14, జూన్ 2014, శనివారం

కృషి వుంటే....


'కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు' అని ఓ సినీ గేయం ఉద్బోధిస్తుంది. బీహార్ కు చెందిన ఆనంద్  కుమార్ ఇదే కోవకు చెందుతాడు.


(శ్రీ ఆనంద్ కుమార్)

అయితే ఇతగాడి గురించి డిస్కవరీ ఛానల్ ఒక గంట  ప్రోగ్రాం ప్రసారం చేసేవరకు, టైం మేగజైన్ ఒక కధనాన్ని ప్రచురించేవరకు, దాన్ని చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా తన ప్రతినిధిని పాట్నా పంపి వివరాలు ఆరాతీసేవరకు ఈ ఆనంద్ కుమార్ ఎవరో బీహార్ బయటి భారత దేశానికి తెలియదు. అదే చిత్రం.
పేరు ఆనంద్ కానీ అతడి జీవితంలో ఆనందం తక్కువే. నిరుపేద కుటుంబం. బాగా చదువుకోవాలనే ఆరాటం. కానీ చదివించలేని కుటుంబ నేపధ్యం.
గణిత శాస్త్ర మేధావి రామానుజం అతడి రోల్ మోడల్. ఒకరకంగా ఆయనకు ఏకలవ్య శిష్యుడు. రామానుజం మాదిరిగా కేంబ్రిడ్జ్ లో చదువుకోవాలనే కోరిక తీరకపోయినా తనలాగా కలలు కనే కటిక పేద విద్యార్ధుల కలలు మాత్రం తన కృషితో నిజం చేసాడు.
కుటుంబానికి వున్న ఒకేవొక్క ఆధారం తండ్రి. ఆయన  హఠాత్తుగా చని పొవడంతో తల్లితో  కలిసి ఆనంద్ బాద్య్హత నెత్తికెత్తుకున్నాడు. ఇల్లిల్లూ తిరిగి తల్లి చేసిచ్చిన అప్పడాలు అమ్మేవాడు. తీరిక దొరికినప్పుడల్లా ఎవరికీ అర్ధం కాని గణిత శాస్త్ర సమస్యలతో కుస్తీ పట్టేవాడు.  కూలీనాలీ  చేసి పొట్టపోసుకునే వారు, ఆటో డ్రైవర్లు తమ పిల్లల్ని లెక్కలు నేర్చుకోవడానికి ఆనంద్ దగ్గరకి పంపేవారు. వాళ్లు ఉడతాభక్తిగా ఇచ్చే డబ్బులే  కుటుంబ పోషణకు అక్కరకువచ్చాయి. ఈ క్రమంలో నిరుపేద  విద్యార్ధి ఒకడు  అతడి వద్దకు వచ్చాడు. ఐ.ఐ.టీ.లో చేరడం అతడి కల. ఆ స్వప్నం సాకారం చేసే బాధ్యత ఆనంద్ తనపై వేసుకున్నాడు. డబ్బు తీసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి శిష్యుడికి పాఠాలు బోధించాడు.  చిత్రంగా అతడు ఎంట్రెన్స్ పాసయి ఐ.ఐ.టీ.లో చేరగలిగాడు. అంతే  తన ప్రతిభ ఏమిటో ఆనంద్ కి తెలిసివచ్చింది. అంతే  కాదు తాను చేయాల్సింది ఏమిటో కూడా అర్ధం అయింది. తనలాగా పెద్ద చదువులు చదవాలనే కోరికలు వుండి తీర్చుకోలేని బీదపిల్లలకు  సాయపడాలని నిర్ణయించుకున్నాడు.
అతడి కల నిజమైంది. అతడ్ని నమ్ముకున్నవాళ్ళ కలలు నిజమయ్యాయి. ఏటా ముప్పైమంది అతిపేద విద్యార్ధులను  ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఐ.ఐ.టీ. ఎంట్రెన్స్ కి పంపేవాడు. ఆ ముప్పైమందీ సెలక్ట్ అయ్యేవాళ్ళు. ఇది తెలిసి విద్యావ్యాపారులు కొందరు  తమతో చేయి కలిపి లాభాలు గడిద్దాం రమ్మన్నారు. కానీ అతడు సుతరామూ అంగీకరించలేదు. కేవలం పేదరికాన్నే కొలమానంగా తీసుకుని ప్రతియేటా పిల్లలకు శిక్షణ ఇస్తూ అఖండ విజయాలు సాధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సాయం తీసుకుంటే యెం జరుగుతుందో అతడికి తెలుసు. అందుకే దాన్ని మృదువుగా తిరస్కరించాడు. టైమ్ పత్రికలో అతడి గురించి చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఏకంగా తన ప్రతినిధినే ఆనంద్  దగ్గరకు పంపి అవసరమైన సాయం చేస్తాననే సంసిద్ధత  వ్యక్తం చేసాడు. కానీ ఆనంద్  ధ్యేయం వేరు. తనలాటి పేదవారిని మరో  నలుగురిని జీవితంలో పైకి తీసుకురావడం తప్ప నలుగురూ  తన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఏనాడు  తాపత్రయ పడలేదు.
ఏటా ముప్పయిమంది అతిపేద పిల్లల్ని ఐ.ఐ.టీ.లో చేర్చడం ఒక్కటే ఈ ఏకలవ్యుడి లక్ష్యం. ఆ ధ్యేయం ముందు అతడికి మిగిలినవన్నీ అత్యల్ప స్వల్ప విషయాలే!
రామానుజం పేరుతొ ఏర్పాటుచేసుకున్న సంస్థలో చదివే పిల్లలకు తల్లి అన్నం వొండి పెడుతుంది. సోదరుడు ఇతరత్రా అవసరమైన  సాయం చేస్తాడు. ఆనంద్ పాఠాలు చెబుతాడు.
అలా వారి జీవితం సాగిపోతోంది. అతడి నుంచి సభ్యసమాజం, ప్రత్యేకించి చిన్నమెత్తు పనిచేసి పెద్దపెట్టున  ప్రచారం పొందాలని  తాపత్రయపడే  వ్యక్తులు, సంస్థలు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం వున్నాయి.
(ఇంగ్లీష్ లో సమాచారాన్ని పంచుకున్న శ్రీ పీవీవీజీ స్వామి గారికి కృతజ్ఞతలతో )

