5, జులై 2013, శుక్రవారం

హెల్మెట్ ఆందోళన – పూర్వాపరాలు -1


పాత విషయాలను ముచ్చటించుకునేటప్పుడు కాల ధర్మాన్ని గమనంలో పెట్టుకోవాలి. నాటి పరిస్తితులను దృష్టిలో వుంచుకోవాలి.  పౌర సమాజంలో పాలకులు విధించే నియమ నిబంధనలు, వాళ్ళు  ప్రవచించే నీతి సూత్రాలు ఎన్నో  వుంటాయి. వాటిని గౌరవించి తీరాలి కూడా. కాకపొతే, ఒక్కోసారి నిబంధనలను అమలు చేసే తీరుతెన్నులే విమర్శలకు గురవుతుంటాయి. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. అలాగని ప్రత్యెక పోలీసు బృందాలను నియమించి రోడ్లపై సిగరెట్ తాగేవాళ్ళని వేటాడి పట్టుకుని జరిమానాలు విధించారనుకోండి. అదిగో అప్పుడే వస్తుంది  చిక్కు.  ఇదిగో ఇలాటిదే హెల్మెట్ నిబంధన. అది అమలు చేయడంలో విచక్షణారహితంగా పోలీసులు నాడు అంటే 1986-87 లో వ్యవహరించిన తీరు. ఓ మోస్తరు వేగంతో కూడా స్కూటర్లు నడపడానికి అనువుగా లేని రోడ్లు.  ఆ రోజుల్లో హైదరాబాదులో వాటి పరిస్తితి  ఎలా వుండేదో నేటి నెటిజన్లకు  తెలిసే అవకాశం లేదు.     
ఏ రోడ్డు చరిత్ర చూసినా ......

రోడ్లపైన వరదలా చేరు వాన నీరు
కాలు జారు ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు
రోడ్డేదో గుంటేదో దేవుడికే తెలుసు
స్కూటరిస్టులంటేనే ఖాకీలకు  అలుసు
అలాటి రోడ్లమీద అతివేగం మాట అటుంచి అసలు డ్రైవ్ చేయడమే నానా యాతనగా వర్ణిస్తూ రాసిన  ఈ మాదిరి వ్యంగ్య రచనలు అధికార యంత్రాంగం కళ్ళు తెరిపించకపోగా  సరిగ్గా ఈ నేపధ్యంలోనే  వచ్చి పడింది ఈ నిర్బంధ హెల్మెట్ ధారణ నిబంధన.
హెల్మెట్లను వ్యతిరేకించడం అంటే పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అన్న వాదనను కొందరు లేవదీసారు.
ఆరోజుల్లో పోలీసు కమీషనర్ ను కలిసి ఒక లేఖ ఇచ్చాను.
“అయ్యా కమీషనర్ గారు –
“హెల్మెట్ల విషయంలో పోలీసుల్ని విమర్శించే వాళ్ళందరూ హెల్మెట్ నిబంధనకు వ్యతిరేకం కాదు. దాన్ని అమలు చేసే విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.
“ఉప్పు అమ్మాలన్నా, పప్పు అమ్మాలన్నా పత్రికల్లో ఎంతో ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తుంటారు. కానీ, పలానా హెల్మెట్ కొనండి అని ఒక్క ప్రకటన  ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక్కసారయినా చూసారా. ఎందుకట?
“హెల్మెట్ తయారీదారులకు ప్రకటనల మీద పైసా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ఒక కోర్టు తీర్పును సాకుగా చూపుతారు. అతి ఉత్సాహం వున్న అధికారిని పట్టుకుంటారు. అంతే!  వారి స్టాకంతా – పుచ్చు వంకాయలలాంటి సరుకయినా సరే క్షణాల్లో అమ్ముడు పోతుంది. పైపెచ్చు సర్కారు ఖర్చుతో హెల్మెట్ ధారణ ఆవశ్యకత గురించి ఎలాగూ ప్రచారం ఉండనే ఉంటుంది. అధికారులు చూపిస్తున్న ఈ అత్యుత్సాహం వెనుక ఏదయినా మతలబు ఉందేమో అని అనుమానిస్తే తప్పేమిటి?
“ప్రజలకు అనునిత్యం  తారసపడే ఏకైక ప్రభుత్వ ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్. ప్రజల పరువు మర్యాదల్ని అతడి ఇష్టాఇష్టాలకు నడిబజార్లో వొదిలేయడం ఏం మర్యాద చెప్పండి.
కార్లలో తిరిగే ట్రాఫిక్ అధికారులను వెళ్లి ఏదయినా కూడలిలో నిలబడి రోడ్డు దాటలేని అభాగ్యులకు సాయం చేయమనండి. అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ దుస్తితిని సరిచేయమనండి. ఒక్క పది రోజులపాటు ట్రాఫిక్ పోలీసుల్ని – చలానాల వసూలు కట్టిపెట్టి తమ పని తాము చేసేలా చూడండి. యెంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. మంచి మార్పును గమనిస్తే ప్రజలే ట్రాఫిక్ పోలీసుల ప్రాధాన్యతను  గుర్తిస్తారు. ఎలాటి నిరసనలు లేకుండా హెల్మెట్లతో సహా అన్ని రకాల  ట్రాఫిక్ నిబంధలను వారే స్వచ్చందంగా తుచ తప్పకుండా పాటిస్తారు. ఇది నిజం. నిజానికి ఇదే సరైన  పరిష్కారం.”
కమీషనర్ నా లేఖను నా ముందే పూర్తిగా చదివారు. అభినందన పూర్వకంగా మందహాసం చేసారు. కానీ ఆ చిరునవ్వులోనే నాకు ఆయన నిస్సహాయత కూడా కనబడింది. కొన్ని రోజులకు పూర్వం నగరంలో ఓ రోడ్డు దుస్తితిని గురించి ఆయనకు నేనే ప్రత్యక్షంగా చూపించాను. (ఆ వివరాలతో పాటు హెల్మెట్ నిబంధన – జర్నలిస్టుల నిరసన పూర్వాపరాలు గురించి మరికొన్ని సంగతులు  మరోసారి) 

