు విసురుతూ
బకెట్లకొద్దీ ఎన్ని నీళ్ళు వృధా  అయ్యాయో తెలియదు కానీ, ఈ బకెట్ల సవాళ్ళ ఉద్యమం మొదలైన నెల రోజుల్లోనే అక్షరాలా పదహారు మిలియన్  డాలర్లు  ఏ.ఎల్.యస్. అసోసియేషన్ ఖాతాలో వచ్చి పడ్డాయి. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నందుకు, ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు   ఇదే  అసోసియేషన్ కు నిరుడు ఇదే కాలంలో వచ్చిన విరాళాలు పద్దెనిమిది లక్షల డాలర్లు మాత్రమే. కానీ ఈసారి సోషల్ మీడియా పుణ్యమా అని విరాళాల  మొత్తం ఒక్కసారిగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. 'అమ్యోట్రాపిక్ లేటరల్ స్క్లెరోసిస్' అనబడే ఒక నోరు తిరగని వ్యాధిపై ఈ అసోసియేషన్  ఏళ్ళతరబడి పరిశోధనలు చేస్తూ వస్తోంది. అది మరీ నోరుతిరగడం లేదని మరొకరు దీనికి లౌ గెహ్రిగ్స్ జబ్బు అంటూ మరో నోరుతిరగని పేరు పెట్టి ప్రచారంలో పెట్టారు. నరాలకు సంబంధించిన ఒకరకమైన జబ్బు ఇది. నరాలు కుంచించుకుపోవడం, మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. అమెరికాలో ఏటా అయిదారువేలమంది దీని బారిన పడుతున్నారని, వ్యాధి సోకినవారిలో లక్షమందిలో ఇద్దరు మృత్యువాత పడుతున్నారనీ గణాంకాలు తెలియచేస్తున్నాయి. బకెట్ ఐస్ నీళ్ళు నెత్తిన గుమ్మరించుకుంటూ, దాన్ని వీడియోలు తీయించుకుంటూ, మళ్ళీ వాటిని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తూ, 'మీరూ ఇలా చేయగలరా' అని తమ సన్నిహితులకు సవాళ్లు విసురుతూ వందలకొద్దీ డాలర్లు ఆ ఏ.ఎల్.యస్. అసోసియేషన్ కు విరాళాలు పంపుతున్న వారికి అసలు ఏ.ఎల్.యస్. అసోసియేషన్ అంటే ఏమిటో తెలుసా అంటే అనుమానమే. ఇందులో పాల్గొంటున్నవాళ్ళు  ఆ అసోసియేషన్ కు ఇచ్చే విరాళం కంటే కూడా ఎక్కువ మొత్తాలను  ఐస్ కొనడానికి  ఖర్చుచేస్తున్నారని విమర్శించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే, ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఐస్ వాటర్ బకెట్లకొద్దీ నెత్తిన దిమ్మరించుకుంటున్న వాళ్ళలో అనేకమంది ఆ సంస్థకు విరాళాలు పంపుతున్నారో లేదో తెలియదు కాని. ఐస్ వాటర్ బకెట్ దృశ్యాలను వీడియోల్లో  చిత్రీకరించి, సోషల్ మీడియాలో ప్రదర్శించడం ద్వారా మంచి ప్రచారం మాత్రం కల్పిస్తున్నారనేది కాదనలేని సత్యం. అందుకే ఈ ఉద్యమం ''భయంకరమైన అంటువ్యాధి' మాదిరిగా అతి తక్కువకాలంలో దేశదేశాలకు పాకిపోయింది. పైగా మైక్రో సాఫ్ట్ వంటి కంప్యూటర్ దిగ్గజాల సీ.ఈ.ఓ. లు స్వయంగా ఈ ఐస్ వాటర్ బకెట్ ఛాలంజ్ వీడియోల్లో స్వయంగా దర్శనం ఇవ్వడంతో దీనికి విశ్వవ్యాప్త ప్రచారం ఇట్టే లభించింది. ఇక మనదేశంలో సరేసరి. అమెరికాలో ఎవరయినా విజిల్ చేతిలో పట్టుకుంటే మనదగ్గర ఈలలు వేసే సంస్కృతి. ఇక చెప్పాలా. ఐస్ వాటర్ బకెట్లకు ఎక్కడలేని ప్రచారం. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని సెలెబ్రిటీ అనిపించుకోవాలని చూసేవారే.  
     
