6, జులై 2014, ఆదివారం

విరాట రాజ్యంలో వాన


ఈ కధ అందరికీ తెలిసిందే. పాండవులు అజ్ఞాత వాసంలో గడుపుతుంటారు. ఏడాది గడువు పూర్తయ్యేలోగా వారి ఉనికిని కౌరవులు కనుక్కోగలిగితే  మళ్ళీ  మరో ఏడాది అజ్ఞాత వాసం తప్పదు. పాండవులు ఎక్కడ వున్నారో తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. 'పాండవులు పుణ్యాత్ములు. వారు నడయాడిన చోట సకాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి' అని కురుసభలో పెద్దలు సెలవిస్తారు. పాండవ స్తుతితో కూడిన  ఆ మాటలు అట్టే  రుచించకపోయినా, వారిచ్చిన 'క్లూ' మాత్రం కురు సార్వభౌముడికి తెగనచ్చుతుంది.
ఈ కధ యెందుకు గుర్తుకు వచ్చిందంటే ఫేస్ బుక్ లో చూసినా, టీవీ స్క్రోలింగులు చూసినా తొలకరి జల్లులు కురిసి  మట్టి తడిసిన వాసన.


కానీ మేముంటున్న మాదాపూర్ లో మాత్రం చినుకు జాడ లేదు, ఉరుములు మెరుపులు తప్ప.  
పాండవులు కాస్త వీలు చూసుకుని ఇటేమన్నా వస్తారేమో చూడాలి.

చెఖోవ్ చెప్పిన చిన్న కధ


‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’
చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.
టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. సోషల్ మీడియాలో సాగే సంవాదాలే చక్కటి సోదాహరణ.  ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.

బడుగులకో గూడు


(ఈనాటి -06-07-2014- సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)   
బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహాన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య.

రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్ని కట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగా అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకం అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు  లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత పదేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడు చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
అదేసమయంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు, కేవలం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పధకాన్ని భూ భాగోతంగా ముద్రవేసి వారి కడుపులపై కొట్టడం కూడా మంచిది కాదు. దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండినవాడు, కడుపు మండినవాడుఅనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.


5, జులై 2014, శనివారం

మహాభూరి
(10000000000000000000000000000000000)
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు వుంటే ఆ సంఖ్యని ఇంగ్లీష్ లో  ట్రిలియన్’ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్బిలియన్ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. పాతిక సున్నాలు అంటే  ఎనిమిది ట్రిలియన్లకంటే ఎక్కువ. లెక్కల్లో సున్నా కనుక్కున్న  దేశం మనదే కాబట్టి ఒకటి పక్కన ముప్పయి నాలుగు సున్నాలవరకు లెక్కెట్టి ఆ సంఖ్యకు మనవాళ్ళు 'మహాభూరి' అనే పెరెట్టేసారు. అదో కధ పోనీండి. పోతే,  ఈలెక్కలన్నీ  దేనికంటే, ఒకటి పక్కన పాతిక సున్నాలు అనుకున్నాం చూడండి. ఆ మొత్తం ఈ యావత్  ప్రపంచ దేశాలలోని జనాలు తమ తమ సెల్ ఫోన్ల ద్వారా ఒక్క ఏడాదిలో పరస్పరం పంపుకున్న ఎస్ ఎం ఎస్’ లకు ఆ సంఖ్య సమానం.
ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ సున్నాల’ గందరగోళం ఎక్కువై అసలు విషయం’ గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు.  పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ఎస్ ఎం ఎస్’ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.

ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేల నాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ బుల్లి పరికరం’ ఈనాడు హస్తభూషణం’ గా తయారయి కూర్చుంది. ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే దేశంలో – ఇంట్లోవున్న నలుగురూ నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.
మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదుసందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ఎస్ ఎం ఎస్ ‘ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.
అప్పటినుంచి ఈ చిట్టి పొట్టి సందేశాల సాంకేతిక పిట్ట’ ప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో – ‘ఎస్ ఎం ఎస్’ ల విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో దశాబ్దం కిందటే,  క్రిస్మస్ పండుగ సందర్భంగా – ఒకే ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకు ‘ఎస్ ఎం ఎస్లు - పండుగ  శుభాకాంక్షలు తెలుపుతూ - ‘ఫోన్లు మారాయి.
ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.
కానీ ఇలాటి లెక్కలు తీసేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం పదేళ్ల క్రితమే  ఈ ఎస్ ఎం ఎస్’ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.
అమెరికాలాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ఎస్.ఎం.ఎస్.’ కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ వసూలు రాజాల’ కు ఇందుకయ్యే ఖర్చు చిల్లి సెంటు’ కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న అదనపు’ చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా మిగిలినట్టేఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.
ఇందులో ఇంత’ వుంది కాబట్టే –  ఎస్ ఎం ఎస్ ‘ ల పేరుతొ ఇన్నిన్ని స్కీములుఇన్నిన్నిగేములు.
పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.
పట్టుకుంటే పట్టు చీరె’ నుంచి ఆటాడుకుందాం రా’ వరకు అన్నీ  ఎస్ ఎం ఎస్’ గేములే.
ప్రతి టీవీ ఛానల్ లో ప్రతి అంశం మీదా ప్రజాభిప్రాయసేకరణలే. ఎస్ ఎం ఎస్’ లు పంపాలని కోరని ఛానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.
పైగా ఈ ఎస్.ఎం.ఎస్.’ ల కు వసూలు చేసే ఛార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్య నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు పోటీలు పడి తమ మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.                                                                      
బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా – చాపకింద నీరులా వ్యాపిస్తూసామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.
టీవీ ఛానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయోఇందులోని వ్యాపార మర్మం’ ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.కానీ ఇది జరిగే పనేనా!
తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’   

Courtesy Image Owner          

3, జులై 2014, గురువారం

యెంత కష్టం యెంత కష్టం


ఆరు నెలల కిందట మేము ఈ ప్రాంతంలో అద్దెకు  వచ్చినప్పుడు మా అపార్ట్ మెంటుకు  ఐ మూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది.