హెల్మెట్ - 1987


ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హెల్మెట్ ధారణను  నిర్బంధం చేయడంతో సామాన్య ప్రజలనుంచే కాకుండా జర్నలిస్టుల నుంచి కూడా నిరసనలు మొదలయ్యాయి. కే.ఎస్. వ్యాస్ గారు ట్రాఫిక్ డీసీపీ. చాలా సమర్దుడయిన పోలీసు అధికారి.  హెల్మెట్ నిబంధనను అమలు చేసే విషయంలో కొత్త పుంతలు తొక్కారు. ప్రధాన కూడళ్ళలో ప్రత్యెకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వాళ్ళను మోటారు సైకిళ్ళపై  వెంటాడి పట్టుకుని జరిమానాలు వేయడం మొదలు పెట్టారు. ఇది జనంలో చాలా అసహనానికి దారితీసింది. ఇంటలిజెన్స్ చీఫ్ హెచ్ జే దొరగారికీ, పోలీసు కమీషనర్ టీ ఎస్ రావు గారికీ విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఎందుకంటే రామారావుగారికి చెప్పగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరోజు పొద్దున్నే నేను జూబిలీ హిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు  గురించి చెప్పాను. వారు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంటుందని, అసలే చాలీచాలని జీతాలతో వెళ్ళదీస్తున్న వారికి – హెల్మెట్ పోయినా, లేదా ఎక్కడయినా మరచిపోయినా అంతంత డబ్బులు పోసి  కొనుక్కోవడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆయన అంతా విని దొరగారికి ఫోను చేసి,  ఏదయినా చేయొచ్చేమో చూడమని చెప్పారు.
బహుశా ఆ మరునాడే అనుకుంటాను. 1987 జులై 14  వ తేదీ.   ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి, మాజీ మంత్రి, అప్పటి శాసనసభ్యులు అయిన ఎన్. అమర్ నాధ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. రేడియో వార్తలకు ఇంకా చాలా వ్యవధానం వుండడంతో ఆంద్రభూమిలో పనిచేసే నా మిత్రుడు సూర్యప్రకాష్ ను ఇంట్లో దింపడానికి స్కూటర్ మీద విజయనగర్ కాలనీకి  బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ లేదని ఆపాడు. దగ్గరలో వున్న హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. నా వెంట వచ్చిన సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి,  నన్ను పోలీసులు పట్టుకుపోయిన విషయం ఇతర జర్నలిస్టులకు తెలియచేసాడు. అంతే! బిలబిల మంటూ అనేకమంది పాత్రికేయ సోదరులు అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. నేను లోపల పోలీసు స్టేషన్ లో ఉన్నందువల్ల గమనించలేకపోయాను కానీ తరువాత తెలిసినదేమిటంటే చాలామంది సీనియర్ పాత్రికేయులు కూడా అక్కడికి వచ్చి నాకు మద్దతుగా నిలిచారని. వారిలో హిందూ రాజేంద్రప్రసాద్, ఎక్స్ ప్రెస్ సుందరం, జ్యోతి వెంకట్రావు, క్రానికల్ రబీంద్ర నాథ్, సింహం, కన్నన్, పేట్రియాట్ ప్రభాకరరావు, న్యూస్ టైం కే.శ్రీనివాసరెడ్డి (ఇప్పుదు రెసిడెంట్ ఎడిటర్ హిందూ, బెంగుళూర్ ఎడిషన్)  జర్నలిస్ట్  యూనియన్ నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, కే.లక్ష్మారెడ్డి, నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, నర్సింగరావు  ఒకరా ఇద్దరా హైదరాబాదులో పేరుమోసిన పాత్రికేయులందరూ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్తితిలోని తీవ్రత పోలీసులకు కూడా అర్ధం అయింది.

(హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేసున్న జర్నలిస్టులు)

మొత్తం మీద జర్నలిస్టుల ఆందోళన కారణంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో  నన్ను విడిచిపెట్టారు. కానీ మరునాడు విలేకరులు  అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరించారు. ప్రెస్ గ్యాలరీ ఖాళీగా వుండడం గమనించి స్పీకర్ జీ. నారాయణ రావు సభను వాయిదా వేసారు. అప్పుడు  ముఖ్యమంత్రి  రామారావు గారు  వెంటనే స్పందించారు. సంఘటనతో సంబంధం వున్న పోలీసు అధికారిని బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు.   కొత్తగా హోమ్  మంత్రి  బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుకు ఈ పరిణామాలు సహజంగానే ఇబ్బందికరంగా పరిణమించాయి. హెల్మెట్ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయలేదు కాని దాన్ని అమలు చేసే పద్ధతిలో కొంత ఉదార వైఖరి చోటు చేసుకుంది. ఈ నడుమలో నాకు మాస్కో రేడియోలో ఉద్యోగం రావడం, నేను కుటుంబంతో సహా సోవియట్ యూనియన్ వెళ్ళిపోవడం జరిగింది.   
దరిమిలా  ఈ హెల్మెట్ అంశం రాజకీయ రంగును పులుముకుంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో హెల్మెట్ రద్దు అంశం కూడా చేర్చారు. ఆఎన్నికల్లో టీడీపీ వోడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జరిగిన  విజయోత్సవ సభలో హెల్మెట్ నిబంధనను  రద్దు చేస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారని ఆయనకు పీ ఆర్ ఓ గా పనిచేసిన జ్వాలా నరసింహారావు మాస్కోలో వున్న నాకు ఫోనులో తెలియచేసాడు.
వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడే హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు ఇంత  గొడవ పడడం సబబా అన్న విమర్శలు కూడా వినపడ్డాయి. ఆ పూర్వాపరాలు మరో సారి. (05-07-2013)                                                   


4, జులై 2013, గురువారం

ఆర్తితో కూడిన ఆప్తుడి ఉత్తరం



గయ నుంచి శర్మ రాసిన ఉత్తరం
వనం జ్వాలా నరసింహారావు
శర్మ గురించి కిందటి అధ్యాయంలో ఉపోద్ఘాతం ఇచ్చాను. వాడు (గయ) కత్రి సరాయ్ లోని నాథ్ ఆయుర్వేదాశ్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక నాడు అనుకోకుండా "అన్వేషణ" అనే వారపత్రిక చూడడం జరిగింది. అందులో మిత్రుడు భండారు శ్రీనివాసరావు (హెచ్.ఎస్.సీ వరకు మా క్లాస్ మేట్) రాసిన ఒక వ్యాసం చదివాడు. వెంటనే స్పందిస్తూ, 22-01-1996 తేదీన ఒక ఉత్తరం రాశాడు. అందులోని విషయాలు చాలావరకు మా ముగ్గురికీ...ఆ మాటకొస్తే...మా సమకాలీనులందరికీ వర్తించేవిగా వున్నాయి. ఆ విషయాలను పదిమందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో యధాతథంగా రాస్తున్నాను.

