3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఫుడ్ సెక్యూరిటీ


క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు గురించి తెలుసా అని.
తక్కున జవాబు వచ్చింది.
‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం దీని ఉద్దేశ్యం’ 


ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.
అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను సగటు తీసి గ్రేడ్లు ఇస్తారు.
సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.
కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.
చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.
ఈసారి అందరికీ తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం మానేశారు.
చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
చివరికి ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.
ఆ తరువాత ప్రొఫెసర్ చెప్పారు.
‘ఫుడ్ సెక్యూరిటీ బిల్లు వల్ల ఏం జరుగుతుందో మీ అందరికీ  అర్ధం అయిందనుకుంటాను.’ 
ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
 ‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,  
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు. మన ప్రధాన మంత్రి గారయినా అంతే. రాజకీయ అవతారం ఎత్తిన తరువాత ఆర్ధిక శాస్త్రాన్ని మరచిపోవాలి.
అదే జరుగుతోంది.

(నెట్లో కంటబడ్డ కధనానికి స్వేచ్చానువాదం)

03-09-2013

ఈ కార్టూన్ కి ఓ క్యాప్షన్ పెట్టండి ప్లీజ్


(ఇది నా సొంత ఐడియా కాదు, గతంలో బాపూ రమణలు 'జ్యోతి' పత్రికలో ఇలాటి ఆటలు ఎన్నో పాఠకులతో ఆడేవాళ్ళు)


చెత్త బండిగా రోల్స్ రాయిస్



పురుషులలో పుణ్య పురుషుల మాదిరిగా కార్లలో రోల్స్ రాయిస్ రాయసమే వేరు. గొప్ప గొప్ప వాళ్లు కొనుక్కుని గొప్పగా చెప్పుకునే ఆ గొప్ప కారును ‘చెత్త బండీ’గా వాడిన ఘనత ఒక భారతీయుడిది. నమ్మి తీరమంటోంది ఓ  ‘నెట్ కధనం.’
1940 కి పూర్వం ఆనాటి మైసూరు మహారాజా గారు ఇంగ్లాండ్ కి విహార యాత్రకి వెళ్లారు. లండన్ లో రోల్స్ రాయిస్ కార్ల షో రూమ్ కి వెళ్ళి అక్కడ కొత్త మోడల్ కారును చూసి ముచ్చటపడ్డారు. కానీ ఆ షో రూమ్ వారికి ఈయన ఎవరో తెలియదు. అది అందరికీ అమ్మే అల్లాటప్పా కారు కాదన్నట్టు చెప్పి  తిప్పి పంపించారు.
రాజావారికి రోషం పొడుచుకు వచ్చింది. స్వదేశానికి వచ్చిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వంలో తనకున్న సంబంధాలను వాడుకుని ఇంగ్లాండ్ నుంచి ఒక రోల్స్ రాయిస్ కారును ఆఘమేఘాల మీద దిగుమతి చేయించుకున్నారు. లండన్ లో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని అనిపించింది. వెంటనే ఆ కొత్త రోల్స్ రాయిస్ కారును రాజప్రాసాదంలో చెత్త రవాణా చేసే  వాహనంగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
దేశదేశాల్లో జనాల మన్ననలు అందుకుంటున్న తమ కారుకు మైసూరు రాజభవనంలో పట్టిన దుస్తితి రోల్స్ రాయిస్ కంపెనీ దృష్టికి వచ్చింది. ఆ కంపెనీ ప్రతినిధులు లబోదిబోమంటూ మైసూరుకు వచ్చి తమ కారు ప్రతిష్టకు భంగం కలిగించవద్దని మొర పెట్టుకున్నారు. అంతగా కావాలంటే కారు ధరకు ఎక్కువ మొత్తం చెల్లించి తమ కారును తాము తీసుకుపోతామని విన్నపం చేసుకున్నారు.
అంతా విని మైసూరు రాజా గారు మీసాలు సవరించుకుంటూ వారితో ఇలా అన్నారు.
“ ఆ మాటయితే ఓ పని చేయండి. రాజప్రాసాదంలో  చెత్త రోజుజుకూ పెరిగి పోతోంది.  మరో రెండు రోల్స్ రాయిస్ కార్లు వెంటనే పంపించండి. ధర ఎంతయినా పరవాలేదు.”
అప్పటినుంచి లండన్ లో రోల్స్ రాయిస్ షో రూమ్ కు  భారతీయులు ఎవ్వరు వెళ్ళినా వారిని మహారాజుల  మాదిరిగా చూడడం మొదలయింది.

