17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఇల్లాలి ముచ్చట్లు



చిన్నప్పుడు చదివిన స్కూలు గురించి ఆ స్కూలు ప్రిన్సిపాల్ గురించి ఓ నలభయ్ అయిదేళ్ళ తరువాత ముచ్చటించుకునే అవకాశం అమెరికా అందాల భరిణెగా   ఎంపికయిన తెలుగు మల్లెపువ్వు ‘నీనా దావులూరి’ మా ఆవిడకు అందించింది.  పిడుక్కూ బియ్యానికీ లంకె పెట్టే ఈ కధా కమామిషూ ఆమె మాటల్లోనే విందాం.


(మిస్ అమెరికా నీనా దావులూరి)


“1968 ప్రాంతాల్లో నేను (అంటే నిర్మలాదేవి) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని.  సరస్వతి వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం ప్రిన్సిపాల్  కోటేశ్వరమ్మగారు.  బెజవాడ కనకదుర్గమ్మ లాగే కోటేశ్వరమ్మ పేరు కూడా అంతే ప్రసిద్ధి.


(నలుగురికి జీవితంలో పనికొచ్చే విద్యాబుద్ధులు నేర్పించిన మాంటిసోరి కోటీశ్వరమ్మగారు)  


“విజయకు కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు (పాతికేళ్ళు దాటింది) బారసాలకు కోటేశ్వరమ్మగారు కూడా వచ్చారు. మేమంతా ఆవిడ  స్టూడెంట్లం కాబట్టి భోజనాల సమయంలో ఆమె చుట్టూ కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత కలిసినా ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. ‘ఏం చేస్తున్నవంటే’ ‘హైదరాబాదులో ‘అమ్మవొడి’ పేరుతొ కేర్ సెంటర్ నడుపుతున్నాను’ అని చెప్పా. బహుశా ఆమె దగ్గర చదువుకున్నవాళ్ళల్లో  చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం నన్ను అభినందించారు. స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా అవసరమని చెప్పారు. నేను ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్  పెట్టుకుంటే, ఆవిడ పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను. ఈరోజు విజయ ‘నీనా దావులూరి’ విషయం చెప్పడానికి ఫోను చేస్తే ఆ పాత విషయాలన్నీ మరోమారు గుర్తుచేసుకున్నాము. కోటేశ్వరమ్మ గారిని సంస్మరించుకునే అవకాశం ఇచ్చిన నీనా దావులూరికి కృతజ్ఞతలు.”

"చివర్లో ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ‘జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి) కూడా మాంటిసోరి స్కూల్లో మా క్లాసుమేటు. దీనికి కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంద్యాల తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మూడేళ్ళు మా వారికీ బీకాం లో క్లాసుమేటు."
(17-09-2013)                      
  


లిఫ్టోచ్చిందోయ్ బాబూ లిఫ్టోచ్చింది!


