22, జులై 2014, మంగళవారం

మంచి చర్చ


"చక్కటి చర్చ ఒక మినీ స్కర్ట్ మాదిరిగా వుండాలి. అంటే విషయంపై ఆసక్తి పెంచేంత చిన్నదిగాను, విషయమంతా కవరయ్యేంత పెద్దదిగాను వుండాలన్న మాట"





NOTE: Courtesy Cartoonist 

21, జులై 2014, సోమవారం

కూర'గాయాలు'


'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంలో నాగార్జున:  "కోటి  రూపాయలు గెలుచుకుంటే ఏం చేస్తారు?"
హాట్ సీట్ లో వ్యక్తి : "ఆ డబ్బుతో ఇంట్లో ఓ నెలకు సరిపడా కూరగాయలు కొనిపడేస్తాను"  

20, జులై 2014, ఆదివారం

ఏలికల్లో పోలికలు


(22-07-2014 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావుకు పేర్లలో మాత్రమే కాకుండా  ఇంకా అనేక విషయాల్లో అనేక పోలికలు వున్నాయి. ఇద్దరూ కొత్తగా ఏర్పడ్డ రెండు రాష్ట్రాలకు ఏలికలు. రెండు ప్రాంతీయ పార్టీలకు అధినేతలు. ప్రభుత్వ యంత్రాంగం మీదా పార్టీ మీదా  గట్టి పట్టున్న నాయకులు. పరిపాలనా అనుభవం వున్నవారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరినవారు. ఏకబిగిన గంటలకొద్దీ  ప్రసంగాలు చేయగల సామర్ధ్యం వున్నవారు.  ఈ కారణాలన్నీ వారు అధికారంలోకి రావడానికి కొంతమేరకు దోహదం చేసాయి. బహుశా వీరికి వున్న అనుభవాన్నే కొలమానంగా తీసుకుని ఇటీవలి ఎన్నికల్లో  రెండు ప్రాంతాల ఓటర్లు వారిద్దరికీ ఎవరిమీద ఆధారపడకుండా పాలన సాగించగల మెజారిటీ కట్టబెట్టారు. పోతే,  ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు సాధ్యాసాధ్యలతో నిమిత్తంలేకుండా  చేసిన వాగ్దానాలకు కూడా సామ్యాలున్నాయి.  వాటిని పక్కనబెట్టి వేరే అంశాలను తెరమీదకు తీసుకువచ్చి మీడియా కళ్ళన్నీ వాటిపై వుండేలా చేయడంలో కూడా ఇద్దరినడుమా  పోలికలున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వుంది.


