24, ఫిబ్రవరి 2013, ఆదివారం

నిర్లక్ష్యంలో సమన్వయం



హైదరాబాదులో గత గురువారం సాయంత్రం జరిగిన ఘోర కలి గురించి రెండు  మూడు రోజులుగా అనేక టీవీ ఛానళ్ళు వరసగా పలు చర్చా కార్యక్రమాలను ప్రసారం చేసాయి. వాటిల్లో పాల్గొన్న సందర్భాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఇది అక్షర రూపం.


“ఉగ్రవాద ఘాతుకాలను శత్రు దేశం సాగించే యుద్ధంతో సమానంగా పరిగణించాలి. ఈ చర్యలకు బలై పోయినవారినీ, అంగవైకల్యం పొందినవారినీ ప్రభుత్వం ప్రత్యేక తరగతిగా గుర్తించి ఆదుకోవాలి. మరణించిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి యాభై వేలు అనే షరా మామూలు ప్రకటనలతో సరిపుచ్చకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి లేదా గాయపడిన వీర సైనికులకు అందచేస్తున్న తరహాలో వారికీ, వారి కుటుంబాలకు శాశ్విత  ప్రాతిపదికన సాయం అందించాలి. ‘గాయపడిన వారికి మెరుగయిన వైద్య సాయం అందించాలని  అధికారులను ఆదేశించాం’ అంటూ చేస్తున్న ప్రకటనలను  టీవీల్లో చూస్తూ, గతంలో జరిగిన సంఘటనల్లో అంగవైకల్యం పొంది ఇప్పటిదాకా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు ఎంతగా రగిలిపోతుంటారో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక బాధ్యతగా టీవీ ఛానళ్ళు అలనాటి దురదృష్టవంతుల దీన గాధలను మరోమారు ప్రసారం చేసి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి.”
“ దిల్ సుఖ్ నగర్ ఘాతుకానికి సంబంధించి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ. నిఘావిభాగం ముందస్తుగా చేసిన హెచ్చరికలు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటవెంటనే తెలియచేసామని చెప్పి ఆయన చేతులు కడిగేసుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థల బృందాలను హైదరాబాదు పంపుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. మొత్తం దేశానికి హోం మంత్రి అయిన ఆయన తనకు అందిన సమాచారాన్ని బట్వాడా చేసి వూరుకోకుండా మరికొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుని వుంటే కొంత ప్రయోజనం వుండేది. అలా కాకుండా సంఘటన జరిగిన తరువాత హైదరాబాదు వచ్చివెళ్లడం కేవలం కంటితుడుపు చర్యగా జనం భావిస్తే తప్పుపట్టాల్సింది వుండదు.”
“కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలను రొటీన్ వ్యవహారంగా భావించామని, ఇంత ఘోరం జరుగుతుందని వూహించ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి అన్నట్టు  ఈ ఉదయం పత్రికల్లో, మీడియా స్క్రోలింగు లలో వచ్చింది. ఇదే నిజమయితే, బాధ్యతారాహిత్యానికి అసలు సిసలు పరాకాష్ట అనే చెప్పాలి.”
“ఈ దుర్ఘటనకు నిరసనగా భారత్ బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం సహేతుకంగా లేదు. ప్రజలు ఆందోళనలో వున్నప్పుడు వారికి బాసటగా నిలవాలే కాని, బంద్ లు, రాస్తా రోఖోలు వంటి కార్యక్రమాలద్వారా వారి ఇబ్బందులను మరింత పెంచకూడదు. ప్రతిపాదిత సడక్ బంద్ ను వాయిదా వేసుకుంటున్నట్టు టీ ఆర్ ఎస్ ప్రకటించడం హర్షనీయం.”
