17, ఆగస్టు 2014, ఆదివారం

దటీజ్ బాపు. బాపు ది గ్రేట్.


ముళ్ళపూడివారి 'కోతికొమ్మ'చ్చికి  ఆయన అభిమాన బృందం  అభిమాన  పురస్సర  కొనసాగింపే 'కొసరు కొమ్మచ్చి' పుస్తకం.   వెల కేవలం రెండువందలు. కేవలం ఎందుకంటున్నానంటే - ఇందులో అక్షరలక్షలు విలువ చేసే బాపూగారి  'రమణా నేనూ, మా సినిమాలు' అనే ముందుమాట వుంది.(ప్రతులకు నవోదయా) ఎదుటివాడిమీద  జోకులేసి నవ్వుకోవడం కాదు, మన మీద మనమే జోకులేసుకుని నవ్వించే గుణం వుండాలి అనే బాపూ గారి మానసిక ఔన్నత్యానికి ఇదిగో ఒక మచ్చు తునక:
బాపూ గారి ఉవాచ:
"శంకరాభరణం ఎనభయ్ మూడోమాటు చూడ్డానికి దియేటర్ కు వెళ్ళినపుడు ఇంటర్ వెల్ లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగునవచ్చి బుల్లి మఖమల్ అట్ట పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. 'పెన్ను లేదమ్మా' అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి అందులోనుంచి పెన్సిల్ తీసి ఇచ్చింది. నేను సంతకం పెడుతుంటే చూసి, 'మీరు విశ్వనాద్ గారు కారా'  అనడిగింది. 'కాదమ్మా' అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని,  ఫ్రెండుని 'ఒసే. బాక్సులో లబ్బరు వుంటుంది ఇలా తే' అంది"
దటీజ్ 



      

16, ఆగస్టు 2014, శనివారం

ప్రత్యేకతలతో సాగిన ప్రధాని ప్రసంగం


(17-08-2014 - ఆదివారం సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో ప్రతియేటా ప్రతి ప్రధానమంత్రి దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట బురుజులపై నుంచి  పంద్రాగస్త్ట్ ప్రసంగాలు చేస్తూ వస్తూనే వున్నారు. ఇది కొత్తవిషయమేమీ కాదు. కానీ ఈసారి  ప్రధాని హోదాలో తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన తరువాత నరేంద్ర మోడీ  చేసిన ప్రసంగంలో అనేకానేక  విలక్షణ  లక్షణాలు  కానవచ్చాయి. గతంలోని జవహర్ లాల్ నెహ్రూ సాదాసీదా రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. విచిత్రం ఏమిటంటే మోడీ  మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా నెహ్రూ ప్రస్తావన తీసుకురాకపోవడం. పైపెచ్చు ఆయన కాలంలో ఏర్పడ్డ  ప్రణాలికా సంఘానికి కాలం చెల్లి పోయిందంటూ  ప్రత్యామ్నాయ వ్యవస్థ ప్రతిపాదన తెర మీదకు తీసుకు రావడం. మళ్ళీ అదే సమయంలో మహాత్మా గాంధీ,  వల్లభాయ్  పటేల్ వంటి కాంగ్రెస్ అగ్రనాయకుల పేర్లు సంస్మరించుకోవడం. అంతే కాకుండా భారత దేశం ఇంతవరకు  సాధించిన అభివృద్ధిలో మునుపటి  ప్రభుత్వాల  పాత్ర వుందంటూ ప్రసంశల వర్షం కురిపించడం.




