24, జులై 2013, బుధవారం

భండారు వంశం గోత్ర నామాలు


(చనిపోయిన వారి వివరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది, తద్దినాలు  తదితర అపర కర్మల సందర్భాలలో వాడుకోవడం కోసం)  

తండ్రి : రాఘవేశ్వర శర్మ (రాఘవరావు గారు)  - పరాశర గోత్రం 

తాత: (తండ్రి తండ్రి) పర్వతాలేశ్వర శర్మ (పర్వతాలయ్య గారు)  - పరాశర గోత్రం 

ముత్తాత :  (తండ్రి తాత) రామేశ్వర శర్మ (రామయ్య గారు) - పరాశర గోత్రం 

తల్లి : వెంకట్రావమ్మ -  పరాశర గోత్రం 

బామ్మ: (తల్లి అత్తగారు-తండ్రి తల్లి) రుక్మిణమ్మ  - పరాశర గోత్రం

బామ్మ తండ్రి : చిదంబరం -  రోహితస గోత్రం

బామ్మ తల్లి : చెల్లమ్మ (చెల్లమ్ముమ్మ) -  రోహితస గోత్రం 

బామ్మ తాత : సీతారామయ్య - పరాశర గోత్రం 

బామ్మ బామ్మ:  వెంకటమ్మ - పరాశర గోత్రం 

తాత (తల్లి తండ్రి) : కొండపల్లి శ్రీనివాస రావు -  శ్రీవత్స గోత్రం

ముత్తాత (తల్లి తాత) : కృష్ణారావు - శ్రీ వత్స గోత్రం

పినతండ్రి  : రామప్రసాదరావు (ప్రసాదం బాబాయి) - పరాశర గోత్రం

పినతండ్రి భార్య :  రాంబాయి -  పరాశర గోత్రం

పినతాత : భండారు లక్ష్మీనారాయణ (లక్ష్మయ్య తాతయ్య) -  పరాశర గోత్రం

పినతాత భార్య :  వరలక్ష్మి (వరం బామ్మ) - పరాశర గోత్రం

పినతాత : భండారు సుబ్బారావు (సుబ్బయ్య తాతయ్య) -  పరాశర గోత్రం

పినతాత భార్య : సీతమ్మ (సీతం బామ్మ) - పరాశర గోత్రం

మేనత్త : రంగనాయకి (రంగమ్మత్తయ్య) - కాశ్యపస 

మేనమామ (మేనత్త భర్త) : కొలిపాక లక్ష్మీనరసింహారావు -  కాశ్యపస 

మేనత్త : కమలాబాయి (చిన్నత్తయ్య) -  కాశ్యపస 

మేనత్త భర్త : పర్చా శ్రీనివాసరావు - కాశ్యపస 

మేనత్త : సీతమ్మ  (చిదంబరం అత్తయ్య) - కాశ్యపస

మేనత్త భర్త  : లక్ష్మీనరసింహారావు -  కాశ్యపస 

పెత్తల్లి  : చుక్కమ్మ - గౌతమ గోత్రం 

పెత్తల్లి భర్త  : వెంకట నరసయ్య -  గౌతమ గోత్రం

మేనమామ :  కొండపల్లి  శ్రీ రామచంద్రరావు - శ్రీ వత్స గోత్రం

మేనమామ భార్య :  రాజ్యలక్ష్మి (రాజమ్మత్తయ్య) - శ్రీ వత్స గోత్రం 

మేనమామ : కొండపల్లి  కృష్ణారావు -  శ్రీ వత్స గోత్రం

మేనమామ భార్య :  వెంకట సుబ్బాయమ్మ(గండ్రాయత్తయ్య) -  శ్రీ వత్స గోత్రం

మేనబావ : కొండపల్లి   శ్రీనివాసరావు - శ్రీ వత్స గోత్రం

మేనబావ : కొండపల్లి వెంకటేశ్వరరావు - శ్రీ వత్స గోత్రం

అక్క : అయితరాజు రాధ - భరద్వాజ 

బావ : అయితరాజు రాంరావు - భరద్వాజ 

మేనల్లుడు: ఏవీజీ కుమార్ (వెంకన్న) -  భరద్వాజ 

బావ :  కొలిపాక రామచంద్రరావు - కాశ్యపస