“షిండే వచ్చివెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు  రాజనాథ్ సింగ్ వస్తున్నారు. పాదయాత్రకు విరామం ఇచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాదు వస్తున్నట్టు ఇప్పుడే టీవీ స్క్రోలింగు లలో వస్తోంది. రేపో మాపో ప్రధానమంత్రి రావచ్చు. ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా వెనుకబడే ప్రసక్తి వుండదు. ఇంతమంది వచ్చి చేసేదేమీ వుండదు. కానీ రాజకీయంగా వారికిది తప్పనిసరి. వస్తే, వీరు వచ్చి చేసిందేమిటి అంటారు.రాకపోతే వీళ్ళకు జనం ప్రాణాలు అంటే పూచికపుల్లలతో సమానం అని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. అందువల్ల రాకతప్పదు. ఆలాంటప్పుడు అనుచరగణంతో హడావిడి చేయడం కాకుండా, విధి నిర్వహణలో వున్న పోలీసులను ఇబ్బంది పెట్టకుండా బాధితులను పరామర్శించి వెళ్ళే పద్ధతికి స్వీకారం చుట్టాలి. వూరికే వచ్చాం,చూసాం,వెళ్ళాం అని కాకుండా తమ పార్టీల తరపున బాధితులకు ఎంతో కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.”
“పేలుడు సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రధాన పత్రికల్లో ప్రచురించిన ఫోటోలు చూడండి. శరీరాలు చిద్రమై రోడ్డున పడివున్నవారి దాపుల్లో అక్కడక్కడా మంటలు చెలరేగుతూనే వున్నాయి. అంటే పేలుడు జరిగిన కొద్ది సేపటిలోనే మీడియా వారు అక్కడికి చేరుకొని ఫోటోలు తీయగలిగారు. ఆ ఫోటోలను పరికించి చూస్తే ఒక్క పోలీసు జవాను కూడా కనబడడు. పేలుడు జరిగిన తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. అప్పుడు ఎక్కడ చూసినా పోలీసులే. రోప్ పార్టీలతో కూడిన రక్షణ వలయాలే.”
“ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం అమెరికాకే సాధ్యం కాలేదు. కాని జరిగిన తరువాత ఏం చేయాలి అన్న విషయంలో మన దగ్గర ఇంకా అయోమయమే. సమన్వయ లోపం కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. పోనీ ఇది మొదటిసారా అంటే కాదు. గతంలో కూడా జరిగాయి. కానీ వాటి నుంచి గుణ పాఠాలు నేర్చుకున్న దాఖలా కనబడడం లేదు. ఉగ్రవాదులకు హైదరాబాదు అడ్డాగా మారిందని అంతా అంటూ వుంటారు. కానీ చేతల్లో పూజ్యం.”
“ఇలాటి సంఘటనలు పునరావృతం కానివ్వమన్న ప్రకటనలే  పునరావృతం అవుతుంటాయి. పేలుళ్లు సరేసరి. అసమర్ధ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రత్యర్ధులు అంటుంటారు. వారు అధికారంలో వున్న రోజుల్లో కూడా ఇలాటి ఉగ్రవాద దాడులు జరిగిన సంఘటనలు మాత్రం మరచిపోతుంటారు. రాజకీయ జోక్యం లేకపోతే వీటిని అరికట్టడం సాధ్యమని రాజకీయ నాయకులే చెబుతూ వుండడం విడ్డూరం.”
“సీ.సీ. కెమెరాల సాయంతో మొన్నటికి మొన్న సైబరాబాదు పోలీసులు ఒక మహిళపై అత్యాచారం చేయబోయిన దుండగులను  ఇరవై నాలుగు గంటలు గడవకముందే అరెస్టు చేశారు. మరి, దిల్ సుఖ్  నగర్ లో సీ.సీ. కెమెరాల వైర్లు ఎవరో రెండు రోజులక్రితమే కత్తిరించారని అంటున్నారు. తీగెలు  కత్తిరిస్తే, ఆ ఫుటేజ్ ని ఎప్పటికప్పుడు కనిపెట్టి చూడాల్సిన సిబ్బంది ఏమి చేస్తున్నట్టు. పలానా ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా  ఒక్క దృశ్యము రికార్డు కాలేదని యెందుకు తెలుసుకోలేకపోయారు?  అలాగే పోలీసు కమీషనర్  సాయిబాబాబా గుడికి వెళ్లడం వల్ల అక్కడ పోలీసుల హడావిడి గమనించి ఉగ్రవాదులు తమ టార్గెట్ ప్రాంతాన్ని మార్చుకున్నారని అంటున్నారు. అంటే ఏమిటి, పోలీసుల నిఘా వుంటే ఉగ్రవాదుల ఆటలు సాగవనే కదా. ఉగ్రవాద దాడిని గురించి ముందస్తు సమాచారం వున్నప్పుడు దాన్నేదో అతి రహస్యం కింద దాచిపెట్ట కుండా  అమెరికా వాళ్లు తమ పౌరులను హెచ్చరించినట్టు నగరంలో రద్దీగా వుండే ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేసి వుండాల్సింది. పోలీసులను మోహరించి, పోలీసు జాగిలాలను ఆయా ప్రాంతాలలో తిప్పి  వుండాల్సింది.”  (24-02-2013)
(సాక్షి, దూరదర్శన్ సప్తగిరి,  హెచ్.ఎం.టీ.వీ.,  టీవీ -5,  స్టుడియో ఎన్, వీ 6 న్యూస్, మహా టీవీల సౌజన్యంతో) 