ప్రధానమంత్రి ప్రసంగంలో మాత్రమే కాకుండా ప్రసంగించిన తీరులో కూడా వైవిధ్యం కనబరిచారు. దశాబ్దాల తరబడి ప్రజా ప్రతినిధులను ప్రజలనుంచి వేరు చేస్తున్న సెక్యూరిటీ విధానాలకు స్వస్తి చెప్పి, బుల్లెట్ ప్రూఫ్ అద్దాల అడ్డుగోడలను తొలగించారు. ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతున్నది తమలో ఒకడే అనే భావన జనాల్లో కలిగేలా తన వేషధారణ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. అధికారులు రాసి ఇచ్చిన ప్రసంగం ప్రతిని వల్లె వేసే పాత పద్దతికి భరతవాక్యం పలికి ఆశువుగా ప్రసంగించడం మరో విశేషం. 'ప్రధాన మంత్రిగా కాదు, ప్రజాసేవకుడిగా మీముందుకు వచ్చాను' తరహా మాటలతో ప్రజానీకం మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
ప్రధానమంత్రిగా తన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు  వివరించే సంప్రదాయాన్ని ఒక పక్క పాటిస్తూనే, ప్రధాని హోదా కలిగి వ్యక్తి  -  స్వాతంత్ర దినోత్సవం వంటి సందర్భాలలో చేసే అధికారిక సందేశ ప్రసంగంలో  ఇంతటి అత్యల్ప స్వల్ప విషయాలను కూడా ప్రస్తావిస్తారా  అని పరిశీలకులు ముక్కు మీద వేళ్ళు వేసుకునే రీతిలో -   'కుటుంబాల్లో ఆడపిల్లల్ని  ఆడామగా తేడా లేకుండా వారిని ఎలా పెంచాలి?'  అనే అంశాలను కూడా జోడించడం  మరో ప్రత్యేకత. మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ, 'ఆడశిశువులను గర్భంలోనే చిదిమివేసే దుష్ట సంస్కృతికి మంగళం పాడాల'ని ఆయన తలితండ్రులకు విజ్ఞప్తి చేసిన తీరు  మరీ   ప్రత్యేకతను సంతరించుకుంది.  ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని, శారీరక ఆరోగ్యాన్ని  వారి విద్యార్జనతో ముడిపెడుతూ 'ప్రతి పాఠశాలలో మరుగు దొడ్ల సౌకర్యం' ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఒక్క ఏడాదికాలంలో ఈ కార్యక్రమాన్ని  అమలుచేయడానికి వీలైన రోడ్ మ్యాప్ కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.  ఇందుకోసం ప్రతి పార్ల మెంటు సభ్యుడు తన నియోజకవర్గం అభివృద్ధి నిధులనుంచి తగిన మొత్తాలను ఖర్చు  చేయాలని సూచించారు. ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చూపే శ్రద్ధను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చూపితే 'పరిశుద్ధ భారతం'గా దేశాన్ని  తయారుచేయడం అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి చిన్న చిన్న అంశాలు కూడా ప్రధాని స్వతంత్ర దినోత్సవ సందేశంలో  చోటుచేసుకోవడం సహజంగానే ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక విమర్శనావకాశాన్ని అందించినట్టయింది.
'అతి సాధారణ అంశాలకు పరిమితం అయిన ప్రధాని ప్రసంగంలో దార్శనికత కొరవడింద'ని కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ  ప్రభ్రుతులు పెదవి విరిచారు. 'ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తే పధకాలను  అమలుచేసేది ఎవరు,  పర్యవేక్షించేది ఎవర'ని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి  ఆక్షేపించారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా, బీజేపీయేతర   రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం మోడీ ప్రసంగం, మంచి  ఉత్సాహాన్ని ఇచ్చి వుంటుంది. సమాఖ్య స్పూర్తిని గౌరవించాలన్న ఆయన పలుకులు వారికి కర్ణపేయంగా వినబడివుంటాయి. ప్రభుత్వాలకు   మెజారిటీ వున్నాకూడా  అందరినీ కలుపుకుపోతూ ఏకాభిప్రాయాన్ని సాధించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుని   సత్ఫలితాలను  సాధించవచ్చని  మోడీ   చెప్పారు. తద్వారా  కేంద్రం అత్తగారి పెత్తనానికి  తన హయాంలో  కాలం చెల్లిపోయినట్టే అన్న అభిప్రాయం  కలిగించారు. అధికారమనేది  రాజకీయాలకు వేదిక కాదనీ, జాతి నిర్మాణ సాధనకు అది ఒక మార్గమనీ మోడీ హితవు పలికారు.
'నేను పనిచేస్తాను, మీరూ పనిచేయండి' అని ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం  చేసారు. నూటపాతిక కోట్లమంది జనం చేయీ చేయీ కలిపి పనిచేస్తే  ప్రపంచంలో భారత దేశానికి ఇక తిరుగే ఉండదని అన్నారు.
కొంత రాజకీయ కోణం ప్రధాని  ప్రసంగంలో కానవచ్చినప్పటికీ, మొత్తం మీద ప్రజలను ఆకట్టుకునే రీతిలోనే సాగిందని చెప్పవచ్చు. మోడీ ప్రసంగిస్తున్నప్పుడు వినవచ్చిన చప్పట్లే  దీనికి  నిదర్సనం.
యావత్ ప్రపంచం గుర్తింపు పొందే విధంగా బ్రాండ్ ఇండియా తయారుచేయాలన్న మోడీ లక్ష్యం నెరవేరే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తె ప్రజలకు కావాల్సింది ఇంకా  ఏముంటుంది.  