సరే బాగానే వుంది. ప్రచారం బాగానే వుంది. కానీ ప్రచారం ఒక్కటే ఏ ఉద్యమానికయినా ఊతం ఇస్తుందా. ఈ ప్రశ్నకు సమాధానం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ 'యునిసెఫ్' ఒక ప్రకటన రూపంలో కనబడింది.
'ఫేస్ బుక్ లో మాకు లైక్ కొట్టండి. కానీ ఆ లైక్ లతో  మేము ఒక్కరంటే ఒక్కబిడ్డకు కూడా పోలియో చుక్కలు వెయ్యలేము'  (అంటే ఏమిటన్నమాట. ప్రచారంతో పనులు జరగవని)
ఏ.ఎల్.యస్. సంస్థ పేరుతొ సాగిపోతున్న ఈ ఆన్ లైన్ ప్రచారంపై కెనడాలో కొంత పరిశోధన జరిగింది. 'ఆన్ లైన్ లో ఏదో చేస్తున్నారు అని ఒక వ్యక్తికీ కానీ, సంస్థకు కానీ బహుళ ప్రచారం జరిగిందంటే, ఇక వాస్తవ జీవితంలో వాళ్ళు సాధించేది ఆ స్థాయిలో వుండదు'అన్నది ఆ పరిశోధన సారాంశం.
సోషల్ సైట్లను సందర్శించేవారికి అనునిత్యం ప్రజా సమస్యలపై  అనేక రకాల పిటీషన్లు , విరాళాలకోసం విజ్ఞప్తులు కోకొల్లలుగా కానవస్తుంటాయి. చాలామందికాకపోయినా కొందరయినా వాటికి స్పందించి చేతనయిన సాయం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఆ రకమైన ఆన్ లైన్ పిటీషన్ లపై స్పందించనివారు, సంతకాలు చేయనివారు కూడా తమకు ఏమాత్రం సంబంధం లేని ప్రజాహిత కార్యక్రమాలకు అంతకంటే ఎక్కువగా విరాళాలు పెద్ద ప్రచారం లేకుండా ఇస్తుంటారని మరో అధ్యయనంలో తేలింది.
ఇప్పుడు ఉధృతంగా సాగిపోతున్న ఐస్ బకెట్ ఛాలంజ్ విషయానికి వస్తే, ఇది ఎన్నాళ్ళు నిలవగలదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
మనిషి సంఘజీవి (సోషల్ యానిమల్) అంటారు. ఈనాటి మనుషుల్లో కొందర్ని 'సోషల్ మీడియా యానిమల్స్' అనొచ్చు అనేది శాస్త్రవేత్తల అబిప్రాయంగా వుంది.
'కొన్ని అంశాలు  సోషల్ మీడియాలో సంచరించే ప్రజల  దృష్టిని ఆకర్షిస్తాయి. వాటిపై స్పందించి దాన్ని వెంటవెంటనే ఇతరులకు క్షణాలమీద చేరవేస్తారు. కాని ఇటువంటివారు తాము ఇచ్చిన  విరాళాలు ఎలా ఖర్చు అవుతున్నాయో అనే దానిపై దృష్టి పెడతారు. వారికి ఆ విధానాలు నచ్చకపోతే మరోసారి అటువంటివాటి జోలికి వెళ్ళరు' అంటున్నారు వారు.

ఐస్ బకెట్ వాటర్ ఛాలంజ్ పట్ల  భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా  ప్రాచుర్యం పొందిన అంశం మరోటి లేదు అనే విషయంలో మాత్రం అందరు ఏకీభవిస్తున్నారు.   

NOTE: Photo Courtesy Image Owner  

24, ఆగస్టు 2014, ఆదివారం

333333

ఇదో తుత్తి
333333

ఆరు  మూళ్లు. అంటే  మూడు లక్షల ముప్పై మూడువేల మూడువందల ముప్పై మూడు. నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటితో ఈ అంకెను దాటిపోయింది. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

ఓ మొగుడి 'ఆత్మ'కధ


(నిజంగా కధే సుమా!)