 ‘యేమో ఏ పుట్టలో ఏ పాముందో’ అనే భయం అక్కడివారిని  పట్టుకున్నట్టుంది.

2, సెప్టెంబర్ 2013, సోమవారం

పెళ్లి ముడి



ఝామ్మున పెళ్లయిపోయింది. వధూవరులిద్దరూ హనీమూన్ బయలుదేరుతున్నారు. పెళ్లి కూతురు తల్లి కుమార్తె చేతిలో ఓ బ్యాంక్ పాస్ బుక్ పెట్టి చెప్పింది.
‘సంసారం అన్నాక కష్ట సుఖాలు వుంటాయి. నీకు బాగా సంతోషం కలిగిన రోజున ఎంతో కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆనందం కలిగించిన కారణాన్ని కూడా అందులో గుర్తుగా రాసుకో. పుస్తకం పారేసుకోకు. చెప్పింది మరచిపోకు’


గిర్రున ఏడాది తిరిగింది. పండంటి బాబు పుట్టాడు. ఆ సంతోషానికి గుర్తుగా కొంత డబ్బు డిపాజిట్ చేసింది.
నెలలు గడిచాయి. ఆమెకు జీతం పెరిగింది. పెరుగుతున్నఖర్చులకు తోడుగా జీతం పెరగడం కంటే ఆనందం ఏముంటుంది. దానికి గుర్తుగా మరికొంత సొమ్ము బ్యాంకులో చేరింది. మరి కొన్నాళ్ళకి అతడికి ప్రమోషన్. రెట్టింపు జీతం. కారు కొన్నారు. మంచి జరిగినప్పుడల్లా బ్యాంక్ డిపాజిట్ పెరుగుతూనే వుంది.
రోజులన్నీ ఒక్క మాదిరిగా వుండవు కదా.
కాపురంలో చిర్రుబుర్రులు మొదలయ్యాయి. సంభాషణల్లో స్వారస్యం తగ్గి వాదాలు చోటుచేసుకోవడం ప్రారంభమయింది.
ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా నోరు తెరిచినా అది చివరకు నోరు పారేసుకోవడం దాకా వెళ్ళేది.
తల్లిదగ్గర చెప్పుకుంది.
‘ఇతగాడిని భరించడం ఇక నా వల్లకాదు. నేను విడాకులు తీసుకుంటాను మమ్మీ. అతడు కూడా వొప్పుకున్నాడు. ఇష్టం లేని కాపురం కన్నా విడిపోయి విడిగా వుండడమే హాయి’
విన్న తల్లి గుండె గతుక్కుమంది. అయినా తమాయించుకుని చెప్పింది.
‘నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా చెప్పు. అలాగే విడాకులు తీసుకుందురు కాని. కానీ నీ పెళ్ళిలో నీకొక బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చాను కదా. అందులో యెంత వేసారో ఏమిటో. ముందు ఆ డబ్బు బయటకు తీసి ఒక్క పైసా మిగలకుండా అంతా ఖర్చుచేసేయ్యి. ఎందుకంటే ఈ దాంపత్యం తాలూకు ఏవీ నీకు గుర్తులుగా మిగిలి వుండకూడదు.’
అమ్మాయి పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. క్యూలో నిలబడివున్నప్పుడు అనుకోకుండా పుస్తకం తెరిచి చూసింది. అందులో డిపాజిట్ చేసింది  తక్కువసార్లే అయినా ఆ ఎంట్రీల వద్ద రాసిపెట్టిన జ్ఞాపకాలు ఆమెను కదిలించాయి. పిల్లవాడు పుట్టడం, జీతాలు పెరగడం, ప్రమోషన్ రావడం – ఆ సందర్భాల్లో తమ నడుమ చోటుచేసుకున్న ఆహ్లాదకర క్షణాలు – ఓహ్ – జీవితమంటే యెంత ఆనందం.
ఇక అక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది. 'ఇదిగో. ఈ పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళు. ఎంతవుంటే అంత తీసేసుకుని అంతా ఖర్చు చేసెయ్యి. ఆ తరవాతే ఇంటికి రా’
మర్నాడు వచ్చాడు. వచ్చి భార్య చేతిలో పాస్ బుక్ పెట్టాడు. అందులో కొత్త డిపాజిట్ వుంది. దానికి కింద ఇలా రాసాడు.
‘ఈ రోజు నా జీవితంలో గొప్పరోజు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిందీ, ఇన్నేళ్ళ దాపత్యంలో నువ్వు నాకెంత సంతోషాన్ని అందించిందీ అన్నీ  ఈ రోజే మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.’
ఎవరు ముందో తెలియనంత వేగంగా వారిద్దరూ ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నారు. ఆనంద భాష్పాలతో వారి కాపురం పునీతమైంది.
తరువాత వారు చేసిన మొట్టమొదటి పని – బ్యాంకు పాస్ బుక్ ను భద్రంగా బీరువాలో దాచిపెట్టడం.