15, ఆగస్టు 2014, శుక్రవారం

విజయానికి ఏడు మాటలు




నిన్న సాయంత్రం హైదరాబాదు గోల్ఫ్ క్లబ్ లో జరిగిన ఒక సమావేశంలో హెచ్.ఎం.ఆర్.ఐ.,  సీ.ఈ.ఓ., డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ విజయం సొంతం చేసుకోవడానికి కావాల్సిన ఏడు మాటలు చెప్పారు.
అవేమిటంటే:
ఆర్తి, ఆకాంక్ష, ఆవేశం, ఆలోచన, ఆచరణ, ఆమోదం, ఆధ్వర్యం
ఏపని చేయాలన్నా ఆపని పట్ల ఆర్తి అవసరం. చేయాలన్న ఆకాంక్ష, చేసి తీరాలన్న ఆవేశం అంతే అవసరం. ఆర్తి, ఆకాంక్ష, ఆవేశం వుంటే చాలదు  ఆలోచన కూడా అవసరం. ముందు వెనుకలు ఆలోచించకుండా అడిగేస్తే  అంతా నిరర్ధకం అయ్యే ప్రమాదం వుంటుంది. తరువాత కావాల్సింది ఆచరణ. ఈమొత్తం ప్రక్రియ విజయవంతం కావాలంటే ఆమోదం అంటే ప్రజల ఆమోదం కూడా వుండితీరాలి. ఇక చివరిగా, అంటే ఇవన్నీ సమకూరినప్పుడు, మొత్తం ప్రణాళికను అమలుచేసే యంత్రాంగం లేదా వ్యవస్థ అవసరం, అదే ఆధ్వర్యం. అది ప్రభుత్వం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు. ఇంకేదైనా కావచ్చు.
ఈ ఏడూ కూడితే అంటే సమకూడితే అలా చేపట్టిన పని ఏదయినా విజయం సాధించి తీరుతుంది. అని డాక్టర్ బాలాజీ ఉవాచ.  

   

కంటికి చిక్కిన 'సిత్రాలు'


స్వాతంత్ర దినవేడుకల్ని అన్ని టీవీ ఛానళ్ళు పోటాపోటీగా ప్రసారం చేసాయి. ఈ సందర్భంలో కానవచ్చిన, వినవచ్చిన కొన్ని విశేషాలు.
సికిందరాబాదు పెరేడ్ మైదానంలో అమర సైనికుల స్మారక స్తూపం వద్ద  నివాళి అర్పించిన అనంతరం స్మారక ఫలకం చేరువలో కూర్చుని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్,  సైనికాధికారులు అందించిన పుస్తకంలో సంతకం చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన ముందున్న స్మారక ఫలకంపై   'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు' అని ఇంగ్లీషులో రాసిన అక్షరాలు కనిపించాయి. ఆ ఫలకం వేసినప్పుడు సీఎం చంద్రబాబు కావడంవల్ల ఆయన పేరు వేశారు. కానీ ఇప్పుడది  విచిత్రంగా గోచరించింది.



స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలచిన గోల్కొండ కోట చారిత్రిక ప్రాధాన్యం గురించి టీవీ వ్యాఖ్యాతల వర్ణవను మించి  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన ప్రసంగంలో  అభివర్ణించారు. ఒకనాటి తెలంగాణ కవులను పేరుపేరునా స్మరించడం  నిజంగా అభినందనీయం. తెలుగు భాషపై ఆయనకు వున్న పట్టు ఎలాటిదో మరోసారి తెలిసివచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.   