ఓ వారం పదిరోజులు అటూ ఇటూగా ఇద్దరూ రెండు కొత్త రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులుగా పదవులు స్వీకరించారు. స్వీకరించి కూడా మండల కాలం గడిచిపోయింది. అయితే ఇన్ని రోజులు గడిచినా,  ప్రజలు వారి మీద పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా వారు అడుగులు వేగంగా  వేయకపోవడంలో సైతం పోలికలు వున్నాయి. దేనికయినా కొంత వ్యవధానం ఇచ్చితీరాలన్న వాదన ఒకటి వినిపిస్తున్నప్పటికీ, సరైన దిక్కులో వీరి నడక సాగుతోందా అంటే అవునని గట్టిగా చెప్పుకోవడానికి ఏమీ కనబడడం లేదు. పైగా అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచి వీరువురి నడుమ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఫిలిం మోస్తరుగా ఎత్తులు పైఎత్తులతోనే కాలం గడిచిపోతోందన్న అభిప్రాయం కూడా బలంగానే వినిపిస్తోంది. ప్రమాణ స్వీకారం రోజు ప్రసంగాలలో కానవచ్చిన వడీ వేగం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే అందుకు చెబుతూ వస్తున్న కారణాలు వారి అభిమానులను అలరిస్తున్నా సామాన్య జనాల్లో మాత్రం  సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
సరే ఇవన్నీ ఇలా వుంచితే, మరో పక్క,  ప్రతి విషయంలో వీరిద్దర్నీ పోల్చి చూసి, వారి పనితీరును లెక్కించే కొత్త సంప్రదాయం తెర మీదకు వచ్చింది. ఏ రాష్ట్రానికయినా ఇరుగుపొరుగు రాష్ట్రాలు వుంటాయి. ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వుంటారు. కానీ వీరిలాగా గతంలో ఏ ఇద్దరు ముఖ్యమంత్రుల నడుమా ఈ రకమైన రాజకీయ విన్యాసాలు జరిగిన దాఖలా లేదు. 'తమలపాకుతో నేనిట్లంటే  తలుపు చెక్కతో తానిట్లంది' అన్న చందంగా   'చంద్రబాబు ఏమన్నారు దానికి ప్రతిగా కేసీయార్ ఏమన్నారు' అన్న అనవసర విషయాలపై రాద్ధాంతాలు జరుగుతున్నాయి. వాటిపై మళ్ళీ  మీడియాలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. వెనక సినిమారంగానికే పరిమితమైన అభిమానుల వీరంగాలు  రాజకీయ రంగ ప్రవేశం చేసాయి. 'తమ నాయకులపై ఈగ వాలినా వూరుకునేది లేదు' అనే  ధోరణిలో దుందుడుకు వాదనలు సాగుతున్నాయి.  దీనితో 'ఏది ఒప్పు ఏది తప్పు' అనే విచక్షణ వెనక్కుమళ్లి పోతోంది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల దగ్గరనుంచి రాజుకున్న రగడ ఇతర విషయాలకు పాకి ఇప్పటికీ ఆరిపోకుండా గండదీపం మాదిరిగా  ప్రజ్వరిల్లుతూనే వుంది. అనేక విషయాల్లో వీరిద్దరు విడివిడిగా లేవనెత్తుతున్న వివాదా౦శాలు, వారి వాక్చతురత పుణ్యమా అని  ఇరు ప్రాంతాల ప్రజల్లో కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి.
ఇరువురికీ పోలికలు ఎన్ని వున్నప్పటికీ కొన్ని విషయాల్లో మౌలికమైన తేడాలు కూడా  వున్నాయి.
కేసేయార్ కు మాటల మాంత్రికుడని పేరుంది. తనతో విభేదించేవారిని కూడా తన వాక్చాతుర్యంతో సమాధానపరచగల ప్రతిభ ఆయన సొంతం. తనకున్న ఈ కళను ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొన్న మొదటి విలేకరుల సమావేశంలో పూర్తిగా ప్రదర్శించారు. అనుకూలమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, అననుకూల మైన వాటిని అసలు  ప్రస్తావనకే రాకుండా చూసుకుంటూ, వచ్చినా వాటిని తెలివిగా దాటవేస్తూ 'ఆహా! యెంత బాగా మాట్లాడారు' అని ప్రత్యర్ధుల ప్రశంసలను కూడా పొందిన తీరు ఇందుకు తార్కాణం.
చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీయార్ కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. తెలంగాణా అధికారుల విస్తృత సమావేశంలో ఆయన,  'ఆ ప్రాంతపు  సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు' అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చింది. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామ'ని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది. 'ఉగ్ర నరసింహావతారం' ప్రస్తావన, తరువాత 'ముఖ్యమంత్రితో ముఖాముఖి' కార్యక్రమంలో 'ఫెడరల్ వ్యవస్థ ప్రాధాన్యం' గురించి అన్యాపదేశంగా చేసిన ప్రకటన  - 'దేనికయినా రెడీ' అన్న హెచ్చరికకు అద్దం పడుతున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్తుతో ముడిపడివున్న అంశాలకు మరిన్ని  చిక్కు ముళ్లు వేసే ఆలోచనలు అంతిమంగా ఆయన్నే చిక్కుల్లో పడేయకుండా జాగ్రత్త వహించాలి.
ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఎలాటి పరిమితులు, అవరోధాల నడుమ తన పాలన మొదలయిందన్న విషయాన్ని ప్రజలకు వివరించడానికి అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూనే వున్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రధాన వాగ్దానం 'రైతు రుణాల మాఫీ' అమలులో వున్న ఇబ్బందులు ఏకరువు పెడుతూ, ప్రజలనుంచి తీవ్రమైన ప్రతిఘటన రాకుండా తన శక్తియుక్తులన్నీ వాడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తలెత్తిన బాలారిష్టాలను అధిగమించడానికే యావత్తు సమయాన్ని వినియోగించాల్సి వస్తోందని ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి నుంచి తగిన  సహకారం అందడం లేదనీ, అందువల్లనే కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు వివరించే కృషి చేస్తున్నారు. కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి కొత్త ప్రాజెక్టులు, ఆర్ధిక సాయం సంపాదించే విషయంలో గట్టి చర్యలే తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతొ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని పిలిచి సన్మానించడం ఇందులో భాగం అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు జోడీ కొత్త రాష్ట్రానికి మేలు చేస్తుందని నమ్మే వారు కూడా వున్నారు. 'రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో ఎండీయే  అధికారంలోకి రాక పోయివుంటే ఇబ్బందులు తప్పకపోయేవి' అనే చంద్రబాబు వ్యాఖ్యలో వాస్తవం వుంది. ఎన్నో ఆటుపోటుల నడుమ పాలన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి నిజమైన వూరట, ఉపశమనం కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే ప్రభుత్వమే. అయితే కేంద్ర సాయం ఆశించిన రీతిలో అందకపోవడం అనేది కూడా ఆయన్ని కలత పెడుతున్నట్టు వుంది. ఇవన్నీ కలిపి చూస్తే,  గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఆయనలో కానవచ్చిన చురుకుదనం పాలు కొంత తగ్గినట్టుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కొత్తగా పుట్టుకొస్తున్నసమస్యలతో, పదేళ్ళ తరువాత తిరిగి అధికారంలోకి వచ్చిన ఆనందం కాస్తా ఆవిరి అయిపోతోంది. కొత్త రాజధాని నిర్మాణం కోసం సచివాలయంలో హుండీ ఏర్పాటుచేయడం ఈ నైరాశ్యంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన కావచ్చు. అయితే వెంటనే వెలువెత్తిన విమర్శలను గమనించి హుండీని ఏర్పాటు చేసి కొన్ని గంటలు కూడా గడవకముందే  తొలగించడం జరిగింది. హుండీ ఏర్పాటు యెంత తొందరపాటు నిర్ణయమో, దాన్ని వెంటనే తొలగించడం కూడా అంతే సరైన నిర్ణయం అని చెప్పుకోవాలి.
మొన్నటి జిల్లా పర్యటనల్లో సింహభాగం సమయాన్ని ఎన్నికల వాగ్దానాలు, ముఖ్యంగా రుణాల మాఫీ గురించి వివరణ ఇచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వాడుకున్న వైఖరి  గమనించినప్పుడు,  ఈ వాగ్దానానికి కట్టుబడివుండడం యెలా అన్న  అంశం ఆయన్ని ఎంతగా కలచివేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. పోతే, ఎన్నికల ప్రచారంలో చేసిన షరా మామూలు ప్రసంగాలను పునశ్చరణ చేస్తూ పోవడం వల్ల  ఈ పర్యటనల్లో  ఆశించిన ఫలితాలు రావు అన్న సంగతి గమనంలో పెట్టుకోవడం కూడా అవసరం.  చేస్తున్నదీ, చేయగలిగినదీ అంతా  తన వల్లనే చెప్పుకున్నా పరవాలేదు కానీ, చేయలేకపోయినవాటికి గత ప్రభుత్వాలను నిందించే విషయంలో కొంత సంయమనం పాటించడం మంచిది.  నిజమే.  ఆయన సామర్ధ్యం పట్ల నమ్మకం పెంచుకున్న అభిమానులు రాష్ట్రంలోనే కాక దేశవిదేశాల్లో  పెద్ద  సంఖ్యలో  వున్నమాట వాస్తవమే కావచ్చు.  వారి బలం, మద్దతు  ఆయనకు శ్రీరామరక్ష. వాగ్దానాల  అమలు విషయంలో  చంద్రబాబుకు  తగిన వ్యవధానం ఇచ్చి తీరాలనే వాదన ప్రబలుతుండడానికి ఇదే కారణం. లేని పక్షంలో  ఈ 'నిష్క్రియాపరత్వం' అనే  అంశం, కొత్త రాష్ట్రంలో ఈపాటికే రచ్చరచ్చగా మారివుండేది. అయితే, చంద్రబాబు వివరణలతో ఆయన  అభిమానులు, పార్టీ కార్యకర్తలు సమాధానపడ్డా,  ప్రధాన ప్రతిపక్షం అయిన వై.ఎస్.ఆర్.సీ.పీ. వూరుకోకపోవచ్చు. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుగు దేశం పార్టీ కూడా నాటి పాలక పక్షంపై ఇలాటి విమర్శలే చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  రుణ మాఫీ విషయంలో గడువులు విధించి హెచ్చరిక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే,  రాజకీయంగా అనవసర రాద్ధాంతం  చేస్తున్నారంటూ  అలాటి ప్రయత్నాలను  అడ్డుకుంటే  కొంతమంది కొంత కాలం  విశ్వసించవచ్చు. కానీ నిరసన జ్వాలలు రైతాంగం నుంచి మొదలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీనమేషాలు లెక్కబెట్టకుండా, కాలయాపన చేయకుండా,  చేయగలిగింది వెంటనే చేయడం, చేయలేని పరిస్తితి వుంటే దాన్ని గురించి భేషజాలకు పోకుండా ప్రజలకు వివరించడం ఈ రెండే ఆయన ముందున్న ప్రత్యామ్నాయాలు.        

