28, జులై 2014, సోమవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 7


చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే చెందిన బీ. రామారావు అనే ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్ను కర్ర వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.


పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్ చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి  పని పూర్తి  చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖ పట్నమో వెళ్ళాల్సి వస్తే,  ఫైళ్ళు వెంటబెట్టుకుని రైల్లో  ప్రయాణం చేసే వారు. రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి ప్రభుత్వ వాహనం ఒకటి  అక్కడ స్టేషన్లో  సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం,  విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని  సచివాలయానికి చేరేవి.

చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ కావొచ్చుకాని ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే చెన్నారెడ్డి  మద్దతుదారులయిన నాటి మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు. అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు కానివాళ్ళు ఇంకా మనవెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు) వెళ్ళిపోయారు"

అదే కాకి, అదే పిచ్చుక, కాకపొతే కధే కొత్తది


(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్ కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం- భండారు శ్రీనివాసరావు)
అనగనగా ఒక కాకి ఒక పిచ్చుక.


వచ్చేది వర్షాకాలం కాబట్టి పిచ్చుక ముందు జాగ్రత్తగా  అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు వెతుక్కొచ్చి ఎత్తుకొచ్చి వెచ్చగా వుండే  ఓ గూడు కట్టుకుంది. కాకి బద్ధకస్తురాలు. 'వర్షాలు పడ్డప్పుడు చూసుకుందాములే' అనే దిలాసాతో వుండిపోయింది.  చూస్తుండగానే వర్షాలు మొదలయ్యాయి.  కష్టపడి ముందు చూపుతో కట్టుకున్న కొత్త గూడులో పిచ్చుక వెచ్చగా పడుకుంది.  తలదాచుకునే  గూడు లేక కాకి 'కావ్వో కావ్వో' అంటూ అరచుకుంటూ  పోయి, అర్జంటుగా మీడియా  సమావేశం పెట్టి తన కష్టాలు ఏకరవు పెట్టుకుంది.
'నేనూ పిచ్చుకా ఇద్దరం పక్షులమే. పిచ్చుకేమో హాయిగా వెచ్చగా గూట్లో పడుకుంటే నేనేమో ఇల్లా ఇల్లూ వాకిలీ లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అఘోరిస్తున్నాను. ఇంత అన్యాయం ఎక్కడయినా వుందా అవ్వా' అంటూ దవడలు నొక్కుకుంది. కాకి పిచ్చుకల వ్యవహారం మీడియాకు విందు భోజనంగా మారింది. పిచ్చుక గూట్లో అనుభవిస్తున్న వైభోగాలు, బయట కాకి పడుతున్న కష్టాలు,  అన్నింటినీ  గ్రాఫిక్కులు జోడించి  రంగు రంగుల విజువల్స్ తో కధనాలు వండి వార్చాయి.
'ఈ అన్యాయాన్ని సహించేది లేదు. కాకికి న్యాయం చేయాలి' అంటూ కాకిహక్కుల సంఘాలు పిచ్చుక గూడు ఎదుట ధర్నా చేశాయి.  'కాకులకూ  పిచ్చుక కట్టుకున్నలాంటి గూళ్ళు కావాలంటూ నిరసన దీక్షలు నిర్వహించాయి. గూడుకు కూడా నోచుకోని కాకులకు న్యాయం జరిగేదాకా విశ్రమించేది లేదం'టూ హెచ్చరించాయి.
ఈ కాకిగోల ప్రాంతీయ చానళ్ళ నుండి జాతీయ ఛానల్లకూ అక్కడినుండి అంతర్జాతీయ ఛానల్లకూ విస్తరించింది. దాంతో,  ఆ పల్లవి అందుకున్న అంతర్జాతీయ  వాయసహక్కుల సంఘం - ఈ విషయంలో భారత ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ఆరోపించింది.
ఇక ఇంటర్ నెట్ లో సరేసరి. కాకికి మద్దతుగా అభిప్రాయ సేకరణ ఉవ్వెత్తున ఒక ఉద్యమం మాదిరిగా మొదలయింది.
పార్ల మెంటులో ప్రతిపక్షాలు కాకులకు మద్దతుగా  వాకవుట్ చేసాయి. ప్రతిపక్షాలు బలంగా వున్నరాష్ట్రాల్లో బందులు జరిగాయి.
విషయం ఇంతగా ముదిరిపోయిన తర్వాత  ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాకులకు న్యాయం చేసేందుకు ఒక అత్యున్నతే స్తాయి కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ కాలయాపన చేయకుండా నివేదిక ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం 'పోటా' తరహాలో 'కాకులపై ఉగ్రచర్యల నిరోధక చట్టం - 'కాటా' తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కాకితో అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగి,  కాకితో మాట మాత్రం  చెప్పాపెట్టకుండా గూడు కట్టుకున్న పిచ్చుకకు మూడేళ్ళు జైలు శిక్ష విధించి అది కట్టుకున్న గూడును కాకికి స్వాధీనం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆ సిఫారసులను 'ఇన్ టోటో'  అమలు చేసింది. జాతీయ ఛానల్లతో సహా దేశ వ్యాప్తంగా అన్ని టెలివిజన్ చానళ్ళు  ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి.
ఏతావాతా జరిగింది ఏమిటంటే-  
కష్టపడి గూడు కట్టుకున్న పిచ్చుకకు గూడంటూ లేకుండా పోయింది. గూడు కట్టుకోవడానికి బద్ధకించిన కాకి మాత్రం గూడు సంపాదించుకుంది.