14, ఆగస్టు 2014, గురువారం

నిర్ణయం (కధానిక) - భండారు శ్రీనివాసరావు




ప్రహరీ  గేటు తెరుస్తుంటే సెల్ మోగింది. శ్రీ కాంతం మామయ్య.
'ఒర్రేయ్ కృష్ణా - నువ్వు బాబాయి గారి వూరెళ్ళావని మీ ఆవిడ చెప్పింది. పరాంకుశం గారు పిల్లని చూడ్డానికి రేపు అక్కడికి వస్తున్నారని చెప్పు. నేనే చెబుదును కానీ, వొద్దులే నువ్వే అక్కడ వున్నావు కదా విషయం  నీకే బాగా తెలిసి వుంటుందిలే' అంటూ ఫోన్ ఆఫ్ చేసాడు. గేటు మీద చెయ్యి అప్రయత్నంగా వెనక్కు వచ్చింది. 'ఏవిటిలా అంటాడు. శ్రీ కాంతం మామయ్యకు  నాకంటే కూడా బాబాయి దగ్గర చనువు. పైగా నేను బాబాయి వూరికి  అనుకోకుండా వచ్చాను. ముందు అనుకున్నది కూడా కాదు. ఇప్పుడేం చేయాలి' అనుకుంటూనే గేటు తెరిచి చూసాను. బాబాయి ఏరి కోరి కట్టుకున్న ఇల్లు. ఇంటి ముందు పది మంచాలు వేసుకుని హాయిగా పండుకునే జాగా. మట్టే బంగారం అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఆయన గజం జాగా కూడా అమ్మలేదు. అపార్ట్ మెంటుకు ఇవ్వాలనే ఆలోచనా  చెయ్యలేదు.
అంతా నిశ్శబ్దంగా వుంది. బాబాయి కొన్ని విషయాల్లో గంభీరంగా వుంటాడు కానీ అందరితో బాగా కలివిడిగా వుండే తత్వం. వచ్చేపోయేవాళ్ళతో హడావిడిగా వుండే ఇల్లు. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో దర్బారు మొదలవుతుంది. కొన్ని విషయాల్లో వయస్సును కూడా మరిచిపోయి హుషారుగా వుంటాడు. అందుకే నాకూ ఆయనకూ చాలా ఏళ్ళు తేడా వున్నా మేమిద్దరం ఎప్పుడూ కలిసినా చాలా సరదాగా కాలక్షేపం చేస్తుంటాం.
వసారా దాటుకుని వెళ్లాను. తలుపు వోరగా వేసి వుంది. మాటలు వినబడుతున్నాయి. అంటే ఇంట్లోనే వున్నారన్నమాట. కాలింగ్ బెల్లు నొక్కకుండానే తలుపు తోసుకుని లోపలకు వెళ్లాను. రాంబాయి పిన్నీ, పిన్ని కూతురు స్పందన ఇద్దరూ  నన్ను చూసి మాటలు ఆపేశారు.
'ఏం కృష్ణా చెప్పాపెట్టకుండా దర్శనం. అంతా బాగున్నారా. మీ ఆవిడ యెలా వుంది. ఈ మధ్య వొంట్లో బాగాలేదన్నారు. బాబాయి గారు ఇంట్లో లేరు. నేనూ స్పందనా  ఏదో లోకాభిరామాయణంలే. ఏవిటి సంగతులు?...' పిన్ని గడగడా మాట్లాడేస్తోంది. కానీ ఆ స్వరంలో ఏదో తేడా. మాటలకు చూపులకు పొంతన కుదరడం లేదు. ఈ టైం లో ఎందుకువచ్చానన్న సందేహం ఆమె కళ్ళల్లో కనబడుతోంది.
నా సందేహానికి సమాధానం స్పందన మాటల్లో నాకు  బోధపడింది.
'కృష్ణప్ప బాబాయి మనకు  ఏవన్నా కొత్తా. ఆయన దగ్గర దాచేది యేవుంటుంది. అదికాదు బాబాయి. పరాంకుశం తాతయ్య కొడుకు లేడూ. సుందరం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చి వారం అయిందట. మళ్ళీ వెంటనే వెళ్ళాలట.  నన్ను చూసుకోవడానికి రేపో ఎల్లుండో వస్తాడట. అమ్మా నాన్నా ఒకటే ఇదై  పోతున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కళ్ళముందు పెరిగారు. పైగా  పరాంకుశం తాతయ్యతో వ్యవహారం. బాగుండదు వొప్పుకోమ్మా అంటారు. నిన్నటి నుంచి ఇదే నస. ఏం చెప్పమంటావు' అనేసింది తానూ తల్లిలాగే లొడలొడా.
