21, డిసెంబర్ 2012, శుక్రవారం

కలలోని నిజం – భండారు పర్వతాలరావు



కలలోని నిజం – భండారు పర్వతాలరావు


కలల లోకంలో  


తలపుటలలు రేగి ఎదల
వలపు వగరు తెచ్చి నింపె
వలపు వగరు మేసి ఎదలు
కలమునందు కలల నొంపె

కలలు తొణకు కలము ప్రజకు
మధువు జిలుకు కవిత నంపె
మధువు జిలుకు కవిత పఠిత
మానసమున మత్తు నింపె

మత్తిల్లిన మానసంబు
మదపు మగత దోగి కునికె
మదపు మగత దోగి కునుకు
మానసమును కలలు కలచె

కలయందున వలపు లేదు
కలల తొణకు కలము లేదు
మధువు జిలుకు కవిత లేదు
మధువు వలన  మగత లేదు

వలపులేక  మధువు లేక
కలయందున నేమున్నది?
చర్మములో, బొమికెలలో
శవముకాని దొకటున్నది

కలలో కనిపించిన బొమి
కల గూటిని చూచి మనసు
కలవరపడి లేచి చూచె
‘కలయే నిజమంచు’ అరచె

కలలు కరిగె, వలపు విరిగె
మధువు తొలికె, మగత తొలగె
నిజం వీపు చరచి ముందు
నిలచి తానున్నానని పలికె! 
                
(విశాలాంధ్ర: ఫిబ్రవరి,1 - 1963)  

20, డిసెంబర్ 2012, గురువారం

శాంతి – భండారు పర్వతాలరావు


శాంతి – భండారు పర్వతాలరావు

మన కొంపలపై బాంబులు
మన పచ్చని పైరుల మంటలు
మన పల్లెల పరుల మిలట్రీ
మన చెల్లికి దుర్మార్గుల చెర
జాబిల్లికి విషవాయువు తెర

మానవ జీవితాల బ్రహ్మజెముడు ముళ్లు
మనిషికీ మనిషికీ మధ్య ఎందుకోయి ఈ గళ్ళు
వద్దు! ప్రళయాన్ని ప్రసవించగల పొరపాట్లు
వద్దు! విలయపుటంచుల వివేకపు కప్పదాట్లు



వద్దు వద్దు మనకీ యుద్ధం!
కావలసినదొకటే శాంతి
జగమంతయు వెలుగగ క్రాంతి!
(విశాలాంధ్ర: ఫిబ్రవరి, 1963)

ఆమంత్రణ - కీర్తిశేషులు భండారు పర్వతాలరావు


ఆమంత్రణ  - కీర్తిశేషులు భండారు పర్వతాలరావు

ఉదయాన్నే లేచి కలువ
వికాసాన్ని కోరకు
ఇసుక కుప్పవోలె అలకు
క్షణం క్షణం  మారకు

ఆదర్శం ముందెన్నడు
అవసరాన్ని చూడకు
ప్రచారాల తెరలు డుల్చి
ప్రతిభ చూడ నోడకు

(తెలుగు స్వతంత్ర :డిసెంబరు, 23, 1955)     

19, డిసెంబర్ 2012, బుధవారం

ప్రాతఃస్మరణీయుడు పర్వతాలరావు గారు


ప్రాతఃస్మరణీయుడు పర్వతాలరావు గారు

చనిపోయి ఆరేళ్ళు దాటిపోతున్నా  ‘మీ అన్నగారెలా వున్నారు? కులాసాయే కదా!’ అంటూ ఆయన మిత్రులు కొందరు ఫేస్ బుక్ లో అడుగుతున్నారంటే నిజంగా ఆయన చిరంజీవే. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు దాదాపు యాభయ్  అరవై ఏళ్ళ క్రితం రచించిన కొన్ని గేయాలు ఇంకా యెంత తాజాగా, ఇప్పటికీ వర్తించేలా యెలా వున్నాయో తెలపడం కోసం ఈ ప్రయత్నం – భండారు శ్రీనివాసరావు