Dear Friend Jwala,
నేను కొన్నాళ్లుగా ఇక్కడ గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంగతి నీవెరిగినదే కదా. నీవు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటావో లేదో గాని, నేను నిన్ను, మన స్నేహితులందర్నీ ఏదో ఒక సందర్భంలో తలుస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితం 9-01-96 అన్వేషణ అనే వారపత్రిక తిరగవేస్తుండగా, పేజీ 45 లో, శ్రీ భండారు శ్రీనివాసరావు వ్రాసిన ఒక వ్యాసం ప్రచురితమయింది నా కంట పడింది. క్రింద రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను. అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు... పాత రిక్కా బజారు హైస్కూల్, మామిళ్లగూడెం మన ఇల్లు, పక్క మురికి కాలువ, మనం భోజనం చేసే మైసూర్ కేఫ్, "భోజనం తయార్" బోర్డు, "చలిగా ఉన్నది..చలి చలి వేస్తున్నది" అని కవిత రాసిన మీ స్నేహితుడు, మన నర్సింగరావు గారు, భండారు శ్రీనివాసరావు గారు, బాల మౌళి, నోముల వారు, గుర్రం వారు, బూర్లె వారు, దోసపాటి వారు, మొదలైన స్నేహితులు గుర్తుకొచ్చాయి. Pulse Polio కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి, మీ ఇంటి ఎదురుగా ఉండే Polio Friend మన క్లాసే కాని  History Student పేరు గుర్తు లేదు, Syed Rehman, Abdul Rehman, Shukur, వారి SC Hostel Friends, "గొట్టం పాపయ్య-పానుగంటి పిచ్చయ్య" అంటూ వుండే శ్రీ కొండలరావు సారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లను కసురుకునే Venkat Ram Reddy సారు, "వనజ భవుండు నిన్నొసట..." అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్రరావు, బాగా కొట్టి చెప్పే సర్వ శ్రీ చిన్ని రామారావు, వీరభద్రం (Science), అవధాని, రసూల్ మొదలైన వారు, డ్రామాలు వేయించే సత్యం, Sitaramaiah మాస్టార్లు, కాలేజీకి వెళ్లేటప్పుడు నీవు సైకిలు తొక్కడం-నేను కూర్చోవడం, గుట్టల బజారు చడావ్ దగ్గర దిగడం-సైకిల్ తోయడం, లిటరేచర్ అనే పేకాట ఆడడం, Self Service Day, మన స్కూల్ ఒంటికన్ను చప్రాసి, పక్కనే జిలేబి అమ్మే హిందీ తాత, J H Prasad, Late M V K H Prasad,...ఇట్లా అందరూ జ్ఞాపకం వస్తూ ఎన్నో విషయాలు మదిలో మెలిగాయి. గయోపాఖ్యానం, దేవుని లాలూచీ, అనే స్కూల్ డ్రామాలు గుర్తుకొచ్చాయి. చిక్కడపల్లిలో నీ రూమ్మేట్స్ అయిన Late రంగారావు గారు (M A Public Administration), రమణ (రెబ్బారం), A Muslim Friend, Tajmahal Hotel Tracer ఉద్యోగం, "Buy and Cry" Pant, నా పురోహితుడి Duty, ఖమ్మంలోని సుందర్, ప్రభాత్, నవాబ్ మొదలైన సినిమా హాళ్లు,  Janveera, Navab, Cheena, Dharma లాంటి పెద్ద age గల మన Friends, ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్సులో నీకు వినిపించిన హరికధా కాలక్షేపం...మొదలైనవి మనసులో మెదిలాయి. ఇలా వ్రాస్తూ పోతూ ఉంటే అంతం ఉండదు. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన చిన్ననాటి సంగతులు అన్నీ ఏకరవు పెట్టి ముచ్చటించాలని ఉన్నది. మా అమ్మాయి వాళ్లు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్న ఈ మధ్య ఒకసారి మా అమ్మాయిని గురించి హైదరాబాద్ వచ్చాను. కాని నీ Phone నెంబరుకి Phone చేసినా ఫోన్ మారిందా ఏమో నెంబరు పలక లేదు. సమయం లేనందున కలవలేకపోయాను.    