'ఓహో అందుకా అన్నీ నీకే తెలిసివుంటాయ'న్నాడు శ్రీకాంతం మామయ్య. విషయం అర్ధం అయింది. స్పందనతో  నేరుగా యెప్పుడన్నా అన్నామేమో  తెలియదు కాని,  సుందరం, స్పందన  చిన్నప్పటి నుంచీ మా అందరి లెక్కలో భార్యాభర్తలే.
ఆ మాటే పైకి అన్నాను. నామాట వినగానే స్పందన కస్సుమని లేవలేదు. పైగా మనసులోని మాటను యండమూరి వారే  ఆవహించారేమో అన్నంత చక్కగా తేటతెల్లం చేసింది.
చిట్టి, అదే స్పందన ముద్దు పేరు,  మా అందరి కళ్ళముందు పుట్టి పెరిగిన చిట్టి తల్లి, అలా ఆరిందాలా ఒక్కొక్క విషయం చెబుతుంటే నేను చెవులొప్పగించి వింటూ వుండిపోయాను.
'చూడు బాబాయి. నువ్వన్నది కరక్టే. నేనూ సుందరం మొగుడూ పెళ్లాలమని మనవాళ్లందరూ అనుకుంటున్న సంగతి నాకూ తెలుసు. కానీ మీకు తెలియంది ఒకటి వుంది. చిన్నప్పటి నుంచీ ఎన్నో అనుకుంటూ వుంటాం. అన్నీ జరుగుతాయా. నేను డాక్టర్ అయితే చూడాలని నాన్న ఆశపడ్డాడు. నాచేత నర్సింగ్ హోం పెట్టించాలని ఇల్లు చెడగొట్టకుండా అంతే వుంచేసాడు. కానీ అయినానా. లేదే. పెళ్లి అనేది మనసుకు సంబంధించింది కాకపొతే నేనూ తలవంచి సుందరం చేత తాళి కట్టించుకునేదాన్ని. చిన్నప్పటినుంచి కలిసి తిరగడం వల్లనో యేమో, 'ఒసే చిట్టీ' అంటే 'ఏరా సుందరం' అనిపిలుచుకునే వాళ్ళం. ఈ కాలంలో మొగుడూ పెళ్ళాలు   ఇలా పిలుచుకోడం మామూలయింది కాబట్టి ఈ వాదన నిలవదనుకో. కానీ, మరి మనసునేం చేయను. అది మరోలా చెబుతోందే. ఇక పరాంకుశం తాతయ్య సంగతి. ఆయనంటే అందరికీ సింహ స్వప్నమే. కానీ నాతో చిన్న పిల్లాడిలా వుంటాడు. తాతయ్య తాతయ్య అంటూ చిన్నప్పటి నుంచి ఆయన వొళ్ళో పెరిగాను. ఇప్పుడు కోడలు అవతారంలో వెళ్ళి 'మామయ్యా కాఫీ తాగుతారా' అని యెలా అడగను. సుందరం సంగతి తలచుకుంటే మరీ విడ్డూరం. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నవాడే. మళ్ళీ ఈ పెళ్లిచూపుల తతంగానికి తల వూపడం ఏమిటి? పైగా చేసే ఉద్యోగం అమెరికాలో. నేనూ ఇందులో ఇరుక్కున్నాను కనుక సరిపోయింది. లేకపోతే ఈ విషయంలో సుందరాన్ని కడిగి గాలించి వుండేదాన్ని. చివరిగా చెబుతున్నాను బాబాయి. అమ్మకూ, నాన్నకూ, పరాంకుశం తాతయ్యకూ ఇష్టం కాబట్టి ఏమి చేయమన్నా చేస్తాను, కానీ సుందరంతో పెళ్లి మాత్రం ఇష్టపడయితే చేసుకోను. అతడు జస్ట్ నా చిన్నప్పటి ఫ్రెండ్. అంతే. అంతకు మించి ఏమీ కాదు. ఇంకోమాట. ఇలా అంటున్నానని నా మనసులో ఎవరో వున్నారని అనుకోవద్దు. ప్రేమా దోమా అలాంటివేం లేవు. వుంటే ముందు చెప్పేది మా అమ్మానాన్నతోనే.'
ఎప్పుడు వచ్చాడో తెలియదు. స్పందన  చెప్పింది ఎంతవిన్నాడో తెలియదు. బాబాయి చేతులు స్పందన  తలను ఆప్యాయంగా నిమురుతున్నాయి. కళ్ళు అదేపనిగా వర్షిస్తున్నాయి.


