14, జులై 2014, సోమవారం

గుడిలో ఏముందీ?


గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.  
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకుఅభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో  మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ  సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి  ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అనుకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి  మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో  ఇది సాధ్యమా అంటే అనుమానమే. 
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.


(దేవాలయాల్లో తీర్ధ ప్రసాదాలను విక్రయించే పద్దతిని నిరసిస్తూ శ్రీ పీఠం అధిపతి  స్వామి పరిపూర్ణానంద చేసిన ప్రకటన ఈరోజు పత్రికల్లో వచ్చిన నేపధ్యంలో - భండారు శ్రీనివాసరావు )                                  


13, జులై 2014, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన .......


ఒక విషయం మీద మనం వ్యక్తం చేసే అభిప్రాయంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. అంతమాత్రాన అక్కడికక్కడే జంధ్యాలు తెంచుకోనక్కరలేదన్నది నా నిశ్చితాభిప్రాయం. ఈ ఉదయం టీవీ 5  'న్యూస్ స్కాన్'  ప్రోగ్రాంలో నాతొ పాటు ఢిల్లీలో  టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, సీనియర్ న్యాయవాది పట్టాభి, టీజేయేసీ నాయకులు కోదండరామ్, కార్యక్రమ నిర్వాహకులు సాంబశివరావు పాల్గొన్నారు. ప్రధాన చర్చనీయాంశం 'పోలవరం'.




ఒక ప్రాంతానికి వరంగా, మరో ప్రాంతానికి శాపంగా మారుతూ రెండు రాష్ట్రాల  నడుమ చిచ్చుపెడుతున్న పోలవరం వివాదం మరింత ముదరకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై వుంది అని చెబుతూ, పోలవరం పూర్వాపరాలను కొంత మేరకు వివరించే ప్రయత్నం చేసాను. మరోచోట నుంచి లైవ్ లో పాల్గొంటున్న కోదండ రామ్ గారికి నేను చెప్పింది సరిగా వినబడకపోవడానికి అవకాశం  వుంది. అందువల్లనేమో, కోదండరాం గారు మధ్యలో కల్పించుకుని, ఈ  (పోలవరం ప్రాజెక్ట్  చరిత్ర) విషయంలో నేను తెలుసుకోవాల్సిన విషయాలు వున్నాయని, అందుకు సంబంధించిన అనేక పుస్తకాలు తనవద్ద వున్నాయని  చెప్పారు. తెలంగాణా ఉద్యమ సారధిగా ఆయనకు వున్న అపార  అనుభవం కానీ, విషయ పరిజ్ఞానం కాని నాకుంటుందని నేననుకోను. అదీకాక కొన్ని విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి. వాదనకు దిగడం ద్వారా అవి తేలేవి కావు. అలాగే  టీవీ ల్లో నిర్వహించే ఇటువంటి చర్చల్లో అభిప్రాయ వ్యక్తీకరణ జరగాలి కాని వాదప్రతివాదాలకు తావివ్వకూడదు. చర్చలో పాల్గొనే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వైఖరులకు కట్టుబడి కొంత వాదానికి దిగినా తప్పుబట్టాల్సిన పనిలేదు కాని జర్నలిష్టులు తాము చెప్పిందే రైటు అనే రీతిలో వాదప్రతివాదాలకు దిగరాదన్నది నా సిద్ధాంతం. అందుకే సాంబశివరావు గారు జవాబుకు అవకాశం ఇచ్చినా నేను వాడుకోలేదు. హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ కీర్తిశేషులు రాజేంద్ర ప్రసాద్ గారు అంటుండేవారు. జర్నలిష్ట్ అనేవాడు ఎదుటివాడు చెప్పింది వినడం అలవాటు చేసుకోవాలని. విభిన్న రంగాలకు చెందిన వాళ్లు చెప్పే అభిప్రాయాలు వినడం ద్వారా మన పరిజ్ఞానం పెంచుకోవచ్చన్నది కూడా ఆయన నుంచి నేను నేర్చుకున్న పాఠం. అందుకే అది టీవీ చర్చ అయినా, ఫేస్ బుక్ చర్చ అయినా నా అభిప్రాయంతో విబేధించేవారితో నేను వాదం పెంచుకోను. అది నా పాలసీ.                      

12, జులై 2014, శనివారం

పోలవరం! ఎవరికి వరం? ఎవరికి శాపం?

దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. కొత్తగా పురుడుపోసుకున్న రెండు రాష్ట్రాల నడుమ ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే  కనిపించే ఈ ప్రాజెక్ట్  వాస్తవరూపం దాల్చడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.  
దేశంలోని నదులన్నింటినీ  అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941  జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్  ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా  మూడు లక్షల యాభై  వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్  మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం  కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న  భద్రాచలం  సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు,  పోలవరం కుడి గట్టు కాల్వని,   కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం  2004  కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న  పోలవరానికి,  వై. ఎస్.  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం.  పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం. ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణించే వారు  విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి  గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది. ఇవీ ఈ ప్రాజెక్ట్ వల్ల అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, విభజన అనంతరం ఏర్పడ్డ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వొనగూడే ప్రయోజనాలు. కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది.          
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే,  గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. అసలు ఏ సేద్యపు నీటి  ప్రాజెక్ట్ అయినా కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి,  కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే  ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి  ఇదే.
రాష్ట్రంలో పలు జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని సహజ సిద్ధమైన బాలారిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్  నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి  పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో  సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్  తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో కూడా పోలవరం అంశం ప్రధాన అవరోధంగా  నిలిచింది. ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో,  ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరో రాష్ట్రంలో వుండే విచిత్ర పరిస్తితి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విభజన  నిర్ణయం తీసుకున్న నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం,  తెలంగాణాలోని అనేక గ్రామాలను  ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఆఖరి క్షణంలో ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తరువాత వచ్చిన మోడీ నాయకత్వంలోని  ఎండీయే సర్కారు ఆ ఆర్డినెన్సు తీసుకురావడమే  కాకుండా దాన్ని లోకసభలో ఆమోదింపచేసుకోవడంతో  తెలంగాణా ప్రాంతంలో అగ్గి రాజుకుంది.  పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి  మింగుడు పడలేదు. పోలవరం బిల్లుకు నిరసనగా తెలంగాణా జేయేసీ ఇచ్చిన పిలుపుకు పాలక పక్షం అయిన టీఆర్ఎస్  మద్దతు పలికింది. 1956 నుంచి తెలంగాణలో భాగంగా వున్న ప్రాంతాలను పొరుగు రాష్ట్రంలో కలపడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పొరుగునవున్న ఒడిశా,  ఛత్తీస్ ఘడ్   ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని అవసరమయితే కోర్టుల్లో  తేల్చుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీయార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.    
పోలవరం ప్రాజెక్ట్ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వున్నట్టు కానవస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజక్ట్ గా చేపట్టి పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా దీని వూసు లేదు. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.
ఈ ప్రాజెక్ట్ అనుకున్న  విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే దానివల్ల ఆట్టే లాభం లేని తెలంగాణా రాష్ట్రంలోని అనేక లక్షలమంది సాధారణ ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా,  అనుకున్న  వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే. ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం  అంచనాలకు మించి పెరిగిపోవడం మాత్రం  ఖాయం. (12-07-2014)

గురుద్దేవో నమో నమః !



సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నానుఅని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడుఅని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.
అదృష్టం కొద్దీ నాకు అందరూ మంచి గురువులే దొరికారు. వీరిలో చదువు  చెప్పిన వాళ్లు వున్నారు. నీతి పాఠాలు బోధించిన వాళ్లు వున్నారు. మా అమ్మ దగ్గరినుంచి నా భార్యవరకు ఆమాటకు వస్తే ఇన్నేళ్ళ జీవితంలో నాకు తారసపడిన ప్రతి ఒక్కరినుంచీ జీవితానికి పనికొచ్చే ముక్క ఏదో ఒకటి నేర్చుకున్నాను. జగమంత గురుకుటుంబం నాది. గురుపూర్ణిమ రోజున గురువులందరికీ - గురుద్దేవో నమో నమః -


11, జులై 2014, శుక్రవారం

చీమ చెప్పే భగవద్గీత


ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తనను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు విసిరి దీనికోసం నన్ను పనికట్టుకుని పిలవాలా! అటు చూడు! అదిగో. అటుగావెడుతున్న ఆ అల్పజీవిని చూడు. దాన్ని చూసి నేర్చుకో' అనేసి చక్కాపోయాడు. ఇతగాడటు చూస్తే నెమ్మదిగా కదిలి వెడుతున్న ఒక చిన్న చీమ కనిపించింది.