(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్ కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం)    
NOTE : Courtesy Image Owner  

26, జులై 2014, శనివారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 6


వెంగళరావు గారి తరువాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారికి  పరిపాలనాదక్షుడు అనే మంచి పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ బ్లాకులో తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన ఆధునిక ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐ..ఎస్. అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్ ఆర్ రామమూర్తి,  గోవిందరాజన్, సంతానం, యుగంధర్, పరమహంస మొదలయిన వారు చాలామంది పనిచేసినా,  వారిలో ఎక్కువకాలం చెన్నారెడ్డి గారితో  వున్నది పరమహంస గారే.  రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్  ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన భద్రతాధికారి. పీ.ఆర్.వొ. గా,   సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. చెన్నారెడ్డి గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు - హషీం, సరోజినీ పుల్లారెడ్డి, రోడామిస్త్రీ వీరిలో ముఖ్యులు -  మరో పని ఏమీ లేదన్నట్టు ఆయన్ని అంటిపెట్టుకునే తిరిగేవారు.  దాంతో,  సీఎం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది.


(మర్రి  చెన్నారెడ్డి) 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో చెన్నారెడ్డి గారొకరు. మొదటి సారి, అలాగే  రెండోసారి పదవి కోల్పోవడానికి కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు. (ఇంకావుంది)

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 5


వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు.  చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.
గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (ఇంకా వుంది)



25, జులై 2014, శుక్రవారం

నేనేరా! గోపీని !

"సాయంత్రాలు నాది 'మద్యే మార్గం'
"బ్లాగు రాతల్లో  మాత్రం 'మధ్యేమార్గం'


(Photo Courtesy Image Owner)

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 4


వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.


(జలగం వెంగళరావు, రోశయ్య, మదన్ మోహన్ పాల్గొన్న సమావేశంలో ప్రసంగిస్తున్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి)

రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.

నేతల హామీలు పునరావృతం కారాదు


(27-07-2014 -   ఆదివారం సూర్య పత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
మెదక్ జిల్లాలో  గురువారం ఉదయం  జరగరాని ఘోరం జరిగిపోయింది. మూసాయిపేట రైల్వే క్రాసింగు వద్ద పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును వేగంగా దూసుకొచ్చిన నాందేడ్ పాసింజరు రైలు డీకొట్టింది. నాలుగు వూళ్ళు తిరిగి తమని రోజూ బడికి చేర్చే స్కూలు బస్సు ఆరోజు తమ పాలిట మృత్యు శకటంగా మారుతుందని తెలియని అందులోని చిన్నారులకు అసలు ఏమి జరుగుతున్నదో అర్ధం అయ్యేలోగా బస్సును వున్నపలాన రైలు  ముందుకు లాక్కుపోయింది. ఈ క్రమంలో బస్సు నుజ్జునుజ్జయింది. డ్రైవరు, పన్నెండు మంది పిల్లలు అక్కడికక్కడే కన్నుమూశారు.  మరో ఇద్దరు  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే  మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇరవై ఒక్కమందిని హైదరాబాదు  యశోదా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో పదకొండుమంది పరిస్తితి విషమంగా వుందని కడపటి వార్తలు తెలుపుతున్నాయి.