అపార్టుమెంటు జీవితాల్లో మనుషుల్ని కలిపేది విడతీసేది లిఫ్టే. ఈ వాస్తవం మా లిఫ్ట్ పుణ్యమా అని మా ఎరుకలోకి వచ్చింది.
మా మధుబన్  అపార్టుమెంటులో లిఫ్ట్ చెడిపోయింది. ఇది పెద్ద వార్తేమీ కాదు. కాకపోతే అది చెడిపోయి మూడు నెలలు దాటిపోయింది. రిపేరు ఖర్చు పెద్ద మొత్తం కావడంతో చాలా రోజులు సంక్షేపించారు. మొదటి రెండు అంతస్తుల్లో వుండేవాళ్ళు మాకు  లిఫ్ట్ అవసరమే లేదు అలాంటప్పుడు అనవసరంగా  ఖర్చు యెందుకు భరించాలి అన్న పద్దతిలో ముందు వాదనకు దిగినా తరువాత దిగివచ్చి డబ్బులో వాటా ఇవ్వడానికి వొప్పుకున్నారు. మొత్తం మీద పని మొదలయ్యింది. కానీ చురుకుగా సాగలేదు. ఈ లోగా మూడో అంతస్తులో వుంటున్న మేమూ మాపై అంతస్తులోవున్నవాళ్ళూ గత్యంతరం లేక  మెట్లమీద నుంచే రాకపోకలు మొదలు పెట్టాము. కింది వాళ్లు సరేసరి. దాంతో అపార్టుమెంటులో వుంటున్నవాళ్లందరూ  రోజులో ఏదో ఒక సమయంలో మెట్లమీద ఎదురు పడడం, మర్యాదకు పలకరించుకోవడం కూడా మొదలైంది. ఏతావాతా ఈ సంబంధాలు క్రమంగా పలకరింపులదాకా, పలకరింపులు ముచ్చట్లదాకా, ముచ్చట్లు  ఒకరింటికి ఒకరు వెళ్ళి రావడాలదాకా  పెరిగి మొత్తం అపార్టుమెంటులోనే ఒక సుహృద్భావవాతావరణం ఏర్పడింది. అంతకు  ముందుదాకా ఎడమొహం పెడమొహంగా వుంటున్నవాళ్లు కూడా  మొహాలమీద చిరునవ్వు పులుముకుని మరీ పలకరించుకోవడం మొదలుపెట్టారు.  ఈలోగా లిఫ్ట్ రిపేరు పని కూడా మొదలయింది. కానీ ఆ పనివాడికి ఈ పాత లిఫ్ట్ రిపేరుకంటే మించిన పని మరెక్కడన్నా దొరికిందో యేమో కానీ మా పనిని వాయిదాల పద్దతిలో కొనసాగిస్తూ వచ్చాడు. దానా దీనా ఈ ఆలశ్యం కూడా మంచే చేసింది. లిఫ్ట్ రిపేరు ఖర్చు విషయంలో పొట్టు పొట్టయిన వాళ్లు, వాళ్ల పిల్లలు చెట్టాపట్టాలు వేసుకుని మెట్లెక్కి దిగే పరిస్తితి ఏర్పడింది. ‘బెడ్ రూమ్ టు బాత్ రూమ్ మార్నింగ్ వాక్’ చేసే నా బోంట్లకు మెట్ల మార్గం కాసింత వ్యాయామ మార్గంగా మారింది.
కాబట్టి ఈ పొట్టి కధలో గట్టి నీతి ఏమిటంటే చెడిపోవడం కూడా కొండకచో మంచే చేస్తుంది.
(తోకవాక్యం: మా ఆవిడ నేను రాసే ఇవ్వేవీ చదవదు కాబట్టి ధైర్యంగా రాస్తున్నాను. లిఫ్ట్ లేకపోవడం వల్ల ఆవిడ  వూళ్ళో బంధువుల ఇళ్లకు రోజువారీ  చేసే పెత్తనాలు కూడా బాగా తగ్గిపోయాయి. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ)
17-09-2013

16, సెప్టెంబర్ 2013, సోమవారం

కప్పూ సాసరు కధ


కప్పూ సాసరు గురించి ఎమ్వీ  అప్పారావు గారు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. వాటికి ఇది కొనసాగింపు.
కాఫీ కప్పు అంటామే కాని  మూడు వందల ఏళ్ళ క్రితం దీన్ని తేనీరు సేవించడానికి వాడేవారు. చైనా నుంచి ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ ముందు వీటిని దిగుమతి చేసుకుందట. అప్పట్లో టీ ఖరీదు ప్రియం. కాఫీ మాదిరిగా గ్లాసుల్లో కాకుండా పొదుపుగా తాగడానికి ఈ కప్పు ఏర్పాటు అనే కధ కూడా ప్రచారంలో వుంది. వేడి ద్రవాన్ని సాసరులో పోసి వూదుకుంటూ తాగడానికి  సాసరు ఉపయోగిస్తున్నా దాని  పరమార్ధం మాత్రం వేడి కాఫీ/తేనీరు  వొంటి మీద వొలకకుండా, అలాగే   టేబుల్ మీద పరచిన వస్త్రం పై మరకలు పడకుండా చూడడానికి మాత్రమే.



ఖరీదయిన కప్పూ సాసర్లు సేకరించడం అనేది కలిగిన వారికి ఒక హాబీ. మేము మాస్కో నుంచి వచ్చినప్పుడు నీలి రంగు కాఫీ  సెట్లు కొన్ని పట్టుకొచ్చాము. మా ఇంటికి వచ్చిన ఓ పెద్దాయన వాటి ఖరీదు చెప్పేదాకా మాకు వాటి విలువ తెలియదు. అంతే! అవిప్పుడు మా ఇంటి డ్రాయింగు రూములో కొలువు తీరాయి. ఎవరయినా చూసి ‘ఓహో ఆహా’ అని అనడానికి తప్ప వాడడానికి వీలు లేని ‘అందమైన అపురూపమైన’ అలంకరణ సామగ్రిగా మారిపోయాయి.
(16-09-2013)



అనువాద వాదసంవాదాలు


అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు.
ఇటీవల కొందరు అనువాదం గురించి వెల్లడిస్తున్న అభిప్రాయాలు చదువుతున్నప్పుడు నేనూ కొన్ని భావాలను పంచుకోవాలని అనిపించింది.


కీర్తి శేషులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు లోగడ ’అనువాద సమస్యలు’ అనే పుస్తకం రాశారు. నేను పాతికేళ్ళ క్రితం మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని రికార్డ్ చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో మాస్కో ‘రాదుగ’  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఈ మధ్యనే ఆయన చనిపోయారు)  నాకు ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ‘రారా’ గా ప్రసిద్ధులయిన రెడ్డి గారు రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. అనువాద సమస్యలు అన్నింటికీ ఈ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.
నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.

