16, జూన్ 2012, శనివారం

మంచి మనుషులు – మంచి మనసులు



మంచి మనుషులు – మంచి మనసులు

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ‘ఆయన’ మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు. సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదలదాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి దృష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. లేదుఅని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసాక  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో అతగాడిని ఉద్యోగం నుంచి అర్ధాంతరంగా  తొలగించారు. అంతటితో ఆగలేదు, అతడిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. కానీ మన మేయర్ గారున్నారే,  ఆయన అలాటిలాటి అల్లాటప్పా  రాజకీయ నాయకుడు కాదు. కనుకనే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని జైలు నుంచి  విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. అంటే ఏమిటి? స్తానిక సంస్తలకు అలనాటి  బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట. అలాటి విశాల తత్వాన్ని ఈనాటి స్వతంత్ర భారతంలో మన  పాలకులనుంచి ఆశించగలమా?

ఆ మేయర్ మహాశయుల పేరు స్మరించుకుందాం.  దేశబంధు బిరుదు పొందిన స్వాతంత్య్ర సమర యోధుడు  చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో హింసా మార్గం అవలంబించినా  తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)
(ఈనెల పదహారో తేదీ చిత్తరంజన్ దాస్ వర్ధంతి)

11, జూన్ 2012, సోమవారం

మైండ్ బ్లాంక్ కావడమంటే!


మైండ్ బ్లాంక్ కావడమంటే!
“ఛీ! ఛీ!! పాడుకొంప పాడుకొంపనీ- ఇల్లు ఇరకటం ఇల్లాలు మర్కటం అంటే ఇదే కాబోలు. సమయానికి ఒక్కటీ కనబడి చావదు. పాడు కొంప పాడుకొంపనీ ....”
                  “ఏమండీ మిమ్మల్నే! ఇందాకటినుంచి గొంతుచించుకుని పిలుస్తుంటే వినిపించుకోరేం! ఏమిటా పరధ్యానం. ఆఫీసులో టైపిస్టు పిల్ల గుర్తొచ్చిందా ఏమిటి?”
“అబ్బెబ్బే ....ల్లే ల్లే ల్లే ల్లే ల్లేదు లేవే”
                 “ఇంటెడు చాకిరితో ఇవతల నేనల్లాడి పోతుంటే అవతల మీరు ఎవరెవర్నో తలచుకోడాలు, మురిసిపోడాలు. సిగ్గు లేకపోతే సరి. సరే దోభీ వచ్చాడు. నాకేమన్నా పది చేతులా! ముందా పద్దు సంగతి చూడండి.”
“స్సస్సస్సస్సరి లేవే! ఆ! చెప్పవయ్యా!! చీరెలెన్ని? లంగాలెన్ని?”

                       “ప్యాంట్లు మూడు – బనీన్లు రెండూ”