'వాదా'లు - వాదనలు


ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా   'వాదా' (ఇచ్చిన మాట)ల గురించిన చర్చలే. ఎన్నికల సమయంలో కురిపించిన వాగ్దాన వర్షాలు ఇప్పుడు గెలిచివచ్చిన పార్టీలకు 'విడువని ముసురు'లా తగులుకున్నాయి. నరంలేని నాలుకతో అవసరార్ధం ప్రకటించిన రుణ మాఫీలు ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పీఠం ఎక్కిన పార్టీలకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 'షరతులు వర్తిస్తాయి' అనే తరహాలో మొదలుపెట్టి, పంట రుణాలు వేరు, వ్యవసాయ రుణాలు వేరు అంటూ  మాట మార్చడానికి చేసిన ప్రయత్నాల నుంచి వెనక్కు తగ్గాయి. నూటికి నూరు శాతం ఎన్నికల హామీని అమలుచేసి తీరుతామని మరో హామీ ఇచ్చి పరిస్తితి చేయి దాటిపోకుండా చూసుకున్నాయి.


తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఈ విషయంలో పాలక పక్షాన్ని నిలదీయడంలో, నిగ్గదీయడంలో విజయం  సాధించామని చంకలు చరుచుకుంటూ సంతోషపడుతున్నప్పటికీ, మళ్ళీ తాము అధికారంలో వున్న ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే విషయం తమకు గుదిబండ కాబోతున్నది అన్న విషయాన్ని మరిచిపోతున్నట్టుగా వుంది. రుణాల మాఫీ విషయంలో ఈ రెండు పార్టీల పరిస్తితి పైకి  ఒకే రకంగా కానవస్తున్నప్పటికీ, ఈ రెంటికీ సానుకూల ప్రతికూల అంశాలు కొన్ని  వున్నాయి.
ఆర్ధిక వనరుల విషయంలో తెలంగాణాకు ఆవిర్భావంతోనే కొంత వెసులుబాటు లభించింది. మిగులు బడ్జెట్ తో ఆ రాష్ట్రం  ఏర్పడింది. దీనికి తోడు రైతు రుణాల మాఫీ భారం కూడా పొరుగున వున్న ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తక్కువ. విద్యుచ్చక్తి, సేద్యపునీటి సమస్యలు మినహాయిస్తే తెలంగాణా 'వడ్డించిన విస్తరి'. రాజధానితో సహా  అన్ని హంగులూ వున్నాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదన్న ఒక్క ప్రతికూల అంశం మినహాయిస్తే, తెలంగాణా పాలనాపగ్గాలు చేపట్టిన టీ.ఆర్.ఎస్. పార్టీ, పొరుగు రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కిన తెలుగు దేశం పార్టీ పరిస్తితితో పోల్చుకున్నప్పుడు కాస్త మెరుగయిన స్తితిలోనే వుంది.
తెలుగుదేశం పార్టీకి కూడా కొన్ని అంశాలు సానుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా వున్నాయి. ఆ పార్టీకి ప్రధానంగా కలిసివచ్చిన  అంశం కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వుండడం. పైపెచ్చు కేంద్ర  ప్రభుత్వంలో మంత్రి వర్గ భాగస్వామిగా వుండడం. వీటికి తోడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పాలనాపరంగా మంచి అనుభవం వుండడం, ఆయన దక్షత పట్ల ఆ ప్రాంత ప్రజల్లో నమ్మకం వుండడం అనేవి అనేవి  అదనపు సానుకూలతలు. కాకపొతే కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ ని ప్రధానంగా వేధించేది నిధుల కొరత. రుణాల మాఫీ భారం కూడా కొండంత. దీనికి తోడు 'ప్రత్యేక హోదా' విషయంలో ప్రణాళికా సంఘం పెట్టిన కొత్త మెలికతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అయితే,  ప్రతికూల అంశాలను సయితం తనకు అనుకూలంగా  మార్చుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడికి ఇది అందివచ్చిన మరో సువర్ణావకాశం అనే భావించాలి. ఈ ఇబ్బందిని ఆయన తన దక్షతతో ఖచ్చితంగా అధిగమించడమే కాకుండా, మొత్తం వ్యవహారాన్ని  తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 'ప్రత్యేక హోదా'  హామీ అమలవుతే, దాని ఖ్యాతి  తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం కాంగ్రెస్  పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నిబంధనలు మారిస్తే తప్ప ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న ప్రణాళికా సంఘం అభిప్రాయాన్ని టీడీపీ, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి జోక్యంతో ప్రణాళికా సంఘం ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా పరిశీలనలో వుందంటూ ప్రణాళికా సంఘం హడావిడిగా మరో ప్రకటన జారీ చేయడమే దీనికి నిదర్శనం. ఈ విషయలో సఫలం అయితే, కేంద్రాన్ని వొప్పించి, నిబంధనలు మార్పించి,   అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేయగలిగామని తెలుగుదేశం నాయకులు చెప్పుకోవడానికి వీలుకలుగుతుంది. రాజకీయ దక్షతలు ఇలాటి సందర్భాలలోనే బయట పడతాయి. ఈ ప్రతిభ విషయంలో చంద్రబాబు నాయుడికి సాటిరాగల నాయకులు అరుదు.                           
పోతే, తెలంగాణా విషయానికి వస్తే, రైతుల రుణ మాఫీ విషయంలో, ముందు టీ ఆర్ ఎస్ శ్రేణులు అనుభవ రాహిత్యంతో చేసిన ప్రకటనలు పార్టీని కొంత  ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ, టీ.ఆర్.ఎస్.  నేత శ్రీ చంద్రశేఖర రావు సకాలంలో స్పందించి, తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి పరిస్తితిని  అదుపులోకి తీసుకురాగలిగారు. తెలంగాణా అసెంబ్లీలో ఈ అంశంపై ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగంతో  రుణాల మాఫీపై నెలకొన్న అసంగ్దితతను చాలావరకు తొలగించడమే కాకుండా ఒక మేరకు స్పష్టతను ఇవ్వడంలో విజయం సాధించారనే చెప్పాలి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణ మాఫీని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని అసెంబ్లీ  సాక్షిగా భరోసా ఇచ్చారు. అంతేకాదు,  'బంగారం కుదువబెట్టి రైతులు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వమే తీరుస్తుందని స్పష్టం చేశారు.

