20, ఆగస్టు 2013, మంగళవారం

బాబుగారితో ఓ సాయంత్రం


నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ భవన్ నుంచి ఆ ఫోను.  అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ  అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు  చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు (అంటే ఈ సాయంత్రం) నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’
జర్నలిస్టుగా పదవీ విరమణ చేసినప్పటినుంచి మళ్ళీ ఏనాడు ఏపార్టీ గుమ్మం కూడా ఎక్కలేదు.
కానీ కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.


ఇంటికి వచ్చి చూస్తే టీవీల్లో స్క్రోలింగులు వస్తున్నాయి,  రాష్ట్ర రాజకీయ పరిస్తితులపై మీడియా విశ్లేషకులతో చంద్రబాబు సమావేశం అంటూ. ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?  ఇప్పటికే మీడియా  విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, చక్రాంకితాలు కనబడని ఆయా పార్టీల అధికార ప్రతినిధులని.  
ముప్పయ్యేళ్ళ పైచిలుకు విలేకరి జీవితంలో కూడా ఏనాడు ప్రశ్నలు వేసే అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను వేలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన ఏమైనా  వుంటుందేమో గమనించండి.’    
అయితే ఇది ఆయన చేసిన ఒక  సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప  జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి  చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘
‘కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా ‘వినదగునెవ్వరుచెప్పిన’ పాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.’
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ?
వేచి చూడాలి.
(20-08-2013 – 10 AM)     

               

19, ఆగస్టు 2013, సోమవారం

SENIOR JOURNALIST JONNALAGADDA RADHAKRISHNA IS NO MORE

SENIOR JOURNALIST JONNALAGADDA RADHAKRISHNA IS NO MORE
------------------------------------------------------------------------------
A senior journalist JONNALAGADDA RAADHAKRISHNA, who has been working since three and half decades with several organisations, has breathed his last just one hour back with massive heart attack. Earlier he was with Andhra Patrika, Udayam, Andhra Bhoomi, UNI, NSS and for some time a casual news reader in AIR. His son who is in abroad is expected tomorrow and according to his family sources the final rites may take place day after tomorrow.
May his soul rest in peace.

కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే?


“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూటన్ కట్టుకొని పోవంజాలిరే?...........................”
ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు ఈ  లోకంలో ఏదీ శాశ్వితం కాదన్న భావాన్ని బలి వ్యక్తం చేసే సందర్భం.
పోతనగారి కవితా భావావేశాన్ని ఇక్కడికి వొదిలి చికాగో లోని ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో జరిగిన ఒక సమావేశం గురించి చెప్పుకుందాం. ఆ రోజు  ఆ హోటల్లో ఏడుగురు అతిరధ మహారధులు సమావేశం అయ్యారు. వారిలో ఎవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఎందుకంటే ఇదంతా  తొంభయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. 1923లో జరిగిన ఈ సమావేశానికి హాజరయిన గొప్పగొప్ప వాళ్ళందరూ కేవలం పాతికేళ్ళ కాలం గడిచేసరికి  ఏమయ్యారో చెప్పడానికే పోతనగారి పద్యం జ్ఞాపకం చేసుకోవాల్సివచ్చింది.
వారిలో ఒకరు  అతిపెద్ద ఉక్కు కర్మాగారం – బెత్లేహం స్టీల్ కార్పోరేషన్ అధిపతి చార్లెస్ ఎం. స్కెవాబ్. కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి   దివాళా తీసి దీన స్తితిలో  చనిపోయాడు.
అప్పట్లో అతిపెద్ద పెట్రోలు కంపెనీ అధినేత హోవార్డ్ హబ్ సన్. పాపం మతిచెడిన స్తితిలో ఈ అపర కుబేరుడు కన్ను మూసాడు.
గోధుమ వ్యాపారంలో కోట్లు గడించిన సంపన్నుడు ఆర్ధర్ క్యుతెన్ సర్వస్వం కోల్పోయి అతి పేదరికంలో అంతిమ శ్వాస విడిచాడు.
ఆరోజుల్లో న్యూ యార్క్ స్టాక్ ఎక్చేంజ్ చైర్మన్ రిచర్డ్ విట్నీ జైలు పాలయ్యాడు.
ప్రెసిడెంట్ హార్డింగ్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి ఆల్బర్ట్ ఫాల్  కొంతకాలం జైలు వూచలు లెక్కబెట్టాడు. క్షమాబిక్ష పొంది ఇంటికి వెళ్ళిన కొద్దికాలానికే మరణించాడు.
వాల్ స్ట్రీట్  షేర్ల వ్యాపారంలో చేయితిరిగిన జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలనాడు వ్యాపార సామ్రాజ్యాన్ని కంటి చూపుతో శాసించిన ఇవార్ క్రుగర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ నేషనల్ సెటిల్ మెంట్ బ్యాంక్  ప్రెసిడెంట్ లియోన్ ఫ్రేజర్ సైతం ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
అతి పెద్ద యుటిలిటీ కంపెనీ అధినేత అయిన సామ్యూల్ ఇన్సల్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అసువులుబాసాడు.
వీరంతా డబ్బు యెలా సంపాదించాలి అన్న యావలోనే జీవితాల్ని గడిపారు కానీ యెలా జీవించాలి అన్న విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదు.
డబ్బు చెడ్డది కాదు. మనిషికి అత్యవసరమైన  కూడూ గుడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ధనం అవసరమే. కానీ అదే సర్వస్వం కాదు. అది శాశ్వితం కూడా కాదు. అలనాడు బలి చక్రవర్తి చెప్పింది అదే.
(నెట్లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి సంక్షిప్తంగా స్వేచ్చగా చేసిన అనువాదం)  