కీర్తిశేషులు భండారు పర్వతాలరావు 


చేయకు

వృధాలోచనలతో నింపి
యెదలో వ్యధ పండించకు
కాంచ చంద్రు నమవస నిశి
కళ్ళూరకే చికిలించకు

పుట్టని రేపును చూడగ
పట్టుదలతో శ్రమియించకు
తెగిన వీణ తీగెలపై
బ్రతుకు పాట మ్రోయించకు

కీర్తి కొరకు కక్కుర్తితో
కలమునమ్మ తలపెట్టకు
కండలపై బ్రతుకు పేద
వాండ్ల తలను చెయిబెట్టకు
         
 (తెలుగు స్వతంత్ర – జనవరి 4,1958)                

15, డిసెంబర్ 2012, శనివారం

పుట్టిన రోజు పండగే అందరికీ!



పుట్టిన రోజు పండగే అందరికీ!

అప్పు పుట్టిన రోజులే కాని పుట్టిన రోజులు లేవన్నాడు ఓ కవి.
తెలుగు తిధులు, ఇంగ్లీష్ తారీఖుల పుణ్యమా అని ఏడాదికి రెండు సార్లు పుట్టినరోజు జరుపుకునే అదృష్టం కొందరికి పడుతుంది.  బోలెడు  బోలెడు వెనుకటి రోజుల్లో ఇళ్లల్లోనే మంత్రసానుల పుణ్యమా అని  పురుళ్ళూ పుణ్యాలు జరిగిపోతున్నప్పుడు, మాతామహులో,పితామహులో లేక వూళ్ళో వున్న సిద్ధాంతిగారో రాసిపెట్టిన కాగితం ముక్క ఆధారంగా పుట్టిన రోజులు జరుపుకునే వాళ్లు కొందరయితే, జనన మరణ దస్తావేజుల ప్రాతిపదికపై జన్మదినోత్సవాలు జరుపుకునే వారు మరికొందరు.

     
మరికొందరు అదృష్టవంతులు కూడా వున్నారు. దేవుడు మేలు చేయకుండానే ముచ్చటగా మూడో  మారు కూడా హ్యాపీ బర్త్ డే గ్రీటింగులు ఏటేటా అందుకుంటూ వుంటారు. ఇప్పటికి షష్టి పూర్తి జరుపుకున్న వాళ్లల్లో  చాలామందికి చిన్నప్పుడు బళ్ళో వేసినప్పుడు   నమోదు చేసిన తేదీయే  అధికారికంగా పుట్టిన తేదీ అయికూర్చుంటుంది. స్కూలు ఫైనల్ నాటికి ఇంత వయస్సు వుండి  తీరాలనే నిబంధనకు అనుగుణంగా వేళ్ళమీద  అప్పటికప్పుడే  లెక్కలు వేసి అక్కడికక్కడే ఇస్కూలు రిజిస్టర్లలో   పుట్టిన తేదీ వేసే సంప్రదాయం కారణంగా కొందరికి ఈ అదృష్టం పడుతుంది.
అయితే ఈ అదృష్టాలు తెచ్చిపెట్టే ఇబ్బందులు కూడా వుంటాయి.
డెబ్బయ్యవ దశకంలో నేను ఆంధ్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు అక్కడ గ్రూపు ఇన్స్యూరెన్సు చేసే పెద్దమనిషి వచ్చి నా చేత భీమా చేయించుకుని వెళ్లాడు. తన దగ్గర బీమా చేయించున్నవాళ్లకు తన రికార్డుల్లో వున్న తేదీల ప్రకారం ప్రతియేటా క్రమం తప్పకుండా  ఓ పోస్ట్ కార్దుమీద గ్రీటింగ్ పంపడం ఆయనకు అలవాటు. అటు ఆంధ్ర జ్యోతికీ,ఇటు  భీమా కిస్తీలకీ సైతం  నీళ్ళు వొదిలి హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత కూడా ఆయన గారు పంపే జన్మదిన శుభాకాంక్షల సందేశం ప్రతియేటా ఠంచనుగా మా ఆఫీసుకు చేరేది. కార్డు ముక్క కావడం వల్ల ఆ ముక్క నలుగురికీ ఎంచక్కా తెలిసిపోయేది. నా పుట్టిన రోజు ఈ రోజు కాదు మొర్రో అని సర్ది చెప్పలేక తల ప్రాణం తోకలోకి వచ్చేది.
ఇప్పుడు మళ్ళీ నెట్లూ నెట్లాగుల పుణ్యమా అని పొద్దుపొడవక ముందే  పొద్దున్న పొద్దున్నే నెట్లో అందుకునే శుభాకాంక్షలకు ‘థాంక్ యూ  వెరీ మచ్’ లు చెప్పుకోవాల్సివస్తోంది.  ఎస్ ఎం ఎస్ లకు జవాబు ఇవాల్సివస్తోంది.
అదేదో ఇంగ్లీష్ సామెత మాదిరిగా తప్పనిసరి అయినప్పుడు ఆనందించమన్నట్టు అందుకుంటున్నది అభినందనలేగా కిమ్మనకుండా అవునంటే పోలా!
అందుకని మిత్రులారా! విష్ మీ హ్యాపీ బర్త్ డే టుడే. మళ్ళీ ఆగస్ట్ ఏడవ తేదీన కూడా మరచిపోకండేం!
(15-12-2012)

