5, ఆగస్టు 2014, మంగళవారం

నా గురించి నలుగురూ.....2


1988 లో ఆంధ్ర జ్యోతి మాజీ ఎడిటర్, మహా టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ ఐ. వెంకట్రావ్, నాటి సోవియట్ ప్రభుత్వ వార్తా సంస్థ 'నోవొస్తీ' ఆహ్వానంపై  రెండు వారాలపాటు సోవియట్ యూనియన్ ని సందర్శించారు. అందులో భాగంగా మాస్కో వచ్చారు. 'ఫ్లాష్ బ్యాక్' అనే పేరుతొ రచించిన పుస్తకంలో శ్రీ వెంకట్రావ్ నా గురించి ప్రస్తావించారు.
"మాస్కోలో వున్నప్పుడు మిత్రుడు భండారు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లాను. ఆకాశవాణిలో పనిచేసే శ్రీనివాసరావు రేడియో మాస్కోలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, నేనూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో సహచరులం. శ్రీనివాసరావు సరదా మనిషి. ఒకటే జోకులు. తెగ నవ్విస్తుంటారు. ఆయన కుటుంబం అంతా నాకు తెలుసు. అందువల్ల నన్ను డిన్నర్ కు ఇంటికి ఆహ్వానించారు. నాతొపాటు ఇండియా నుంచి వచ్చిన మరో ఇద్దరు జర్నలిష్టులను కూడా. ఆయన ఇంటిలోనే ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడి గారిని కలిసాను. ఆవిడా, ఆవిడ బృందం ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా సోవియట్ నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. మాలాగే, ఆవిడా, ఆవిడ సహచర బృందం కూడా శ్రీనివాసరావుకి గెస్టులు. అర్ధరాత్రివరకు కబుర్లు, తిండి తినడాలతో కాలం ఇట్టే గడిచిపోయింది. హోటల్ కు తిరిగి రావడానికి ఇంటి బయటకు వస్తే వీధులన్నీ నిర్మానుష్యం. లైట్లు  దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కానీ జనసంచారం నిల్. శ్రీనివాసరావుని అడిగాను - 'భయం వుండదా?'అని. మిగతా సమస్యలు యెలా వున్నా మాస్కోలో భయం అన్నది మాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి వొంటరిగా ఆడమనిషి బయటకు వెళ్ళినా నిక్షేపంగా ఇంటికి చేరగలదని ఆయన చెప్పారు. దగ్గర్లో  వున్న మెట్రో స్టేషన్ వరకు మా వెంట వచ్చి రైలు ఎక్కించి వెళ్లారు."



నా గురించి నలుగురూ .....


నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది.
ముందుగా రేడియోలో నా సహచరులు, ప్రసిద్ధ కధారచయిత శ్రీ డి. వెంకట్రామయ్య ఉవాచ:


 “ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీనివాసరావు గారూ (ఇలా రాయడం ఆయన మర్యాద కానీ, ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ...ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడంఅన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.
 అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను. అయినా ఆఫీసులో కూర్చున్నంతసేపు నా పని నాదే, నా పద్ధతులు నావే. నా నియమాలు నావే. సక్రమం, సమజసం  అనుకున్న మార్గాన్ని ఏమాత్రం విడవలేదు”  
(ఆకాశవాణిలో నా అనుభవాలు శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచనఅక్టోబర్, 2013 సంచిక నుంచి రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)

నిజమేనేమో!


'పుట్టుకతో కాదు కాని నేను మాంసాహారినే' అంటుంది మా ఆవిడ.

ఎందుకంటే  తీరికూర్చుని  ఇతర్ల మెదళ్ళు తింటుంటానుట.  


4, ఆగస్టు 2014, సోమవారం

టీవీ చూస్తున్నా. ఏమిటా గోల?


(నెల్లుట్ల వెంకట రమణారావు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధనానికి అనువాదం)
ఏకాంబరం టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే భార్య చేతులు తుడుచుకుంటూ వచ్చి అడిగింది.
"ఏమిటి చూస్తున్నారు"
"ఐ పీఎల్. నువ్వూ కూర్చుని  చూడు"
"బ్యాట్ చేస్తున్నది బ్రిట్ లీ కదా"
"కాదు అతడు బౌలర్. ఇతడు క్రిస్ గేల్"
"ఓహో! అలా అనిపించింది. భలే! భలే! మళ్ళీ వికెట్ పడింది"
"అది రీప్లే. ఇందాకటిదే మళ్ళీ చూపిస్తున్నారు"
"అలాగా! నేనూ అదే అనుకున్నాను. చూస్తుండండి ఈసారి ఈ మ్యాచ్ ఇండియా గెలిచి  తీరుతుంది"
"ఐపీఎల్ ఇండియా ఆడే మ్యాచ్ కాదు. ఇప్పుడు జరుగుతున్న  మ్యాచ్ బెంగుళూరు ముంబై మధ్య"
"నేనూ అదే అనుకున్నాను. ఈ జట్టు గెలవాలంటే ఇంకా ఎన్ని రన్స్ చేయాలి"
"36 బంతుల్లో 72 పరుగులు చేయాలి"
"తేలిగ్గా చేయొచ్చు. ఒక్క బంతికి రెండు పరుగులు"
"ఈ గోలంతా యెందుకు. నీకు టీవీ కావాలి. సీరియల్ చూడాలి. అంతే కదా!"
ఏకాంబరం భార్యకు రిమోట్ ఇచ్చేసాడు. ఆమె ఛానల్ మార్చి సీరియల్లో మునిగిపోయింది.
"నిన్న ఎపిసోడ్ లో కనిపించలేదు. ఎవరావిడ?" ఏకాంబరం చిన్నగా అడిగాడు.
భార్య గయ్యిమని లేచింది.
"నన్ను చూడనివ్వరా? కాసేపు ఆగలేరా? సీరియల్ పూర్తయ్యేదాకా వూరికే పక్కన కూర్చుని ఇలా ప్రశ్నలతో చంపకండి."