అంత పెద్ద దేవుడు ఇంత చిన్న చీమ నుంచి జీవితం గురించిన పాఠాలు నేర్చుకోమని అంటున్నాడు ఇతడేమి దేవుడు అని అనుకోకండి.

దారీ తెన్నూ తెలియని స్తితిలో వున్న మనుషులకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని కార్యోన్ముఖుల్ని చేయడంలో మోటివేషన్ గురు అని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జిన్  రాన్' కూడా  చీమల నుంచే తన విజయ సూత్రాలకు స్పూర్తిని పొంది ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. దాని పేరు యాం ట్స్' ఫిలాసఫి అంటే చీమలు బోధించే తత్వశాస్త్రం అని దగ్గరి అర్ధం.

చీమల జీవన సరళిని బాగా అధ్యయనం చేసిన జిన్ రాన్ మహాశయులవారు  జీవితంలో విజయాలు సాధించడానికి  కొన్ని  సూత్రాలను వాటినుంచి నేర్చుకోవాల్సి వుంటుందని సెలవిచ్చారు.



ఈ సారి సమయం దొరికినప్పుడు మీ చేతివేలును చీమ వెళ్ళే దారిలో అడ్డంగా వుంచి గమనించండి. ఆ చీమ మీ వేలును దాటివెళ్ళడానికయినా ప్రయత్నిస్తుంది లేదా మీ వేలి చుట్టూ తిరిగి వెళ్ళడానికయినా చూస్తుంది. అంతేకాని అక్కడే ఆగిపోయి బిత్తర చూపులు చూడదు. ఎందుకంటె మడమ తిప్పడం,  వెన్ను చూపడం దాని ఇంటా వంటా లేదు. ఓటమిని అంగీకరించడం దాని రక్తంలో లేదు.(చీమ వొంట్లో రక్తం వుంటుందా? వుంటే అది ఏ గ్రూపు అని చర్చిస్తూ కాలక్షేపం చేయడం మనుషులకే చెల్లు) అంటే ఏమిటన్న మాట. జీవితం అన్నాక మనం చేసే పనులకు అవరోధాలు ఎదురవడం సహజం. అడ్డంకులను అడ్డం పెట్టుకుని కాడి కింద పారేసి సారో సాంగులు సోలో సాంగులు మొదలు పెట్టకూడదు. ఎన్ని సవాళ్లు ఎదురయితే మనం మనస్సును అంత దృఢపరచుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు వచ్చి వొళ్ళో వాలతాయి. లేదంటే చక్కా ఎగిరిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విన్ స్టన్ చర్చిల్ ఏమన్నాడు. సాధించేదాకా సాధన మానకండి. ప్రయత్నం వొదిలిపెట్టకండి అని తన సైన్యాలను ఉత్తేజపరిచాడు. బహుశా చీమలనుంచే ఆయన ఈ స్పూర్తిని గ్రహించి వుంటాడు.

NOTE: Courtesy Image Owner

గళ్ళు - ముళ్లు


ఎక్కడో దూరాన వున్న చంద్రుడిమీద కాలు మోపడం తెలిసిన మనిషికి పక్కింటివాడు మాత్రం పరాయి మనిషి.
ఓపక్క ఆధునిక సాంకేతికత పుణ్యమా అని దూరాభారాలు తగ్గిపోతున్నా,  మనుషుల నడుమ దూరాలు, భారాలు పెరిగిపోతూనే వున్నాయి.



బాపూరమణల సినిమాలో చెప్పినట్టు 'పులిని చూసి పులి ఎన్నడు బెదరదు, పాపఖర్మమదేమొ కాని మనిషి మనిషికి కుదరదు'  ఇదో విషాదం. 
Courtesy Image Owner    

ఔనంటారా! కాదంటారా!



మట్టే బంగారం అనుకునే  ఖరీదయిన చోట్ల   కోట్లు పోసి కట్టిన లంకంత కొంప 
కానీ  కాపురం వుండేది మాత్రం  లింగూ లిటుకూ మంటూ ఓ  ముసలి జంట
రెక్కలొచ్చిన పిల్లలు  రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఎక్కడో,  సుదూరంగా ఏ దేశంలోనో 
అమ్మా నాన్నా ఓ పనమ్మాయి

ఏదయినా సినిమా టైటిల్ గుర్తొస్తోందా!
Courtesy Image Owner