మా ఆవిడ కంటే మా కోడలు అదృష్టవంతురాలు. ఆమెకు ప్రేమించే మొగుడు దొరికాడు.
ఆ మాటకు వస్తే  నేనూ ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఈ వయస్సులో అబద్ధం చెప్పడం యెందుకు? నన్ను ప్రేమించిన మా ఆవిడను నేను పెళ్ళాడాను.
నన్ను పెళ్ళిచేసుకుని ఆవిడ ఏం సుఖపడిందో నేను గ్యారంటీగా చెప్పలేను కాని ఆవిడ్ని చేసుకుని నేను చాలా లాభపడ్డాను.
అంటే బోలెడు బోలెడు కట్నం డబ్బులతో మా ఇంటిని మెట్టిందని కాదు. కట్టుడు చీరేతోనే కాపురానికి వచ్చినా ఆ తరువాత నా జీవితానికి ఎక్కడా లేని నిశ్చింతను తెచ్చిపెట్టింది. నా భార్య కుడికాలు మోపిన దగ్గరనుంచి నేను కాలు మీద కాలు వేసుకుని బతగ్గలిగే బతుకు నా సొంతమయింది.
మొదటినుంచీ నాది స్వతంత్ర ప్రవృత్తి. దానికి తోడు ఏదో కధలూ కాకరకాయలు గిలుకుతానని నమ్మకం.
ఈ చేతకానితనానికి నేను ఓ సిద్ధాంతాన్ని  తగిలించి ప్రచారం చేసుకున్నాను.   తన రెండు కాళ్ళమీద తాను నిలబడలేని వాడే ఉద్యోగం చేస్తాడని, తనపై తనకు నమ్మకం వున్న ఏ మనిషయినా సరే  తనకు తానుగా పైకి ఎదగడమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తాడని బీరాలు పలుకుతూ, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చినా చేయకుండా రెండు కాళ్ళు ముడుచుకుని ఇంట్లోనే వుండిపోయాను. దాంతో మా ఆవిడే నన్నూ, నా వల్ల పెరిగిన సంసారాన్నీ ఒంటిచేతిపై  సాకడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె తేనెటీగలా నిరంతరం శ్రమించింది. నన్ను నా మానాన వొదిలేసిందన్న సంతోషంతో నా బాధ్యతారాహిత్య జీవితాన్ని మరింత ఆనందంగా గడపడం మొదలుపెట్టాను.
మా అందరికోసం అంతగా కష్టపడే మా ఆవిడ పట్ల నేనెప్పుడూ రవంత జాలి చూపిన జ్ఞాపకం లేదు. అదేదో ఆవిడ బాధ్యత అనుకునేవాడిని. నేనూ నా స్నేహితులూ, కధలూ, సభలూ, సమాజాన్ని మార్చడానికి అడ్డమయిన చర్చలూ, అలా అలా అదోవిధమయిన మత్తులో జీవితం గడిచిపోయింది.
దేవుడనేవాడు వున్నాడో లేదో తెలియదుకాని, వుంటే వాడి దయవల్ల  వున్న ఒక్క కొడుకు ప్రయోజకుడయ్యాడు. అందులో నా ప్రయోజకత్వం యెంత మాత్రం లేదు. ఆ విషయం నాకు తెలుసు కానీ నలుగురికీ తెలియదు కదా. వాడి ఎదుగుదలలో నా పాత్రను గురించి  తెలిసిన నలుగురూ పదిమందిలో పొగుడుతుంటే తెలియని ఆనందంతో పొంగిపోయేవాడిని. కనీసం  మర్యాదకు కూడా అలాటి సందర్భాలలో మా ఆవిడ ప్రసక్తి తెచ్చేవాడిని కాదు.