10, డిసెంబర్ 2012, సోమవారం

అద్వైతం


అద్వైతం
తెలుగులో నాకున్న కొద్దిపాటి  పాండిత్యం నలుగురిలో నాకొక పెద్ద  గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి నా తెలుగు అంతంత మాత్రమే. కానీ ఏమీ లేనిచోట ఆముదపు మొక్క మాదిరిగా అమెరికాలో నేనొక తెలుగు పండితుడన్న పేరు తెచ్చుకోవడానికి అది అడ్డం కాలేదు. చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు బట్టీ వేయించిన తెలుగు పద్యాలనే కాస్త అటూ ఇటూ తిప్పి సందర్భం అసందర్భం అని చూసుకోకుండా అందరి నడుమ   ప్రయోగించే నా తెంపరితనాన్ని  నలుగురు నాలుగు రకాలుగా మెచ్చుకుంటూ వుండడంతో తెలుగు పండితుడన్న బిరుదు, దేశం కాని దేశంలో నాకు  స్తిరపడిపోయింది. దానితో ఆటా, తానా సభల్లో నేను ఆడింది ఆట పాడింది పద్యం అయిపోయింది.
అసలే ఎన్.ఆర్.ఐ. అనే మూడక్షరాలే  నా వొంట్లో పొగరును బాగా పెంచాయి. వీటికి తోడు ఈ మధ్య ‘గ్రీన్ కార్డు’ అనేది మరొకటి జత కలిసింది. ఇంకేముంది అసలే కోతి, కల్లు తాగింది కధలో మాదిరిరిగా పొగరుకు ‘విగర్’ తోడయింది. ఇండియా వచ్చినప్పుడల్లా తెలుగు పుస్తకాలు భారీగా కొనుక్కుని వెళ్లి  అమెరికాలో తెలుగువారికి  పంచి పెడుతూ నా పేరును సార్ధకం చేసుకునే కొత్త భారాన్ని నెత్తికెత్తుకునేలాచేసింది.
ఈ సొంత గోల ఆపి అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఇండియా వచ్చి తిరిగివెళ్ళబోయేముందు తెలుగు పుస్తకాలు కొందామని వెళ్లాను. నేను అంతకు ముందు ఆ షాపుకు వెళ్ళలేదు. చాలా పెద్ద దుకాణం. కొనేవారికి సాయపడేందుకు సహాయకులను కూడా పెట్టారు. నాకు సాయంగా వచ్చిన అమ్మాయికి ఇరవై లోపే వయసు.  అందవికారంగా వుంది. వేసుకున్న దుస్తులు కూడా ఆమెకు నప్పలేదు. అసలే చింపిరి జుట్టు,  సరిగా దువ్వుకోకుండా ముడేసుకుంది.
‘మీరు ఏరకమైన పుస్తకాలు ఇష్టపడతార’ని మామూలుగా  అడిగింది. ఆమె ముందు నా పాండిత్యం వొలకబోయాలన్న దుర్బుద్ధి కలగడంతో  ‘అద్వైతం గురించిన గ్రంధాలేమయినా వున్నాయా వుంటే చూపించు’ అన్నాను, నిజానికి ద్వైతాద్వైతాలగురించి నాకు ఎలాటి  అవగాహన లేకపోయినా. అడిగినదే తడవుగా ఆ అమ్మాయి కొన్ని గ్రంధాలు తీసి చూపించింది.
నా తెలివిని మరింత ప్రదర్శించడానికి ‘అద్వైతం అంటే నీకు ఏమాత్రం తెలుసు. పురాణ వాజ్మయంలో నీకున్న అవగాహన ఏపాటిది?’ అని అడిగాను.
ఆ ఆమ్మాయి చెప్పిన జవాబుతో నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. నా అజ్ఞానం ఏస్థాయిలో వున్నదో  అర్ధం అయింది.
