15, మే 2014, గురువారం

ముందు కుక్క సంగతి చూద్దాం.


(కొల్లూరు సురేష్ బాబు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)


ఏకాంబరం : " ఉదయం నుంచీ నా భార్య కనిపించడం లేదు"
ఇనస్పెక్టర్ : కొన్ని గుర్తులు చెప్పండి. ఆవిడ యెంత హైట్ వుంటారు?
ఏకాంబరం : "నేనెప్పుడు గమనించలేదు"
ఇనస్పెక్టర్ : "పోనీ లావా సన్నమా యెలా  వుంటారు/"
ఏకాంబరం : "అంత సన్నమేం కాదు, కొద్దిగా బొద్దుగా వుండొచ్చు"
ఇనస్పెక్టర్ :  "కళ్ళ రంగు?"
ఏకాంబరం :  "అంత శ్రద్ధగా ఎప్పుడూ గమనించలేదు"
ఇనస్పెక్టర్ :  "చివరి సారి చూసినప్పుడు ఏ దుస్తులతో వున్నారు, చీరె కట్టుకున్నారా, చుడీదారా?"
ఏకాంబరం : నైట్ డ్రెస్? నో నో ఇనస్పెక్టర్! సరిగా గుర్తుకు రావడం లేదు"
ఇనస్పెక్టర్ : పోనీ ఆవిడ వెంట ఎవరైనా వెళ్ళారా?
ఏకాంబరం : ఎప్పుడూ మా కుక్క రోమియో మా ఆవిడ వెంటే వుంటుంది. దాన్నే వెంటేసుకుని వెళ్ళి వుంటుంది. మా రోమియో అంటే గుర్తుకు వస్తోంది ఇనస్పెక్టర్ . దాని అందం దానిదే. తెల్లగా బొద్దుగా వుంటుంది. నిగనిగ లాడే జుట్టు. తేనె కళ్ళు. ఏడాది వయసు నిండలేదు కానీ ఇదిగో నా మోకాళ్ళ ఎత్తు పెరిగింది. గోళ్ళు వొంపు తిరిగి వుంటాయి. మాంసం లేకపోతే ముద్ద ముట్టదు అంటే నమ్మండి. ఎంతో ముచ్చటపడి బంగారు తాపడంతో గొలుసు కూడా  చేయించాము. అది కనబడకపోతే ఎలాగో వుంది ఇనస్పెక్టర్"

ఇనస్పెక్టర్ : ఓహో ! అలాగా! అయితే మేమిప్పుడు వెతకాల్సింది మీ కుక్కను."     
NOTE: Image Courtesy Cartoonist)

రెండు గుండెల చప్పుడు


'లబ్ డబ్ .....లబ్ డబ్ ......'


"ముందొచ్చిన మునిసిపాలిటీలు, తరువాతొచ్చిన జడ్పీటీసీల ఫలితాల నేపధ్యంలో రేపు వస్తున్న   ఫైనల్  రిజల్ట్స్...అధికారం అందినట్టే అనిపించి అందకుండా పోతుందేమో.....లబ్ డబ్...లబ్ డబ్...."

"మునిసిపాలిటీలు సరే.. జడ్పీటీసీలు సరే....ఇవన్నీ వచ్చి అసలు అధికారం అందకపోతే...లబ్ డబ్....లబ్ డబ్ ...".

14, మే 2014, బుధవారం

సర్వేల మంటలు

రాష్ట్రం మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి స్టవ్ వెలిగించినట్టు వుంది. ఆ వేడిని మరింత పెంచుతున్నాయి ఎన్నికల సర్వేలు.


ప్రార్ధన చేసే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న - సత్య సాయిబాబా



ఎప్పుడయినా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనిపిస్తే అందుకు  తగిన మార్గం ఒకటుంది. అదేమిటంటే అవసరంలో వున్నవాళ్ళకి సాయం చేయడమే. చాలామంది సాయం అర్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటూ వుంటారు. వారిలో కొందరికి సాయం చేయడానికి ఆ దేవుడు మిమ్మల్ని  ఎంపిక చేసుకుని వుంటాడనుకోవాలి. మనకు ఏదయినా పదవి వచ్చినా, ఉద్యోగంలో  పెద్ద  హోదా దొరికినా,  సంపదలు లభించినా  అవసరంలో వున్న వారికి సాయపడడానికే అన్న ఎరుక పెంచుకోవాలి.

అలనాటి ఆంధ్రపత్రిక మళ్ళీ కంటపడింది.


యెంత సంతోషం అనిపించిందో.


పక్కన స్టూడియో వన్ టీవీ ఛానల్లో 'నేనంటే నేను' పాత బ్లాక్ అండ్ వైట్ సినిమావస్తోంది. హీరో కృష్ణ, హీరోగా మారిన నాటి విలన్ కృష్ణంరాజు, చిదిమితే పాలుగారే వయస్సులో చంద్రమోహన్, నవ్వించే విలన్ నాగభూషణం, అందాల తార కాంచన, ఇక వస్తాదు నెల్లూరు కాంతారావు సరేసరి. కధలో భాగంగా చంద్ర మోహన్ చేతిలో ఆంధ్ర పత్రిక కనిపిస్తుంది. కాసేపే అయినా, అది చూడగానే  అలనాటి ఆంధ్ర పత్రిక వైభోగం కనులముందు కదలాడింది. ఆ పత్రిక్కి సంబంధించిన అనేక జ్ఞాపకాలు మదిలో సుడి తిరిగాయి. గొప్ప చరిత్ర కలిగిన ఆ గొప్ప పత్రిక చివరకు చరిత్రలో కలిసిపోయింది.

12, మే 2014, సోమవారం

కారాలే కారాలు

టీవీల్లో కారాలు మిరియాలు
ఇంట్లో కొత్తావకాయ కారాలు



ఈసారి సుస్తీ చేసి కోలుకుంటున్న మా ఆవిడకు సాయంగా మా వొదినె గారు విమలాదేవి, మేనకోడలు వనం విజయలక్ష్మి - ఓహ్! ఒక్క రోజు కష్టానికి ఏడాది పాటు హాయిగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. కానీ ఆడవారి కష్టానికి ఖరీదు కట్టే షరాబు ఏడీ! 

విజేతలకు అభినందనలు.

గతం నిజం, వర్తమానం వాస్తవం. భవిష్యత్తు వూహ.
ఇలా జరిగింది నిజం. ఇలాజరుగుతోంది వాస్తవం. ఇలా జరుగుతుంది వూహ.
మునిసిపల్  ఎన్నికల్లో తెలుగుదేశం విజయం వాస్తవం. ఈ నిజాన్ని అంగీకరించి తీరాలి.
'ఇలా జరిగింది కాబట్టి ఇలానే జరుగుతుంది, ఇలా జరిగే వీలే లేదు' ఈ వాదనలన్నీ వూహాజనితాలు.
ఒక్కొక్కటిగా ప్రజాతీర్పు బయటకు వస్తుంది. వచ్చిన తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. మన ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా అన్నీ జరగాలని అనుకోవడం అత్యాశే అవుతుంది.
ఎన్నికల్లో విజేతలకు అభినందనలు.