బావ : కవుటూరి కృష్ణమూర్తి -  కౌసికస గోత్రం 

మేనల్లుడు : శేషు -  కౌసికస గోత్రం 
బావ : తుర్లపాటి హనుమంతరావు - కణ్వస    

మేనల్లుడు :  తుర్లపాటి రాఘవరావు (పుతక) - కణ్వస 

అక్క:  కొమరగిరి  అన్నపూర్ణ -  భరద్వాజ 

బావ : కొమరగిరి వెంకటప్పారావు - భరద్వాజ

మేనల్లుడు : కొమరగిరి చంద్ర కాంతారావు (చందు) - భరద్వాజ 

మేనల్లుడు : కొమరగిరి రంగారావు (రంగడు) -  భరద్వాజ 

బావ : పింగిలి మధుసూదనరావు  - భారద్వాజస  

అన్నయ్య : భండారు పర్వతాలరావు - పరాశర 

అన్నయ్య : భండారు వెంకటేశ్వర రావు (వెంకప్ప) -  పరాశర 

అన్న (పినతండ్రి కొడుకు) : భండారు సత్యమూర్తి  - పరాశర 

గురువు : హనుమంతరావు గారు - భారద్వాజస గోత్రం

మేనమామ కొడుకు : మోహనరావు - శ్రీ వత్స గోత్రం 

మేనమామ కొడుకు భార్య : యజ్ఞ పదాయి - శ్రీ వత్స గోత్రం

పర్వతాలరావు గారి షడ్డకుడు : భావనారాయణ - భారద్వాజ 

పినతండ్రి  అల్లుడు : పట్టాభిరామారావు - భారద్వాజ 

గురువు : రాఘవరావు - పరాశర 

గురువు : హరినారాయణ – భారద్వాజ

(సేకరించి పెట్టిన భండారు పర్వతాలరావు గారికి కృతజ్ఞతలతో-) 

భండారు వంశం కధాకమామిషు (మొదటి భాగం)


భండారు వంశం ఎప్పుడు మొదలయిందో   ఇదమిద్ధంగా చెప్పడం కష్టం. దీనిని గురించి కొంత పరిశోధన చేసిన శ్రీ భండారు చంద్రమౌళీశ్వరరావు గారు  న్యాయవాది, రచయిత కూడా. వీరిది వరంగల్లు. ఈ విషయంలో వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడదు.  
పోతే, నిజాం షుగర్స్ లో పనిచేసిన కీర్తిశేషులు   శ్రీ భండారు నాగభూషణ రావు గారి  స్వగ్రామం వేములపల్లి. ఆయన చెప్పినదాన్నిబట్టి బసవేశ్వరుడు ఈ వంశానికి ఆదిపురుషుడని తెలుస్తోంది. కొందరు అక్కన్న కూడా ఈ వంశం వాడేనని  అంటున్నారు.
వంశనామాలలో చాలా భాగం వూరి పేర్లు కనిపిస్తాయి. కొడవటిగంటి (కొడవటిగల్లు) మాగంటి (మాగల్లు), వేములపల్లి, తుర్లపాడు మొదలయినవి ఇందుకు ఉదాహరణ. అయితే ‘భండారు’ అనే పేరు తెలుగునాట ఏ ఊరికీ లేదు. మహారాష్ట్రలో ‘భండారి’ అనే ఓ బస్తీ వుంది. ఛత్రపతి శివాజీ దండయాత్రల సమయంలో అక్కడినుంచి కొందరు బ్రాహ్మణులు ఆయనతో పాటు ఆంధ్రదేశం వచ్చి అక్కడక్కడా స్థిరపడినట్టు తెలుస్తోంది. వారిని, భండారి వారని, భండారు  వారని పిలిచే అవకాశం లేకపోలేదు. మా చిన తాతగారు భండారు లక్ష్మీనారాయణ గారు దాచివుంచిన 1878 వ సంవత్సరం నాటి కోర్టు తీర్పు ప్రతిలో వారి తండ్రి, పినతండ్రి- రామయ్య, లక్ష్మయ్యగార్ల  పేర్లను ‘రామయ్య కులకర్ణి, లక్ష్మయ్య కులకర్ణి’ అని ఉదహరించడం కనిపించింది.