10, జూన్ 2012, ఆదివారం

స్టాక్ హోం సిండ్రోం


స్టాక్ హోం సిండ్రోం

‘కొట్టిన చెయ్యే  కోరు’ అని పాత సినిమాలో ఒక పాట వుంది.
1973 లో స్వీడన్ లోని స్టాక్ హోం లో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒకరకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా బందీలు అంగీకరించలేదు. పైపెచ్చు,  తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే  వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి  సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో ‘స్టాక్ హోం సిండ్రోం’ అనే పేరు స్తిరపడింది.
ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.         
‘మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల  మాటలు -  రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీటిలాటివి’
ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో  నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన  ఒక విశ్లేషకుడు ఏకీభవించలేదు.
మేధావులు, చదువుకున్నవాళ్ళు - తమకున్న పరిజ్ఞానంతో 'అది' లేని వారికి విషయం విడమరచి చెప్పి  సరయిన తీరులో వాళ్ళు  కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపొతే మా ఇరువురి నడుమా ఈ  సంభాషణ ‘బ్రేక్’ టైం లో సాగింది.
ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?
సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.
ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న పెద్దమనిషి సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమ లోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.
ఇది చెప్పి, టీవీ ఛానళ్ళవాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని  నా అభిప్రాయం వెల్లడించాను.
అసలింతకీ విషయం  ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని  సామాన్యులు  అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం  ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే  ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకడం లేదు. ఈ నేపధ్యంలో ప్రజలు కొద్ది రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఇవ్వబోయే తీర్పు తమకు అనుకూలంగా లేకపోతే వారు అవినీతికి కొమ్ము కాసేవాళ్లని అనుకున్నా తప్పులేదని తీర్మానించడం  కూడా ప్రజాతీర్పును చిన్నబుచ్చినట్టే అవుతుంది.
రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటు కోసం ఏదయినా కోరుకుంటే అది అధర్మం. కనీస అవసరాలు కనుక్కునేవారికి మద్దతుగా నిలబడితే ‘బిస్కెట్లకు’ ఆశపడేవారిగా ముద్ర.  రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. సమాజం మొత్తం అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతేకాని పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు.  
రాజకీయ నాయకులు, ఆ మాటకు వస్తే సమాజంలో ఎంతోకొంత పలుకుబడి కలిగిన వాళ్లందరూ  తమ స్వప్రయోజనాలకు పెద్ద పీట  వేస్తున్నప్పుడు, తమ విషయంలోనే ఈ పెద్దలు సుద్దులు నూరిపోయడం సామాన్యులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందుకే, కనీవిని ఎరుగని స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని గ్రహించినందువల్లనే కాబోలు, ఆర్ధిక కారణాలతోనే ప్రజలు అవినీతిపరులుగా ముద్ర పడినవారి పట్ల అభిమానం చూపిస్తున్నారని కొత్త గగ్గోలు మొదలయింది.
పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఎంతో పుణ్యం చేసుకుంటూ స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించుకుంటున్నాడని అంతా వేనోళ్ళ చెప్పుకునేవారు.అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ‘ఎంగిలి’ అవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ‘ ఆ ఎంగిలి కూడు’ ఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా  వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో  ఆ భవనానికి వెళ్లి కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో  రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ అక్కడ నరకంలో రాజుగారి ‘ఎంగిలి కొండ’ క్రమంగా తరిగిపోవడం మొదలయింది.
త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ  అది.            
‘మాదోరి పాప. ఆదోరి  బయ్యాలి’ అని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది. (09-06-2012)                 

30, మే 2012, బుధవారం

తేరా భారత్! మేరా మహాన్!!


తేరా భారత్! మేరా మహాన్!! 

