3, ఆగస్టు 2014, ఆదివారం

మనసు చేసే అల్లరి


మనసు పదిలం తమ్ముడూ! అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ మనిషి గతి ఇంతే!
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.


మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి చొప్పున  కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో కప్పల బేరం కుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే! పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. 


(ఆంగ్ల కధనానికి అనువాదం - Courtesy Image Owner)

2, ఆగస్టు 2014, శనివారం

తెలంగాణా ఖజానాకు మొదటి చెల్లింపు


సీసా మూతపై తళతళలాడుతూ కనిపించింది ఓ స్టిక్కర్.  షాపువాడు  ముక్కు పిండకుండానే వసూలు చేసింది అక్షరాలా పద్నాలుగు వందల ఎనభై రూపాయలు.  స్టిక్కర్ అంటించిన సర్కారుకు ఇందులో యెంత ముడుతుందో లెక్కలు తెలవ్వు. అయినా ఎంతో కొంత చేరడం ఖాయం. కాబట్టి నేను సైతం ........




చేతులు కలిసిన శుభవేళ ..

ఈ ఇద్దరు కలవాలంటే దేవుడే దిగిరావాలి అనుకున్నారు. కానీ రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాదు రాక ఈ ఇద్దరు చంద్రులను కలిపింది.  ఈ కలయిక మరిన్ని మంచి పరిణామాలకు పునాది కావాలి.

   

దిల్ మాంగే మోర్


రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తానుఅన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.
సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా
మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
దిల్ మాంగే మోర్’  




(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం & Courtesy Image Owner)

ఓ! మై గాడ్!

దేవుడా నువ్వే దిక్కు
మా ఇంట్లో అందరూ దేవుడి పార్టీ.
నేనూ దేవుడూ ఒక పార్టీ.
'దేవుడు వేరూ తాము వేరు' అనుకుని వాళ్లు దేవుడుకి దూరం అవుతున్నారని నా ఘోష.
'దేవుడితో ఫ్రెండ్ షిప్ చేయాలనే అత్యాశ పెంచుకోవడం వల్ల నాకు దేవుడు దూరం అవుతున్నాడ'ని వాళ్ల బాధ.
కారణం ఏమైతేనేం నాకు మా ఇంట్లోనే కాదు మా చుట్టపక్కాల్లో కూడా 'వీడొట్టి నాస్తికుడు' అనే ముద్ర పడిపోయింది.  
'చిన్నప్పుడు గోరాగారితో తిరిగాడు. అలానే మాట్లాడుతాడు' అనేవాళ్ళు పైగా.
ఆయన ఎప్పుడూ దేవుడు లేడు అనేవారు కాదు, అసలు లేనివాడు ఆడో మగో అనవసరం అనేది గోరాగారి సిద్దాంతం, అందుకే 'దేవుడు లేదు' అంటుండేవారు. అలా అన్న గోరాగారే,  చనిపోయిన తరువాత వాళ్ల కుటుంబానికి దేవుడుగా మారిపోయాడని కొందరు అంటుంటారు. అసలు దేవుళ్ళు పుట్టిందే ఇలాగా అని మరి  కొందరు సనాయి నొక్కులు నొక్కుతుంటారు. శిష్యులకు, అభిమానులకు చెప్పింది తలకెక్కదు, అంచేతే 'విగ్రహారాధన కాదుకూడదు' అన్న బుద్ధుడికి దేశదేశాల్లో ఇన్నేసి విగ్రహాలు వేశారని ఇంకొందరు ఉవాచిస్తుంటారు (గ్రామరు తప్పయితే గోడ కుర్చీకి రెడీ)
నిజం చెప్పాలంటే నాకు దేవుడితో, దేవుడికి నాతొ ఏ పేచీ లేదు. వున్న పేచీ అల్లా ఆ దేవుడి పేరుతొ నానా యాగీ చేసేవాళ్ళతో. (ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాల్సింది ఏమిటంటే - 'ఈ బాపతు వాళ్ళల్లో' దేవుడ్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళూ వున్నారు)
అసలు విషయానికి వస్తాను. మా మేనల్లుడు రామచంద్రం నిన్న ఒక ఫంక్షన్ లో కలిసాడు.  వాళ్ల నాన్నగారిలాగే ఆధ్యాత్మిక మార్గం. చెప్పేవి పెద్ద పెద్ద విషయాలు  కాబట్టి నాకంటే వయస్సులో చిన్నవాడయినా వాడికి పెద్దరికం బాగానే  అబ్బింది. ముచ్చట్లలో దేవుడి విషయం వచ్చింది. 'దేవుడు వేరు, దైవం వేరు' అన్నాడు. 'దేవుళ్ళు అనేకమంది. దైవం మాత్రం ఒక్కడే' అని కూడా అన్నాడు.  'దేవుడు ఎవ్వరో కాదు, నువ్వే. ఎక్కడో లేడు, నీలోనే వున్నాడు' అని కూడా  తేల్చేసాడు.  'ముందు నువ్వు 'నేను' అనే విషయం మరవగలిగితే నువ్వే దేవుడివి' అని చెప్పాడు. విన్నప్పుడు కాస్త గందరగోళం అనిపించింది. అందుకే వేదాంతం అన్నారేమో! ఆలోచించి చూస్తే 'ఆహా!' అనిపించింది మనసులో. కానీ పైకే అన్నానేమో.
'యెందుకు అనిపించదు, ఇన్నేళ్లబట్టీ మీరూ అదేకదా చెబుతోంది. అందుకే ఆ ఆహాలు, ఒహోలు' అంది మా శ్రీమతి హఠాత్తుగా ప్రత్యక్షమై.
'ఓ మై గాడ్!' అని పైకి మాత్రం అనలేదు.