వరసగా కొన్ని గంటల పాటు కరెంటు లేకపోవడం వల్ల, ఎంతో ఖర్చు పెట్టి పెట్టించుకున్న ఇన్వర్టర్లు కూడా పనిచేయడం మానేసాయి. అంచేత ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో  దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో  అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమ పధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట  కాగానే గంట  కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని ఇళ్లనుంచి తెచ్చుకున్న భోజనాలు చేశారు. చూడగలిగిన కళ్ళు వుండాలే కాని చుట్టూ వున్న ప్రపంచంలో చూడగలిగినవి ఎన్నో వున్నాయి. అయినా ఇంకా ప్రపంచం చుట్టిరావాలన్న యావ చావడం లేదు ఎందుకో అర్ధం కాదు.
కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూ నే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది  కదా! అదే ఇది.

మేముంటున్న ప్రాంతానికి దగ్గర్లోనే ఈమధ్య వార్తల్లో చోటుచేసుకుంటున్న గురుకుల్ అనండి  అయ్యప్ప సొసైటీ అనండి - అనేక ఇండ్లు కూల్చేసిన ప్రాంతం వుంది. ఫోటోల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇల్లు, దానికంటే అవి చాలా పెద్దవిగా అనిపించాయి.  ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు.   ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో  వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం?  ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బు అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు  వొదులుకున్నట్టే కదా!    ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన  అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం   ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా  ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వితంగా  తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా! మిగిలిన అన్ని విషయాలు పక్కనబెట్టి  ఆలోచించండి.                   

2, జులై 2014, బుధవారం

జంప్ జిలానీలకు ముకుతాడు వేయాలంటే


ఎక్స్ ప్రెస్ టీవీ ఈనాటి (02-07-2014) రాత్రి ఎనిమిది గంటలకు ఈ అంశంపై ఎక్స్ ప్రెషన్స్ కార్యక్రమం నిర్వహించింది. ప్రెజెంటర్ రోజా. కాంగ్రెస్ నాయకురాలు మాజీమంత్రి శ్రీమతి డీ.కే. అరుణ,  ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్నారు. నా అభిప్రాయాలు క్లుప్తంగా:


"ఎన్నికలకు ముందు వోటర్లు ప్రలోభాలకు యెలా గురవుతోంది, అందువల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు యెలా వాటిల్లుతోందీ అని వివరిస్తూ మేధావి వర్గాలు తెగ ఆందోళన పడిపోయాయి. కానీ మన సగటు ఓటరు మాత్రం  అభ్యర్ధులు యెంత ఖర్చుపెట్టినా ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తన ఇష్ట ప్రకారమే పాత ప్రభుత్వాలను మార్చుకున్నాడు, కొత్త ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు నిస్సిగ్గుగా పార్టీలు మారుతుంటే ఆ వర్గాలు మాత్రం  పెదవి విప్పడం లేదు. పార్టీలు మారి వచ్చిన వారిని వేరే పార్టీలు కండువాలు కప్పి సగౌరవంగా ఆహ్వానించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదో ఘన కార్యం అన్నట్టుగా మీడియాలో ఆ దృశ్యాలు చూపిస్తున్నారు. ఇలా పార్టీలు మారేవారిని మళ్ళీ తమ గుమ్మం తొక్కడానికి అనుమతించేది లేదని ఏ పార్టీ కూడా  గట్టిగా చెప్పడం లేదు. అంటే,  రేపు దశ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కాదని  పోయిన వాళ్ళంతా తిరిగి  అదే వేగంతో స్వగృహ ప్రవేశం చేస్తారన్న ధీమా కాబోలు. ఆకర్షించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆకర్షితులు కావడానికి కూడా అన్నే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అధికారం లేకపోతే అంతా అంధకారమే అనే నాయకులు వున్నంత వరకు ఇదే పరిస్తితి తప్పదు."  

  

కారే రాజులు ......


కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా! - పోతన


ఈ ఫోటోలు చూసినప్పుడు ఈ పద్యం  జ్ఞాపకం వచ్చింది. మన పొరుగు దేశాన్ని వొంటి చేత్తో పరిపాలించిన ఆ దేశపు  ఓ మాజీ ప్రదాని, మరో దేశంలో ముచ్చటపడి కట్టించుకున్న అత్యంత ఖరీదయిన  సౌధం ఇది.  కానీ చనిపోయిన తరువాత మిగిలింది ఏమిటి. ఖబర్ స్థాన్ లో ఆరడుగుల జాగా మాత్రమే! 



PHOTO COURTESY IMAGE OWNERS