ఏదిఏమైనా ఈ ఇద్దరు 'చంద్రుల'వల్ల రెండు రాష్ట్రాలకు మేలు జరగాలనే చాలామంది కోరుకుంటున్నారు. వారికి సహజ సిద్ధంగా వున్న శక్తి సామర్ధ్యాలన్నీ ఇందుకే ఉపయోగపడాలని ఉభయ రాష్ట్రాలలో రాజకీయాలతో ప్రమేయంలేని అధిక సంఖ్యాకులు ఆశ పడుతున్నారు. విశేష రాజాకీయానుభవం వున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయంలో పోటీ పడితే అది వాళ్ళను నమ్ముకున్న జనాలకు మేలు చేస్తుంది. ఈ వాస్తవం గుర్తించగలిగిన నేర్పు వారికి వుందనీ, వుండాలని కోరుకుందాం. అయితే, సమస్యల పరిష్కారానికి యెంత సమయం తీసుకున్నా ఎవ్వరూ అభ్యంతర పెట్టరు  కానీ  అలా తీసుకున్న వ్యవధానాన్ని  సమస్యలని ఆటక ఎక్కించడానికి వాడుకునే ప్రయత్నం చేస్తే అది చివరికి వారికే   కొరుకుడు పడని సమస్యగా తయారయ్యే ప్రమాదం వుంది. (20-07-2014)