23, ఫిబ్రవరి 2013, శనివారం

Morning Edition- News with Mr Devi prasad-Mr Ashok Babu-Bandaru Srinivas...

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఎప్పుడో ఎక్కడో విన్నట్టు వుంది కదూ!




‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం!’
‘దోషులు ఎంతటివారయినా అరెస్టు చేసితీరుతాం!’
‘ప్రజల ప్రాణాలు కాపాడడం పాలకులుగా మా ప్రాధమిక కర్తవ్యం’
‘ఇలాటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’
‘పేలుళ్ళలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్ష రూపాయలు. గాయపడిన వారికి యాభై వేలు’
‘క్షతగాత్రులు త్వరగా కోలుకోవడానికి మెరుగయిన వైద్యసాయం అందిస్తాం’
‘నిఘా వైఫల్యం’
‘ ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ అసమర్ధ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు’  
‘తక్షణం రాజీనామా చేయాలి’
‘చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి’
..........ఈ మాటలు ఎక్కడో, ఎప్పుడో విన్నట్టుంది కదూ.
ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఇలాటి మాటలు పరిపాటే.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళలో అసువులు బాసిన వారు ఈ వ్యర్ధప్రలాపాలు వినే అవకాశం ఎట్లాగో లేదు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి చెవినపడ్డా నవ్వుకునే పరిస్తితిలో వుండి వుండరు.
గతంలో జరిగిన ఈ మాదిరి దుర్ఘటనల్లో గాయపడి అంగవైకల్యంతో అలమటిస్తున్నవాళ్ళు ఈ మాటలు వింటూ ఎన్ని శాపనార్ధాలు పెట్టుకుంటున్నారో తెలవదు.
దేవుడే ఈ దేశాన్ని రక్షించాలి.
దేవుడి పేరుతోనే ఇవన్నీ జరుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? (22-02-2013)

NOTE: Courtesy image owner

21, ఫిబ్రవరి 2013, గురువారం

Hyderabad Blasts - Shame on Our Part



One thing we all should accept. When Blasting news scrolling was on TV channels, many relatives and friends from other cities and other parts of the country inquired about our safety. None from Hyderabad. We too, are not exception. We just watch the incidents just like any tv episode or serial. No concern. Leaders compete with each other to condemn the incident. Media covers it. Later, all of us forget conveniently.We must curse ourselves.Not anybody.



Sakshi Prime Time Show 20th Feb 2013 - Sakshi TV

The ప్రైమ్ టైమ్ షో 20th feb -భండారు శ్రీనివాసరావు విత్ సాక్షి

The ప్రైమ్ టైమ్ షో 20th feb -భండారు శ్రీనివాసరావు విత్ సాక్షి

20, ఫిబ్రవరి 2013, బుధవారం

డబ్బును లెక్కచేయని డబ్బున్న మనిషి




లక్షా యాభయ్ వేల కోట్ల డాలర్లు. ఈ మొత్తాన్ని రూపాయల్లోకి మార్చి చెప్పాలంటే  పదిహేను పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో.