ఇటాలియన్ మంత్రిగారొకరు హడావిడిగా ఇండియా వచ్చి భారత విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. దీనికి కొంత నేపధ్యం వుంది. ఇటలీ నౌకాదళ సైనికులు ఇద్దర్ని అంతకు కొన్ని రోజులముందు కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రపు దొంగలుగా భ్రమపడి  ఇటలీ సైనికులు కాల్చి చంపారని అభియోగం. వారిని విడిపించే ప్రయత్నంలో భాగంగా ఇటలీ మంత్రి ఇండియా మంత్రి చర్చలు జరుపుతున్నారు.
పట్టుబడిన  ఇద్దరినీ ఇండియాలోనే వుంచి విచారణ జరపడం మంచిదని ఇండియా మంత్రి ఇటలీ మంత్రికి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వివరించే క్రమంలో ఆయన ఇటలీ మంత్రికి కొన్ని విషయాలు విశదం చేశారు.
ఇటలీలో పుట్టి పెరిగి ఇండియా కోడలిగా వచ్చి ఇప్పుడు ఏకంగా మొత్తం ఇండియానే శాసిస్తున్న సోనియా గాంధీకి జాతీయ అంతర్జాతీయ నేరస్తులపట్ల యెనలేని  కనికరం వున్న సంగతి యాదాలాపంగా బయట పెట్టారు. అందుకు దృష్ట్యాంతంగా   యూనియన్ కార్బైడ్ వ్యవహారం గురించీ, ఆయుధాల వ్యాపారి ఖత్రోచీ గురించీ, చివరాఖరుకు పాక్ ఉగ్రవాది కసబ్ పట్ల చూపుతున్న అపూర్వఆదరణ  గురించీ  ఇటలీ మంత్రికి వివరించి చెప్పి, ఇటాలియన్ సైనికుల విచారణ ఇండియాలోనే జరగడం వల్ల వాళ్లకు మంచే కాని చెడు జరగదన్న విషయాన్ని విడమరచి చెప్పారు.
అంతేకాదు స్పెక్ట్రం కుంభకోణం గురించీ, అందులో పీకల్లోతు ఇరుక్కున్న రాజా, కనిమొళి గురించీ ఇటలీ మంత్రి చెవిలో వేసారు. స్విస్  బ్యాంకుల్లో  కోట్లకు కోట్లు డబ్బు దాచుకున్న వారి సంగతి కూడా చెప్పి అలాటివారంతా భారత దేశంలో ఎలాటి  చీకూ చింతా లేకుండా యెలా రోజులు వెళ్ళదీస్తున్నారో సయితం అంకెలతో సహా చెప్పిచూసారు.        
ఎంతచెప్పినా ఆ ఇటలీ మంత్రికి చెవికెక్కిన దాఖలాలు లేవు.  భారత దేశంలో తన వారిపై విచారణ జరపడానికి సుతరామూ ఆయన  అంగీకరించలేదు. నేరస్తులకు రక్షణ పూర్తిగా వుంటుందని యెంత చెప్పినా అర్ధం చేసుకోని ఇటలీ మంత్రిపై ఇండియా మంత్రికి పట్టలేని కోపం వచ్చింది.
అయితే ఇంతలో ఒక అద్భుతం జరిగిపోయింది.
మంత్రి గదిలో వున్న టెలివిజన్ తెరపై అప్పుడు ఒక స్క్రోలింగ్ వస్తోంది.
ఇటలీ నౌకను పాతిక లక్షల రూపాయల పూచీకత్తుపై విడిచిపెట్టాలని కేరళ న్యాయమూర్తి ఆదేశించారన్నది  ఆ వార్త సారాంశం.
పాతిక లక్షల రూపాయలంటే యెంత అని ఇటలీ మంత్రి అడిగాడు. సుమారుగా ముప్పయ్ ఎనిమిది వేల   యూరోలని ఇండియా మంత్రి జవాబు చెప్పాడు.
భారత దేశ పౌరసత్వం దొరకాలంటే ఏం చెయ్యాలని ఇటలీ మంత్రి ఆసక్తిగా అడిగాడు.
నెహ్రూ కుటుంబంతో వియ్యం అందితే ఇట్టే  దొరుకుతుందని ఇటునుంచి సమాధానం.
‘వాళ్ల కుటుంబంలో  ‘పెళ్ళికాని ప్రసాద్’ రాహుల్ ఒక్కడే కదా! అదెలా సాధ్యం?’ అని ఇటాలియన్ మరో ప్రశ్న సంధించాడు.
అనవసరంగా రాహుల్ ప్రసక్తి తెచ్చానే అని నీళ్ళు నమిలిన ఇండియా మంత్రి ‘సిటిజన్ షిప్ లాంటి తతంగాలన్నీ అత్యల్ప స్వల్ప విషయాలు. వాటిని గురించి కనుక్కుని ఏర్పాట్లు చేయడానికి కోటరీ చాలా వుంది. ముందు మీ సంగతి  తేల్చండి’ అన్నాడు.          
ఇటలీ మంత్రి కూర్చున్న చోటి నుంచి కదలకుండా రోముకు ఫోను చేసి తాను ఇప్పట్లో ఇటలీ రావడం లేదని చెప్పాడు. మరో ఫోను సిసిలీకి చేసి అక్కడి మాఫియా అధినేతతో మాట్లాడాడు.
‘ఇన్నాళ్లబట్టి మీరంతా ఏదో పోటుగాళ్లన్న భ్రమలో వున్నాం. ఒకసారి ఇండియా వచ్చి చూడండి. ఇక్కడివాళ్ళు చాలా తెలివిమీరిపోయారు. మీరింకా పాత రాతి యుగంలోనే  వున్నారన్న సంగతి అర్ధమవుతుంది.’
(30-05-2012)
(ఇంటర్నెట్ లో సంచారం చేస్తున్న ఇంగ్లీష్ ‘జోకు’ కు స్వేచ్ఛానువాదం)   

29, మే 2012, మంగళవారం

పెద్దరికంలో వున్న మజా!


పెద్దరికంలో వున్న మజా!

“జీవితమంటే శక్తి. బలహీనతకు మరోపేరే మృత్యువు. మన వూహలు,ఆలోచనలు,ఆశలు,ఆశయాలు అన్నీ మన జీవితాల్లో భాగమే!” – స్వామి  వివేకానంద



అరవయ్యో పడిలో పడ్డ చాలామంది ఏదో తెలియని అభద్రతా భావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీద పడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న భయం కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నదేమో అన్న  బాధ  కావచ్చు. కారణం ఏదయినా వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు  సహజం. అయితే వీటిని అధిగమించి జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు జీవితాన్ని కాచి వడబోసిన వాళ్లు.       

ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.
వయసుల్లో మూడు రకాలున్నాయి.జనన తేదీ ప్రకారం చెప్పుకునే వయసు ఒకటయితే,రెండోది శారీరిక ఆరోగ్యం ఆధారంగా అంచనా వేసేది. ఇక మూడో వయస్సు అనేది మన భావనలు  బట్టి ఆలోచనలు బట్టి నిర్ధారణ అవుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీ శ్రీ రాసింది ఇలాటి వారి గురించే.
ఇందులో మొదటి దానిమీద మనకు కంట్రోల్ వుండని మాట నిజమే. నిజానికి ఆ వయసును ఏమాత్రం మార్చలేము, ఏమార్చలేము.
కాకపోతే రెండోదాన్ని మానవ ప్రయత్నంతో  కొంతవరకు అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే సరయిన  పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసును ఉల్లాసంగా వుంచుకోవడం ద్వారా కొంతమేరకు వయసు ప్రభావం శరీరం మీద పడకుండా చూసుకోవచ్చు. సానుకూల వైఖరి, ఆశావహ దృక్పధం పెంపొందింపచేసుకోవడం వల్ల మూడో రకం వయస్సును అదుపుచేసుకోవడానికి  కుదురుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని ‘భాగ్యానికి’ నిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.
భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబం అందరూ ఆనందంగా సంతోషంగా వుండడం. వయసు మళ్లి  పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి  కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ వారిని ఇబ్బందుల పాలు చేయకుండా ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది. కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచుకుంటే ఇదేమంత పెద్దపని కాదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం, డాక్టర్ రాసిచ్చిన మందులు సక్రమంగా  వేసుకోవడం – ఇలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలిగితే పిల్లల్ని అనవసర శ్రమలనుంచి రక్షించినవాళ్ళవుతారు.            
ధనమూలం ఇదం జగత్!
డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుకాదు కాని ఆనందంగా జీవించడానికి  డబ్బు కావాలి.
అందుకే పశువుకు తిన్నది దండి మనిషికి వున్నది దండి అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో గౌరవంగా జీవించడానికి, కుటుంబ సభ్యులనుంచి ప్రేమాదరాలు పొందడానికి, ఎంతో కొంత సొంత సొమ్ము ప్రతి ఒక్కరికీ అవసరం. వయస్సు మీదపడ్డ తరువాత శారీరిక శ్రమ చేసి సంపాదించడానికి వీలులేని రోజుల్ని ముందుగానే అంచనా వేసుకుని  భద్రమయిన భవిష్యత్ జీవితం కోసం తమకంటూ కొంత మొత్తాన్ని  కూడబెట్టుకోవడం చాలా అవసరం. దీన్ని స్వార్ధం అని ఎవ్వరూ అనుకోరు. మీ పిల్లలు మీ అవసరాలను కనుక్కోగలిగితే అది బోనసుగా భావించాలి. మీ అవసరాలు కనుక్కోలేని అవసరాలు వాళ్లకు వుంటే దాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకునే పెద్దరికం మీకుండాలి. అప్పుడే ముదిమి వయస్సులో చీకూ చింతా లేని జీవితం మీ సొంతమవుతుంది.

హాయిగా మనసెంతో తీయగా
మనసును హాయిగా వుంచుకోవాలి. ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. ‘మా రోజుల్లో అయితే...’ అంటూ నస పెట్టకుండా వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం  అలవరచుకోవాలి. వేళకు నిద్రపోవడం, చక్కటి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, నిత్య జీవితంలో హాస్యాన్ని ఆస్వాదించగలగడం – ఇవన్నీ మనసుకు హాయినిచ్చి వయసును తగ్గిస్తాయి.      
సమయం అమూల్యం
ఈ జీవన యానంలో సంపాదించింది యెంత వున్నా పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది  మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే,  ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం  చేతిలో వున్న పైకం. దాన్ని జాగ్రత్తగా ప్రయోజనకరంగా వాడుకోగలగాలి. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం  నేర్చుకోవాలి.
మార్పు శాశ్వితం.
మారుతూ  వున్నప్పుడు అది శాశ్వితమెలా అవుతుందన్న అనుమానాలు పెట్టుకోకూడదు. మార్పును అంగీకరించడం అంటే వరద వాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువ తరంతో, రానున్న తరంతో  సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ‘ముసలి వాసనలు’ మన నుంచి తప్పుకుంటాయి.   కాలక్రమంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగానే మన జీవితాలు  ఇప్పుడిలా  సుఖప్రదంగా గడుస్తున్నాయన్న  వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి.  
నాకేమిటి?
స్వార్ధం లేని మనిషంటూ వుండడు.ఏమిచేసినా దీనివల్ల ‘నాకేమిటి’ అనేవాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు.కానీ వున్న ఈ చిన్ని జీవితంలో అవసరంలో వున్నవాడికి సాయపడడం వల్ల కలిగే సంతృప్తికి ఏదీ సమానం కాదు.ఇచ్చుటలో వున్న హాయిని కనీసం జీవితం చరమాంకంలో కూడా అనుభవించలేకపోతే ఇక దానికి సార్ధకత లేనట్టే. ఆ జీవితానికి అర్ధం లేనట్టే.