Note: నెట్లో తారసపడిన ఓ ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం  

(02-08-2013)

"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"




(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ఎన్టీఆర్ తో నేనుఅనే పుస్తకం నుంచి  కొన్ని భాగాలు)




“......ఎన్టీఆర్ కు అసలు దేవుడన్నా, పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ  ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు. ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు. తిరుమలకు తప్ప రాష్ట్రంలోని మరే ఇతర దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు......


“.......పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి.......

“..... సినిమా షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు వస్తే , సారధీ స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు.....

“.....ఎన్టీఆర్ కి బాగా దగ్గరగా మసలిన వ్యక్తి,  బీవీ మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్- బీవీతో కలసి తిరుపతి వెళ్లి వస్తున్నారు. వీళ్ళ కారు వెనకనే వస్తున్న వీఐపీ కారు ఒకటి సైరన్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయిందట. ఆ వీఐపీ కారుకు  అటూ ఇటూ మరికొన్ని కార్లు. ఈ హంగామాను ఎన్టీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు, బీవీ కలగచేసుకుని మీ కారు కూడా ఎనభైలో ఇలాగే సైరన్, పైలట్ హంగామాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇది తధ్యం' అని జోస్యం చెప్పారట........

“......రామారావుది మొదటి నుంచి ఒకటే ఫిలాసఫీ. ఏదయినా వ్యాపారం అంటూ చేస్తే సొంత డబ్బు పెట్టాలి. ప్రభుత్వ రాయితీలు, ఉచిత  స్థలాలు  ఎందుకనే వారు. అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో నిర్మాణానికి (ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్తలంలో వేరే వ్యాపారాలు చేయడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. వారికి నోటీసులు పంపండి. ఏం పర్వాలేదుఅని ఆదేశాలిచ్చారాయన......

“.......తన సినీ జీవితం తొలినాళ్ళలో ఆత్మాభిమానం మెండుగా వున్న ఈ నిండు మనిషి, ఒకసారి నడుచుకుంటూ షూటింగుకు వెళ్లడం చూసి ఆ సినిమా నిర్మాత ఆయనకు ఒక కొత్త కారు కొని ఇంటికి పంపారట. ఆ రోజుల్లో కొత్త కారు ఖరీదు పదిహేను వందల రూపాయలు. తరువాత తనకు డబ్బు సమకూరాక నందమూరి ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కారు డబ్బులు తిరిగి ఇచ్చేశారట......