మరో పక్క, రుణ మాఫీ హామీ అమలు గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక ఆయుధాన్ని అందించినట్టు అయింది. ఆయన అదృష్టం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ లోని రైతాంగంలో ఎలాటి అలజడి, ఆందోళనా చోటుచేసుకోకపోవడం. ఇక్కడ మళ్ళీ ఆయన అనుభవమే బాగా అక్కరకు వచ్చినట్టుంది. టీడీఎల్పీ మొదటి సమావేశం తిరుపతిలో, ప్రమాణ స్వీకారం గుంటూరులో, మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం విశాఖపట్నంలో నిర్వహించడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు. అసలే ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న కొత్త రాష్ట్రం ఇటువంటి అనవసరపు వ్యయాన్ని భరించగలదా అనే విమర్శలు మొగ్గలోనే అణగారిపోయాయి. ప్రజల దృష్టి మళ్ళించడం ద్వారా కొన్ని అంశాల తీవ్రతను తగ్గించడం, కొన్ని అంశాలకు తగిన ప్రాచుర్యం కలిగించడం ద్వారా వాటికి ప్రాధాన్యం కల్పించడం చంద్రబాబుకు వెన్నతోబెట్టిన విద్య. అదే ఆయనకు శ్రీరామ రక్ష. అయితే, మీడియా ప్రభావం అధికంగా వున్న ఈ రోజుల్లో ఈ రక్ష రేకులు అన్ని రోజులూ అక్కరకు వస్తాయని చెప్పడానికి వీలులేదు. ఈ వాస్తవం అందరికంటే ఆయనకే బాగా తెలుసు. మారిన మనిషిని అని రుజువు చేసుకోవడానికి ప్రజలిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని చంద్రబాబు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం. (14-06-2014)
NOTE: Courtesy image owner                       

13, జూన్ 2014, శుక్రవారం

ఎన్నికల హామీలు - ప్రజల సమస్యలు


ఈ ఉదయం (13-06-2014) ఐ న్యూస్ ఛానల్లో చర్చించిన అంశాల్లో ఈ రెండూ వున్నాయి. వీటిల్లో ఓ పోలిక వుంది. ఎప్పటికప్పుడు పెరిగిపోయే గుణం ఈ రెంటికీ వుంది. ఇచ్చిన  హామీలను, ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదే. కానీ ములుకర్ర పట్టుకుని 'వెంటనే తీరుస్తావా లేదా' అంటే కుదరని పని. వాటికి ప్రతిపక్షాలు కొంత వ్యవధానం ఇవ్వాలి. పాలకపక్షాలు కూడా ఈ అవకాశాన్ని సావకాశంగా తీసుకుని కాళ్ళుబారజాపి కూర్చోకూడదు.


(ఐ న్యూస్ స్టూడియో)


పోతే ప్రజల సమస్యలు. అవి ఒక పట్టాన తీరేవి కావని ప్రజలకూ తెలుసూ ప్రభుత్వాలకు తెలుసు. పైగా సమస్యలు అనేవి సాపేక్షం. నా సమస్య నాకు పెద్దదిగా నాకు కనిపిస్తుంది. పక్కవాడి సమస్య యెంత పెద్దదయినా అది నా దృష్టిలో స్వల్పమే. కరెంటు కొరత ప్రభుత్వం సమస్య. కరెంటు కోత ప్రజల సమస్య. కొరతతో  ప్రజలకు సంబంధం లేదు. కోతలతో పాలకులకు వచ్చే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ల ఇళ్ళల్లో, కార్యాలయాల్లో కోతలు లేకుండా చూసుకునే అధికార గణం ఎలాగూ వుంటారు. అంచేత ప్రజల సమస్యల్లో తీవ్రత వారికి తెలియదు. బహుశా పూర్వం రాజులు, మహారాజులు మారు వేషాల్లో దేశ సంచారం చేసేవారు అంటారు ఇందుకేనేమో!
పోతే, మరో చిన్న మాట. ఐ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో యాంఖర్ తో పాటు ఒక్క విశ్లేషకుడు మాత్రమే వుంటారు. కాబట్టి ఓ గంట సేపు మనసులో మాటలు ఎలాటి అడ్డంకులు అంతరాయాలు లేకుండా శ్రోతలతో పంచుకోవచ్చు, వారికి నచ్చకపోయినా సరే! 