దడిగాడువానసిరా



సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది తప్పున్నరతప్పు అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అన్నది మా వాడి థియరీ! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. 
కాకపోతే అర్ధంలేని అనుమానాలతో,  కుట్రలు, కుతంత్రాలతో కూడిన బహిరంగ, జనాంకిత ప్రకటనలతో - అనంతంగా సాగే డైరీ సీరియళ్ళలోని ‘ఆడతనం’ మచ్చుకు కూడా లేని ఆడపాత్రలు - ఎప్పుడో ఒకప్పుడు, వాణిజ్య ప్రకటనలకు కాస్తముందో వెనకో - వీలుచూసుకుని, వీలుచేసుకుని, ప్రక్కవాళ్ళ డైరీలనో, ఉత్తరాలనో చదివే అమూల్య అవకాశం లేని పక్షంలో - ఆదిక్కుమాలిన అనుమానాలు తీరిపోయే సువర్ణావకాశం తప్పిపోయి,  ఇక ఆ సీరియళ్ళు  అనంత విశ్వంలో దారి తప్పిన రోదసీ నౌకల్లా అలా, అలా, అలా, అలా, అలా, ఏళ్ళ తరబడి అనంతంగా సాగిపోయే మహత్తర ప్రమాదం లేకపోనూలేదన్నది మా సుబ్బారావు వాదన.
ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు,  చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్  టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు.  వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని  విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన,  వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది పోస్ట్ ట మాస్టరుగా తనకున్న కాపీరైట్‌గా భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా పాటిస్తుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?'  అంటూ ఆరాలు తీసేవాడు.  ఇలా చాన్నాళ్లు  అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం.  కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ  - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.
తాజాతోక
ఈ శీర్షికకు `మనసులో మాట' అనే పేరు పెట్టడం వల్లా అలాగే చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ,  ఆ పదాలపై అన్ని స్వామ్యములు ఈప్రజా స్వామ్యదేశంలో,   ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. 