ఇలా ఈ పత్రిక తిరగేస్తూ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి వ్యాసం చదువుతూంటే, వారిని గురించిన జ్ఞాపకాలు కూడా వచ్చాయి. AIR లో వింతలు-విశేషాలు అనే వారి వార్తలు లోగడ ప్రసారమవుతూ ఉండేవి. తర్వాత ఆయన రష్యా వెళ్లినట్లుగా నీవు చెప్పావు. ఇలాంటివే మరెన్నో వ్యాసాలు, ప్రజలకి, ఈనాటి యువతకి పనికి వచ్చే ట్లుగా వ్రాయాలని శ్రీ భండారు వారిని మరీ మరీ కోరుతున్నాను. ఈ విషయాలలో వారితో Personal గా ఒకసారి Discuss చేయాలని అనుకుంటున్నాను. మన భారత దేశం ఒక పుణ్యభూమి. ఎంతో మంది మేధావులకు, మహానుభావులకు జన్మనిచ్చిన మాతృ భూమి. మన వేదాలు, పురాణాలు, మన సాంఘిక ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ మన ఉనికి, మనుగడలకై ఎంతో ఉపయోగపడేవిగా నిర్ణయించబడి, ఆచరించబడుతున్నవి. ఈ ఆచారాలన్నీ మన శీతోష్ణ స్థితి, Environment పై ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేసి, పాశ్చాత్య నాగరికతలో ఈనాటి భారతీయుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆరోగ్య దృష్ట్యా, తోలు చెప్పులు, నూలు దుస్తులు, తాజా ఆహారం, సాత్విక మితాహారం తీసుకోవాల్సి వుండగా Plastic చెప్పులు, బూట్లు, Synthetic దుస్తులు, ఫ్రిజ్ లో నిలవ వుంచిన Tinned Foods తీసుకుంటున్నారు. Christianity లో లాగా మన మతానికి ఒక క్రమశిక్షణ లేదు. మన తాత-ముత్తాతలు శివుడు, విష్ణువులను, మనం వెంకటేశ్వరుడు మొదలైన వారిని దేవుడిలాగా పూజించాం. ఈ నాటివారు బాబాలను, జిల్లెడమూడి అమ్మలను, తాంత్రిక స్వాములను, ఇలా వెలిసిన వూరికొక దేవ దూతలను పూజిస్తున్నారు. వేలు ఖర్చు చేసి దేవుడికి కళ్యాణం చేయిస్తాం కాని మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. మన చరిత్రలోని మంచిని తీసుకోం. ధర్మరాజు అబద్ధం చెప్పలేదా?, కృష్ణుడు మాయ చేసి యుద్ధంలో పాండవులను గెలిపించలేదా? అని విమర్శిస్తూ ఉంటాం. ఉన్న గుళ్లు చాలన్నట్లు ప్రతి రోజూ, ప్రతి వూళ్లో గుడి కట్టడానికి చందాలు వసూలు చేస్తుంటారు. ప్రజలు నడిచే రోడ్లను ఆక్రమించి చిన్న-చిన్న గుళ్లను కట్టారు. అంతేగాని, మదర్ థెరిస్సాలాగా బీదవారికంటూ మన వాళ్లు నడిపే Poor Homes ఏమీ లేవు. ఒకడు నిజాయితీగా వ్యాపారం చేస్తూ తృప్తిగా జీవిస్తుంటే, పక్కవాడు ఏదో మతలబులు చేసి, బాగా సంపాదిస్తూ మేడలు-కార్లు కొంటుంటే, మొదటి వాడిని శుంఠ-చేతకానివాడి కింద లెక్క కడతారు. రెండవ వాడిని తెలివి తేటలు కలవాడంటారు. అందరూ వాడినే గౌరవిస్తారు. మన ప్రభుత్వం కూడా Reservations కల్పించి ప్రజలకు మంచే చేస్తున్నప్పటికీ, కనీసం విద్య-వైద్య-సాంకేతిక-ఇంజనీరింగ్ రంగాల్లోనైనా Merit ఉన్నవాళ్లకు(Irrespective of the Caste) అవకాశాలు ఇవ్వకుండా, మార్కుల రాయితీలు ప్రకటించి నందువల్ల, ఈనాటి స్కూలు మాస్టార్లు "శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ" అంటే, "శ్రీరాములవారు తులసి ఆకులతో చారు కాచి" అని చెప్పే వారిగా మారిపోతున్నారు. అదే మన రోజుల్లో...మన చదువు తీసుకుంటే....మన చిన్నతనంలో మనం చదువుకున్న మన పాఠం, మను చరిత్రలోని పద్యం ఇంకా నాకు గుర్తున్నది. ఆ పద్యాన్ని నేను ఏమాత్రం చదవలేదు. కంఠస్థం అంతకన్నా చేయలేదు. లెక్చర్ విని, మాస్టారు విడమర్చి చదవగా విని గుర్తు పెట్టుకున్నాను. వాటిలో కొన్ని...."అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి, ముదిమది తప్పిన మొదటి వేల్పు.....అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ"; ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో నన్నయగారి భారతంలోది..."చనపేడికి తారక్రియయును......కృష్ణు పూజించుటిలన్"; ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం, "ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి.....వివేక భ్రష్ట సంపాతముల్"; "జలమున నగ్ని, చాత్రమున జండ మయూఖుని.....మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే"; "అవనీనాధులనేకులుండగ విశిష్టారాధ్యుల్. ఆర్యుల్ పూజ్యులు పల్వురుండగ....దాశార్హుండు పూజార్హుండే"; "ఈతనికి ధనమిత్తురేని అభీష్టములైన కార్యముల్....అనర్హుడర్హుడని అత్యుతునచ్యుత చేయపాడియేధర్మవు ధర్మ నందనా"; 8th Class English లో "Her arms across her breast she laid she was more fair than words can say"; Waste Not Want Not Proverb లో శ్రీ గెంటాల రంగారావు గారు చెప్పిన మాటలు "Economy does not mean stringency. One must enjoy life according to his status and earnings. If he goes beyond it he may be called Spend Thrift".

