4, మార్చి 2014, మంగళవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 11

పిలవకుండానే పలికే డాక్టర్లు.

ఉదయం పది గంటలు దాటుతోంది. పిల్లలు స్కూలుకు వెళ్ళారు. మా ఆవిడతో కలసి హిందీ రామాయణం కొత్త ఎపిసోడు కాసెట్ చూస్తున్నాము. ఇంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తె నలుగురయిదుగురు రష్యన్లు. 'దోం  సెం దేసిత్  జేవిచ్ పజాలుస్తా' అందులో ఒకతను అంటున్నాడు. పజాలుస్తా (ఇంగ్లీష్ లో ప్లీజ్ ) అన్న పదం తప్ప ఏమీ అర్ధం కాలేదు. తొంగి చూస్తె వారి వెనుక ఒక చక్రాల కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం కేజీబీ వాళ్ళేమోనన్న అనుమానం మనసులో మెదిలింది. వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేసాను. కూర్చోమన్న నా అభ్యర్ధనను పట్టించుకోకుండా ఇంట్లో ఇంకా ఎవరయినా వున్నారా అన్నట్టుగా కలయచూస్తున్నారు. సమయానికి పిల్లలు కూడా లేకపోవడంతో- మా ఆవిడ పై అంతస్తులో వుండే జస్వంత్ సింగ్ భార్యను పిలుచుకుని వచ్చింది. ఆ కుటుంబం చాలా ఏళ్ళుగా మాస్కోలో వుంటున్నారు కాబట్టి రష్యన్ బాగా వచ్చు. ఆవిడ వాళ్ళతో మాట్లాడి హిందీలో మళ్ళీ మాకు చెప్పినదాన్నిబట్టి అర్ధం అయింది ఏమిటంటే - ఆ వచ్చిన వాళ్ళు డాక్టర్లు. మా ఇంట్లో ఎవరికో బాగా లేదని వారికి సమాచారం అందిందిట. అంతే! రయ్యిమని వచ్చేసారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే కొంత ఆలస్యంగానే అయినా బుర్రలో లైటు వెలిగింది. అంతకు కొద్ది సేపటిక్రితం రేడియోకు ఫోన్ చేసి గీర్మన్ తో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. ఆఫీసు కు పోవడానికి బద్ధకం వేసి 'జలుబుగా వుంది, ఈ రోజు రాలేనని' చెప్పాను. బహుశా అతను ఈ విషయం సంబంధిత అధికారులకు చేరవేసివుంటాడని జస్వంత్ సింగ్ గారి భార్య మాకు టీకా తాత్పర్యం చెప్పింది.


రష్యన్ డాక్టర్లతో పిచ్చాపా'టీ'

మాస్కోలో అంబులెన్సులు రాత్రింబగళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఏ ఇంటి నుంచి సమాచారం అందిందో - ఆ ఇంటికి దగ్గరలో తిరుగాడుతున్న అంబులెన్సుకు వైర్ లెస్ లో వివరాలు తెలియచేస్తారు. నిమిషాల వ్యవధిలో వారు అక్కడికి చేరుకొని వైద్య సహాయం అందిస్తారు. మొత్తానికి ఉత్తుత్తి జలుబు పుణ్యమా అని మాస్కో జీవితంలోని మరో మంచి కోణం తెలుసుకోగలిగాము. వచ్చిన డాక్టర్ల బృందానికి ఏ భాషలో క్షమాపణలు చెప్పామో గుర్తులేదు కానీ ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి మేము ఎన్నుకున్న ఎత్తుగడను అర్ధం చేసుకుని నవ్వుకుంటూ వాళ్ళు  వెళ్ళిపోవడం మాత్రం ఇంకా కళ్లల్లో మెదులుతున్నట్టేవుంది.
పోతే, పనిలో పనిగా జస్వంత్ సింగ్ గారి భార్య అంబులెన్సు సర్వీసు గురించి మరి కొన్ని సంగతులు మా చెవిన వేసి వెళ్ళింది. మైనస్ ముప్పయి, నలభయి డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఆ నగరంలో వోడ్కా అనేది అక్కడి జనాలకు ఒక నిత్యావసర వస్తువులాంటిది. వొళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి వోడ్కా పుచ్చుకునే వారు కోకొల్లలు. ఈ విషయంలో కూడా అక్కడ మహిళలలదే పైచేయి.


మాస్కోలో 'దేవదాసులు'

 తాగి తాగి ఆ తాగిన మత్తులో మంచులో తూలి పడిపోయి ఇంటికి చేరలేని   డోసు బాబులను అంబులెన్సు బృందాలు  వెతికిపట్టుకుని ఆసుపత్రులకు చేరవేస్తుంటాయట. వారివద్దవుండే ప్రోపుస్కా (ఫోటో గుర్తింపు కార్డు) ఆధారంగా వారి ఇళ్ళకూ, ఆఫీసులకూ సమాచారాన్ని అందిస్తాయిట.  అంతే కాదు , ఆసుపత్రుల్లో అలా చేరిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడమనేది కొసమెరుపు.
 