18, ఆగస్టు 2013, ఆదివారం

ఔదార్యం

"శ్రీవారికి 
'
ముక్కోపం తగ్గించుకోకపోయినా పరవాలేదు,కానీ చారిటీ అనే గుణం కొంచెం పెంచుకోండి.తరవాత ఏ చీకాకులు వుండవు.
ఔదార్యం పెంచుకోవడం అనేది ఎవరికోసమో కాదు, మీ కోసమే.
అది లోపించడం వల్ల మీరు ఏమి కోల్పోతున్నారో మీకు తెలియదు.ఎదుటివారి లోపాలనూ-బలహీనతలనూ, ఔదార్యంతో క్షమించే ఆర్థ్ర్ర హృదయానికి ఎంతటి  ఆనందం లభిస్తుందో మీరు అర్థం చేసుకోవడం లేదు.
అందుకే మళ్ళీ చెబుతున్నాను.
మీ అనందం కోసమే-
మీ జీవిత మాధుర్యం కోసమే
కాసింత  ఔదార్యం పెంచుకోండి.
తప్పుచేయడం మానవ లక్షణం
క్షమించడం మానవీయ గుణం అంటారు కానీ-
నన్నడిగితే
తప్పుచేయడం మానసిక దౌర్బల్యం
క్షమించడం మానవ సంస్కారం '
-
ఓ శ్రీవారికి ఓ శ్రీమతి (నన్నడిగితే అందరి శ్రీమతులదీ ఇదే మాట)

17, ఆగస్టు 2013, శనివారం

నీటిలా సాగిపోవాలి!

 


వియత్నాం వీరుడు హోచిమిన్ తన జ్ఞాపకాలలో ఇలా రాసుకున్నారు.





నాకప్పుడు తొమ్మిదేళ్ళు. స్కూలు పరీక్ష తప్పాను. నాకొచ్చిన మార్కులు చూసుకుని ఎంతో బాధ పడ్డాను. జీవితం వృధా అనిపించింది. యావత్ ప్రపంచం నన్నో పనికిమాలినవాడిగా చూస్తున్న భావన కలిగింది. ఆ మానసిక వేదనతో వున్ననేను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. ఐతే, మా నాన్నగారు నామానసిక స్తితిని కనిపెట్టారు. తండ్రిగా దగ్గరకు తీసి లాలించారు. పరీక్ష పాసవడం ఒక్కటే జీవితంలో ప్రధానం కాదన్నారు. మా అమ్మ మరీను. ఎంతో ఆప్యాయంగా మృదువయిన మాటలతో నాకు సర్దిచెప్పింది. నా మనోవేదనను చేత్తో తీసివేసినట్టు మాయం చేయడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. మా కుటుంబానికి ఎల్లవేళలా దన్నుగావుండే మాఇంటి ఆధ్యాత్మిక గురువు గారు నాకు మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ఆ సమయంలో వారినుంచి నాకు లభించిన భరోసా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసిందనే అనుకున్నాను. అయినా, నాలో గూడుకట్టుకుపోయిన దైన్యం తొలగిపోలేదు. అధైర్యం మాసిపోలేదు. వారి మాటలతో, చేతలతో తెచ్చిపెట్టుకున్నకూసింత ధైర్యం కాస్తా మరునాటికే జావకారిపోయేది. నిరాశ ,నిస్పృహ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక ఓ రాత్రి ఇంటి నుంచి పారిపోయాను.


అలా దిక్కుతోచకుండా తిరుగుతూ ఒక బౌద్ద ఆరామం చెంతకు చేరుకున్నాను. బౌద్ద బిక్షువు ఒకరు సుమధురంగా ఆలపిస్తున్న ప్రార్ధనా గీతం నా చెవిన పడింది. అతడు పాడుతూనే వున్నాడు. నేను వింటూనే వున్నాను.


నీరు స్వచ్చంగా ఎలావుంటుంది? ఎందుకంటె అది నిరంతరం పారుతూనే వుంటుంది. అలా పారే నీటికి అడ్డంకులు వుండవా? వుంటేనేం నీటికి వున్న పారే గుణం ఆ అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. ఒక నీటి బొట్టు ఓ పెద్ద జలపాతంలా ఎలా మారుతుంది ? ఎందుకంటె దానికున్న పారే గుణమే దానికా శక్తి నిచ్చింది. ఆ జలపాతం ఒక వాగులా, ఆ వాగు ఓ నదిలా ఎలా రూపం మార్చుకుని సముద్రం లో కలుస్తుంది ? ఎందుకంటె ఒకే జవాబు. నీటికి వున్న పారే ఆ లక్షణమే దానికి కారణం.