పై విషయాలన్నీ నీకు Bore కలిగించవచ్చునేమో కాని, ఇక్కడ ఖాళీగా ఉన్న నాకు (ఈ రోజు ఆదివారం...ఒంటరిగా ఆఫీసులో ఉన్నాను) ఏదో రాయాలనిపించి, నీవు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించుతావని వ్రాస్తున్నాను.

ఇంకో విషయం. మనకు ముఖం తెలియని వాడెవడో బాబా గురించి ఉత్తరం వ్రాస్తూ, ఇలాంటి ఉత్తరం 100 ప్రింట్ చేయించి Mr. Ex లక్ష రూపాయలు లాటరీ కొట్టాడు, Mr. Y నిర్లక్ష్యం చేసి తలపగిలి లేదా పాము కాటుకు గురై చచ్చాడని అంటూ, ఇలాంటివే 100 ప్రింట్ చేసి బట్వాడా చేయాలని వ్రాస్తూ వుంటారు. హిందూ మతం దిగజారడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మన రోజుల్లో మనకు తెలిసింది, తెలియని వాళ్లకి విడమర్చి చెప్పే వాళ్లం. ఈ రోజుల్లో చెప్పడం చేత కాదు కొందరికి. చెప్పితే ఎక్కడ నేర్చుకుంటాడో అని ఈర్ష్య కూడా. ఆ రోజుల్లో Cricket గురించి, Sixer, Four, Wide, Wicket అంటూ చెప్పింది నీవే. ఈ రోజుల్లో ప్రతి పిల్లాడికి తెల్సుననుకో. ఇంత భారతం వ్రాయడానికి, ఇన్ని విషయాలు మననం చేసుకోవడానికి ధనస్సు రాశిలో వ్రాసిన వార ఫలాలు కూడా కాకతాళీయంగా ఏకీభవిస్తున్నాయి! (ఒక పేపర్ క్లిప్పింగ్‌ను వాడి వుత్తరానికి జత పర్చాడు. అందులో వార ఫలాలలో ధనస్సు రాశివారికి " చిన్ననాటి జ్ఞాపకాలు రాగలవు" అని వుంది. బహుశా వాడి జన్మ రాశి ధనస్సు కావచ్చు).

More details in my next letter. I request you to please reply for this letter at least because this is my second letter to you from Gaya. My kind enquiries to one and all of your family members and also to Mr. B. Srinivasa Rao and his family members. Please show this letter to Mr. Bhandaru Srinivasa Rao  also.

Yours Loving Friend,
L. V. R. S. Mvr Sharma