సమాచారం తెలియగానే తెలంగాణా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అయిదు లక్షల చొప్పున ఆర్ధిక సాయం  ప్రకటించారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను, వారి తలితండ్రులను  పరామర్శించారు. ఖర్చుకు వెనకాడకుండా వారికి అవసరమైన వైద్య సాయం అందించాల్సిందని అక్కడి వైద్యులను కోరారు. మంత్రి హరీష్ రావు హుటా హుటిన బయలుదేరి దుర్ఘటన ప్రదేశానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇరవై అంబులెన్సులను రప్పించారు. గాయపడిన వారిని హైదరాబాదు తరలించారు. కాగా, ప్రమాదం గురించిన సమాచారం తెలియగానే రైల్వే మంత్రి సదానంద్ గౌడ్ లోకసభలో ప్రకటన చేశారు. తక్షణ సాయంగా రైల్వే తరపున మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడినవారికి ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని ప్రాధమిక సమాచారం వల్ల తెలుస్తోందని అన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని కూడా దుర్ఘటనపై సంతాప ప్రకటనలు చేశారు. ఆయా పార్టీలకు చెందిన  రాష్ట్ర స్థాయి నాయకులు సరే. అంతా యశోదా  ఆసుపత్రికి క్యూ కట్టారు. బాధితులను పరామర్శించి వారికి తక్షణ సాయం అందేలా తాము శక్తివంచన లేకుండా పాటుపడతామని పాత పల్లవినే అందుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు. సరే. ఇవన్నీ కూడా ఒక  పద్దతి ప్రకారం జరిగిపోతుంటాయి. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా పాలక పక్షం వారు షరా మామూలు ప్రకటనలు చేస్తుంటారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మొక్కుబడి హామీలు ఇస్తుంటారు. ప్రతిపక్షాల సంగతి  చెప్పేదేముంది. ప్రభుత్వ అసమర్ధత వల్లనే ఇలాటివి జరుగుతున్నాయని ఆరోపిస్తుంటారు.        
కానీ ఈ ప్రకటనలతో పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఈ హామీలతో మళ్ళీ ఇటువంటి దుర్ఘటనలు జరగవన్న  పూచీ కూడా  లేదు.
అసలు చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి?
చక్కగా చదువుకుని జీవితంలో ఎదిగివద్దామనుకున్న చిన్నారుల బతుకు దీపాలు ఈ దుర్ఘటనలో అర్ధాంతరంగా కొండెక్కాయి. ఎవరో చేసిన పొరబాటుకు అన్నం పున్నెం ఎరుగని పసివారు  దారుణంగా మూల్యం చెల్లించారు. బస్సు పట్టాలు దాటే సమయంలో డ్రైవరు సెల్ ఫోనులో మాట్లాడుతున్నాడని కొన్ని వార్తలు తెలుపుతున్నాయి. ఇదే నిజమయితే ఇంతకంటే నిర్లక్ష్యం మరోటి వుండదు.  పొద్దున్నే తయారై , బడికి పోయొద్దామని బయలుదేరిన వాళ్ళలో చాలామంది, తమ కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని  లోకాలకు తరలిపోయారు. పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయించి, ప్రేమగా  గోరుముద్దలు తినిపించి, పుస్తకాల సంచీ, టిఫిన్ బాక్సులూ చేతికందించి దగ్గరుండి బస్సెక్కించిన తలితండ్రులకు ఈ ప్రమాద వార్త ఆశనిపాతంగా మారింది. వారి ఘోష వర్ణనాతీతం.