NOTE: Courtesy Image Owner 

అబ్రకదబ్ర


నాటి మాటలు  
"ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే సంతకాలు చేస్తా!" - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
"ముఖ్యమంత్రి అవగానే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తా!" - చంద్రబాబు నాయుడు
"తెలంగాణా రాష్ట్రంలో హెలికాఫ్టర్ అంబులెన్సులు ఏర్పాటుచేస్తా! ఆదిలాబాదును బంగారు తునకగా మారుస్తా!" " - కేసీఆర్
"సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం" - కేంద్ర మంత్రి జై రామ్ రమేష్



(మాంధాతల కాలంనాటి మాటలు కాదు - ఈ ఏడాది మార్చిలో చెప్పినవి - పాత పేపర్లలో కనబడ్డవి)

3, ఆగస్టు 2014, ఆదివారం

ఆడది అబల కాదు, మా ఆవిడ అసలే కాదు


'వ్రతం చేసుకుందాం' అన్నాడు మా వాడు. 'సరే' అంది మా ఆవిడ. రోజుకు పాతిక ముప్పయి టాబ్లెట్స్, మూడు ఇంజెక్షన్లు. అయినా సరే అంటుంది. అంత సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడేకదా నువ్వు కోలుకుంటోంది. 'వద్దులే' అన్నది నా మాట. కానీ అది పైకి అంటే కదా!  చివరికి నేనూ సరే అనక తప్పలేదు.
మా పిల్లలు, మా అన్నయ్యగారి పిల్లలు. ఇల్లు కళకళ. శ్రావణ మాసం డిమాండ్ వున్నప్పటికీ మంచి పురోహితులవారు దొరికారు. 'పాతిక ముప్పయిమంది భోజనాలు మాకొక లెక్కా' అన్నారు మా కోడళ్ళు అత్తగారితో చేయికలిపి.
పొద్దున్న ఛానల్ కు వెళ్ళి వచ్చేసరికి  'అంతా తయార్!'


(చూశారా! మగబుద్ది. ఫోటోలో కూడా అంతా మగవాళ్ళే)

వ్రతం, భోజనాలు సలక్షణంగా, తృప్తిగా జరిగాయి. 'బాగా చేశారు' అనబోయాను. అనేవుంటాను. 'మాదేవుంది, అంతా ఆయనే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం' అన్నారు అంతా కోరస్ గా.
చేసికూడా చెప్పుకోకపోవడం ఆడంగులకే చెల్లింది.

చెవిటిమేళం


చెవిటిమేళం 
ఏకాంబరానికి అనుమానం వచ్చిందే తడవుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
మా ఆవిడకు చెవుడు వచ్చిందని నా అనుమానంచెప్పాడు డాక్టర్ తో.
వోస్ ఇంతేనా! మా పని చెవుడు నయం చేయడమేఅన్నాడు డాక్టర్.
మా ఆవిడ చెవుడు యెంత  ముదిరిందో తెలుసుకునే వీలుందా!
అదేమంత పని. దీనికి చిన్న టెస్ట్ వుంది. మీరే చేసుకుని  మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు
డాక్టర్ చెప్పిన చిట్కా విని ఇంటికి వెళ్లాడు ఏకాంబరం. భార్య వంట గదిలో వుంది.
డాక్టర్ చెప్పినట్టు,  కాస్త ఆమెకు దూరంగా నిలబడి,  ‘ఇవ్వాళ ఏం కూర చేస్తున్నావుఅని అడిగాడు.
ఏదో గొణుగుతున్నట్టు పెదాలు కదిలాయి కాని ఆమె దగ్గరనుంచి సమాధానం లేదు.
ఏకాంబరం ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఏం కూరఅంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. అప్పుడూ ఆమెనుంచి స్పందన లేదు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళి డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ అదే అడిగాడు.
ఈసారి ఏకాంబరం భార్య నుంచి ఠకీమని  జవాబు వచ్చింది.
ఏం కూర ఏం కూర అని మూడు సార్లు అడిగారు. వంకాయ కూర అని మూడుసార్లూ  నెత్తీ నోరూ కొట్టుకుంటూ చెప్పాను. మీకేదో చెవుడు వచ్చినట్టుంది. ముందు పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోండి



(నెట్లో సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్ కధనం ఆధారంగా- యధావిధిగా IMAGE OWNER కి కృతజ్ఞతలు)