( నిన్న మేము వెళ్ళిన మా దగ్గరి దూరపు చుట్టం 'పెనుగంచిప్రోలు రవి' ఇంట్లో -  వాళ్లు ముచ్చటపడి, ఎంతో శ్రద్ధతో  చేయించుకున్న పూజా మంటపం) 

1, ఆగస్టు 2014, శుక్రవారం

నరం లేని నాలుకలు



అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.


అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటానుఅన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే! గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
కండవర్  విండిలై విండవర్ కండిలైఅని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదుఅని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.

ప్రస్తుత రాజకీయాల తీరుతెన్నులు ఈ వాస్తవానికి అద్దం పడుతున్నాయి.
NOTE: Courtesy Image Owner  

31, జులై 2014, గురువారం

రాజకీయం ఒక రక్షరేఖ


దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో,వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ వున్నా రాజకీయ నాయకులతో పోలిస్తే  తీసికట్టే.



లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బుసంచులూ  వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడంకోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే మాటలు కూడా  పొసగని వాళ్లు సయితం  డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో నీరాజనాలు. ఎక్కడకు వెళ్ళినా,  ఒక్కసారి పలకరిస్తే చాలు అనుకుని పులకరించిపోయే జనాలు. తమ అభిమాన నటుడు కరచాలనం చేసినా జన్మ ధన్యం అయిపోయినట్టు కలలు కనే అభిమాన జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చాలు ఆ నటుడికి దిగ చెమటలు పట్టడానికి.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్ట కుండా కూడా   డబ్బు రాశులు రాశులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంతనే వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకుపోగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళి, పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు.  ముఖ్యమంత్రి పేషీలోకి అనుమతి లేకుండా జొరబడగలడు. చివరాఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సైతం సందేహించే పోలీసు ఠాణాల్లోకి  సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని దేవాలయాల్లోకి  పదిమందిని వెంటేసుకు పోగలడు.
అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం పని తీరు  తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే బాగు చేయిస్తాం రాఅని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే చాలు  అన్నీ వున్నట్టే లెక్క. అదే అధికార పార్టీ అయితే ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.

పొలిటికల్ పవర్ కు వున్న పవర్ అలాటిది. అందుకే ఈరోజుల్లో అందరి చూపూ   రాజకీయం మీదే!
NOTE: Courtesy Image Owner