".......ఎమ్జీఆర్ (అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్ ) ఢిల్లీ వెళ్ళే సందర్భాలలో ఆయన విమానం హైదరాబాదులో నలభై అయిదు నిమిషాల పాటు ఆగేది. ఎన్టీఆర్  టిఫిన్ క్యారియర్ పట్టుకుని నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళేవారు. అక్కడ తన మద్రాసు మిత్రుడితో కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా సార్లు జరిగింది."

పత్రికలు - రాజకీయాలు



(సరిగ్గా నాలుగేళ్ళక్రితం - 2009 సెప్టెంబర్ లో రాసింది ఈ వ్యాసం)


హెలి కాఫ్టర్ దుర్ఘటనలో రాజశేఖర్ రెడ్డిగారు మరణించి రెండు వారాలు గడచి పోయాయి. మొదటి రెండు మూడు రోజులు- తెలుగునాట మీడియానిర్వహించిన పాత్ర అభినందనీయం. ఇప్పుడు మీడియా అనే పదాన్ని పత్రికలకు, టెలివిజన్ ఛానెళ్ళకు అన్వయించి విస్తృతార్ధంలో వాడుతున్నారు. ఈ రెండు మాథ్యమాలు – దుర్ఘటన  గురించిన సవివరమైన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పటానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డాయి. దుర్గమారణ్యంలో వాగులు, వంకలు కాలి నడకన దాటుకుంటూ వెళ్ళి - సమాచార సేకరణలో తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. స్థానిక ఛానెళ్ళు చిత్రీకరించిన దృశ్యాలనే అనేక జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్ళు ఉపయోగించుకున్న తీరే ఇందుకు నిదర్శనం. ఇంతవరకు తెలుగు మీడియా నిర్వహించిన పాత్రను కొనియాడితీరవలసిందే.
పదవిలో ఉంటూ ఒక ముఖ్యమంత్రి చనిపోవడం అన్నది మన రాష్టానికి సంబంధించినంతవరకు ఇదే ప్రథమం. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులను మార్చిన సందర్భాలకు, ప్రస్తుత సన్నివేశానికి హస్తిమశకాంతరం తేడా వుంది. చనిపోయిన వ్యక్తి సాక్షాత్తూ ముఖ్యమంత్రి. అందునా రాజశేఖర రెడ్డి. వ్యక్తిత్వ శోభతో, నాయకత్వ పటిమతో, దీక్షా దక్షతలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి పార్టీ అధిష్టానాన్ని సైతం ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. ఆయన లేని లోటును ఊహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వైయస్సార్  మృతితో రాష్ట్రం యావత్తూ దిగ్భ్రాంతికి గురయ్యింది. జనం చేష్టలుడిగి పోయారు. సొంత మనిషి మరణించినట్టుగా తెలుగునాట ప్రతి ఇంటా విషాద చాయలు అలముకున్నాయి. వైయస్సార్  ఇక లేరుఅన్న దారుణ వార్త జీర్ణించుకోలేక దాదాపు మూడు వందలపై చిలుకు అభిమానులు, ఆపన్నులు గుండె పగిలి చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందంటే - ఈ దుర్ఘటన ప్రజలను ఏ స్థాయిలో ఏరకంగా కలచివేసిందో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తేరుకుని తక్షణ కర్తవ్యానికి నడుం బిగించింది. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వయసురీత్యా,  అనుభవం రీత్యా అత్యంత సీనియర్ అయిన రోశయ్య గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.

వైయస్సార్  మంత్రి మండలిలోని ఇతర మంత్రుల చేత కూడా మరోసారి ప్రమాణ స్వీకారం చేయించి అవే శాఖలు అప్పగించి ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ సజావుగా సాగిపోయేందుకు ఏర్పాటు చేసింది. 

