28, డిసెంబర్ 2012, శుక్రవారం

వచ్చిండన్నా, వచ్చాడన్నా


వచ్చిండన్నా, వచ్చాడన్నా- వరాల తెలుగు ఒకటేనన్నా భండారు శ్రీనివాసరావు
(తిరుపతి తెలుగు సభలను పురస్కరించుకుని మరోమారు పునశ్చరణ)
ఈ మధ్య కాలంలో కొన్ని కొత్తరకమయిన ఉద్యమాలు, ఆందోళనలు రూపం దిద్దుకుంటున్నాయి. కొన్ని కులాలు, వర్గాలకు చెందిన వారి ఆచారవ్యవహారాలు, కట్టూబొట్టూ, మాటా యాసా ఇవన్నీకొన్ని సినిమాల్లో  వివాదాస్పదమవుతున్నాయి. సినిమాను సినిమాగా చూడాలని కొందరు అంటుంటే, శ్రుతిమించినప్పుడే సమస్యగా మారుతోందని ఇంకొందరు వాదిస్తున్నారు.
ఇందులో తప్పొప్పులను నిర్ధారించడానికి ఆయా వ్యవస్థలు వున్నాయి కాబట్టి  వివరాల్లోకి పోవడం లేదు.
ఈ నేపధ్యంలో భాషకు, యాసకు సంబంధించిన వివాదాలు చిక్కుముడులుగా మారకుండా చూడాల్సిన అవసరం వుంది.
ఒక ప్రాంతం వారి భాషను, యాసను మరో ప్రాంతం వారు అణగదొక్కుతూ,  తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోతున్నారన్న ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పోయి అమ్మాయి, కొడుకు పోయి అబ్బాయి, కక్కయ్య పోయి బాబాయి, చిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నాయని   సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించిన   అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితే, పరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.

నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలారాసేవారో చాలామందికి గుర్తుండేవుంటుంది. అప్పట్లో కూడా అనేకమంది తెలుగు భాషకు పట్టిన దుర్గతిని చూసి ఇలాగే మధనపడేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుస్తితి  ఏమిటని బాధపడేవారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే స్లయిడ్లలో, పత్రికల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల్లో  కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయిలో తయారయ్యేవి. హిందీ లిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత రాయించడం వల్ల,చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది  తెలిసిన విషయమే.

వెనుకటి రోజుల్లో, నిజాం పాలిత ప్రాంతాలలో  చాలామంది తెలుగు మాతృభాషగా  వున్న కుటుంబాలనుంచి వచ్చినవాళ్లు సైతం ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే వుండేవారు. చాలా   గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని  కూడా చెప్పుకునేవారు.

ఆ రోజుల్లో బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలనుంచి  హైదరాబాదుకు రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.

ఫలితంగా గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో  అతితక్కువగా వున్న అక్షరాస్యత శాతాన్ని  బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశర్యకరమేమీ కాదు.
వలసలు వచ్చిన వాళ్ళు  సాధారణంగా   వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకువస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగువాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారం, ఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు, స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టి, ఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తె, వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.

భాష పట్ల మమకారం లేని వాడు వుండదు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడిపొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.

మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా.  హిందీ, ఉర్దూ తెలియని ప్రాంతాల్లో కూడా ఆ భాషల చలన  చిత్రాలను ప్రజలు ఆదరించడం తెలిసిందే.  ఎవరయినా ఉర్దూ భాషలో  మాట్లాడుతుంటేనో, ముషాయిరాలు వినిపిస్తుంటేనో  ఆ భాషలోని మాధుర్యానికి అది ఏమాత్రం తెలియని వాళ్లు కూడా తలలూపుతూ ఇంకా వినాలని ఉత్సాహం చూపడం కద్దు. అదీ భాషలోని సౌందర్యం. అదీ భాషలోని గొప్పదనం.

మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపోతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.

భాషలో తమవిఅనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయిపోతూవుండడం పట్ల ఎవరయినా బాధపడితే వారి ఆవేదన అర్ధం చేసుకోతగ్గది.

ఐతే, భాషాభిమానులు  బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని  వున్నాయి. నాన్నను ఒరేఅనడం అమ్మను ఒసేఅనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు  అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా తల్లిని ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని. 

27, డిసెంబర్ 2012, గురువారం

ఏం భాషరా బాబు!


ఏం భాషరా బాబు!


