9, ఆగస్టు 2013, శుక్రవారం

భండారు వంశం (స్వగతం)


బాల్యం. ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించడమే కాని వాటిని ఎలా సంపాదించుకోవాలనే తాపత్రయం వుండదు. ప్రేమను పూర్తిగా పొందడమే కాని తిరిగి పంచే పూచీ వుండదు.
గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
నాకు కూడా చిన్ననాటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడని గారాబం చేయడంతో మంకుతనం, ముట్టె పొగరు కర్ణుడి కవచకుండలాల మాదిరిగా సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దల జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. చేతినిండా నెయ్యి వేయలేదని గుక్క తిరగకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. వాళ్ళు ఏది అడిగితె అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి తెలుసు కనుక   ఇక ఇది పని కాదనుకుని ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం – ఎందుకు నచ్చానో తెలియదు కాని – నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును  కూడా తోడు  తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడిని. కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే తగిలిస్తాడు. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో!

ఒకటి పక్కన 34 సున్నాలు




గణితములో భారతీయులది  ఎంతో వినుతికెక్కిన ఘనత.  వారు అంకెలను ఎంత వరకు చదవగలరో చూడండి. మన పాత పెద్ద బాల శిక్ష పుస్తకాలలో అనంత కోటి లెక్క ఇలా ఉంది.
1-
ఏకం
10 -
దశమం
100 -
శతం (2 సున్నాలు)
1000 -
సహస్రం (3 సున్నాలు)
10000 -
దశ సహస్రం, అయుతం (4 సున్నాలు)
100000 -
లక్ష (5 సున్నాలు)
1000000 -
దశ లక్ష (6 సున్నాలు)
10000000 -
కోటి (7 సున్నాలు)
100000000 -
దశ కోటి (8 సున్నాలు)
1000000000 -
శత కోటి (9 సున్నాలు)
10000000000 -
అర్భుదము (10 సున్నాలు)
100000000000 -
న్యర్భుదము (11 సున్నాలు)
1000000000000 -
ఖర్వము (12 సున్నాలు)
మహా ఖర్వము (13 సున్నాలు)
పద్మము (14 సున్నాలు)
మహా పద్మము (15 సున్నాలు)
క్షోణి (16 సున్నాలు)
మహా క్షోణి (17 సున్నాలు)
శంఖము (18 సున్నాలు)
మహా శంఖము (19 సున్నాలు)
క్షితి (20 సున్నాలు)
మహా క్షితి (21 సున్నాలు)
క్షోభము (22 సున్నాలు)
మహా క్షోభము (23 సున్నాలు)
నిధి (24 సున్నాలు)
మహా నిధి(25 సున్నాలు)
పర్వతము (26 సున్నాలు)
పరార్ధము (27 సున్నాలు)
అనంతము (28 సున్నాలు)
సాగరము (29 సున్నాలు)
అవ్యయము (30 సున్నాలు)
అచింత్యము (31 సున్నాలు)
అమేయము (32 సున్నాలు)
భూరి (33 సున్నాలు)
మహాభూరి (34 సున్నాలు)

మంచి మనుషులు – మంచి మనసులు



మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ఆయనమొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు. సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదలదాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి దృష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. లేదు అని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసాక  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో అతగాడిని ఉద్యోగం నుంచి అర్ధాంతరంగా  తొలగించారు. అంతటితో ఆగలేదు, అతడిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. కానీ మన మేయర్ గారున్నారే,  ఆయన అలాటిలాటి అల్లాటప్పా  రాజకీయ నాయకుడు కాదు. కనుకనే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని జైలు నుంచి  విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. అంటే ఏమిటి? స్తానిక సంస్తలకు అలనాటి  బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట. అలాటి విశాల తత్వాన్ని ఈనాటి స్వతంత్ర భారతంలో మన  పాలకులనుంచి ఆశించగలమా?