‘తిరుమల తిరుపతి దేవస్థానం వారు  అద్వైతాక్షర మాలిక అనే అనువాద గ్రంధాన్ని 2003 లో  ప్రచురించారు. భాగవతుల కుటుంబరావు గారు అనువాదం చేశారు. గ్రంధ సంపాదకులు పుల్లెల రామచంద్రుడు గారు. చూస్తుంటే  అద్వైతం పట్ల మీకు ఆసక్తి వున్నట్టుంది. వ్యవధానం వున్నట్టయితే  కొన్ని విషయాలు చెబుతాను.
‘చాలా సంవత్సరాలకిందట కొందరు పండితులు సంస్కృతంలో 51  వ్యాసాలు   రాశారు.  1945 లో   కుంభకోణంలో జరిగిన అద్వైత సభ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆశీస్సులతో ఈ గ్రంధాన్ని ప్రచురించారు.  
‘పోతే, పురాణ వాజ్మయం గురించి అడిగారు కదా. వేదవ్యాసులవారు తొలుత బ్రహ్మ నుంచి వేదాలను గ్రహించారు. వాటిని నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులయిన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించారు. వారు వారి శిష్యులకు, వారు తమ అనుయాయులకు పరంపరగా అందించారు.
‘ఇక వేదాల విషయంలో కూడా మన తెలుగు పండితులు విశేష కృషి చేశారు. సంస్కృతంలో వ్యాస విరచిత వేద వాజ్మయాన్ని దాశరధి రంగాచార్య గారు 70 ఏళ్ళ వయస్సులో అయిదు వేల  పేజీల్లో  తెలుగులోకి అనువదించారు.  ఇందులో ఒక భాగమయిన శుక్ల యజుర్వేదాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు రెండువేల సంవత్సరంలో ఆవిష్కరించారు.  
‘వేద వాజ్మయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు సాయణాచార్యుడి ప్రసక్తి అనివార్యం. ఎందుకంటే ఆయన అచ్చ తెలుగువాడు. భారద్వాజగోత్రుడు. అనేక ప్రకాండులను సమకూర్చుకుని అనేకమయిన వేద వ్యాఖ్యానాలు రచించాడు.
‘సాయణాచార్యులవారు మరికొన్నింటికి కూడా వ్యాఖ్యలు రాశారు.
‘తైత్తిరేయ బ్రాహ్మణము,  ఆర్షేయ బ్రాహ్మణము, దేవాధ్యాయ బ్రాహ్మణము, ఉపనిషద్ బ్రాహ్మణము, సంహితోపనిషద్ బ్రాహ్మణము  వీటిల్లో ముఖ్యమయినవి.
‘ఈ గ్రంధాల్లో కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని లభ్యం కావడం లేదు. ఆదరించేవారు తక్కువ కావడం ప్రధాన కారణం. అమెరికాలో వుంటూ కూడా ఇలాటి ప్రాచీన భారతీయ  సాహిత్యం  పట్ల మీవంటి వారు చూపుతున్న ఆసక్తే, చనిపోతున్న ఈ సాహిత్యాన్ని  బతికించాలి.’
అప్పటికే సిగ్గుతో సగం చచ్చిపోయి వున్నానేమో ఆ అమ్మాయి మాటలకు ఏం జవాబు చెప్పగలనో మీరే చెప్పండి.
 (10-12-2012)
గమనిక: పుస్తక ప్రేమికులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఇంగ్లీష్ లో వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి రాసిన ఓ అద్భుత వ్యాసాన్ని నాకు మెయిల్లో పంపారు. తమిళనాడు నేపధ్యంలో సాగిన రూపొందిన రచన అది. కొన్ని మార్పులను చేసి ఆ వ్యాస భావం చెడకుండా రాయడానికి చేసిన ప్రయత్నం ఇది. – భండారు శ్రీనివాసరావు 