తిరుపతిలో తెలుగు సభలేమో కాని టీవీ చానళ్ళలో తెలుగు చర్చలు హోరెత్తి పోతున్నాయి. నిన్న ఒక ఛానల్లో పాల్గొన్న  ముగ్గురూ ఓ పక్క తెలుగులో మాట్లాడుతూనే మరో పక్క మీ తెలుగు వేరు మా తెలుగు వేరు అని  వాదించుకోవడం చూసి చూస్తున్న వారికి  మతి పోయింది. ఒకాయన ఏకంగా దేశంలో యే భాషకు లేనివిధంగా ఒక్క తెలుగుకే తెలుగు,తెనుగు, తెనుంగు అని రకరకాల పేర్లు వున్నాయని, కావున రాష్ట్రంలో ఎవరి తెలుగు వారిదేననీ తేల్చేసారు. మరి పొరుగున వున్న తమిళనాడులో అరవం, తమిళం అని ఒకే భాషను రెండు రకాలుగా పిలుస్తున్న సంగతిని ఆయన వాదం కోసం కాసేపు మరచిపోయినట్టున్నారు. పైగా చర్చలో పాల్గొంటున్న వారెవ్వరూ తమ యాసలో తెలుగు మాట్లాడలేదు. అందరూ మాట్లాడే తీరు ఒకేరకంగా వుంది. పక్కవారు మాట్లాడేది అసలు తెలుగే కాదంటారు. వితండవాదం అంటే ఇదే కాబోలు.

ఇలావుంటే ఈ రోజు ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు శ్రీ మంచాల శ్రీనివాసరావు  పెట్టిన పోస్టింగ్ తెలుగుకు పట్టిన తెగులుకు అద్దం పట్టేదిగా వుంది. చిత్తగించండి.
    
ఈనాడు" తెలుగీకరణ తెల్లారినట్టే ఉంది... ఖర్మరా బాబూ!!
APPSC
అంటే రాష్ట్ర ప్రజా సేవ సంస్థ అట! అది సర్కారు కొలువులకు నియామక పరీక్షలు నిర్వహించే సంస్థ మాత్రమే... అందులో సేవ అనే పదానికే అర్థముండదు.... కనీసం ఉద్యోగ నియామక సంస్థ అని చెప్పినా ఓ తీరుగా ఉండేది...!
IAS
పదానికి తెలుగీకరణ మరీ ఘోరంగా ఉంది. indian అనగానే భారత్, administration అనగానే పాలన, service అనగానే సేవ... ఇంకేం, భారత పాలన సేవ అని తేల్చేశారు... అది ఒక జాతీయ స్థాయి ఉద్యోగ కేడర్ అనే అర్థమేమైనా స్ఫురిస్తోందా అసలు!?
records
కి తెలుగు పదం నమోదు పత్రమట!! record చేయడం అనగానే నమోదు అనే పదం గుర్తొచ్చి అలా తేల్చేశారు... కానీ ఇక్కడ records అంటే పత్రాలను పదిలపర్చడం.... 
market yard
అంటే విపణి వేదిక అట! market అంటే ఎంతటి విస్తృతార్థం ఉందో తెలిసినవారెవ్వరూ ఈ పదాన్ని మామూలు market yardకి ఉపయోగించరు!!
commission agents
కి ప్రతిఫలాపేక్షదారులు అనే అనువాద ప్రయాస కూడా గుత్తేదారు అనే విఫల ప్రయోగాన్నే గుర్తుకు తెస్తోంది... .
మంచి సంకల్పం ఉన్నా... ఇలాంటి వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది...!!
NOTE: కార్టూనిస్టుకు ధన్యవాదాలు  

ఆచార్య పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఇక లేరు




ఆచార్య పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఇక లేరు


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున శ్రీ వంగూరి చిట్టెన్ రాజు ఇలా తెలియచేస్తున్నారు.
మిత్రులారా, 
ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్యానికి భీష్మాచార్యుల వంటి సాహితీవేత్తకవితొలి అమెరికా తెలుగు పత్రిక సంస్థాపకులునాటక రంగ నిష్ణాతులునృత్య నాటక నిర్మాతదర్శకులుచిత్ర కారులుప్రపంచ ప్రసిధ్దిగాంచిన న్యూక్లియర్ శాస్త్రవేత్తవంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు ఆదినుంచీ గౌరవ సంపాదకులుడాపెమ్మరాజు వేణుగోపాల రావు గారు మొన్న అట్లాంటాలో పరమపదించారునేను ఎక్కడో దూరంగా ఇండియాలో ఉండగా ఆయన పోయిన కబురు రావడం మరింత బాధగా ఉందిఆయనతో మా అనుబంధంఆయన వ్యక్తిత్వంలో ఉన్న లోతులు అందరికీ తెలినది కొంతచాలామందికి తెలియనిది కొండొంత.విన్నకోట రవిశంకర్ వాసిన వ్యాసం పెమ్మరాజు గారి గురించి అన్ని అనేక అంశాలను స్పృసిస్తూ మనందరి భావాలనీ వ్యక్తపరిచింది వ్యాసం లంకె  క్రిందన ఇస్తున్నాను.

http://vaakili.com/patrika/?p=440

తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభలలో తొలి రోజు (డిశంబర్ 27, 2012) ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించే ఏర్పాట్లు చేస్తున్నాను….


భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

Acharya Pemmaraju Venugopala Rao is well known as Dr. P. V. Rao in the US in many ways. Dr. Rao is a multi faceted personality. He is one of the principle architects of Atlanta Indian Community. Dr. Rao is a generalist. He is a professor of Nuclear Physics in Emory University. He is also a poet, artist and a journalist. Quite often he deliver lectures on Indian culture and spirituality. He is a fatherly figure to many institutions and youngsters in US and they turn to him for guidance in times of crisis. Institutions and persons in around the USA frequently refer Dr. Rao as wise man of Atlanta and turn to him for his wisdom words and advise.

26, డిసెంబర్ 2012, బుధవారం

ఎటు ముందుకు ఎటు వెనక్కు




ఎటు ముందుకు ఎటు వెనక్కు




‘ఎటు ముందుకు ఎటు వెనక్కు’
‘ఇటే ముందు పదండి రండి’
‘వద్దు. అది వెనక్కు. నిరోధకుల కుమ్మక్కు’
‘అయినా పరవాలేదు రండి. మార్క్స్ చూపిన దారిన పొండి’
‘వద్దు. దాన్ని స్టాలిన్ మార్చేసాడు’
‘రాయిస్టులం మాతో రండి’
‘ఇస్! మిమ్మల్ని అడిగిందెవడు?’
‘ఛీ! వూరుకోండి. అంతా సోదరులం’
‘సర్లే! రష్యా ఎటేపు?’
‘చేయి బెరియాను వాకబు’
‘పోనీ అమెరికాకు పోదాం’
‘అవును. మెకార్తీ ఇస్తాడు వెల్కం’
‘అయితే లండన్?’
‘సూయజ్ పై రీసెర్చ్ కి ఎండన్’
‘అన్నిటికీ అన్నీ అయితే ... గాంధీ, నెహ్రూ..... !!’
‘రాజదానిలో ఒకరు ....రాజఘాటులో మరొకరు’
‘ఏమిటి?’
‘సమాధి’
‘మరేది దారి’
‘శివోహం’
‘ఛీ! మరి దాసోహం!’
‘ఇందులోనూ భిన్నత్వం.... ఆ భిన్నత్వంలో ఏకత్వం....’
‘ఇది సాధించడం యెలా?’
‘రాట్నం తో వడకడం నూలుగా’
‘రాటం, ఈనాడు కాదు వాటం’
‘మరెలా?’
‘ఇటు ముందుకు’
‘కాదు. అటు వెనక్కు’
‘ఇటు ఇటు’
‘అటు అటు’
‘అబ్బే!’
‘దా
‘రా’
‘ఎటు ఎటు ?’

-భండారు పర్వతాలరావు : తెలుగు స్వతంత్ర : జనవరి: 1954     


25, డిసెంబర్ 2012, మంగళవారం

టైమ్ టార్పెడో



టైమ్ టార్పెడో




టైమ్ టార్పెడో  టైమ్ టార్పెడో
ఎవరెస్ట్ క్షణంలో పసిఫిక్!
ఎవరు చేయగలరీ ట్రిక్!!
టైమ్ టార్పెడో  టైమ్ టార్పెడో

షాజహాన్ను, తిమ్మరసును, శ్రీనాధుని చివర చివర
ధర తగ్గిన ధాన్యపు గరిసెలు
ఇన్ఫ్లేషన్ రోజుల నూకలు
గాజేసిన, ఘనతను దాచేసిన శక్తి ఎవరు?
టైమ్ టార్పెడో  టైమ్ టార్పెడో

ఆ మినిటులో ఆంటోనీ స్పీచ్ అనేక వేల బులెట్ల పెట్టు
ఆ ఆగస్టులో క్విట్ ఇండియా అనడం అరెస్టుకై రిక్వెస్టు
ఆ మినిటు కాస్పిరిటు
ఆ నెల కావెల
ఇప్పించిన శక్తి ఎవరు?
టైమ్ టార్పెడో  టైమ్ టార్పెడో

-భండారు పర్వతాలరావు (1955)

లయ సుమాలు



లయ సుమాలు



దీపము వలసిందెప్పుడు
తిమిరమునందే
విజ్ఞాని ముందు నిలచిన
అజ్ఞాని నోరు బందే

కలలు పొర్లు కనులు నడుపు
కాలు ముళ్లమీదే
తలలు మార్చువాని సలహా
మంచికెపుడు కాదే

ఇత్తడి బంగారమనే
వానిదె ఈ లోకం
పుత్తడి పూర్ణల బ్రతుకె  
రిత్త కడుపు శోకం

-కీర్తిశేషులు భండారు పర్వతాలరావు (ఫిబ్రవరి,1956)