ఆ మేయర్ మహాశయుల పేరు స్మరించుకుందాం.  దేశబంధు బిరుదు పొందిన స్వాతంత్య్ర సమర యోధుడు  చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో హింసా మార్గం అవలంబించినా  తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)

8, ఆగస్టు 2013, గురువారం

ఊరక కారు 'మహాత్ములు'





మహాత్మా గాంధి జైల్లో వున్నప్పుడు కస్తూరి బా, ఆయన్ని  చూడడానికి వెళ్లారు. 
భార్యాభర్తలకు మాట్లాడుకునే ఏకాంతం కల్పించాలనే  సదుద్దేశ్యంతో జైలు సార్జంటు వారిని  వొంటరిగా వొదిలేసి ఓ అరగంటసేపు బయటకు వెళ్లాడు. కస్తూరి బా వెళ్ళిన తరువాత భార్య యోగక్షేమాలు అడిగారా, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారా ? వాళ్ళెలా వున్నారు?’ అంటూ  యధాలాపంగా గాంధీని అడిగాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఆ బ్రిటిష్ అధికారిని నివ్వెర పరచింది.
జైల్లో వున్నప్పుడు ఇక్కడి నియమాలను పాటించి తీరాలి. జైలు సిబ్బంది పరోక్షంలో సొంతమనుషుల వద్ద కూడా నోరు విప్పకూడదని నాకు తెలుసు. అందుకే మీరు వెళ్ళి తిరిగివచ్చేదాకా మా ఆవిడతో నేను ఏవీ మాట్లాడకుండా మౌనం పాటించాను
గాంధీ ఇంకా ఇలా అన్నారు.
మీరు బయటకు వెళ్ళకుండా వుండి వుంటే నేను నా భార్యతో ఏవయినా సంగతులు ముచ్చటించి వుండేవాడినేమో. మీరు లేకపోవడంతో నాకు ఆ అవకాశం లేకుండా పోయింది
సార్జంటుకు నోటమాట రాలేదు. నెత్తి మీది టోపీ తీసి గాంధీకి వొంగి నమస్కారం చేసిన సంగతి కూడా వేరుగా  చెప్పేపనిలేదు. 
ఆయన అందుకే మహాత్ముడు అయ్యాడు.


(From some classic english narrations of Shri AS Murthy, Dy. Director, Ramakrishna Math during his speech  at TTD Tiru Nilayam Hyderabad, on 28.3.2013.)

‘అ ఆ లనుంచి ఆకాశం అంచులదాకా.........’

భండారు వంశం (కొత్త అధ్యాయం)
ఇంతవరకు కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారి కధనం. ఇక మా మూడో అక్కయ్య శ్రీమతి తుర్లపాటి సరస్వతి చెప్పిన  చిన్ననాటి ముచ్చట్లు.

‘అ ఆ లనుంచి ఆకాశం అంచులదాకా.........’ 
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో


రుక్మిణీ  కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరుపదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీ దేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది  ఎవరో కాదు నా చెల్లెలు అన్నపూర్ణ. మధ్యలో మంచంలో మా బామ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట  పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరో శ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.  


(మా మూడో అక్కయ్య గారు శ్రీమతి తుర్లపాటి సరస్వతి)  



ఎనభై ఏళ్ళ క్రితం సంగతి  .....
ఇప్పటికీ కుగ్రామంగా వున్న మా వూరు కంభంపాడు అప్పుడు  ఎలావుండి వుంటుందో  వూహించుకోవాల్సిందే.

మా నాన్నగారు వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. నా తరువాత పుట్టిన అన్నపూర్ణను పక్కవూరు పెద  కరణం గారి అబ్బాయి అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేసాము. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే కొత్త అల్లుడు గుర్రం మీద అత్తగారింటికి వచ్చినప్పుడు  గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు (ఆదాయం లేదా రాబడి) మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తు కట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.  (మరో భాగం మరో సారి)

7, ఆగస్టు 2013, బుధవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)
మా రెండో అన్నగారిది పెద్దలు నిర్ణయించిన పెళ్లి. వివాహం నాటికి వధూవరులిద్దరూ చాలా చిన్నవాళ్ళు. వాళ్ళే చిన్నవాళ్ళయినప్పుడు ఇక నాకు ఆ పెండ్లి విషయాలు గుర్తుండే వీలేలేదు. కాకపొతే విన్న సంగతుల ఆధారంగానే రాయాలి.