ఇలా ఇలా మా కధ సాగిపోతూవుండగా  సినిమాలో ఇంటర్వెల్ ముందు చిన్న క్లైమాక్స్ మాదిరిగా -
కన్నతండ్రిని,  నాతో  ఒక్క మాట కూడా చెప్పకుండా నా ఒక్కగానొక్క కొడుకువాడి ఆఫీసులో పనిచేసే ఒకమ్మాయిని గుళ్ళో పెళ్ళాడి ఇంటికి తీసుకువచ్చాడు. బుద్దులెక్కడికి పోతాయి చెప్పండి.
కానీ నా బుద్దులు వాడికి వొంటబట్టిన దాఖలాలు ఆ తరువాత కనబడలేదు. కొత్త పెళ్ళాన్ని కాలుకందనీయకుండా చూసుకునే వాడి వైనాన్ని చూస్తుంటే నాకు వొళ్ళు మండిపోయేది. అదేమిటో ఆ క్షణంలో నాకు వాడు కొడుకన్న సంగతి కూడా మరచిపోయి కోడలిపట్ల వాడు చూపుతున్న ప్రేమా,ఆదరణా చూసి, పైకి అనకూడదు కానీ లోలోపల   అసూయపడేవాడిని. కానీ,  మా ఆవిడ మాత్రం కోడలంటే ప్రాణం పెట్టేది.  కూతురు లేని కొరతను కోడలుతో తీర్చుకుంటున్నట్టుగా వుండేది ఆమె ప్రవర్తన. నిజానికి మా ఆవిడ పడాలి అసూయ, నన్ను కట్టుకున్న అనుభవంతో, నాతో  కాపురం చేసి పొందిన  అనుభవాలతో.  
పాపీ చిరాయువు అంటారు. కానీ, జీవుల జమాలెక్కలు పైనుంచి చూసే ఆ భగవంతుడికి అది తెలిసినట్టు లేదు.
అందుకే    రోజు ఇంట్లో కాళ్ళు బారజాపి  టీవీలో సీరియల్ చూస్తున్న నన్ను, ఎవరినో అడ్డంపెట్టి బయటకు పిలిచాడు. మామూలుగా సహజ బద్ధకంతో  పట్టించుకోని నేను వెంటనే బయలుదేరిపోయాను. నేను వెడుతున్న ఆటో సందు మలుపు తిరుగుతుండగానే ఓ లారీ వచ్చి కొట్టింది. అంతే. అంతవరకే తెలుసు.
కాకపోతే ప్రాణాలు పోతున్నప్పుడు మా ఆవిడ జ్ఞాపకం వచ్చింది. ఆవిడ మా కుటుంబం కోసం పడ్డ కష్టం జ్ఞాపకం వచ్చింది. బహుశా ఈ ఒక్క కారణం తోనే అనుకుంటా నేను నమ్మని ఆ దేవుడు ఈ నాలుగు ముక్కలు నలుగురితో చెప్పి గుండె బరువు తగ్గించుకునే ఈ వెసులుబాటు ప్రసాదించాడు. ఇందులో మరో మతలబు కూడా వుండవచ్చేమో. ఇది చదివి నాలాటి వారిలో ఏదయినా కొద్ది మార్పు అయినా వస్తుందన్న ఆశతో చేసివుంటాడేమో! అందుకే దేవుడు పిచ్చివాడన్నారు.పిచ్చి దేవుడన్నారు. 
ఇలాటివి నేను ఎన్ని రాయలేదు గనుక.  ఎవరయినా మారారా! అంతెందుకు. నేనేమయినా మారానా!