అందుకని ఓ నా జీవితమా! ఎక్కడా ఆగిపోకు. నిరంతరం సాగిపోతూవుండు. పారుతూనేవుండు. అలా అలా సాగిపోతూనే వుండు.


ఆ గీతం వింటూ చాలాసేపు నన్ను నేను మరచిపోయాను. ఎంత గొప్ప భావం. ఎంత చక్కని సందేశం. చలనం లేని ప్రపంచం ఎంత నిరర్ధకం. 


ఆ బౌద్ద బిక్షువు ప్రార్ధన నాలో కొత్త మనిషిని తట్టిలేపింది. అంతే! అప్పటినుంచి నేను నిరంతరం పారే నీటిలా మారిపోయాను. నాటినుంచి ఇప్పటివరకు సదా ప్రవహిస్తూనే వున్నాను. ఎక్కడా ఆగిపోలేదు. అన్నిచోట్లకూ వెళ్ళ గలుగుతున్నాను. అందరినీ చేరగలుగుతున్నాను. ఎందుకంటె సతతం పారే నీటి గుణాన్ని నేను కూడా అలవరచుకున్నాను కనుక. కనుకే, ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతున్నాను.అని తన స్మృతుల్లో రాసుకున్నారు- మహా నాయకుడు, అశేష జనాలకు పద నిర్దేశకుడు అయిన హోచిమిన్. 



16, ఆగస్టు 2013, శుక్రవారం

శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి

 శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి 
మా అమ్మగారు శ్రీమతి వెంకట్రావమ్మ గారు గతించి రెండు దశాబ్దాలు గడిచాయి.  ఈ నెల పద్దెనిమిదో తేదీ ఆదివారం ఆవిడ ఆబ్దీకం. ఆమె చనిపోయిన రోజు ఇంకా కళ్ళకు కట్టినట్టు వుంది. అది శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఆవిడకు వొంట్లో బాగా లేదని తెలిసి అంతా వచ్చారు. ఇంటి కోడళ్ళు అందరూ శుక్రవారం నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆవిడ వారి నోములకు, వాయినాలకు ఆటంకం కలిగించకుండా అన్నీ పూర్తయ్యేవరకు వుండి ఆ తరువాత కన్ను మూసింది. దహన సంస్కారాలు పూర్తికాగానే, మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు ఆమె అపరకర్మలు కాశీలో జరపాలని ప్రతిపాదించడం, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, బావగార్లు అందరం వారణాసి వెళ్లి ఆ పవిత్ర ప్రదేశంలో గంగా తీరంలో పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడవడం అంతా ఓ కలలా జరిగిపోయింది.

(కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ గారు)