కాబట్టి, రాసేది  అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి. (16-09-2013)                     

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

కోపం వచ్చినప్పుడు గొంతు యెందుకు పెరుగుతుంది?



గురువు గారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. పనిలో పనిగా జ్ఞానబోధ చేస్తున్నారు.
గురువు అడిగారు “ కోపం వచ్చినప్పుడు స్వరం యెందుకు పెరుగుతుంది? పక్కన వున్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా గొంతు పెంచాల్సిన అవసరం యేముంటుంది?”
శిష్యులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం జవాబు చెప్పాలో తెలియక.
గురువుగారే చివరకు వివరించారు.
“ఇద్దరు వ్యక్తులకు ఒకరి మీద మరొకరికి పట్టరాని కోపం వచ్చినప్పుడు వారి హృదయాల నడుమ దూరం పెరుగుతుంది. ఆ దూరం కారణంగా  తాము చెప్పేది ఎదుటివాడికి వినబడదేమో అన్న అనుమానంతో  స్వరం పెంచుతారు. కోపం పెరిగిన కొద్దీ దూరం పెరుగుతుంది. దూరం పెరిగిన కొద్దీ మాటల్లో తీవ్రత పెరుగుతుంది”
గురువు గారు తాను చెప్పదలచుకున్నదాన్ని కొనసాగించారు. శిష్యులు మనసు పెట్టి వింటున్నారు.
“ఎప్పుడన్నా ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునే తరహా గమనించారా! చాలా నెమ్మదిగా, మృదువుగా వారి సంభాషణ సాగుతుంది. ఎందుకంటే వారు మానసికంగా దగ్గరగా వుంటారు. అందువల్ల పెద్దగా అరిచినట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం వారికి వుండదు.
“వారి నడుమ ప్రేమ మరింత బలపడిందనుకోండి. వారి నడుమ సాన్నిహిత్యం కూడా  మరింతగా పెరుగుతుంది. హృదయాలు మరింత దగ్గరవుతాయి. దాంతో వారి మధ్య మాటలు గుసగుసలాడుకున్నట్టుగా సాగుతాయి.
“అంటే  ఏమిటన్న మాట. కోపం లేకపోతే స్వరం పెరగదు. కోపం లేని వ్యక్తుల నడుమ సంభాషణ మాట్లాడుకున్నట్టుగా  వుంటుంది. పోట్లాడుకున్నట్టు వుండదు.
“వాదనలు చేసుకునేటప్పుడు దీన్ని మరింత గమనంలో పెట్టుకోవాలి. మీ మాటల్లో ప్రేమ తొణికిసలాడితే ఎదుటివాడి పలుకుల్లో కూడా పదును తగ్గుతుంది.
“వాదనల్లో వాడే పదాలతో హృదయాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడితే మీకు కోపం అనేదే రాదు. వచ్చినా ఎదుటి వ్యక్తిని శాశ్వితంగా దూరం చేసుకునేంతగా మీ  స్వరం పెరగదు”

గురువుగారు ఆనాటికి పాఠం ముగించారు. శిష్యులు తమ జీవితాలకు ఉపయోగపడే కొత్త పాఠం ఒకటి ఆనాడు  నేర్చుకున్నారు. (15-09-2013)

రేడియో రోజులు - 7 - నిజాం మరణం



(నిజానికి ఇక్కడ రేడియో రోజులు అంటే నేను రేడియోలో పనిచేసిన రోజులని కాదు. ఆ రోజుల్లో రేడియో అని. నాకన్నా ముందు పనిచేసిన వారి జ్ఞాపకాలు మరింత ఆసక్తిగా వుంటాయని వారిలో కొందరితో  ముచ్చటించినప్పుడు తెలిసింది. వాళ్లు వయస్సులో చాలా పెద్దవాళ్ళు కావడం మూలాన పేర్లూ తారీఖులూ సరిగా గుర్తురావడం లేదని వారే చెప్పారు. అంటే ఏదన్నా విషయం గురించి చెప్పినప్పుడు దాని స్తూల భావాన్ని మాత్రం తీసుకుని, మూలాల్లోకి, చర్చల్లోకి పోకుండా స్వీకరించలిగితే నాటి స్మృతులను ఆస్వాదించడానికి ఆస్కారం వుంటుంది. లేదా చదువరుల్లో ఎవరయినా నాటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు వుండి, తప్పొప్పులను సవరించగలిగితే  ఈ రచనకు సంపూర్ణత్వం, సాధికారికత సిద్ధిస్తుంది. ఇది నా మనవి భండారు శ్రీనివాసరావు)