మరచిపో !మన్నించు!!
ఈ రెండుపదాలు చాలా చిన్నవే అయినా నిజానికి  ఎంతో గొప్పవి.ఇతరుల తప్పిదాలు గురించి అస్తమానం ఆలోచించడం వల్ల వొరిగేదేమీ వుండదు.ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపడానికి మనం గాంధీలం కాకపోవచ్చు.  కానీ వయసు మీదపడుతున్న దశలో మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం ఈ మాత్రం సర్దుబాట్లు అవసరం. లేకపోతే పెరిగేది మన ‘బీపీ’నే.
ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే
మరణ భయం
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. రేపు పదవీ విరమణ చేసే వ్యక్తి కూడా చేస్తున్న ఉద్యోగం  శాశ్వతమే అన్న భ్రమలో వుంటాడు. అలాగే మరణం తధ్యమని తెలిసీ అది తన జోలికి రాదన్న భ్రాంతిలో మనుషులు బతుకుతారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణ భయం పట్టుకున్నదంటే చాలు ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే. మనం చనిపోతే భార్యా పిల్లలు తట్టుకోలేరన్న మరో అర్ధం లేని అనుమానం మనిషిని పీడిస్తుంది. కానీ సక్రుత్తుగా తప్ప ఇది జరిగే పని కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి కుటుంబంలోని వారు బాధ పడడం సహజం. కానీ  ఆ బాధ, ఆ ఆవేదన  శాశ్వితంగా అలాగే వారిని అంటుకుని వుండవు. కాలమే అలాటి గాయాలు మానిపోయేలా చేస్తుంది. అది ప్రకృతి ప్రసాదించిన వరం.
అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.
జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.
వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా  వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాది
ద్దాం రారండి.
(29-05-2012) 

23, మే 2012, బుధవారం

ఐయ్యేయస్లంటే మాటలా ? మరి ‘మాటలే!’



ఐయ్యేయస్లంటే మాటలా ? మరి మాటలే!

(ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.,ఐ.ఎఫ్.ఎస్. వంటి అఖిలభారత సర్వీసు అధికారులను ఎంపిక చేసే యూపీఎస్సీ ఇంటర్వ్యూ లలో అడిగే ప్రశ్నలు జవాబులు ఇలా వుంటాయిట.)

ప్రశ్న: పదిమంది కూలీలు కలసి పదిగంటల్లో ఒక గోడ కట్టారు. ఆ గోడ కట్టడానికి నలుగురు కూలీలకు యెంత టైం పడుతుంది?
జవాబు: పదిమంది కలిసి  ఆ గోడ అప్పటికే కట్టేశారంటున్నారు కదా! ఇక కొత్తగా పట్టే  టైం ఏముంటుంది? (యూపీఎస్సీ ఇరవై మూడో రాంకర్. ఇతగాడు  ఐ.ఎఫ్.ఎస్. సర్వీసును ఎంచుకున్నాడు.

ప్రశ్న: ఒక చేతిలో మూడు యాపిల్స్ నాలుగు బత్తాయిలు వున్నాయనుకో. రెండో చేతిలో నాలుగు యాపిల్స్ మూడు బత్తాయిలు వుంటే నువ్వు ఏది కోరుకుంటావు?
జవాబు: ఇంకా పెద్ద చేతులు వుంటే బాగుంటుందని.(యూపీఎస్సీ పదకొండో ర్యాంకు. ఐ.పీ.ఎస్. ను  ఎంచుకున్నాడు.) 