రోశయ్యగారికి సంబంధించినంతవరకు ఇది అయాచిత పదవి. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరువాత కూడా పలుకులో, నడవడికలో ఏ మాత్రం మార్పు లేదు. ఆయన తొలిసారి మంత్రి అయినపుడు ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్ ప్రొబేషనర్లుగా రాష్ట్ర సర్వీసులో ప్రవేశించిన అధికారులు - ఆయన కళ్ళముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, డీ.జీ.పీ.లుగా ఎదిగారు. రాష్ట్రస్థాయిలోను, జిల్లా స్థాయిలోనూ అధికారులను పేరుతో పిలిచి గుర్తుపట్టగల సుదీర్ఘ అనుభవం ఆయనది. పోతే ఫైళ్ళూ ప్రాజెక్టులు,  నిధులు, జమాఖర్చులు ఇవన్నీ ఆయనకు కొట్టిన పిండి. శక్తివంతమైన ప్రసంగాలతోనే ప్రత్యర్ధుల గుండెల్ని పీల్చి పిప్పిచేయగల ప్రతిభా సామర్ధ్యాలు ఆయన సొంతం. 

రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా – వైయస్సార్  చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల గురించి రోశయ్య గారికి సంపూర్ణమైన సదవగాహన వుంది.  పైపెచ్చు వైయస్సార్ కి అత్యంత ఆత్మీయుడు. అందుకే ముఖ్యమంత్రిగా ఆయనని ఎంపిక చేస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ వర్గాలను అంతగా కలవరపరచలేదు. అలాగే మంత్రుల సహాయ నిరాకరణ గురించి మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాలను చూసి రోశయ్యగారు కూడా కలవర పడిన దాఖలాలు లేవు. కాబట్టే అప్పగించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించేందుకే ఆయన కృషి చేస్తున్నారు.
 కాగా, రాజశేఖర్ రెడ్డిగారికి నిజమైన రాజకీయ వారసుడు ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డే కావాలని వైయస్సార్ ని అభిమానించే వారు కోరుకోవడం అత్యంత సహజం.  వైయస్సార్  సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది పేద ప్రజలు కూడా అందుకు మద్దతు పలకడం అంతే సహజం. అయితే జగన్ కు ఆశించిన రీతిలో అధిష్టానం మద్దతు దొరకడం లేదన్న విషయాన్ని గోరంతను కొండంతలుగా చేసి జనంలోకి తీసుకువెళ్ళడంలో  మీడియా నిర్వహిస్తున్న  పాత్రను కొందరు తప్పుపడుతున్నారు. జగన్ కు అనుకూలంగా మీడియాలోని ఒక వర్గం ఎంత గట్టిగా పనిచేస్తున్నదో, జగన్ కు వ్యతిరెకంగా మరొకవర్గం అంతే పట్టుదలతో పనిచేస్తున్నదని కాంగ్రెస్ రాజకీయాలను ఔపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు ప్రైవేటు సంభాషణల్లో పేర్కొంటున్నారు.


రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో అధిష్టానం బూచిని చూపించి సొంత పార్టీలోని ప్రత్యర్ధులను బెదిరించే సంస్కృతికి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నూకలు చెల్లిపోయాయి. ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీకి సాధించి పెట్టిన విజయం దరిమిలా ఆయన్ని వేలెత్తి చూపగల చేవ, పన్నెత్తి ప్రశ్నించగల సత్తా పార్టీలో కొరవడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుసరిస్తూవస్తున్ననూతన దిశానిర్దేశనం కూడా దీనికి దొహదం చేస్తోంది.