18, జులై 2014, శుక్రవారం

కూల్చివేతలు శాశ్విత పరిష్కారం కాదు


హైదరాబాదు నగరాన్ని క్రమబద్దీకరణతో కూడిన ఒక అధునాతన నగరంగా రూపొందించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చేస్తున్న ప్రయత్నాలు, రూపొందిస్తున్న ప్రణాళికలు హర్షించదగినవే. ఆహ్వానించదగినవే. తెలంగాణా రాజధానికి ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు వుంది. అనేక అంతర్జాతీయ సంస్థలు  హైదరాబాదులో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గత అయిదేళ్ళ కాలంలో పరిపాలనా పరంగా ఏర్పడ్డ అనిశ్చితి, ప్రాంతీయ ఉద్యమం కారణంగా కొనసాగిన అసంగ్దిగ్ధ స్తితి మరికొన్ని విదేశీ సంస్థలు నగర ప్రవేశం చేయడానికి అడ్డంకిగా మారాయి. ఇప్పుడా పరిస్తితి లేదు. కాకపొతే పెట్టుబడులు భారీగా పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చేవారు అనేక విషయాలు ముందుగా ఆలోచించుకుంటారు. వాటిల్లో ప్రధానమైనది శాంతిభద్రతల అంశం. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త ముఖ్యమంత్రి హైదరాబాదును నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్టుంది. పోలీసు బలగాల సంఖ్యను పెంచడం, విధులను మరింత వేగంగా సమర్ధంగా నిర్వహించేందుకు వీలుగా వారికి అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించడం ఇలాటివన్నీ ఆ ఆలోచన నుంచి పురుడుపోసుకున్నవే. ఈ క్రమంలోనే కాబోలు నగరంలో రోజురోజుకూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తోస్తోంది. అయితే దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం తలపెట్టిన కూల్చివేతల కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా అలజడి రేపుతోంది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తుంటే మరికొందరు తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నారు. అయినా ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, అక్రమనిర్మాణాలను ఎట్టి పరిస్తితిలోను అనుమతించేది లేదనీ, హైదరాబాదును అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మహా నగరంగా తయారుచేయాలన్న స్వప్నం నిజం చేసుకోవాలంటే అక్రమార్కులపై కొరడా విదల్చక తప్పదనీ ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేయడంతో ఈ 
విషయంలో ఆయన యెంత పట్టుదలగా వున్నారో అన్న సంగతి అర్ధం అవుతోంది.


ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. యెంత మంచి  పధకం అయినా ప్రజల మద్దతు  లేనిదే విజయవంతం కానేరదు. ఈ ఒక్క విషయంలో ముఖ్యమంత్రి తన పట్టుదలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నిబంధలలోని  లొసుగులను అడ్డం పెట్టుకుని గృహనిర్మాణ రంగంలోని వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా డబ్బు కొల్లగొడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. అయితే ఈ అక్రమ నిర్మాణాలకు కారణభూతులయిన పెట్టుబడిదార్లు ఇలాంటి కూల్చివేతల వ్యవహారం వచ్చేసరికి పూర్తిగా రంగం నుంచి తప్పుకుంటారు. అక్రమ స్థలాల్లో అక్రమ పద్దతుల్లో నిబంధనలను కాలరాసి, డబ్బుకు గడ్డితినే సిబ్బందిని మామూళ్ళతో వశపరచుకుని సాగించే నిర్మాణాలు కాబట్టి కొంత చవకగా అమ్మే వెసులుబాటు వారికి సహజంగా వుంటుంది. ఇదిగో ఇక్కడే, దిగువ మధ్య తరగతి ఆదాయ వర్గాలు వారికి శలభాల్లా చిక్కుతారు. పదిమంది కొంటున్నప్పుడు మనకేమవుతుంది అనే ధీమా, గతంలో ఇలా కొన్న భవనాలను గత ప్రభుత్వాలు క్రమబద్ధీకరించిన వైనాలు వారిని ఇలాటి నిర్మాణాలను కొనుగోలు చేయడానికి పురికొల్పుతాయి. జీవిత పర్యంతం కూడబెట్టుకున్న డబ్బు, అదీ చాలకపోతే అప్పోసప్పో  చేసయినాసరే  హైదరాబాదు నగరంలో ఒక గూడు అంటూ ఏర్పాటుచేసుకోగలిగితే ఎప్పటికో అప్పటికి అదే ఓ పెద్ద ఆసరా అవుతుందన్న ఆశా,  వారిచేత చేయకూడని ఇలాటి పనులు చేయిస్తాయి. అందుకే ఇలాటి సందర్భాలలో పూర్తిగా నష్టపోయేది ఈ తరగతి వారే అవుతున్నారు.
హైదరాబాదు నగరంలో ఈ రకంగా నిబంధలకు విరుద్ధంగా కట్టిన భవనాలు అరవై వేలవరకు వుండవచ్చని ఓ అంచనా. ప్రస్తుత భవన నిర్మాణ వ్యయాన్ని ప్రామాణికంగా తీసుకుని లెక్కలు వేస్తె ఈ అక్రమ భవనాల మీద పెట్టుబడి కోట్లరూపాయాల్లో వుంటుంది. వీటిని కూల్చివేయడం అంటే,  సిమెంటు, ఇసుక, ఇనుము వంటి ఖరీదయిన నిర్మాణ సామాగ్రితో పాటు వేలకొద్దీ కార్మికుల శ్రమదమాదులు కూడా వృధా అయినట్టే. ఇక్కడే ఒక జవాబు దొరకని, దొరకాల్సిన ప్రశ్న  తలెత్తుతొంది. తెలంగాణాను  అవినీతిరహిత రాష్ట్రంగా తయారు చేయాలనే సత్సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  దృష్టి  సారించాల్సిన అంశం కూడా ఇదే. ఒక బహుళ అంతస్తుల భవననిర్మాణం అనేది ఒక్కరాత్రిలోనో లేదా కొన్ని రోజుల్లోనో పూర్తయ్యే వ్యవహారం కాదు. సంబంధిత అధికారుల కన్నుగప్పి నిర్మాణం సాగించడం కూడా వీలుపడే విషయం కాదు. కాబట్టి  సర్కారు విదిలిస్తున్న మొదటి కొరడా దెబ్బ పడాల్సింది అక్రమార్కులకు ఏదో రూపంలో సహకరిస్తున్న అధికారులు, వారి సిబ్బంది మీద. ఇలా వాదించడం అక్రమ నిర్మాణదారులను సమర్ధించడానికి ఎంతమాత్రం కాదు. కూల్చివేతల భయం కలిగించడం ద్వారా అక్రమనిర్మాణాల జోలికి పోరాదని ఎలాగైతే ప్రజానీకంలోకి హెచ్చరికలు పంపాలని పాలకులు భావిస్తున్నారో, అలాగే కొందరు అధికారుల మీద రాజీ లేని కఠిన చర్యలు తీసుకోగలిగితే ఇలాటి అక్రమాలకు శాశ్వితంగా అడ్డుకట్ట వేయడానికి సాధ్యపడుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఈ విషయంలో వున్న చిత్తశుద్ధి పట్ల ఎవరికయినా ఏమైనా  సందేహాలు వుంటే అవి నివృత్తి అవుతాయి.
ఇప్పుడు వున్న అక్రమ నిర్మాణాలతో పాటు ఇప్పటినుంచి నగరంలో ఎక్కడయినా అక్రమ నిర్మాణం జరిగినా లేదా జరుగుతున్నా దానికి సంబంధించిన సమాచారం నిర్దిష్టంగా అందితే  ముందు ఎలాటి సంకోచం లేకుండా సంబంధిత అధికారులను సస్పెన్షన్ తో సరిపుచ్చకుండా శాశ్వితంగా ఉద్యోగాలనుంచి తొలగించాలి. అలాగే, ముఖ్యమంత్రి వీలు చేసుకుని ప్రతిరోజూ ఈ కూల్చివేతల వ్యవహారాన్ని స్వయంగా సమీక్షించాలి. ఎక్కడా ఎలాటి లొసుగులకు చోటివ్వని రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన నిర్దారించుకోవాలి.
నగరాన్ని సుందరంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి అభిలాష పూర్తిగా నెరవేరాలంటే, నగరంలో కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నతాధికారులు పర్యటించి పరిస్తితులను పరిశీలించాలి. సగం సగం కూల్చిన ఇళ్ళు, అడ్డదిడ్డంగా కూల్చిన అపార్ట్ మెంట్లు  నగరం నలుమూలలా అలా అందవికారంగా  కనబడుతుంటే అది నగరానికి ఏమాత్రం శోభనివ్వదు.       

