“2014 లో ‘యుగాంతం’ కాబోతోందని గతంలో మేము ప్రసారం చేశాము. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల యుగాంతం 3014 సంవత్సరానికి వాయిదా పడిందని తెలపడానికి విచారిస్తున్నాము. అంతవరకూ చూస్తూ వుండండి టీవీ సూపర్ ఫైన్.”
28, మార్చి 2014, శుక్రవారం
టీవీ సూపర్ ఫైన్ ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక
“2014 లో ‘యుగాంతం’ కాబోతోందని గతంలో మేము ప్రసారం చేశాము. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల యుగాంతం 3014 సంవత్సరానికి వాయిదా పడిందని తెలపడానికి విచారిస్తున్నాము. అంతవరకూ చూస్తూ వుండండి టీవీ సూపర్ ఫైన్.”
27, మార్చి 2014, గురువారం
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"
sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై ఒక
కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే,
మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు
ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే
అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ
ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి
ముందు కృతజ్ఞతలు.
ఒక చానలు కు అమ్ముడు
పోయారా అన్నది వారి సందేహం. ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు
పొద్దున్నే పోతున్నాను అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను
వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ
ఈ పాఠకుడు తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు.
ప్రతివారం నా షెడ్యూలు
ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి
ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని
న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఎనిమిది వరకు - హెచ్ ఎం టీ వీ, బుధవారం ఉదయం
ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ, గురువారం ఉదయం ఏడు గంటలనుంచి అటూ ఇటూగా
ఎనిమిది వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడు గంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్
ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్
కు (సాధారణంగా 10 టీవీ), ఆదివారం ఉదయం ఏడునుంచి ఏడు నలభై అయిదు వరకు - V 6 ఛానల్. ఇవికాక మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సందర్భాన్నిబట్టి చర్చాకార్యక్రమాలు వుంటాయి. గత
రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు
పిలుస్తున్నా, పాత చానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు
పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. నా అవసరాలను బట్టి
నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత
మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన
జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం
నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి
కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"
26, మార్చి 2014, బుధవారం
పాత కాగితాల్లో దొరికిన పాత గేయాలు
(ఓ వయసులో ఈ రాతలు రాయని మనసూ వుండదు-మనిషీ వుండడు - నేనూ మినహాయింపు కాదు. కాకపొతే - ముప్పయి , నలభై ఏళ్ళ తరవాత చదువుతూ వుంటే - రాసింది నేనేనా అనిపిస్తోంది. కాలమహిమ కాబోలు. ఏ వొక్క మహిళ అభ్యంతరం చెప్పినా వీటిని నిరభ్యంతరంగా తొలగిస్తా అని హామీ ఇస్తున్నాను. - రచయిత )
రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే
కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది
నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని తాకినట్టువుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని ముద్దాడినట్టువుంటుంది
నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే
నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
అస్తమానం నిన్ను అంటిపెట్టుకునే వున్నానుగా
రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను
నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వెడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా
గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా
ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?
నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు
నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు
నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి
షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?
నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను
కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే
ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్తపోతున్నాము.
(చలం రాతలు పిచ్చిగా చదివి)
లేబుళ్లు:
పాత కాగితాల్లో దొరికిన పాత గేయాలు
25, మార్చి 2014, మంగళవారం
నీదా నాదా పైచేయి
రష్యన్లు హాస్య ప్రియులని ప్రతీతి. తమమీద తామే జోక్ వేసుకుని ఆనందించగల సంస్కారం వారిలో పుష్కలంగా వుంది.
గోర్భచెవ్ ఇచ్చిన వాక్స్వాతంత్ర్యం పుణ్యమా అని ఈ హాస్య ప్రియత్వం మరింత వెలుగులోకి వచ్చింది. అలా వారిలో వారు చెప్పుకునే కొన్ని జోకులను శౌనకాదిమునుల్లో ఒకరు విని సూతునికి చెప్పగా తెలియవచ్చిన ఒక జోకు కధాక్రమంబెట్టిదనిన:
సోవియట్ చరిత్రలో నికితా కృశ్చేవ్ ది ఒక ప్రత్యేక స్తానం. ఆయన ఒకసారి ప్రత్యేక విమానంలో అధికారిక పర్యటనపై అమెరికా బయలుదేరారు. ఆ రోజుల్లో అమెరికా గూఢచారి సంస్త ‘సీఐయే’, సోవియట్ గూఢచారి సంస్త ‘కేజీబీ’ – ఈ రెండింటి నడుమ ‘నీదా నాదా పై చేయి’ అనే రీతిలో అభిజాత్య ప్రదర్శన జరిగేది. ప్రతివిషయంలో ఏదోవిధంగా తమ ఆధిక్యతను చూపే అవకాశాన్ని దొరకబుచ్చుకోవడానికి ఈ రెండు సంస్తల అధికారులు అనుక్షణం శ్రమిస్తూ వుండేవారు.
ఆ రోజు కృశ్చేవ్ ప్రయాణిస్తున్న విమానం మరికొద్ది గంటల్లో వాషింగ్టన్ చేరుకోబోతున్నదనగా కేజీబీ అధికారి ఒకరు తనకు తెలియవచ్చిన సమాచారాన్ని సోవియట్ అధినాయకుడి చెవిలో వేశారు.