8, డిసెంబర్ 2012, శనివారం

నోటికి తాళం


నోటికి తాళం
పెదవి దాటిన  మాట పృధివి దాటుతుందంటారు.
అందుకే ఏదయినా ఒక మాట అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పెద్దలంటారు.
దీనికి ఉదాహరణగా ఒక కధ నెట్లో సంచారం చేస్తోంది.
అదేమిటంటే-
అనగనగా ఒక పెద్దమనిషికి వూళ్ళో నలుగురి గురించీ నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం అలవాటు. నిజమో కాదో నిర్ధారణ చేసుకోకుండా అందరి మీదా నీలాపనిందలు మోపడం ఆయన హాబీ. అందులో భాగంగా ఆయన పక్కింటి కుర్రాడు దొంగ అంటూ తేలిగ్గా  ఓ నెపం మోపాడు. అంతటితో ఆగకుండా వైనవైనాలుగా ప్రచారాలు చేసి ఆ కుర్రవాడు దొంగ అని నలుగురు నమ్మేలా చేసాడు. పోలీసులు కూడా అది నిజమని నమ్మి ఆ కుర్రాడిని పట్టుకుని జైల్లో వేసారు. శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తరువాత ఆ కుర్రాడు సదరు పెద్దమనిషిపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగాడు.
పోతే, న్యాయమూర్తి ముందు ఆ పెద్దమనిషి మాట మార్చాడు. తానేదో ఉబుసుపోకకు అన్న మాటలే కాని ఆ కుర్రాడు దొంగ కాదన్నాడు. అతడిని బాధ పెట్టే  ఉద్దేశ్యం లేదన్నాడు.
జడ్జి అంతావిని అతగాడికి ఓ కాగితం ఇచ్చి ఆ కుర్రాడిని గురించి లోగడ అన్న మాటలన్నీ దానిమీద రాయమన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలుగా చించి ఇంటికి వెళ్ళే దారిలో విసిరేసి మర్నాడు కోర్టుకు రమ్మన్నాడు.
ఆ పెద్దమనిషి న్యాయమూర్తి చెప్పినట్టే చేసి మరునాడు కోర్టులో జడ్జి ముందు బోనులో నిలబడ్డాడు.
న్యాయమూర్తి తీర్పుచెప్పబోయేముందు,  విసిరేసిన కాగితం ముక్కలు తనకు చూపించమన్నాడు.  ‘ఇంకా అవెక్కడున్నాయి. ఎప్పుడో గాలికి  కొట్టుకుపోయాయి’ అని పెద్దమనిషి జవాబు చెప్పాడు.
అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు.
వేళాకోళంగా అనే మాటలు కూడా చింపిపారేసిన కాగితం ముక్కలు లాంటివే.  గాలికి కొట్టుకుపోయిన వాటిని తిరిగి తేలేనట్టే చెడుపు చేసే మాటల్ని  కూడా. అవి అవతలి వ్యక్తికి  చేసే అపకారాన్ని గురించి కాసేపు ముందే ఆలోచిస్తే అలాటి మాటలు అనడానికి కాస్త సంకోచిస్తాము. ఏదో మాటే కదా! అన్నంతమాత్రానికే   ఏమవుతుంది అనుకుంటే ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఎదుటివాడిని గురించి మంచి చెప్పలేనిపరిస్తితే వుంటే అప్పుడు కనీసం  అసలేమీ చెప్పకపోవడం మంచిది.
మన నాలికకి మనమే యజమానులం. మనం చెప్పినట్టే అది మాట్లాడాలి. అది మాట్లాడినట్టల్లా మనం తలాడించకూడదు. ఆడిస్తే ఇలాగే తల దించుకోవాల్సిన పరిస్తితి ఎదురవుతుంది.
ముగించాడు న్యాయమూర్తి మందలింపుగా.
నీతి: నోటికి తాళం వేసుకోలేకపోయినా నాలుకను సంభాలించుకోవడం ఉత్తమం.