భార్యతో కలసి ఇంగ్వార్ కంప్రాడ్


అదొక సమావేశ మందిరం.
ప్రపంచంలో అత్యుత్తమ వ్యాపార ప్రముఖుడికి ఇచ్చే అవార్డ్ ప్రదానో త్సవం అక్కడ జరగబోతోంది. అంతా అతడి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అక్కడ ఓ సిటీ బస్సు ఆగింది. అందులోనుంచి దళసరి కళ్ళద్దాలు, ముతక కోటు, మోటు బూట్లు ధరించిన ఓ వ్యక్తి కిందికి దిగి లోపలకు రాబోయాడు. అతడి వాలకం చూసి అక్కడి సెక్యూరిటీ గార్డులు ఆపే ప్రయత్నం చేశారు. వారికి తెలియదు, ఆ సాయంత్రం ఆ సభాభవనంలో జరిగే కార్యక్రమంలో అవార్డును స్వీకరించే ముఖ్య అతిధి అతడేనని.
ఇంగ్వార్ కంప్రాడ్ అతి సాధారణంగా కానవచ్చే అసాధారణ వ్యక్తి. కొన్ని వేల మిలియన్ల డాలర్లు విలువచేసే ‘ఐకియా’ సంస్థ సంస్థాపకుడు. ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల జాబితాలో ఏడో స్థానంలో వున్న వ్యక్తి. అయినా పైకి చూడడానికి డబ్బు ఇబ్బందుల్లో వున్న పింఛనుదారు మాదిరిగా కానవస్తాడు. అతడి మనస్తత్వాన్ని తెలిపే ఉదంతం ఒకటి ప్రచారంలో వుంది. అనేక  సంవత్సరాలుగా అలవాటయిన  క్షురకుడిని ఈ మధ్య మార్చారట. ఎందుకంటే అతడికంటే తక్కువ డబ్బులకు  క్షౌరం చేసే మరో క్షురకుడు దొరికాడట.
స్వీడిష్ జాతీయుడయిన కంప్రాడ్, ‘ఐకియా’ అనే పేరుతొ  గృహనిర్మాణ సామాగ్రి సంస్థను స్థాపించి, అనతికాలంలోనే  అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు, కోట్లల్లో డబ్బూ పోగేసుకున్నాడు. అంత కీర్తి గడించిన కంప్రాడ్ కాంస్య విగ్రహాన్ని అతడి సొంత పట్టణంలో  ఏర్పాటు చేసి కంప్రాడ్ ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారుట. ఆవిష్కరణ సూచకంగా రిబ్బన్ కత్తిరించడానికి బదులు కంప్రాడ్ ఆ రిబ్బన్ ను మడిచి నిర్వాహకుల  చేతిలో పెట్టి, బంగారంలాటి రిబ్బన్ ముక్కను ముక్కలుగా  కత్తిరించి వృధా చేయవద్దని ఓ ఉచిత సలహా ఇచ్చాడట.
భార్యతో కలసి లోకల్ రైళ్ళలో ప్రయాణిస్తూ, చిన్న చిన్న రెస్టారెంట్లలో భోజనం చేస్తుండడం ఆయనకు  అలవాటు. ‘ఎందుకిలా?’ అనే ప్రశ్నకు ఆయన వద్ద రెడీమేడ్ సమాధానం సిద్ధంగా వుంటుంది.
‘నేను పుటకతో సంపన్నుడిని కాను. నా పదిహేడో ఏట ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అయినా కష్టపడడంలో వున్న సుఖం ఏమిటో కష్టపడేవాడికే తెలుస్తుంది. డబ్బు ఖర్చు పెట్టడం, ఆడంబరంగా జీవించడం నాకు చేతకాకకాదు. నన్ను చూసి మరొకరు అనుకరించి కష్టాల పాలు కాకూడదనే నేనిలా చేస్తున్నాను. ఆదర్శాలు చెప్పడం కాదు ఆచరించడం అవసరం.’
అంటారాయన.
ఇక ఏమంటాం! 
NOTE: Courtesy image owner (20-02-2013)