(మాస్కో  గురించి మరో మంచి ముచ్చట మరో సారి )

3, మార్చి 2014, సోమవారం

జంబూ ద్వీపం వూహాచిత్రం



జంబూద్వీపం చిత్రం వూహాజనితమైనా బాగుంది. పసిఫిక్ మహాసముద్రానికి శాంతి సముద్రం అని పేరు. దానికి ఇందులో ఇచ్చిన నామం 'ప్రశాంతోదధి' అలాగే, అట్లాంటిక్ మహాసముద్రానికి 'అతులాంతకోదధి', ఆర్కిటిక్ సముద్రానికి 'ఆర్కోదధి',  అమెరికాకు 'పాతాళదేశం(నాగ దేశం), ఆసియాకు 'హరివర్షపం','ఆర్యఖండం', ఆస్ట్రేలియాకు 'అస్త్రాలయ' - ఇలా బహు రసవత్తరమైన పేర్లు పెట్టారు.



(పలివెల భార్గవ రామ్ సౌజన్యంతో)



 
      

పాతికేళ్ళనాటి మాస్కో - 10


వృద్ధులు - కురు వృద్ధులు
సోవియట్ యూనియన్ జనాభా తక్కువే కానీ వృద్ధుల సంఖ్య ఎక్కువే.
రేపెలా గడుస్తుంది అన్న బెంగ లేకపోవడం, చవుకగా లభించే పౌష్టికాహారం, శుభ్రమయిన గాలీ నీరూ ఇవన్నీ సోవియట్ పౌరుల ఆయు ప్రమాణాలను గణనీయంగా పెంచడానికి దోహదం చేసి వుంటాయనుకోవచ్చు. ప్రతివారికీ పని చూపించే బాధ్యత ప్రభుత్వంపై వుండడం, పిల్లలను కనడమే కానీ చదువు సంధ్యలు చూడాల్సిన అవసరం లేకపోవడం వీటన్నిటి వల్లా ఆరోగ్యం తొణికిసలాడే వృద్దులే ఎక్కువగా కానవస్తారు. ఎనభయి దాటిన స్త్రీలు కూడా గోళ్ళు గిల్లుకుంటూ ఇంటి పట్టున వుండరు. పూలూ పళ్ళు అమ్ముకుంటూ కనబడతారు. ఆత్మాభిమానానికీ, ఆత్మ స్తయిర్యానికీ ప్రతీకలుగా నిలబడతారు.


(టాక్సీలో స్కూలుకు వెడుతున్న సందీప్)

సామాన్యుల స్వర్గం
పౌర సదుపాయాలను అన్నిటినీ సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. చలి దేశం కాబట్టి - నిత్యావసరాల కోసం ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేకుండా నివాస భవనాలకు దగ్గరలోనే షాపులు ఉండేవి. పాలు,వెన్న, కోడిగుడ్లు అమ్మే దుకాణాలను 'ప్రోదుక్తి' అని పిలిచేవారు. అలాగే స్కూళ్ళు, దేస్కిసాద్లు (చైల్డ్ కేర్ సెంటర్లు ) సలూన్లు, పిల్లల ఆసుపత్రులు అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉండేట్టు చూసారు.
(పిలవకుండానే పలికే డాక్టర్ల గురించి మరోసారి)


2, మార్చి 2014, ఆదివారం

తెలంగాణా ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ (తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు) గురించి కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్


పాతికేళ్ళనాటి మాస్కో - 9


 దేశంలో పిల్లలే ప్రత్యేకం అనుకుంటే - వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యేక ఆసుపత్రులు,ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక ఆహారం, ప్రత్యేక దుస్తుల దుకాణాలు, ప్రత్యేక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గవున్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు, దువ్వెనలు, బ్యాటరీతో పనిచేసే బుల్లి బుల్లి హెయిర్ డ్రయర్లు మొదలయినవన్నీ అమ్మే ప్రత్యేక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈత కొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు, మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు, పడక గదులు - అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం - మరికొన్నింటి ధరలు నామమాత్రం.


(మాస్కోలో ఇండియన్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ్)

మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదానుఉద్యోగాన్ని బట్టి కాకుండా వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు ఉండడంవల్ల మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.
మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండేవాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.

పలికించెడి వాడు .....


అనుదిన జనాభిప్రాయం
"..........అన్న జగన్ మోహన రెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తారా?....'అవును'- 87 శాతం, 'కాదు' - 13 శాతం"
"..........అన్న చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవిస్తారా? .......'అవును - 87 శాతం , 'కాదు' - 13 శాతం"
"..........అన్న కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తారా?...'అవును' - 87 శాతం, 'కాదు' - 13 శాతం"
"..........అన్న కేసీయార్ అభిప్రాయంతో ఏకీభవిస్తారా?.........'అవును' - 87 శాతం, 'కాదు' - 13  శాతం"    
(ఏ గూటి 'టీవీ' ఆ గూటి పలుకే పలుకుతుంది)

ఆరు నెలల క్రితం చెప్పిందే ఇప్పుడు చెబుతున్నాను.