10, జూన్ 2014, మంగళవారం

రోశయ్య గారితో కాసేపు


మొన్న శనివారం ఉదయం. సుమారు ఏడుగంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే జ్వాలా రాజ్ భవన్ కు ఫోన్ చేస్తే, తుల్జానంద్ సింగ్ గారు వెంటనే రండి అని చెప్పారు. వెళ్ళగానే అప్పుడే వాకింగ్ నుంచి వస్తూ గవర్నర్ రోశయ్యగారు కనబడ్డారు. అందర్నీ పేరు పేరునా - జ్వాలా, శంకర్, శ్రీనివాసరావు ఎలావున్నారు, ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు వుంటారు అని కుశల ప్రశ్నలు వేసారు. వెంటనే వెళ్ళాలని చెప్పాం. కుర్చీలు తెప్పించి బయట లాన్ లో వేయించారు. రాజ్ భవన్ కదా మర్యాదలు మామూలే. టీ తాగుతూ పిచ్చాపాటీ. ఒకరకంగా గత కాలపు ముచ్చట్లే. పాత కబుర్లు చెబితే రోశయ్యగారే చెప్పాలి. ఆయన ధారణ శక్తి అసాధారణం.


(రోశయ్య గారితో పాటు, జ్వాలా, నేనూ)

పనిలోపనిగా చెన్నై రాజ్ భవన్ ముచ్చట్లు. ఒకప్పుడు అది సుమారు పదమూడువందల ఎకరాల్లో వుండేది. చాలావరకు దట్టమైన అడవి. మేము కూర్చున్న చోటుకు దగ్గర్లో కొన్ని హరిణాలు తచ్చాడుతూ కనిపించాయి. ప్రస్తుత రాజ భవన్ విస్తీర్ణం బాగా కుదించుకు పోయినా, ఇంకా వంద ఎకరాల పైమాటే. రాజ్ భవన్ లో విశాలమైన ప్రాసాదాలు గవర్నర్ నివాసంకోసం వున్నప్పటికీ, రోశయ్య గారు వాటి జోలికి పోకుండా పక్కనే వున్న ఓ చిన్న గెస్ట్ హౌస్ లో మకాం చేస్తున్నారు.
'వుండేది నేనూ నా భార్య ఇద్దరమే. మరీ పెద్ద ఇళ్ళల్లో అయితే ఒకరినొకరం వెతుక్కోవాలి.'
చిన్న భవనంలో వుంటున్నందుకు రోశయ్యగారు ఇచ్చుకునే సంజాయిషీ అది.

(ఫోటో కర్టెసీ, మా చిరకాల మిత్రుడు, గవర్నర్ ఓఎస్డీ, (ఉమ్మడి) ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మాజీ కార్యదర్శి శ్రీ తుల్జానంద్ సింగ్.)

3, జూన్ 2014, మంగళవారం

ఇద్దరు చంద్రులకూ ఒకే చిట్కా - భండారు శ్రీనివాసరావు


ఇటు చంద్రశేఖరరావు గారు అటు చంద్రబాబు నాయుడుగారు - ఇద్దరికీ పనికొచ్చే తాయిలం ఇది.
స్కూళ్ళల్లో చేరే పిల్లల  సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అధవా చేరినా, చేర్చినా -  చదువుకు మధ్యలోనే గంట  వాయించి స్కూళ్ళు వొదిలి వెళ్ళిపోయే వారి సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు. వాటిని అన్వేషిస్తూ ఢిల్లీలో ఒక స్వచ్చంద సంస్థ 'సూదికోసం సోది'  చెప్పించుకుంది. ఆ సోదిలో తేలిందీ తెలియవచ్చిందీ ఏమిటంటే -
"ఢిల్లీలోని మురికివాడల్లో నివసించేవారికి అనేక ఇబ్బందులు. అందులో ఒకటి విద్యుచ్చక్తి లేకపోవడం. వున్నా నామమాత్రంగా -  'గుడ్డికన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే' అన్న తీరులో వుండడం. ఈ కారణం వల్ల ఆ వాడల్లో వుండే పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారు. అంతే సరిగా హోం వర్క్ చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా బాగా మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు. దీనికంటే చదువు మానేయడమే మంచిదనే తీర్మానానికి వస్తున్నారు (ట).
ఈ విషయం అర్ధం చేసుకున్న 'సలాం బాలక్ ట్రస్ట్' అనే ఒక స్వచ్చంద సంస్థ ఒక అడుగు ముందుకేసి  పరిష్కారం దిశగా ఆలోచించింది. మరో సంస్థతో కలిసి సోలార్ పానెల్స్, ఎల్.ఈ.డీ. లైట్లు వున్న స్కూల్ బ్యాగ్ తయారుచేసింది. పగటివేళ పిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడు ఈ సంచీని వీపుకు తగిలించుకుని వెడతారు. సూర్యరశ్మికి  ఈ సోలార్ బ్యాగ్ చార్జ్ అవుతుంది.  రాత్రివేళ కరెంటు లేకపోయినా కూడా ఈ బ్యాగ్ కు అమర్చిన లైట్ల సాయంతో పిల్లలు చదువుకోవచ్చు.
కాబట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటీ అంటే-
ఉపాయం  లేనివాడిని వూరినుంచి తరిమెయ్యమంటారే -  అదిగో ఆ సామెతలో ఎంతో అర్ధం వుందని.