కాపలా లేని రైలు క్రాసింగు వద్ద జరిగిన దుర్ఘటన మెదక్ జిల్లా లోని నాలుగు గ్రామాల్లో అనేక కుటుంబాల ఇళ్లలో ఆరని శోకం రగిల్చింది. వీళ్ళందరూ కలిగినవాళ్ళు కాదు. పూట కూలీలు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలతో కాపురాలు నెట్టుకొస్తూ, ఆటోలతో   బతుకు బండి లాగిస్తూ, వున్నంతలో తమ  పిల్లల్ని   మంచి చదువులు చదివించి,  వారికయినా తమకు దక్కని మంచి జీవితం లభించేలా చూడాలని  చిరు ఆశలు పెంచుకున్న బడుగు జీవులు వాళ్లు. చక్కగా తలదువ్వుకుని, యూనిఫారాలు వేసుకుని, భుజాలపై పుస్తకాల సంచీలు వేలాడేసుకుని 'అమ్మా టాటా! నాన్న టాటా! 'అంటూ స్కూలు  బస్సెక్కి పోతున్న పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోయే వాళ్లు వారు. చక్కగా మంచి స్కూళ్ళల్లో చదువుకుంటే,  వారి భవిష్యత్తు బంగారం అవుతుందనీ కమ్మని కలలు కనే వాళ్లు వారు. అలాటి వాళ్ల కన్నుల్లో ఇవాళ కనబడుతోంది కన్నీళ్ళే. ఇవి తుడిచినా ఆరేవి కావు. కానీ తుడిచేవాళ్ళే లేరు. అందరూ హామీలు ఇచ్చేవాళ్ళే. ఇదొక విషాదం.
ఈ సందర్భంలో మరో కోణం గురించి కూడా విశ్లేషించుకోవడం సముచితంగా వుంటుంది. ఏ దేశంలో అయినా డ్రైవరు పని అంటే మామూలు కాదు. డ్రైవింగు లైసెన్సు సంపాదించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ మనదగ్గర మాత్రం  పైసా వున్నా,  పలుకుబడి వున్నా  లైసెన్సు ఎగురుకుంటూ వచ్చి వల్లో పడుతుంది. దేశ ఆర్ధిక పరిస్థితులు కూడా అలాగే వున్నాయి. చదువుకున్నా లేకపోయినా డ్రైవింగ్ తెలిస్తే పొట్టపోసుకోవచ్చు అనే అభిప్రాయం పల్లె పట్టుల్లో పెరిగిపోతోంది. లక్షలు పోసి బస్సులు కొనే స్కూలు యాజమాన్యాలు కూడా నైపుణ్యం  కలిగిన డ్రైవర్లకు మంచి జీతాలు ఇవ్వడానికి వెనుకాడతాయి. గీసి గీసి బేరమాడుతాయి. ఫలితం. అనుభవం లేని డ్రైవర్లు. డబ్బులు అదనంగా వస్తాయనుకుంటే నిద్రమానుకుని అదనపు పని గంటలు పనిచేసే డ్రైవర్లు స్కూలు బస్సులు నడుపుతుంటారు.  యజమానులకి కావాల్సింది అదే. ఏదో విధంగా పని నడిచిపోతే చాలు. మరి ప్రమాదాలు జరుగుతున్నాయంటే జరగవా. జరక్కపోతేనే ఆశ్చర్యపడాలి.
విలువలకు ప్రాణం ఇచ్చే ఈ పుణ్య భూమిలో ప్రాణాలకు విలువలేకుండా పోవడం మరో విషాదం.
పోతే, ప్రస్తుతానికి వస్తే,  కాపలాలేని రైలు క్రాసింగులు దేశంలో వేలకొద్దీ, రాష్ట్రంలో వందలకొద్దీ వున్నాయి. గేట్లు పెట్టి కాపలా సిబ్బందిని నియమించాలంటే ఒక్కొక్కదానికీ ఏటా ముప్పయి, నలభయ్ లక్షల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, లక్షల్లో  జీతాలు తీసుకుంటూ  అప్పనంగా లెక్కలు చెప్పే అధికారులు వందల సంఖ్యలో ఎప్పుడూ  సిద్దంగానే వుంటారు. వారి దృష్టిలో ఇది  అనవసరపు వ్యయం. మరోపక్క, పర్తి రైల్వే మంత్రీ   ఇన్నేళ్ళ వ్యవధిలో కాపలా లేని రైల్వే క్రాసింగులు అసలు వూసులోకి లేకుండా చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీలు ఇస్తూనే వుంటారు. అవన్నీ రికార్డుల్లో భద్రంగా వుండిపోతాయి.
అనకూడదు కానీ, ఈ లోగా ఇంకో సంఘటన చోటుచేసుకుంటుంది. మరికొందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. మళ్ళీ యధావిదిగా ఎక్స్ గ్రేషియా ప్రకటనలు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కానిచ్చేది లేదని  షరామామూలు హామీలు. ఇదో విష చక్ర భ్రమణం.
పునరావృతం కానివ్వమనే ప్రకటనలు,  పునరావృతం కాని మంచి రోజులకోసం వేచి వుండడమే సాధారణ  ప్రజలకు మిగిలింది.   (25-07-2014)