29, జులై 2014, మంగళవారం
శనగల మంగళవారం
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 8
ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా ఏ నాయకుడయినా
బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే
అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం
ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి
వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి ఆ అసహనం బయటకు వస్తుండేది. చెన్నారెడ్డి
వ్యతిరేకులు ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న
సంజయ్ గాంధీ సాయంతో నాయకత్వ మార్పిడి విషయంలో ఒక నిర్ణయానికి రాగలిగెట్టు
చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని
తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. ఈ
నేపధ్యంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో
ముఖ్యమంత్రి మార్పు తాత్కాలికంగా వాయిదాపడింది.
(సంజయ్ గాంధీ నడిపిన విమానం ఢిల్లీలో కూలిన దృశ్యం)
సంజయ్ అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు
అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని
ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి
నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట
వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో
అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది.
వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి ' సీ ఎం మాట్లాడింది
మొత్తం రికార్డ్ చేసారా అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. ఆశ్చర్యపోతూనే
కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. సంజయ్
గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించిందని చెన్నారెడ్డి చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా
మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు
చాలా....)
ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా
వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
28, జులై 2014, సోమవారం
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 7
చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా
వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో
అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే
చెందిన బీ. రామారావు అనే ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్ను కర్ర
వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.
పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్
చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న
బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి పని పూర్తి చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖ
పట్నమో వెళ్ళాల్సి వస్తే, ఫైళ్ళు
వెంటబెట్టుకుని రైల్లో ప్రయాణం చేసే వారు.
రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి
ప్రభుత్వ వాహనం ఒకటి అక్కడ స్టేషన్లో సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం, విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి
సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని సచివాలయానికి చేరేవి.
చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ
కావొచ్చుకాని ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు
చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి
నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే
చెన్నారెడ్డి మద్దతుదారులయిన నాటి
మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా
తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా
అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు.
అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు
కానివాళ్ళు ఇంకా మనవెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు)
వెళ్ళిపోయారు"
లేబుళ్లు:
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 7
అదే కాకి, అదే పిచ్చుక, కాకపొతే కధే కొత్తది
(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్
కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం- భండారు శ్రీనివాసరావు)
అనగనగా ఒక కాకి ఒక పిచ్చుక.
వచ్చేది వర్షాకాలం కాబట్టి పిచ్చుక ముందు
జాగ్రత్తగా అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ
ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు వెతుక్కొచ్చి ఎత్తుకొచ్చి వెచ్చగా వుండే ఓ గూడు కట్టుకుంది. కాకి బద్ధకస్తురాలు. 'వర్షాలు
పడ్డప్పుడు చూసుకుందాములే' అనే దిలాసాతో వుండిపోయింది. చూస్తుండగానే వర్షాలు మొదలయ్యాయి. కష్టపడి ముందు చూపుతో కట్టుకున్న కొత్త గూడులో పిచ్చుక
వెచ్చగా పడుకుంది. తలదాచుకునే గూడు లేక కాకి 'కావ్వో కావ్వో' అంటూ అరచుకుంటూ పోయి, అర్జంటుగా మీడియా సమావేశం పెట్టి తన కష్టాలు ఏకరవు పెట్టుకుంది.
'నేనూ పిచ్చుకా ఇద్దరం పక్షులమే. పిచ్చుకేమో
హాయిగా వెచ్చగా గూట్లో పడుకుంటే నేనేమో ఇల్లా ఇల్లూ వాకిలీ లేకుండా ఎండకు ఎండుతూ,
వానకు తడుస్తూ అఘోరిస్తున్నాను. ఇంత అన్యాయం ఎక్కడయినా వుందా అవ్వా' అంటూ దవడలు
నొక్కుకుంది. కాకి పిచ్చుకల వ్యవహారం మీడియాకు విందు భోజనంగా మారింది. పిచ్చుక
గూట్లో అనుభవిస్తున్న వైభోగాలు, బయట కాకి పడుతున్న కష్టాలు, అన్నింటినీ గ్రాఫిక్కులు జోడించి రంగు రంగుల విజువల్స్ తో కధనాలు వండి వార్చాయి.