మొదటి అయిదు సంవత్సరాల పదవీ కాలంలో అధిష్టానం వద్ద వైయస్సార్ మాటే చెల్లుబడి అవుతూ వచ్చింది. దానితో రాష్ట్ర స్థాయిలో పార్టీలోని ఆయన ప్రత్యర్ధుల  విమర్శలు, ఆరోపణలు ఒక స్థాయికి పరిమితం కావడం మాత్రమే కాకుండా క్రమేపీ వారి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. రాజశేఖరరెడ్డి గారి అకాల మరణం తరువాత అసమ్మతి శక్తులు మళ్ళీ పుంజుకుంటాయని చాలామంది భావించారు. కానీ ఆయన ఆకస్మిక మృతి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబుకిన భావోద్వేగాల నేపథ్యంలో అసమ్మతి స్వరాలు అంతరంగాలకే పరిమితం అయ్యాయి. దాంతో జగన్ ని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తప్ప జగన్ కి వ్యతిరేకంగా చేతులు కలిపి, బహిరంగంగా ముఠా కట్టి వాదం వినిపించగల వాళ్ళు లేకుండా పోయారు.

రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలను శ్రద్ధగా గమనిస్తున్న ప్రతి పక్షాలు కూడా పైకి పెదవి విప్పడం లేదు. అవన్నీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలంటూ  వాటితో తమకు సంబంధం లేదని పేర్కొంటున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి మృతికి కొన్ని వారాల ముందు తమ పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్  ని వైయస్సార్  అమలు చేస్తున్నారని ఆయా పార్టీలు చేసిన ఆరోపణలను స్ఫురణకు తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో సంభవిస్తున్న పరిణామాల పట్ల అవి అంత  నిర్లిప్తంగా ఉంటాయనుకోలేము. అలాగని బహిరంగ వ్యాఖ్యానాలు చేయడానికి కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలను తమ రాజకియ అవసరాలకి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాయని కానీ  భావించడం పొరపాటే అవుతుంది. కాకపోతే, వైయస్సార్   స్థానంలో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావడం ప్రతిపక్షాలకు ప్రధానంగా తెలుగు దేశం పార్టీకి మింగుడు పడకపోవచ్చు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కూడా  తన తండ్రి బాటలోనే అదే విధమైన రాజకీయ ఎత్తుగడలను కొనసాగించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంతర్లీనంగా సందేహపడే వీలుంది. ‘జగన్ ముఖ్యమంత్రి  కాకపోతే చాలు’ అన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నట్టు భోగట్టా.

అయితే రాజశేఖర రెడ్డి వంటి మహోన్నత వ్యక్తి మరణించిన వెంటనే ఆయన రాజకీయ వారసత్వానికి సంబంధించి రకరకాల కథనాలు, విశ్లెషణలు మీడియాలో తామర తంపరలుగా వెలువడుతూ ఉండటాన్ని సామాన్య జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ పన్నెత్తి మాట్లాడని కె.వి.పి.సైతం గాంధిభవన్ సమావేశంలో చెలరేగిన ఆవేశకావేశాలను సద్దుమణిగేలా చేసేందుకు  ఉద్వేగ ప్రసంగం చేయడం ఓ  కొసమెరుపు.

ఈ పరిణామాలను జగన్ వర్గానికి వ్యతిరేకంగా మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం సహజం. ఈ ప్రయత్నాలకు మీడియాలోని ఒక వర్గం సహకరిస్తోందన్నది తాజాగా వినిపిస్తున్న ఆరోపణ. కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు ఇందుకు ఉదాహరణలుగా  ఈ  ఆరోపణలు చేస్తున్నవారు పేర్కొంటున్నారు. జగన్ కు అనుకూలంగా పార్టీ అధిష్టానానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఉత్తరాది పత్రిక ఒక దానికిచ్చిన ఇంటర్వ్యూలోని  అంశాలను యథాతథంగా తర్జుమా చేసి ప్రచురించిన ఒక తెలుగు దినపత్రిక - అలా మాట్లాడినందుకు ఆ నాయకుడిపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటూ , ఆ కథనాన్ని ప్రారంభించిన వైనాన్నివారు ఉదహరిస్తున్నారు. కె.వి.పి. ఢిల్లీయాత్రల గురించీ, అధిష్టానం తీరు తెన్నుల గురించి ఊహాగానాలు చేస్తూ మీడియాలోవెలువడుతున్న కథనాలలోని నిబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ కాకపోతే కాంగ్రెస్ లో ఎవరైనా పర్వాలేదన్న పద్ధతిలో మీడియాలో ఒక వర్గం పనికట్టుకుని ప్రచారం చేస్తోందన్నది ఆ ఆరోపణలోని సారాంశం.  ‘కొన్ని’ పత్రికల విశ్వసనీయతని పదే పదే ప్రశ్నిస్తూ ప్రజల్లో తమ పత్రికల పట్ల గౌరవాదరాలు తగ్గిపోయేలా రాజశేఖరరెడ్డి ప్రయత్నం చేసారన్న కినుకతో ఉన్నపత్రికాధిపతులే ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకుంటున్నారన్న అనుమానాలు  కూడా వారి మాటల్లో తొంగిచూస్తున్నాయి. పత్రికల విశ్వసనీయత పట్ల రాజశేఖర్ రెడ్డి హయాంలో తలెత్తిన నీలినీడలు ఆయన అస్తమయం తర్వాత కారుమబ్బులుగా పరిణమించడం విషాదం.