NOTE:Courtesy Image Owner



23, ఆగస్టు 2014, శనివారం

బాబోయ్ హెచ్చార్!


ఉద్యోగంలో చేరి రెండేళ్లు కావస్తోంది. ప్రమోషన్ సంగతి దేవుడెరుగు ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. అనుకుని హెచ్ ఆర్ మేనేజర్ దగ్గరకు వెళ్లాను. వెళ్ళి ముసిముసి నవ్వొకటి విసిరి మనసులో మాట బయట పెట్టేలోగా ఆయనే ఒక మందహాసం పారేసి కుర్చీలో కూర్చోబెట్టి బాంబు లాటి కామెంటు ఒకటి నా మొహం మీదే పేల్చాడు.
‘చూడండి సుందరరావు గారు మీరు ఆఫీసుకు రాకుండానే జీతం తీసుకుంటున్నారట’
నాకు నోటమాట రాలేదు. ఇదేమిటి ఇలా ఎదురు వచ్చాడు.
మేనేజర్ మళ్ళీ  అడిగాడు
‘చూడండి సుందరరావు గారు ఏడాదికి ఎన్ని రోజులు?’
ఓ పక్క వొళ్ళు మండుతున్నా నెమ్మదిగా జవాబిచ్చాను
365 లేదా కొన్ని సార్లు 366
‘అవునా! మరయితే రోజుకు ఎన్ని గంటలు?’
అందుకే అంటారు  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని. ఏం చేస్తాను? పని నాది కదా, ఓపక్క నోరు నొక్కుకుని  మరో పక్క నోరు తెరిచి చెప్పాను.
24 గంటలు’
‘అవునా! మరి మీరు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు?’
‘ఉదయం పది నుంచి  సాయంత్రం ఆరుగంటల దాకా. అంటే ఎనిమిది గంటలు’
‘అవునా! అంటే  ఏమిటన్న మాట. రోజుకు 24  గంటల్లో మీరు పనిచేసేది మూడో వంతు’
(అవునొరేయ్) 'అవును'  
‘ఏడాదికి  366 రోజుల్లో మూడో వంతు అంటే యెంత 122రోజులు అవునా!’
( అవున్రా! గాడ్దీ! )
‘మీరు పనిచేసేది వారానికి అయిదు రోజులు. శనాది వారాలు ఆఫీసుకి  రారు’
‘అంటే ఏమిటన్నమాట. 52  ఆదివారాలు, 52 శని వారాలు. మొత్తం 104  రోజులు ఆఫీసు మొహం చూడరు’
‘సరే! ఇందాకటి  122 రోజులనుంచి ఈ 104  తీసేస్తే మిగిలినవి ఎన్ని?’
(నాబొంద నీ శ్రాద్ధం) 
అలా నీళ్ళు నమలడం కాదు. నేను చెప్పేది వినండి. ఇవికాక ఏడాదికి రెండువారాలు,  రోగం రొస్టు అంటూ సిక్  లీవులు.    ఆ 14 తీసేస్తే మిగిలేవి నాలుగు రోజులు’ 
ఇక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, జనవరి ఫస్ట్, దీపావళి పండుగలకి  ఎట్లాగు  రారు.
‘అంటే ఏమిటన్నమాట. మీరు సంవత్సరంలో ఒక్క రోజు కూడా పనిచేయడం లేదన్నమాట. అంటే ఏమిటి అర్ధం. ఆఫీసులో  ఏపనీ చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటున్నారని అర్ధం.  ఎట్లాగు వచ్చారు కదా! ఇప్పుడు చెప్పండి  నన్నేం  చెయ్యమంటారో.  పనిచేయని కాలానికి తీసుకున్న డబ్బుల్ని  ఇకనుంచి ఎన్ని వాయిదాల్లో మీ నెల జీతం నుంచి పట్టుకోమంటారో చెప్పి మరీ  వెళ్ళండి.’



తోక మాట: ప్రత్యేకంగా చెప్పేదేవుంది? ఇది కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎత్తిపోతే! కాకపోతే నా సొంత బాణీలో రాతే! 
NOTE: Courtesy Image Owner