మా నాన్నగారు రాఘవరావు గారు చనిపోయి అనేక దశాబ్దాలు దొర్లిపోయాయి. నా చిన్నతనంలోనే కన్నుమూయడం వల్ల,  ఆయన రూపం కూడా నాకు గుర్తు లేదు.  ఆయన ఆబ్దీకాలను మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అత్యంత శ్రద్దాసక్తులతో  ప్రతియేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. మా స్వగ్రామంలో వరుసగా నలభయ్ యాభై ఏళ్ళపాటు జరుగుతూ వచ్చిన  ఈ ఆబ్దీకాలు,  కాలక్రమంలో  వాస్తవంగా ఒక పండుగ మాదిరిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలందరూ ఓ శుభకార్యానికి వచ్చినట్టు హాజరయ్యేవారు. పిల్లలు, వారిపిల్లలు, వారి పిల్లలు  ఇలా అందరూ,  అదొక తద్దినం అనే  కన్నా కూడా నలుగురు కలిసి  ‘పెద్దల’ను సంస్మరించుకునే ఒక అవకాశంగా భావించి,  ఒకరికొకరు  కూడబలుక్కుని  ఆరోజుకల్లా అంతా ఠంచనుగా ఓ దారీతెన్నూ లేని  ఆ చిన్న పల్లెటూరు మా వూరు  చేరుకునేవారు. నిజానికి ఈ యావత్ కార్యక్రమానికి వెన్నుదన్ను మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు. ఆయన మా వూరు కరణీకం చేసేవారు. ప్రతియేడూ మా నాన్న తద్దినానికి పెళ్ళికి పంపినట్టు అందరికీ పేరుపేరునా  వర్తమానాలు పంపేవారు. మా నాన్న ఆబ్దీకం అంటే మా వూళ్ళో ఓ సందడి. వూరబంతి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే తద్దినాలు ఘనంగా జరిగేవని చెప్పుకునేవారు.
ఇన్నేళ్ళ తరువాత కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అన్ని సంవత్సరాలుగా అంత శ్రద్ధగా ఘనంగా మా అమ్మానాన్నల తద్దినాలను బాధ్యతగా  నిర్వహిస్తూ వచ్చిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు ఈ నాడు మా మధ్యన లేకపోవడం మేమందరం  తట్టుకోలేకపోతున్న ఓ విషాద పరిణామం. మూడో అన్నయ్య ఏకంగా మా వూరిలో ‘అమ్మానాన్నల గుడి’ నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడా గుడి పక్కనే వారిద్దరి స్మారక చిహ్నాలు నిర్మించి మా అన్నయ్య పిల్లలు ఆయన ఋణం కొంతమేర తీర్చుకున్నారు.



(కంభంపాడులో మా అన్నయ్య కట్టించిన 'అమ్మానాన్నల గుడి)


(మా పెద్దన్నయ్య, మూడో అన్నయ్యల స్మారక చిహ్నాలు)



పోతే, చావంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుని, తద్దినం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని స్తితిలో పెరుగుతూ వచ్చిన నేను,  వూహ తెలిసే నాటికే తద్దినం పెట్టే కర్త  తమ్ముడి పాత్రలో వొదిగిపోయాను. మా రెండో అన్నయ్య  రామచంద్రరావు గారు దత్తు పోవడం వల్ల, చివరికి మిగిలింది నేనే కావడం వల్ల ఏటా మా అమ్మానాన్నల తద్దినాలు కర్తగా కూర్చుని  పెట్టే అవకాశం – ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి – నాకు లభించింది. దాదాపు కాపురానికి వచ్చింది లగాయతు మా పెద్ద వొదినె గారు శ్రీమతి  సరోజినీ దేవి, రెండో వొదినెగారు శ్రీమతి  విమలాదేవి, మూడో వొదినెగారు శ్రీమతి  అరుణా దేవి మడికట్టుకుని  తడిబట్టలతో ఎంతో శ్రద్ధతో  ఈ పవిత్ర కార్యానికి తోడ్పడుతూ వచ్చారు. గత కొన్నేళ్ళుగా ఈ బాధ్యతను  మా ఆవిడ నిర్మలాదేవి నెత్తికెత్తుకుంది.


(అమెరికాలో అమ్మ తద్దినం)

దాదాపు  అరవై ఏళ్ళుగా  మా నాన్నగారి ఆబ్దీకం, సుమారు రెండు దశాబ్దాలుగా మా అమ్మగారి తద్దినం   క్రమం తప్పకుండా నిర్వహించే భాగ్యం   నా పూర్వజన్మ సుకృతం.  నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా పెద్దవాడు సందీప్  పూనుకుని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ కూడా ఏలోటూ రాకుండా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించగలిగాను. అందుకే అందరికీ కృతజ్ఞతాంజలి. గతించిన పెద్దలకు శ్రద్ధాంజలి. – భండారు శ్రీనివాసరావు  (17-08-2013)