విభజన – విచికిత్స (As published in today’s , 27-08-2013, Andhra Jyothy, Edit Page) – భండారు శ్రీనివాసరావు




“రాష్ట్ర విభజన అనివార్యం. ఆ నిర్ణయంలో మార్పువుండదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అది మినహా వేరే ఏవైనా విషయాలుంటే చెప్పండి. అవి కూడా ఆంటోనీ కమిటీలో ” అని కాంగ్రెస్ అధినాయకత్వం తమను కలుసుకుని తమ గోడు వెళ్ళబోసుకోవాలని వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోందని భోగట్టా.
ఈ నేపధ్యంలో అంశాలను సమీక్షించుకుంటే కొన్ని విషయాలు బోధపడతాయి. నిర్ణయం అమలుచేసే వ్యవధానం, ఎన్నికలు ముంగిట్లో వున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వుందా అన్న అనుమానాలు పక్కకి పెట్టిచూస్తే, కాసేపు ఆ పార్టీ చిత్తశుద్ధి పట్ల వున్న సందేహాలను కూడా పక్కకి నెట్టి చూస్తే, కనబడే రాజకీయ చిత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
విభజన నిర్ణయం తిరుగులేనిదని అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ కమిటీల మీద కమిటీలు వేస్తూ పోవడాన్ని యెలా అర్ధం చేసుకోవాలి. విభజన విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాతుకునిపోయివున్న భయ సందేహాలను ఈ కమిటీ తీర్చగలుగుతుందా. వినడం తప్ప వేరే నిర్ణయం తీసుకోలేని ఈ కమిటీ ఏర్పాటు కేవలం కాలయాపన కోసమే అని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సింది ఏముంటుంది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపకల్పన చేసిన ఆహార భద్రత బిల్లు లోక్ సభ ఆమోదం పొందేలా చూడగలిగినప్పుడు, అదే వేగంతో నలుగురినీ సంప్రదించి ఒక ఆమోద యోగ్యమైన పరిష్కారంతో విభజన బిల్లు తయారు చేసి ఆమోదింప చేయడానికి వున్న అడ్డంకులు ఏమిటి? మీనమేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించడం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో రాజుకుంటున్న విద్వేషాలు మరింత ప్రజ్వరిల్లడం మినహా సాధించేది ఏముంటుంది?
మాటల ఈటెలు విసురుకుంటున్న రాజకీయ నాయకులకు వచ్చేది పోయేది ఏమీ వుండదు. విద్వేషాలు మరింత ముదిరితే బాధ పడేది ఇరు ప్రాంతాల ప్రజలే. ఈరోజు ఒక పార్టీలో వున్న నాయకుడు పట్టుమని పదికాలాలపాటు అదే పార్టీలో వుంటాడన్న నమ్మకం ఆ పార్టీలకే లేదు. ఇక అలాటి వాళ్లని నమ్ముకుని ఆవేశకావేశాలకు దిగడం అంత తెలివితక్కువతనం మరోటి వుండదు.
మరో విషయం. తెలంగాణాని కోరుకుంటున్న వాళ్ళపై ఇప్పుడు పెద్ద బాధ్యత వుంది. కోరుకుంటున్నకల సాకారమయ్యే సంకేతాలు కనబడుతున్న దశలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం వున్నప్పటికీ, లక్ష్యానికి చేరువైన సమయంలో కటువైన వ్యాఖ్యలు చేయకుండా సంభాలించుకోవాల్సిన అవసరం తెలంగాణావాదులపై ఎక్కువగా వుంటుంది. పరిస్థితులు విషమంగా తయారవడం వల్ల ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశం అధికార పార్టీకి ఇవ్వకూడదు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు వున్న సందేహాలను తేలిక పరచి మాట్లాడ్డం తగ్గించాలి. వాటిని నివృత్తి చేసే పనికి నడుం కట్టాలి. ‘మీకేం భయం లేదు, మీ రక్షణకు మాదీ పూచీ’ అని టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు సయితం హామీలు గుప్పించడం విడ్డూరంగా వుంది. ఆ పని చేయాల్సింది, అలాటి హామీలు ఇవ్వాల్సింది అధికారంలో వున్నవాళ్ళు. ఆ హామీల అమలుకు సత్వరం ఒక నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసినప్పుడే వాటిపట్ల ప్రజలకు విశ్వసనీయత కలుగుతుంది.
విభజన తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు అది చేతల్లో కూడా కనబడాలి. కానీ ఆ దిక్కుగా అడుగులు పడుతున్న సూచనలు కానరావడంలేదు, కేవలం మొక్కుబడి ప్రకటనలు తప్ప.
కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడుతాయా అన్నదే ఈ నాటి ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన జవాబు అన్వేషించడంలో పార్టీలు విఫలం అయితే భవిష్యత్ తరాలు మాత్రమే కాదు వర్తమానతరం వారు కూడా వాటిని క్షమించరు.
(27-08-2013)