                                      

అందని ద్రాక్ష తీయన




మేము హైదరాబాదు వచ్చిన కొత్తల్లో మాఇంటికి అయిదారిళ్ళ అవతల ఓ పెంకుటిల్లు అమ్మకానికి వచ్చింది. మూడొందల గజాల స్థలం. చుట్టూ జాగా మధ్యలో ఇల్లు, ప్రహరీ గోడ. నలభయ్ వేలు అన్నారు. అప్పట్లో మూడుగదులున్న మా ఇంటి అద్దె నూటయాభయ్ రూపాయలు. నలభయ్ వేలున్న ఇంటి ఖరీదు  నలభయ్ లక్షలు అవుతుందని తెలియదు.  మా ఇంటి ఓనరు అద్దె పెంచకుండా వుంటాడని తెలియదు. అంచేత ఓ ఇరవై ఏళ్ళు అలా అద్దె కట్టుకుంటూ అద్దె ఇంట్లోనే కాలక్షేపం చేయొచ్చనుకుని  సొంత ఇంటి కల కనకుండా కలల లోకం లోనే  వుండిపోయాము.


అయితే ఒక విషయం చెప్పుకోవాలి.  తరువాత హైదరాబాదులో  అద్దెలు పెరిగిన మాట నిజమే కాని భరించలేనంతగా కాదు.  ఇళ్ళ ఖరీదులు పెరిగాయి కాని కొనలేనంతగా కాదు. బంజారా హిల్స్ దాటిన  తరువాత బజార్లే లేవు. అన్నీ పంట పొలాలు. ఎక్కువగా బంజరు నేలలు. అదేం చిత్రమో, 1987 లో మేము మాస్కో పోయి అయిదేళ్ళ తరువాత తిరిగొచ్చేసరికి  సీను సితారా అయిపోయింది. ఏళ్లతరబడి మన్నుతిన్న పాములా పడివున్న ఇళ్ళ ధరలు, ఖాళీ స్థలాల ధరలు వామనుడు శరీరం పెంచి ముల్లోకాలకు వ్యాపించినట్టు  ఆకాశం అంచులు తాకాయి. అక్కడినుంచి అవి రోజురోజుకూ పెరుక్కుంటూ పోవడం తప్ప కిందికి  దిగివచ్చిందీ లేదు. దిగివస్తాయన్న నమ్మకమూ లేదు. మా ఎకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు చెప్పినట్టు ' I did not have when I could have, I cant have when I want to have"       

  NOTE: Courtesy Image Owner 

17, జులై 2014, గురువారం

Good Governance For whom... Either KCR or Chandrababu ? | Part 1 : TV5 News

"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"


(సీరియస్ గానే సుమా!)


sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై  ఒక కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే, మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి ముందు కృతజ్ఞతలు.
ఒక ఛానలుకు అమ్ముడు పోయారా అన్నది వారి సందేహం. 'ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు పొద్దున్నే పోతున్నాను' అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పాఠకుడు  తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు. చాలామందికి వున్న  మరో భావన  ఏమిటంటే ఇలా చర్చల్లో పాల్గొనేవారికి బాగానే సంభావనలు ముడతాయని. ఒక్క ఉచిత వాహన సౌకర్యం మినహా ఇంకా ఎలాటి గిట్టుబాటు వ్యవహారాలు వుండవు అన్నది అసలు నిజం.
పోతే, ప్రతివారం నా షెడ్యూలు ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఏడున్నరవరకు  - 10 టీ వీ, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ,  గురువారం ఉదయం ఏడు గంటలనుంచి  ఏడున్నర వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడుంబావు నుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్ కు ఆరోజు వెడతాను. ఆదివారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదివరకు టీవీ 5. ఇవికాక  రాత్రి వేళల్లో  సందర్భాన్నిబట్టి వివిధ ఛానళ్లలో    చర్చాకార్యక్రమాలు వుంటాయి. కొన్ని యెన్ ఆర్ ఐ కార్యక్రమాలు నెలకు రెండు సార్లు అర్ధరాత్రి సమయాల్లో వుంటాయి.  గత రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు పిలుస్తున్నా, పాత ఛానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. ఒకవేళ నా అవసరాలను బట్టి నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు" (ఇది మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు రాసిన ఒక గేయంలో వాక్యం)
వందనాలు