అసెంబ్లీలో అసలేంజరుగుతోంది? -భండారు శ్రీనివాసరావు


(24-08-2014 ఆదివారం 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
గత కొంత కాలంగా పేపర్లు చదువుతున్నా,  పాత పేపర్లు తిరగేస్తున్నా,  టీవీ చర్చలు చూస్తున్నా  సామాన్య జనానికి  మనసులో మెదిలే ప్రశ్న ఇదే.
ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎలాంటి  రాజకీయపార్టీకయినా ఏవో కొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్థిరమైన భావజాలాలుంటాయి. కానీ ఈనాడు  దాదాపు  అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.
ఏకంగా  శాసన సభను వేదికగా చేసుకుని ఎదుటివాళ్ళు అసభ్యపదజాలం వాడుతున్నారంటూ చేసే ఆరోపణల్లో కూడా అదేమాదిరి పదాలు దొర్లడం చూస్తుంటే  గోటితో పోయేదానికి గొడవలవరకు లాగుతున్నారన్న అభిప్రాయం సామాన్య జనాల్లో కలుగుతోంది. గొడవలకు కారణభూతులెవ్వరో తేల్చుకునే క్రమంలో మరిన్ని గొడవలకు అంకురార్పణ చేస్తున్నారు. జరిగినదానికి మొత్తం బాధ్యత అవతలవారిపై మోపుతూ అసలు బాధ్యతల నుంచి తప్పించుకునే దృశ్యం దృగ్గోచరమవుతోంది.
విమర్శలు చేసినప్పుడు, వివరణలు ఇస్తున్నప్పుడు గతాన్ని తవ్వుకోవడం వల్ల విషయం పక్క దోవపడుతూ, సభాసమయం వృధా అవుతున్న అంశాన్ని పట్టించుకోవడం మరచిపోతున్నారు. ఏది పార్లమెంటరీ పదం? ఏది కాదు? అనే విషయంలో ఇదమిత్థమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సభాసాంప్రదాయాల విషయంలో లక్షలు ఖర్చు చేసి శిక్షణ ఇప్పించినప్పటికీ వాదప్రతివాదాల వేడిలో అవన్నీ ఆవిరైపోతున్నాయి. గొడవలకు మూలకారణం మీరంటే మీరని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ, చివరికి ఎవరిది తప్పో ఎవరిది వొప్పో తేల్చుకోలేని పరిస్తితిని స్వయంగా కల్పించుకుంటున్నారు. తమ వాదాలకు బలం చేకూర్చుకునే క్రమంలో వాడే భాష అదుపుతప్పి అనవసర గందరగోళాలకు కారణమవుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. సభలో సాగుతున్న ప్రతిదాన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న సంగతి మరచిపోతున్నారు.     
పార్టీల విషయం వచ్చేసరికి ఎవరికీ నిబంధనల  సంగతి  పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. నిందారోపణలు చేయడానికి, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఏ పార్టీకి  ఆ పార్టీవారు మూకుమ్మడిగా ఒక్కటై  ఒక్కపెట్టునలేచి మాట్లాడడం, అధికారపక్షం, ప్రతిపక్షం తేడాలేకుండా పోడియంలోకి దూసుకుపోయి సభాకార్యక్రమాలకు అంతరాయం కల్పించడం ఇవన్నీ గమనిస్తున్నవారికి, ముందే పేర్కొన్నట్టు అసలు అసెంబ్లీలో ఏం జరుగుతోంది అన్న అనుమానం అందరి మనసుల్లో ఇంతింతై అంతింతై అన్నట్టు పెరిగిపోతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.
గతాన్ని తవ్విపోసుకోవడం  తప్పుకాదు అన్న తరహాలో అందరూ  వ్యవహరిస్తున్నారు కాబట్టి ఒకసారి  గతంలోకి తొంగిచూస్తే, పాత రోజుల్ని పునశ్చరణ చేసుకుంటే కానవచ్చే దృశ్యం 'గతకాలము మేలు' అన్న సూక్తిని గుర్తుచేస్తుంది.
రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ శాసన సభకు పాత అసెంబ్లీ భవనాన్ని కేటాయించారు. అయ్యదేవర కాళేశ్వర రావు వంటి స్పీకర్లు, పుచ్చలపల్లి సుందరయ్య,  తెన్నేటి విశ్వనాధం, పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు వంటి ప్రతిపక్ష దిగ్గజాలు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావువంటి నేతలు కలిసి కూర్చుని సమాలోచనలు జరిపిన సభామందిరం అది.  అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు.
శాసన సభలో ఏం జరిగిందో సవివరంగా అదే రోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు
పదిహేను నిమిషాలపాటు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి పత్రికల్లో పనిచేసే జర్నలిష్టులు సమీక్షలు రాసేవాళ్ళు. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది.
సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో కదలికమొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
ఇక శాసనసభ విషయానికి  వస్తే-
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. 

టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో మరో అంశం చర్చనీయాంశం అవుతోంది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారడం ఇందులో దాగున్న విషాద కోణం. అయితే,  టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక్క  అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని ప్రతిపక్షాలు కూడా అలవరచుకోవాలి. అదే సమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌధ పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి. (23-08-2014)

                                                      



21, ఆగస్టు 2014, గురువారం

సింగపూర్లో కేసీఆర్ - చిన్న మా ఫామిలీ టచ్


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనలో భాగంగా హోటల్ రిట్జ్ లో భారత పారిశ్రామిక సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆదిత్య కృష్ణ రాయ్ అనే ఒక తెలుగు  యువకిశోరం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. మీరు చూస్తున్న ఫోటోలో కేసీఆర్ తో కనబడుతున్న శాల్తీ ఆదిత్యే. ఈ ఆదిత్య  యవరయ్యా అంటే మీలో చాలామందికి తెలిసిన నా క్లాస్ మేట్ వనం జ్వాలా నరసింహారావు కుమారుడు. జ్వాలా ఎవరయ్యా అంటే కేసీఆర్ సీపీఆర్వో. సీఎం తో ఆదిత్య కలయికకి జ్వాలా ఉద్యోగానికి ఎంతమాత్రం సంబంధం లేదు. ఈ ఆదిత్య యవరయ్యా అంటే  సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దేశాలకు గూగుల్ సంస్థ హెచ్ ఆర్ డైరెక్టర్. అంతే  కాదు వాడికి ఇంకో  హోదా వుంది. అది ఇంకా గొప్పది.  అదేమిటయ్యా అంటే ఆదిత్య మా మేనకోడలు విజయలక్ష్మి ఏకైక పుత్రుడు.