రాలిన సంగీత నక్షత్రం ప్రపంచం సీతారాం


(ఈనాటి - 04-06-2014 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
సంగీతానికి చావు లేదు. అయితే, అజరామరమైన సంగీతాన్ని జనాలకు వొదిలి సంగీత కారులు మాత్రం  అమరులుగా మిగిలిపోతుంటారు. అలాంటి సంగీత నక్షత్రం ఒకటి అమెరికాలో ని అట్లాంటాలో మొన్న ఆదివారం నాడు రాలిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం ఇక లేడన్నవార్తను  మీడియా కాస్త ఆలశ్యంగా మోసుకొచ్చింది.  అంతటి సంగీతకారుడు పనిచేసిన రెడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క  కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల  ఏ యోగ్యతా నాకులేదని, ఆ ఒక్కటే  ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌఖరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఈ రచనకు దోహదం చేసింది.


ప్రపంచం సీతారాం స్వయం ప్రతిభ కలిగిన వ్యక్తి. స్వయం శక్తితో పైకి వచ్చారు. చేతిలో ఇమిడిపోయే వేణువును ఒక పరికరంగా  తీసుకుని జీవితాన్ని తీర్చి దిద్దుకున్నారు. సరయిన వయస్సులో తగిన విద్యార్హతలు సంపాదించుకోలేకపోయినా తదనంతర  కాలంలో పట్టుదలతో శ్రమించి అనేక విశ్వవిద్యాలయాల డిగ్రీలు తన ఖాతాలో వేసుకున్నారు. జీవిక కోసం ఒకప్పుడు ఢిల్లీ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లూట్ కచ్చేరీలు చేసేవారు. ఆ పిదప యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా ఎంపికై రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా చేరి, ఢిల్లీ రేడియో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి.                                    
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం),  బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహన రావు, ఎల్లా వెంకటేశ్వరరావు  (మృదంగం) ప్రపంచం సీతారాం,  ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ).   మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకువున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం,  హైదరాబాదు కేంద్రం  నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే,  అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.  కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూవచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉపాధి అనుకున్నారు కాని ఉద్యోగం కాదనుకుని వచ్చి ,  పరిస్తితులతో రాజీపడలేని కొందరు రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో మొన్న అట్లాంటాలో కన్నుమూసిన ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపెరుకాదనీ, ఎప్పుడో దశాబ్దాలక్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.   

రేడియోలో చాలాకాలం అదీ బెజవాడ రేడియోలో ఎక్కువకాలం న్యూస్ ఎడిటర్ గా  పనిచేసిన నా సీనియర్ సహచరులు  ఆర్ వీ వీ కృష్ణారావు గారికి , సీతారాం గారి  మరణ వార్త గురించి చెప్పగానే ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. నిబంధనల  పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి ఒక అనుభవాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు.
ఇది జరిగి కూడా పాతిక ముప్పయ్యేళ్ళు అవుతుందేమో.  మంగళగిరి,  నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకువెళ్లారు. అదేసమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారస పడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై. ప్రమోషన్ మీద  బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీత కారుడు.  కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేదికాదు. పైగా అలాటి వారికి  మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.
జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో,  ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల తరువాత రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధానపరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఫ్లూటు వాయిద్యంలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రపంచం సీతారాం గారు ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని శాండియాగోలో వుంటున్న తన కుమారుడు ప్రసన్నను చూడడానికి  వెళ్ళి, గత ఆదివారం నాడు ఈ ప్రపంచాన్ని శాశ్వితంగా విడిచివెళ్ళారు.
తన సంగీత జ్ఞానంతో తెలుగు  సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, దేశం ఎల్లలు  దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయి దేశంలో మరణించడం విధి విచిత్రం. (03-05-2014)