లక్ష్మయ్య తాతయ్యగారి కుటుంబం 



భండారు వంశీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా అనే అనుమానానికి దీనివలన కొంత ఆస్కారం చేకూరుతోంది. ‘కులకర్ణి’ అనేది ఆరోజుల్లో గ్రామాధికారి పదవి. అయినా, అది మహారాష్ట్ర నుంచి వచ్చిందే. దేశముఖ్, దేశపాండేలవలె గ్రామాల్లో శిస్తు వసూలుచేసి పెట్టె అధికారం వారికి వుండేది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో కులకర్ణి వ్యవస్థ కనిపిస్తోంది. (మరో భాగం మరోసారి)

(మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు సేకరించి రాసి వుంచిన  వివరాల ఆధారంగా ) 

22, జులై 2013, సోమవారం

గురుద్దేవో నమో నమః !

గురుద్దేవో నమో నమః !  
ఈరోజు గురు పూర్ణిమ.  
సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నానుఅని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడుఅని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.
గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.
ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.
తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు
ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.
మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.
1921 వ  సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.
పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.
ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.


శ్రీ శివరాజు అప్పయ్య పంతులు గారు 

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు  చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.
గురు పూర్ణిమ సందర్భాన్ని  పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -
గురుద్దేవో నమః

(22-07-2013)

21, జులై 2013, ఆదివారం

అత్తా కోడలు


అత్త వసారాలో వాలు కుర్చీలో కూర్చుని విసన కర్రతో విసురుకుంటూ ఆపసోపాలు పడుతుంటే, కోడలు చేటలో బియ్యం చెరుగుతున్న సందర్భంలో ఒక బిచ్చగాడు వస్తే కోడలు 'చెయ్యి ఖాళీ లేదు మళ్ళీ రా' అంది. అతగాడు పోబోతుంటే అత్త కేకేసి పిలిచింది. ఈ మహాతల్లయినా ఏదయినా విదిలిస్తుందేమో అని బిచ్చగాడు ఆశ పడుతుంటే అత్త తన మాటలతో ఇన్ని  నీళ్ళు చల్లింది.' మళ్ళీ రమ్మనడానికి అదెవత్తే! ఆ మాట చెప్పాల్సింది నేను. ఇక పో!'



కాబట్టి అత్త సెంటిమెంటు పనిచేసి అత్త (ఇందిరా గాంధి) మీద కోపంతో అయినా ఈ కోడలు (సోనియా గాంధి) తెలంగాణాపై ఏదయినా నిర్ణయం తీసుకుంటుందేమో వెండి తెరపై చూడాలి.(21-07-2013)

20, జులై 2013, శనివారం

వృత్తి రహస్యం


పర్వీందర్, హబీబ్ ఇద్దరు వృత్తి రీత్యా స్నేహితులు. ఆ ఇద్దరిదీ ఒకటే వృత్తి. లండన్ వీధుల్లో అడుక్కోవడం. ఇందుకోసం ఇద్దరూ చెరో వీధి ఎంపిక చేసున్నారు. పొద్దున్నే బయలుదేరడం, ఓ చౌరస్తా చూసుకుని చతికిలపడడం, ఎవరయినా జాలితలచి ఇచ్చే డబ్బులు పోగుచేసుకోవడం- ఇదీ వారి దిన చర్య.
హబీబ్ జాతకం ఏవిటో కాని ఏరోజూ అతడి జోలిలో పడే డబ్బు రెండు మూడు పౌండ్లు దాటేది కాదు. పర్వీందర్ విషయం అలా కాదు. ప్రతిరోజూ డబ్బుల పంటే. ఎవ్వరు కూడా పది  పౌండ్ల నోటుకు తక్కువ వేసేవాళ్ళు కాదు.
సాయంత్రం అయ్యేసరికి ఎన్నో  నోట్లు అతడికి ధర్మం కింద వచ్చేవి.
ఇద్దరూ బిచ్చగాళ్ళే. కానీ ఈ తేడా ఎందుకో, అడుక్కునే బొచ్చె నెత్తినేసి కొట్టుకున్నా హబీబ్ కి  అర్ధం అయ్యేది కాదు. చివరికి పర్వీందర్ నే అడిగాడు. అతడు బదులుగా మరో ప్రశ్న వేసాడు.
“బిక్షం అడిగేటప్పుడు నువ్వేమని అడుగుతావ్?”
“యేమని అడుగుతాను.పెళ్ళాం రోగిష్టిది. పిల్లలు చిన్నవాళ్ళు. నాకు ఉద్యోగం లేదు. దయచేసి ధర్మం చేయండి అని అడుగుతాను. వాళ్ళు ఒకటో రెండో నోట్లు విదిలించి  వెడతారు.”