(కేసేఆర్ తో ఆదిత్య)

సూదికోసం సోది




జోకులు పంచుకుంటే పెరుగుతాయి అనేది ఓ హితవచనం. జోకులకి కాపీ కొట్టే రైట్లే కాని కాపీ రైట్లు వుండవన్నది మరో ఉచాచ. ఈ ఉపోద్గాతం ఎందుకంటె నిన్న మార్కెట్లోకి వచ్చిన ఆంద్ర జ్యోతి 'నవ్య' వారపత్రిక (27-08-2014) ఈరోజు మాఇంటికి చేరింది.  అందులో  61వ పేజీలో  One more cup coffee అనే శీర్షిక కింద 'వైనతేయ' అనే కలం పేరుతొ 'అన్యోన్య దాంపత్యం' అనే చిన్న గల్పిక ప్రచురించారు. రెండేళ్లకు పూర్వమే  అంటే 2012 మే నెలలో నేను నా బ్లాగులో 'గుర్తురావడం లేదు' అంటూ ఒక రచన పోస్ట్ చేసాను. నిజానికి దానికి మూలం నెట్లో సంచరిస్తున్న ఒక ఇంగ్లీష్ కధ. నేను దాన్ని నాదైన శైలిలో తెలుగులోకి మార్చాను. అదే మళ్ళీ ఈ రోజు మరో రూపంలో 'నవ్య'లో దర్శనం ఇవ్వడం కేవలం కాకతాళీయం కావచ్చు. మలయాళంలో సినిమాని హిందీలో డబ్ చేస్తే దాన్ని తెలుగులోకి అనువదిస్తే తిరిగిదాన్నే మలయాళంలోకి మార్చిన సినిమా కధలు వింటుంటాం. ఇదీ ఆ కోవలోనిదే. 


           

గుర్తు రావడంలేదు - భండారు శ్రీనివాసరావు 
ఎనభయ్యవ పడిలో పడ్డ పరమేశ్వరాన్ని ఆయన బాల్య స్నేహితుడయిన ఏకాంబరం చాలా  ఏళ్ళ తరువాత ఇంటికి  ఆహ్వానించాడు.
భోజనాలు అయిన తరువాత ముసలివాళ్లిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పిచ్చాపాటీ మొదలుపెట్టారు.
పైకి ఏదో మాట్లాడుతున్నాడన్న మాటే కాని పరమేశ్వరాన్ని మనసులో ఒక సందేహం తొలుస్తోంది.
వచ్చినప్పటినుంచీ చూస్తున్నాడు. ఏకాంబరం భార్య కొంగుపట్టుకుని తిరుగుతూ చూడు కన్నా, చూడు బుజ్జీఅంటూ ఒకటే నస.
ఇన్నేళ్ళ సంసారం తరువాత కూడా ఏకాంబరం భార్య పట్ల చూపిస్తున్న ప్రేమానురాగాలు, ప్రేమతో పిలుస్తున్న తీరూ గమనించిన పరమేశ్వరానికి మతిపోయినట్టుగావుంది. 
వాళ్ల  పెళ్ళయి దాదాపు అరవై ఏళ్ళు దాటిపోయాయి. అయినా ఏదో నిన్ననో మొన్ననో పెళ్ళిచేసుకున్న జంటలా ఆ పిలుపులు ఏమిటో.
వుండబట్టలేక ఏకాంబరాన్నే నేరుగా అడిగేసాడు అదేమిట్రా ఇంకా చిన్నపిల్లాడిలా పెళ్ళాన్ని పట్టుకుని కన్నా, బుజ్జీ అంటూ ఆ పిలుపులేమిటి? ఎంచక్కా పెళ్ళాన్ని పేరుతొ పిలవచ్చుకదా! అంటూ.
ఏకాంబరం జవాబు చెప్పాడు.
నాకూ పేరుతొ పిలవాలనే  వుంది. కానీ అదేమిటో కానిఆమె పేరు 
 మరచిపోయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నీ పేరేమిటని పొరబాటున అడిగాననుకో ఆ రాక్షసి నా ప్రాణం తోడుకుతింటుంది.’ (May-2012)

NOTE: Courtesy Cartoonist Mallik