సాకారమైన కల


నేటి సాక్షి దినపత్రిక (03-06-2014) ఎడిట్ పేజీలో ప్రచురితం

    
మన  రాష్ట్రానికి సంబంధించిన  ఒక ప్రధానమైన ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూసలుపుతూ వచ్చిన ఒక సమస్యకు'ముగింపుదొరికింది. పడింది 'శుభంకార్డామరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం.  దాన్ని కాలమే తేలుస్తుంది.
ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం  కూడా తగదు.
ఎవరు అవునన్నా   ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణా స్వప్నం సాకారం అయింది.  ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్ధాల్లో, క్రీడల్లో  మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదుఆటా కాదు.ఉభయప్రాంతాల జనంలో వున్న ఆకాంక్షకు చక్కని  అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఇకనుంచయినా సరేరెండు ప్రాంతాల ప్రజలు  రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ  ప్రాంతాల సత్వర  అభివృద్ధిలో  స్వయంగా భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు ఎరుకపరచాలి.
నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హింసాత్మక ఘటనలు తక్కువే కావచ్చు. 1969 నాటితో పోలిస్తే  మొత్తం మీద ఉద్యమం శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం తపనపడి , ప్రత్యేక రాష్ట్రం  ఇక తీరని కలేమో అని అపోహపడి, ఆ నిర్వేదంలో  అనేక మంది యువకులు చేసిన  బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ రాజకీయులు తమ స్వార్ధం కోసం రగిల్చిన  సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్నపిల్లల  తలిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే షరాబులు దొరకరు. అంచేత అలాటివారికి  స్వాంతన కలిగించడం తెలంగాణా నాయకుల ప్రధమ కర్తవ్యం.
ప్రజల మనసులకు తగిలిన  గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా చేసి  వ్రణాలుగా తయారు చేయకపోతే  అదే పది వేలు.
రైలు ప్రయాణంలో కలిసిన ప్రయాణీకులే విడిపోయేటప్పుడు ఎంతో బాధ పడతారు. అలాటిది దాదాపు అరవై ఏళ్ళక్రితం కలిసిపోయి, ఇన్నేళ్ళుగా కలిసి మెలిసి వుండి విడిపోయే తరుణంలో బాధపడని వారు వుండరు. విడిపోవడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు చేసుకుని వాటిని పదిలపరచుకోవడం, మరింత పెంచుకోవడం విజ్ఞుల లక్షణం.
మరో వారం తిరగగానే  తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణా పది జిల్లాలు పోను మిగిలిన పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకోబోతోంది.  వేరే వెతుక్కోకుండా తెలంగాణాకు,  వడ్డించిన విస్తరి మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధానీ నగరం వుంది. అటుపక్క ఆంధ్ర ప్రదేశ్ లో  మాత్రం అన్నీ మొదటి నుంచీ మొదలు పెట్టాలి. బుడి బుడి అడుగులతో నడక ప్రారంభించాలి. అదీ వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం కారణంగా అభివృద్ధి యావత్తూ హైదరాబాద్, దాని చుట్టుపక్కల మాత్రమే కేంద్రీకృతం అయింది. అంతర్జాతీయ స్థాయి కలిగిన విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య,  వైద్యాలయాలు అన్నీ కట్టగట్టుకుని ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం, వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధుల కోసం రాష్ట్రం నలుమూలలనుంచి హైదరాబాదు రావడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు కొన్నేళ్ళ పాటు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతంలో ఈ సౌకర్యాలు ఓ మోస్తరు స్థాయిలోనే అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంతంలో కొలువు తీరబోతున్న నూతన  ప్రభుత్వ వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే.          


అభివృద్ధి  బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే వారి కోర్టులో వుంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. వున్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేండ్ల పుణ్యకాలం ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి, లేనిపోని  గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో అనుదినం  పొద్దుపుచ్చకుండా, ప్రజలకు  ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ,  సత్వర కార్యాచరణకు నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించడం అంత సులభం కాదు కొత్త రాష్ట్రాలను సుసంపన్నంగా తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, గరిష్ట నిష్టతో  నిర్వహించ గలిగితేనే రాష్ట్ర విభజన వల్ల సానుకూల ఫలితాలు రెండు ప్రాంతాలకు సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు మిగిలిపోతాయి.(02-06-2014)