(పెళ్ళినాడు మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు - వొదినె శ్రీమతి విమలాదేవి)  

ఆడపెళ్ళి వాళ్ళు, మగపెళ్లివాళ్ళు ఒకరికొకరు బాగా తెలిసినవాళ్ళు. ఒకే వూరు.  వాళ్ళది మాదీ  ఒకే వీధి కాక పోయినా పక్క వీధిలో పక్కిల్లే. ఈ ఇంట్లో వసారాలోనుంచి చూస్తే ఆఇంట్లో పెరట్లో వున్న వాళ్ళు కనబడతారు. పైగా రెండు కుటుంబాల్లో రాకపోకలు హెచ్చు.  వియ్యంకుడి తల్లిగారు లలితమ్మ గారు సాయంత్రం అయ్యేసరికల్లా ఠంచనుగా మా ఇంటికి  మా బామ్మకోసం వచ్చేది. ఆ పెళ్లి చూసిన వాళ్ళు అచ్చు బొమ్మల పెళ్లి అని చెప్పేవారు. పెట్టుపోతలు, అలగడాలు, ఆడంబరాలు లేకుండా అచ్చు పెళ్లిలా జరిగిన పెళ్లి.

సరే! ఇది పెద్దవాళ్ళు అనుకుని చేసిన సంబంధం. అదే వూళ్ళో, మా ఇంటి పెద్దహాల్లో పందిళ్ళూ ఏవీ లేకుండా మరో పెళ్లి చేసారు. అది ప్రేమ పెళ్లి.  అక్షరాలా ప్రేమ వివాహమే. పెళ్లి కూతురు పేరు ప్రేమ. అంటే మా ఆరో అక్కయ్య. వరుడు అక్కడెక్కడో వరంగల్ జిల్లాలో మానుకోట దగ్గర ఈదులపూసపల్లి వాస్తవ్యులు.  దీనికి కొంత నేపధ్యం వుంది. అంతకుముందు మా ఇంట్లో మరో ప్రేమ వివాహం లాటి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. మా పెద్దన్నయ్య  పర్వతాలరావుగారు ఇరు పక్షాల పెద్దలను వొప్పించి అత్యంత నిరాడంబరంగా మా వొదినె గారు సరోజినీ దేవిని – మేనరికం – చేసుకున్నారు. మా మేనత్త అంటే మా వొదినెగారి తల్లి – (గండ్రాయి అత్తయ్య అనేవాళ్ళం)  తాలూకు వాళ్ళు వరంగల్ జిల్లా మానుకోటలో వుంటారు. (నిజానికి వారిది మా అమ్మ పుట్టిల్లు అయిన గండ్రాయి. మా వూరికి దగ్గరలోనే వుండేది.)


(ఈదులపూసపల్లిలో ఇంటి ముందు మా బావగారు, అక్కగారు) 

మూడునిద్రలకు ఆ వూరువెళ్లినప్పుడు వెంట మా ప్రేమక్కయ్య కూడా వెళ్ళింది. అక్కడ దేశముఖ్ పింగిలి వెంకటరామారావు గారి మూడో కుమారుడయిన  మధుసూదన రావుగారు మా అక్కయ్యను చూడడం, తొలి చూపులోనే ప్రేమించడం, ఆ తరువాత ‘అంగీకారం అయితే పెళ్ళిచేసుకోవడానికి సిద్ధం’ అని  మా వాళ్లకు ఉత్తరం రాయడం,   దరిమిలా   నేరుగా మా వూరికే   వచ్చి పెళ్ళాడి తీసుకువెళ్ళడం చకచకా జరిగిపోయాయి. ఆ పెళ్లి ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం నాడు జరగడం విశేషం.  అలా మొదలయిన ప్రేమ పెళ్ళిళ్ళు మా కుటుంబంలో తదనంతర కాలంలో తామరతంపరగా వర్ధిల్లాయి. కట్న కానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే పధ్ధతికి కూడా  అప్పుడే బీజం పడింది. మా అక్కయ్యల ఇళ్ళల్లో  దాదాపు మగపిల్లలు అందరూ  కట్నాలు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. (మరో భాగం మరోసారి)                                  

6, ఆగస్టు 2013, మంగళవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)
మా కుటుంబం మొత్తంలో భండారు సుబ్బారావు తాతగారి తరహానే  వేరు. పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి సాయం చేస్తూ  వుండేవారు. తరచుగా సతీసమేతంగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు.కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండు’ అనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు.