తోకచుక్క రాలినప్పుడు ఎవరో పెద్దవారికి కాలం మూడిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. అలాగే తుమ్మెదలు వున్నట్టుండి గుంపులు గుంపులుగా కానరావడం,  కప్పలు సంగీతం మొదలుపెట్టడం వాన  రాకడకు  సూచనలుగా పేర్కొనేవారు.
ఈ సందర్భంలో చెప్పుకోవలసిన విషయం మరొకటి వుంది. రేడియోలో మామూలు కార్యక్రమాలు నిలిపేసి విషాద సంగీతం ప్రసారం చేస్తున్నారంటే ఎవరో జాతీయ నాయకుడు కన్నుమూశారని జనాలకు అర్ధం అయ్యేది.
మరణ వార్తను ప్రసారం చేసేముందు రేడియో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయం తెలిసినా, అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా మరణ వార్తలను ప్రసారం చేయరు. అధికారిక నిర్ధారణ జరగడానికి జరిగే కాలయాపన కారణంగా అనేకసార్లు ఆ నిందను ఆకాశవాణి వారే మోసేవారు. 
ఇంతకీ విషయానికివస్తే -

ఆ రోజు నిజాం నవాబు మరణించారు. ఆ వార్తను ధృవీకరించడానికి నిజాం కుటింబీకులే చాలా సమయం తీసుకున్నారు. కానీ చావుకబురు ఆగదు కదా. ఆ నోటా ఈ నోటా పడి కొందరికి తెలిసిపోయింది. యూ.ఎన్. ఐ. వార్తాసంస్థ  ధ్రువీకరణతో నిమిత్తం లేకుండానే సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రపంచం అంటే ఇక్కడ పత్రికలు. వార్తాసంస్థ పంపిన వార్త రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లోని పత్రికలకు తెలిసిపోయింది కాని ఇప్పట్లా త్వరితగతిన  సమాచారం  చేరవేతకు అవకాశం లేకపోవడం వల్ల దాని ప్రభావం హైదరాబాదులో అంతంత మాత్రమే అని చెప్పాలి. కానీ వార్త తెలిసిన రేడియో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేడియో ట్రాన్స్ మిషన్ వ్యవధి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారిక సమాచారం  అందేదాకా విషాద సంగీతం ప్రసారం విషయం పక్కనబెట్టారు. ఈలోగా ఉన్నతాధికారి ఒకరు రేడియో ప్రసార వ్యవధిని పొడిగిస్తున్నట్టు సిబ్బందికి తెలియ చెయ్యడానికి  స్టూడియోలోకి వెళ్లారు. గుమ్మం దగ్గర నిలబడి తలుపు వోరగా తెరిచి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు బయట నడవాలో వున్న వేరే సిబ్బంది నిజాం మరణంపై  వినవస్తున్న వదంతులు గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ప్రసారం అయిపోయింది. అప్పటి హడావిడిలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని హైదరాబాదు నుంచి వెలువడే ఒక చిన్న పత్రికలో ఆ విషయం ప్రచురించారు. ఆ తర్వాత కూడా  జనంలో ఈ విషయం చర్చకు రాలేదు కాని పత్రికావార్తపై మాత్రం రేడియో అధికారులు స్పందించి విచారణ జరిపారు. సంబంధం వున్నవారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. 

మోసం గురూ!


ఇద్దరు ముక్కూ మొహం తెలియని వాళ్లు  హోటల్లో కలిశారు.  బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మాటలు కలిపారు.
అందులో ఒకడు అన్నాడు బ్రెడ్  స్లయిస్ కు వెన్న రాస్తూ.  
‘మీరు గమనించారో లేదో! మనం టోస్ట్ చేసిన బ్రెడ్ స్లయిస్ కు వెన్న పూసి కింద పడేశామని అనుకుందాం. అది ఖచ్చితంగా  వెన్న రాసిన వైపే కిందకి  పడుతుంది’
రెండోవాడు క్షణం ఆలోచించకుండా కాదు పొమ్మన్నాడు.
‘అలా జరగడానికి అవకాశాలు యెంత మాత్రం లేవు. అంత ఖచ్చితంగా చెప్పడానికి నేను వొప్పుకోను’ అని వాదించాడు.
‘అలానా అయితే ఇది చూడండి’ అంటూ ఒక బ్రెడ్ ముక్కకు వెన్న రాసి కింద పడేశాడు.
కాని అతను అన్నట్టు కాకుండా ఆ బ్రెడ్ ముక్క  తిరగబడింది.
‘నా అనుమానమే కరక్ట్.’ అన్నాడు రెండోవాడు.

‘అదే నేను చెప్పేది. నేను వెన్న రాసింది రెండో వైపు’
(15-09-2013)