14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

లెస్స పలికిన చైనా


వార్త - వ్యాఖ్య  
వార్త : "భారత్ ది అపరిపక్వ ప్రజాస్వామ్యం : చైనా (ఈనాటి 'ఈనాడు' దిన పత్రిక మెయిన్ ఎడిషన్ రెండో పేజీ)
"భారత్ తో సహా అనేక ఆసియా దేశాల్లో నేటికీ అపరిపక్వ ప్రజాస్వామ్యమే నడుస్తోందని చైనా వ్యాఖ్యానించింది. ఈ పరిస్తితి ఆయా దేశాల ఆర్ధిక పురోగతిని దెబ్బతీస్తోందని పేర్కొంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోని  పార్టీలన్నీ వోట్ల రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయని విశ్లేషించింది. ప్రజాస్వామ్యం ఘర్షణ వాతావరణానికి దారితీస్తే, (జరగనున్న) ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తాయని (జోస్యం) చెప్పింది.

వ్యాఖ్య : "కాదనేందుకు ఏముంది ? లెస్స పలికితివి చైనా!" 
(14-02-2014)   

13, ఫిబ్రవరి 2014, గురువారం

వ్యాఖ్య అవసరం లేని వార్తలు


(ఈ మధ్యాహ్నం టీవీల్లో దొర్లిన స్క్రోలింగులు)
"ఇప్పటికీ సోనియానే మా లీడర్ - విభజననే వ్యతిరేకిస్తున్నాం" - కిరణ్
"టీ బిల్లు లోక సభలో ప్రవేశపెట్టారు" - దిగ్విజయ్
"ప్రవేశపెట్టలేదు" - బీజేపీ నేత సుష్మాస్వరాజ్
"మ్యాచ్ పూర్తికాలేదు, లాస్ట్ బాల్ మిగిలే వుంది" - సీఎం

"దారులు వేరయినా బారులొక్కటే"

వార్త - ఈరోజు (13-02-2014) 'ఆంధ్ర జ్యోతి' మెయిన్ ఎడిషన్ ఏడో పేజీ:
"కాలు దువ్వారు - కలిసి భోంచేశారు"
న్యూ ఢిల్లీ లోని ఏపీ భవన్ బుధవారం కూడా ప్రత్యేక, సమైక్య నినాదాలతో దద్దరిల్లింది.తెలంగాణా - సమైక్య వాదులు ఎదురెదురుగా భైఠాయించి పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. సై అంటే సై అంటూ కాలు దువ్వారు. ....ఓ రెండు గంటలు గడిచాక అందరికీ ఆకలైంది. నినాదాలకు విరామమిచ్చి విడివిడిగా క్యాంటీన్ దారి పట్టినా , అక్కడ మాత్రం కలివిడిగా తిరుగుతూ భోజనాలు ముగించారు."

వ్యాఖ్య - "దారులు వేరయినా బారులొక్కటే"     

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ధర్మ సందేహం


"కలిపేస్తే విడదీస్తాం" - డిగ్గీ
"విడదీస్తే కలిపేస్తాం" - కేసీఆర్  (ఈరోజు 'ఆంధ్ర జ్యోతి'లో వార్త)
"నన్నోడి తన్నోడెనా ? తన్నోడి నన్నోడెనా ?"
(మహాభారతం - ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో పాంచాలి లేవనెత్తిన 'ధర్మ సందేహం' - వ్యాఖ్య)
(09-02-2014)

20, జనవరి 2014, సోమవారం

మాయమై పోతున్నవమ్మా!


ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు, వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే -  వీసీఆర్ అనే పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని, ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్కృతమైన దరిమిలా,  లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి  ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే, టెలిఫోన్  డైరెక్టరీ తో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.

నిన్న మొన్నటిదాకా కళ్ళముందు కదలాడిన వస్తువులు కళ్ళముందే కనుమరుగు అవుతూ వుండడం ఓ విషాదం.

గతం గుర్తులు చెరిగిపోతున్నాయి


ఈరోజు పత్రికల్లో రెండు చిన్న వార్తలు వచ్చాయి. ఒకటి, హైదరాబాదు నగరంలో అతివేగంగా  అమలవుతున్న మెట్రో రైలు  ప్రాజెక్టుపై  ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన వార్త. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్  సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో  ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల  ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే తెలియాలి.  కానీ, మెట్రో నిర్మిస్తున్నది  అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి  వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం అత్యాశే అవుతుందేమో!


మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం నగరంలో అనేకచోట్ల పాత నిర్మాణాలను తొలగించేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నారన్నది మరో వార్త. అభివృద్ధి వల్ల వాటిల్లే తప్పనిసరి సమస్యల్లో ఇదొకటి. పాత కట్టడాలను తొలగించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని ఫోటోలు తీయించి భావితరాలకోసం భద్రపరచడం నిర్మాణ సంస్థల బాధ్యత. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక నగరాల రూపురేఖలు అనూహ్యంగా అతివేగంగా మారిపోతున్నాయి. వెనుక నగరం ఇలా వుండేది అని చెప్పుకోవడానికి ఏమీ మిగిలేట్టు లేదు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఇప్పుడు దేశంలో వున్నారో, వాళ్ల పిల్లల వద్ద అమెరికాలో వున్నారో తెలియదు. ఆయన ఎవ్వరో కాదు విజయవాడ నగరం పూర్వ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్. ఆయన బెజవాడ నగరానికి చెందిన అనేక పాత భవనాలను (రాజగోపాలచారి రోడ్డులోని లాయర్ చక్రవర్తి గారి ‘శ్వేత భవనం’ వాటిల్లో ఒకటి) ఫోటోలు తీయించి పెట్టారని విజయవాడ ఆకాశవాణిలో చాలాకాలం వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఆర్.వీ.వీ. కృష్ణారావు చెప్పారు. మెట్రో నిర్మాణ సంస్థ తలచుకోవాలే కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. నన్నడిగితే పాత నిర్మాణాలను కూలగొట్టి కొత్తవి నిర్మించేందుకు అనుమతులు కోరేవారు విధిగా పాత కట్టడం ఫోటో జత చేయాలని అధికారులు నిబంధన విధిస్తే బాగుంటుందేమో! (20-01-2014)

19, జనవరి 2014, ఆదివారం

గాయత్రి మంత్ర అంతరార్ధం


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన.
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి. 
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. 
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.
• 
ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. 
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా 
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. 
అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. 
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే. 
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. 
భర్గో దేవస్య ధీమహి 
భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. 
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు. 
కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి. 
"ఆనోభద్రాః కృతవోయంతు విశ్వతః” –రిగ్వేద)
 
(
అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)