'ఈ అన్యాయాన్ని సహించేది లేదు. కాకికి న్యాయం
చేయాలి' అంటూ కాకిహక్కుల సంఘాలు పిచ్చుక గూడు ఎదుట ధర్నా చేశాయి. 'కాకులకూ పిచ్చుక కట్టుకున్నలాంటి గూళ్ళు కావాలంటూ నిరసన
దీక్షలు నిర్వహించాయి. గూడుకు కూడా నోచుకోని కాకులకు న్యాయం జరిగేదాకా
విశ్రమించేది లేదం'టూ హెచ్చరించాయి.
ఈ కాకిగోల ప్రాంతీయ చానళ్ళ నుండి జాతీయ ఛానల్లకూ
అక్కడినుండి అంతర్జాతీయ ఛానల్లకూ విస్తరించింది. దాంతో, ఆ పల్లవి అందుకున్న అంతర్జాతీయ వాయసహక్కుల సంఘం - ఈ విషయంలో భారత ప్రభుత్వం ఘోరంగా
విఫలం అయిందని ఆరోపించింది.
ఇక ఇంటర్ నెట్ లో సరేసరి. కాకికి మద్దతుగా
అభిప్రాయ సేకరణ ఉవ్వెత్తున ఒక ఉద్యమం మాదిరిగా మొదలయింది.
పార్ల మెంటులో ప్రతిపక్షాలు కాకులకు మద్దతుగా వాకవుట్ చేసాయి. ప్రతిపక్షాలు బలంగా వున్నరాష్ట్రాల్లో
బందులు జరిగాయి.
విషయం ఇంతగా ముదిరిపోయిన తర్వాత ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాకులకు న్యాయం
చేసేందుకు ఒక అత్యున్నతే స్తాయి కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ కాలయాపన చేయకుండా నివేదిక ఇచ్చింది.
ఉగ్రవాద వ్యతిరేక చట్టం 'పోటా' తరహాలో 'కాకులపై ఉగ్రచర్యల నిరోధక చట్టం - 'కాటా'
తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కాకితో అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగి, కాకితో మాట మాత్రం చెప్పాపెట్టకుండా గూడు కట్టుకున్న పిచ్చుకకు మూడేళ్ళు
జైలు శిక్ష విధించి అది కట్టుకున్న గూడును కాకికి స్వాధీనం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం
ఆ సిఫారసులను 'ఇన్ టోటో' అమలు చేసింది.
జాతీయ ఛానల్లతో సహా దేశ వ్యాప్తంగా అన్ని టెలివిజన్ చానళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి.
ఏతావాతా జరిగింది ఏమిటంటే-
కష్టపడి గూడు కట్టుకున్న పిచ్చుకకు గూడంటూ లేకుండా
పోయింది. గూడు కట్టుకోవడానికి బద్ధకించిన కాకి మాత్రం గూడు సంపాదించుకుంది.
(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్
కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం)
NOTE : Courtesy Image Owner
లేబుళ్లు:
అదే కాకి,
అదే పిచ్చుక,
కాకపొతే కధే కొత్తది
26, జులై 2014, శనివారం
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 6
వెంగళరావు గారి తరువాత ముఖ్యమంత్రి అయిన
చెన్నారెడ్డి గారికి పరిపాలనాదక్షుడు అనే
మంచి పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ
బ్లాకులో తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన
ఆధునిక ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు
ముగ్గురు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్
ఆర్ రామమూర్తి, గోవిందరాజన్, సంతానం,
యుగంధర్, పరమహంస మొదలయిన వారు చాలామంది పనిచేసినా, వారిలో ఎక్కువకాలం చెన్నారెడ్డి గారితో వున్నది పరమహంస గారే. రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్ ఐ.పీ.ఎస్.
అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన భద్రతాధికారి. పీ.ఆర్.వొ. గా, సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా
పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. చెన్నారెడ్డి
గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు - హషీం, సరోజినీ పుల్లారెడ్డి, రోడామిస్త్రీ
వీరిలో ముఖ్యులు - మరో పని ఏమీ లేదన్నట్టు
ఆయన్ని అంటిపెట్టుకునే తిరిగేవారు. దాంతో,
సీఎం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది.
(మర్రి చెన్నారెడ్డి)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు
ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో చెన్నారెడ్డి గారొకరు. మొదటి
సారి, అలాగే రెండోసారి పదవి కోల్పోవడానికి
కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండు
సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే
కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు.
(ఇంకావుంది)
లేబుళ్లు:
పరమహంస,
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 6
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 5
వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.
గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (ఇంకా వుంది)
లేబుళ్లు:
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 5
25, జులై 2014, శుక్రవారం
నేనేరా! గోపీని !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