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేని సాహసాన్ని - మీడియాలో ఒక వర్గంపై విమర్శలు గుప్పించడం ద్వారా రాజశేఖర రెడ్డి ప్ర్దదర్శించారు. అక్షరంపై ప్రారంభమైన దాడిగా కొందరు విశ్లేషకులు అభివర్ణించారు. అయినా వైయస్సార్  తన సహజ స్వభావానికి తగ్గట్టుగానే ఏమాత్రం వెనుకంజవేయలేదు. పైపెచ్చు తన విమర్శలకు మరింత పదును జోడించారు. పత్రికల్లో పనిచేసేవారిని, పత్రికలు నడిపేవారిని విడదీసి చూపిస్తూ పత్రికా స్వేచ్చకి తనదైన భాష్యం చెప్పారు.

పత్రికలకు, మీడియాకి విమర్శించే హక్కు వుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన ధర్మం వుంది. ఎవరికో కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు లేశమాత్రం తలెత్తకుండా పత్రికలను నడపాల్సిన పవిత్ర భాద్యత కూడా వారి భుజస్కంథాలపై వుంది. ఈ బాధ్యతని సమర్ధవంతంగా, విశ్వసనీయంగా నిర్వర్తిస్తున్నామని  నిరూపించుకోడానికి వాటికి ఇదే సరైన తరుణం.
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కావడం వలన సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం కలగవచ్చు. లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
 కానీ -

ఈ సూత్రం మీడియాకి వర్తించదు అన్న వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలి. 

(
సెప్టెంబర్- 2009)

1, సెప్టెంబర్ 2013, ఆదివారం

సిగరెట్లు మానడం యెలా?


‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.

నాకు సిగరెట్ అలవాటు యెలా అలవడిందో గుర్తు లేదు. మా మామగారి ముందు  ఆధిపత్యం ప్రదర్శించడానికి నేను సిగరెట్లు మొదలు పెట్టానని మా ఆవిడ అంటుంది. కానీ సిగరెట్ తాగే మా స్నేహితులు చెప్పే మాట వేరే. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 2004లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలు’ అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు. దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా పొట్టలో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.  మామూలుగా అయితే అక్కడ విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీ తో టీడీపీ కి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ లోపల ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళు మంటలు. నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు. కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాకర్ల వారు కూడా వచ్చి చూసారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమని అన్నారు. కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను ముందుకు వొంగి  ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అనేశాను. ఆయన నెత్తి మీది వెంట్రుకలు పట్టి చూపిస్తూ ‘ఇలాటి వాళ్ళను నేను ఇంతమందిని చూసాను’ అంటూ  అదంత తేలిక కాదని ఆయనే చెబుతూ నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి రాత్రి అంతా నిద్ర పోయిన తరువాత నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా పట్టుదల కల మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  తాగాలని కూడా అనిపించలేదు. (01-09-2013)