 NOTE: Courtesy Image Owner



13, ఆగస్టు 2014, బుధవారం

"విత్ మి ఆర్ విత్ మై ఎన్మీ"


"వుంటే నాతొ వుండు, లేదా నా శత్రువుతో వుండు" అని అర్ధం వచ్చే ఈ మాట అన్నది ఒక అమెరికన్ ప్రెసిడెంటు. పేరు గుర్తుకు రావడం లేదు.
"వుంటే నాతో వుండు. పోతే నీ దేశం పోరా" అనే సినిమా పాట అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది.  ఏ సినిమాలోదో, ఎవరు రాశారో అదీ గుర్తులేదు.
ఇప్పుడవి గుర్తుకువచ్చిన సందర్భం మాత్రం గుర్తుంది.
ప్రతిరోజూ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల నడుమ సాగుతున్న మాటల యుద్ధం గమనిస్తూ, వాటిని గురించి విశ్లేషణ చేసే సందర్భంలో మహా విసుగు వస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల సముఖంలో ఇలాటి చర్చ జరిగినప్పుడు మరీ ఇబ్బందిగా వుంటోంది. ఏ విషయానికయినా బొమ్మా బొరుసూ మాదిరిగా 'మంచీ చెడూ' అనే రెండు పార్శ్వాలు వుంటాయి. పీపీయేలు, ఫీజు రీఇమ్బర్స్ మెంట్లు,  సర్వే ముచ్చట్లు ఏది తీసుకున్నాఈ విషయంలో  'మాదే రైటు' అనే మొండి ధోరణి తప్ప ఒక అంగుళం దిగివచ్చి మంచేదో చెడేదో మాట్లాడుకుందాం అన్న ధోరణి కానరావడం లేదు. ఏ విధానం అయినా, ఏ ప్రణాళిక అయినా నూటికి నూరు శాతం కరక్టుగా వుండే అవకాశం  వుండదు. మొత్తం మీద బాగున్నా ఏవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. కానీ, ఒక్క చిన్న విషయంలో  కూడా అవతలవాళ్ళు చెప్పింది అంగీకరించడానికి ఇవతలవాళ్ళు సిద్ధంగా వుండరు.  వాళ్ల నాయకుల విధానాలను సమర్ధించుకుంటూ పోవాలనే ఏకైక లక్ష్యం ఒక్కటే కనబడుతుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇంత గుడ్డిగా సమర్ధించుకుంటూ పోవడం ఏమేరకు మేలు చేస్తుందో అర్ధం కావడం లేదు. పార్టీలతో ప్రమేయం లేని వ్యక్తులు కూడా వుంటారని వాళ్లు మరచిపోతున్నారు. చాలా దురదృష్టకరం.


అనేక విషయాల్లో విబెదిస్తున్న అటూ ఇటూ నాయకుల వరస ఒక విషయంలో మాత్రం ఒకే విధంగా వుంది.
'మధ్యే మార్గం వద్దు. వుంటే నాతో వుండు. లేదా శత్రువుతో వుండు'
మరి నాయకుల్నిబట్టే వారి అనుచరులు.
దీనికి ముక్తాయింపు అన్నట్టుగా పక్కన  టీవీలో తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతుంటే వారి పార్టీ సభ్యులు గుడ్డిగా బల్లలు చరుస్తున్న దృశ్యం కనబడుతోంది.      

NOTE: Courtesy Image Owner 

వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ


రేడియో న్యూస్ రీడర్లు గురించి నేను రాసినవాళ్ళందరూ  నాతో పాటు హైదరాబాదు కేంద్రంలో పనిచేసినవారే!. ఇక, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడలో, చదువరుల్లో కొందరు పేర్కొంటున్న మరికొందరు న్యూస్ రీడర్లు  ఢిల్లీలో - ఉదాహరణకు కొంగర జగ్గయ్య - రేడియోలో వార్తలు చదివినవారే. తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వారే. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తూవస్తున్నాడు. యెంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. అది ఇంకా మంచి విషయం.
పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగావెళ్ళి ఆరోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.


(ప్రయాగ రామకృష్ణ)

వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పండితత్వం ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా పనికొచ్చాయి. ఒక్కోసారి బులెటిన్ అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకువెళ్ళి అందించేలోగా రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ అనర్ఘళంగా చెప్పేవాడు. కొప్పుల సుబ్బారావుది మరో బాణీ. మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారుకాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగివచ్చి ఉద్యోగ పర్వంలో శిఖరాగ్రం చేరిన కొన్నాళ్ళకే కన్నుమూయడం బాధాకరం.