“మరి నేనేమి అడుగుతానో తెలుసా? అయ్యా నేను పాకిస్తాన్ తిరిగివెళ్ళాలి.ఒక్క  పది పౌండ్లు మాత్రమె  తక్కువ పడ్డాయి అంటాను. అంతే!”


(20-07-2013)
Image Courtesy Owner

18, జులై 2013, గురువారం

ఈవిడ ఎవరో కాదు ఆడది


చతుర్ముఖ బ్రహ్మ తన విధి నిర్వహణలో భాగంగా జీవరాశులను సృష్టించే క్రమంలో ఒక వినూత్న జీవానికి రూపకల్పన చేసేపనిలో పడ్డాడు. పక్కనే కూర్చుని వీణ వాయిస్తూ భర్త చేతిలో రూపం దిద్దుకుంటున్న స్త్రీ మూర్తిని చూసి అచ్చెరువు చెంది అడిగింది చదువుల తల్లి తన పతి దేవుడిని, ఆవిడ ఎవరని.
బ్రహ్మ తన నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తూ చెప్పాడు.


“ఈవిడ ఆడది. నేను సృష్టికర్తను అన్న పేరే కాని నిజానికి ఈవిడే ఈ సమస్త సృష్టికి కర్త కర్మా క్రియ.   
“అందరు మానవుల్లాగే ఈవిడకూ  రెండు చేతులే. కానీ ఆ రెండింటి తోనే తన సంసారాన్ని యావత్తు సంభాలిస్తుంది. ఆ రెండు చేతులతోనే ఇంటిల్లిపాదికీ వొండివారుస్తుంది. తను తిన్నా తినకపోయినా అందరూ తిన్నారా లేదా అన్న యావలోనే గడుపుతుంది. ఆ రెండు చేతులతోనే పిల్లల్ని లాలిస్తుంది. అత్తమామల్ని ఆదరిస్తుంది. భర్త ఆలనా పాలనా చూస్తుంది. ఇంటికివచ్చేవారిని కనుక్కుంటుంది.
“ఆమె వైద్యురాలు కాదు. కానయియితేనేం అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. అంతే! దానితో  శారీరక రుగ్మతలే కాదు  మానసిక రోగాలు కూడా మటుమాయం.
“ఆమె ఆర్ధిక శాస్త్రనిపుణురాలు కాదు, కానీ జీతానికీ జీవితానికీ పొంతనలేని సంసారాలు  కూడా సర్దుబాటు చేస్తుంది.
“ఆవులు గడ్డి తిని పాలిస్తే, ఈవిడ క్లేశాలను కడుపులో దాచుకుని ప్రేమను పంచి పెడుతుంది.
“మనసు వెన్న. మాట సున్నితం. అందం అమోఘం. ఆకర్షణ అనంతం.
“కానీ నా ఈ సృష్టిలో లోపం లేని జీవి అంటూ వుండదు. ఈవిడకీ ఓ లోపం వుంది. తన సమర్ధత ఏవిటో, తన శక్తి సామర్ధ్యాలు ఏపాటివో ఆవిడకు తెలియవు. అందుకే ‘ఆడదిగానే’ మిగిలిపోతుంది.” (18-07-2013)

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ముందు అంటే పైన అనికాదు, ఈ వ్యాసం శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది అన్న జ్ఞానోదయం అయింది.  దాంతో తెలివినపడి అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండా మునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ నిన్న సాయంత్రం బయట వర్షం పడుతుండగా లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేక  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన చెప్పాడు కూడా.  సాధారణంగా, పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు.  సాక్షాత్తు  ‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారికీ  మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అనేసింది. అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ముఖ్యమంత్రితో పోల్చడం, కాదు కాదు ముఖ్యమంత్రిని నాతొ పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా అనుకున్నాను.
ఏవిటో అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“కిరణ్  కుమార్ రెడ్డి గారి లాగే  నేను మొండివాడ్ని. కాదు నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేరకం.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   
ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (18-07-2013)