(సుబ్బయ్య తాతయ్య - సీతం బామ్మ) 

మా నాన్నగారికీ, లక్ష్మయ్య తాతయ్య గారికీ నడుమ జరిగిన తగాదాల్లో సుబ్బయ్య తాతయ్య ఎప్పుడూ నాన్న పక్షానే నిలబడేవాడు. నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో ఆయన ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడే వాడు. ఒకసారి, అప్పుడు నాకు (భండారు పర్వతాలరావు) పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. సందర్భం జ్ఞాపకం లేదు కాని అనవసరంగా ఆవేశపడి ఆయనతో మాట తూలాను. నా మాటల్లో తీవ్రత చూసి ఆయన ఆశ్చర్య పడ్డాడే కాని కోపం తెచ్చుకోలేదు. తరువాత  నా తప్పు తెలుసుకున్నాకాని, ఆయన మనస్సు గాయపడింది అన్న విషయం కూడా బోధపడింది. చాలామందికి తెలియదు కాని నాది కోపిష్టి  మనస్తత్వం. అనాలోచితంగా, అనుచితంగా ప్రవర్తించడం, పెద్దవారిని నొప్పించడం దురదృష్టవశాత్తు పరిపాటి అయిపోయింది. భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది. ఆయన ఔదార్యం మళ్ళీ, ఆయన పెంపకానికి తీసుకున్న మా రెండో తమ్ముడు రామచంద్రరావుకు వచ్చింది. మొత్తం కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కనిపెట్టి చూసే మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాడు. దత్తు పోవడంవల్ల అదనంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా ఎప్పుడూ తన సొంతం అనుకోలేదు. ఈ సద్బుద్ధి మా తమ్ముడి పిల్లలకు కూడా వుండడం వల్ల ఆస్తుల విషయంలో మా కుటుంబంలో ఎలాటి పొరపొచ్చాలు తలెత్తలేదు. మా నాన్నగారు, తాతగారు పోయి అనేక దశాబ్దాలు గడిచినా ఇంతవరకు మా మధ్య , మా పిల్లల  మధ్య ఆస్తి పంపకాలు జరగలేదు. కంభంపాడు ఇల్లు, పొలాలకు సంబంధించి ఈనాటి వరకు మాది ఉమ్మడి కుటుంబమే. తమ్ముడు రామచంద్రరావు భార్య విమల కూడా,  చివరి రోజుల్లో మంచానపడిన  మా సుబ్బయ్య తాతగారికి ఎంతో సేవచేసింది.
అదేమిటో ఖర్మ తెలియదు కాని, మా కుటుంబంలో మగవాళ్ళు చివరి రోజుల్లో మంచానపడి, అవస్థలు పడి తీసుకుని తీసుకుని  పోయారు. మా నాన్నగారు దాదాపు మూడునెలలు మంచంలో వున్నాడు. లక్ష్మయ్య  తాతగారి పరిస్తితి మరీ దయనీయం. చెట్టంత ఎదిగిన మనుమడు సత్యమూర్తి ఆయన కళ్ళముందే అకాల మరణం చెందడం దారుణం. అందరిలోకి అదృష్టవంతురాలు ఆయన భార్య వరమ్మగారు. చనిపోయేముందు మొగుడి కాళ్ళు తన దగ్గర పెట్టుకుని, అందరికీ అన్నీ అప్పగింతలు పెడుతూ, ఏదో రైలుకు వెళ్ళేదానిలా హాయిగా అనాయాసంగా దాటిపోయింది.


(కంప్యూటర్లు లేని రోజుల్లో తొడమీద కాగితం దస్త్రాలు పెట్టుకుని వేల పేజీలు  కేవలం ధారణశక్తితో బాల్ పాయింటు పెన్నుతో రాస్తూ మా చరిత్రను గ్రంధస్తం చేసిన దార్శనికుడు, మా చోదక శక్తి, మా పెద్దన్నయ్య - కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారికి  యావత్ భండారు వంశం తరపున ఇవే కైమోడ్పులు. 2006  ఆగస్టు 21 న పుట్టపర్తిలో  కన్నుమూసిన ఆ  మహానుభావుడి  వర్ధంతి ఈ ఏడాది తిధుల ప్రకారం వచ్చే నెల మూడో తేదీ.)    


(మరో భాగం మరోసారి)