అంతకు కొన్ని గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో పనిచేసుకుంటూ తూలిపోయి ఓ పక్కకు వొరిగిపోయారట. ఆ వైనాన్ని క్షణం ఆలశ్యం చేయకుండా రష్యన్ టెలివిజన్లో ప్రసారం చేసిన సంగతి అది. అది విన్న కృశ్చేవ్ అమందానందకందాళభరితుడై, తన గూఢచారి విభాగం పనిచేస్తున్న విధానానికి హర్షం తెలియచేసారట. వారికి అభినందనలు అందచేసి ఆ పిమ్మట బాతు రూముకుపోయి లఘుశంక తీర్చుకుని వస్తూ వోడ్కా మత్తులో ఆయన తన ప్యాంటు బొత్తాములు పెట్టుకోవడం మరచిన విషయాన్ని అదేసమయంలో వాయిస్ ఆఫ్ అమెరికా ప్రసారం చేస్తోంది.(ట)
లేబుళ్లు:
నీదా నాదా పైచేయి
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు .......
లేబుళ్లు:
Malasia Airlines
ఐడియా
ఐడియా
అమెరికన్లు సరదాగా చెప్పుకునే ఓ కధ ఇంటర్నెట్ లో
దర్శనం ఇచ్చింది. దాన్ని తెలుగులో చెక్కితే .....
(ఇదో గొప్ప ఐడియా - రెండింటిని ఒకటిగా చూపడం)
'అనగనగా ఓ అమెరికన్ వూళ్ళో ఓ వృద్ధుడు నివసిస్తూ
వుండేవాడు. అతడి ఒక్కగానొక్క కొడుకు దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కి
జైలుపాలయ్యాడు. ఆ మనాదితో భార్య మంచానపడి కన్ను మూసింది. వృద్ధుడికి పెద్దతనం
మరింత ముసురుకు వచ్చింది. జైల్లో వున్న కొడుక్కు ఉత్తరం రాసాడు.
'నాయనా. అమ్మ పోయినదగ్గర నుంచి నాకేమీ చేతకాకుండా
పోతోంది. వున్న ఎకరం (?) బంగాళా దుంపల తోట దున్ని పంట వేయడం నాకు అలివి కావడం
లేదు. నువ్వా జైల్లో వున్నావు. ఏం చెయ్యాలో తోచడం లేదు' అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
కొడుకు నుంచి తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.
'నాన్నా . ఆ తోట జోలికి వెళ్ళకు. నేను దొంగతనంగా
ఎత్తుకొచ్చిన తుపాకులను మన తోటలోనే పాతిపెట్టాను. నేను వచ్చిన తరువాత దాని సంగతి
చూసుకుందాం.'
ఆ ఉత్తరం వచ్చిన మర్నాడే బిలబిలమంటూ పోలీసు పటాలం
దిగింది. ఆ వృద్దుడిని వెంటబెట్టుకుని తోటకు వెళ్లారు. అతడు కళ్ళప్పగించి
చూస్తుండగానే మొత్తం ఆ తోటనంతా గడ్డపారలు తీసుకుని కుళ్లబొడిచారు. సెంటు జాగా వొదలకుండా
తవ్వేశారు. అక్కడ తుపాకులు గట్రా ఏమీ దొరకకపోవడంతో వెనక్కు మళ్ళారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు తోటను సాగుకు అనువుగా
చేసిపోయారు.
ఇంతకీ జరిగినదేమిటంటే ..తండ్రి
రాసిన ఉత్తరం కొడుక్కు బాధ కలిగించింది. తానా జైల్లో వున్నాడు. వెళ్ళి తండ్రికి
సాయం చేసె వీలు లేదు. కానీ మనసుంటే మార్గం
వుంటుంది. ఆ క్రమంలో ఆ జైలుపక్షికి ఒక 'ఐడియా'
తట్టింది. తుపాకులు, దొంగతనం అంటూ తండ్రికి ఉత్తరం రాసాడు. అతడు వూహించినట్టే దాన్ని పోలీసులు పొల్లుపోకుండా చదివారు. తోటలో
దాచిన తుపాకులను స్వాధీనం చేసుకోవాలని వెళ్లారు. తోటనంతా తవ్విపోసారు. ఏమైతేనేం చేతకాని తండ్రికి
చేతనైన సాయం చేయగలిగాడు. NOTE: Courtesy image owner
24, మార్చి 2014, సోమవారం
రేడియో జోకులు
నిజంగా రేడియోలో వచ్చిన జోకులే. పీ ఎస్. గోపాల కృష్ణ గారు, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం పూర్వ సంచాలకులు, లాంగ్ లాంగ్ ఎగో, సో
లాంగ్ ఎగో, నో బడీ కెన్ సె హౌ లాంగ్ ఎగో, సంచాలకులు కాకపూర్వమే రేడియోలో
'నవ్వకండి' అనే కార్యక్రమం చేస్తుండేవారు. నేనో జోకు చెప్పనా అనే తరహాలో కాకుండా
జోకు చెప్పి నవ్వించే జోకులు
చెబుతుండేవారు, అందులో ఒకటి.
"రేడియో ఏం రిపేరు చేసినట్టయ్యా! ఇంకా అన్నీ
చెత్త ప్రోగ్రాములే వస్తున్నాయి" అందొకావిడ రిపేరీ చేసిన ఆసామితో.
నవ్వుకు నా పూచీ ఏం లేదు.
అల్లాగే ఇంకోటి.
"పదేపదే పార్టీలు
మారుతున్నాను అని నేనంటే గిట్టనివారు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇందులో
వాస్తవం ఎంతమాత్రం లేదు. కావాలంటే నా గత చరిత్ర ఒకసారి తిరగేయండి. నేను ఎప్పుడూ
ఏదో ఒక అధికారపక్షంలోనే వుంటున్న సంగతి బోధపడుతుంది."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