ప్రశ్న:  నిద్రపోకుండా మనిషి ఎనిమిది రోజులు గడపగలడా?
జవాబు: తప్పకుండా. రాత్రిపూట నిద్రపోతే సరి. (యూపీఎస్పీ  ఐ.ఏ.ఎస్.  98 వ ర్యాంకు)

ప్రశ్న: యెర్ర రాయిని నీలం సముద్రం లోకి విసిరితే ఏమవుతుంది?
జవాబు: మునిగిపోతుంది.(యూపీఎస్సీ ఐ.ఏ.ఎస్. రెండో ర్యాంకు)

ప్రశ్న: సగానికి కోసిన యాపిల్  పండు యెలా కనబడుతుంది?
జవాబు: సగం యాపిల్ మాదిరిగా.(యూపీఎస్సీ -  ఐ.ఏ.ఎస్. టాపర్)

ప్రశ్న : బ్రేక్ ఫాస్టులో నువ్వు తినలేనిది ఏమిటి?
జవాబు: డిన్నర్

ప్రశ్న: పది తేలిక ప్రశ్నలు అడగమంటావా లేక ఒక్క గొట్టు ప్రశ్నకు జవాబు చెబుతావా ?
అభ్యర్ధి: ఒక్క గట్టి ప్రశ్నే అడగండి.
ప్రశ్న: అయితే ఈ ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పు. రాత్రి ముందు వస్తుందా? లేక  పగలా?
జవాబు: పగలే సర్.
ప్రశ్న: యెలా?
జవాబు: మీరు ఒక్క ప్రశ్నే అడుగుతామన్నారు సర్.

1987 ఆక్స్ ఫర్డ్  ఫిలాసఫీ పరీక్షలో ఒక ఎస్సే ప్రశ్న ఇచ్చారు. యాభయి మార్కులు.
‘ధైర్యమంటే ఏమిటి?’
ఒక  అభ్యర్ధి పది సమాధాన పత్రాలు తీసుకుని తొమ్మిది ఖాళీగా వొదిలి పదో దాంట్లో  చివర్న ఇలా రాసాడు.
ధైర్యమంటే ఇదే!  (23-05-2012)

21, మే 2012, సోమవారం

ఎవరికి నష్టం? ఆలోచించండి!



ఎవరికి నష్టం?  ఆలోచించండి!
ఎస్సెస్సీ లో ప్రధమ శ్రేణి. పీయూసీ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకే. ఐఐటీ ఎంట్రెన్స్ లో సేమ్ టు సేం ఫస్ట్ ర్యాంకే. ఆల్ ఇండియా ఐఐటీ కంప్యూటర్ సైన్స్ లో అదే వరస. అదే మొదటి ర్యాంకు. ఐఏఎస్ ఎంట్రెన్స్ పరీక్ష రాస్తే తిరిగి ఫస్ట్ ర్యాంకు. ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకే.


శ్రీ నారాయణస్వామి, ఐ.ఏ.ఎస్.

చదువుల్లో  ఎక్కడా ఎప్పుడూ ‘ఫస్ట్ ర్యాంక్’ మిస్సు కాని ఈ చెన్నై ఐఐటీ కుర్రాడి పేరు నారాయణస్వామి. అక్కడ పట్టా పుచ్చుకున్న వెంటనే స్వామికి అమెరికా లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆహ్వానం అందింది. స్కాలర్ షిప్ తో కూడిన సీటు వచ్చింది.
కానీ నారాయణ స్వామి రూటే వేరు. అతడు ఆలోచించే తరహానే వేరు. అందుకే అతడు నారాయణ స్వామి అయ్యాడు. ఈనాడు ఇంతగా చెప్పుకోదగ్గ మనిషి అయ్యాడు.
స్వామిది మధ్య తరగతి కుటుంబం. తన ఐఐటీ చదువుపై  ప్రభుత్వం  లక్షలు ఖర్చు పెట్టిందని తెలుసు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలుసు. తనలాటి వాళ్లు, తన కంటే పేద వాళ్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్కారుకు చెల్లించిన పన్నులు తన చదువుకు ఉపయోగపడ్డాయని తెలుసు. అందుకే రెక్కలొచ్చిన పక్షి మాదిరిగా స్వదేశాన్ని వొదిలి విదేశాలకు  పోకుండా ఇక్కడే వుండిపోయి  ‘తల్లి పాల రుణం’ కొంతయినా తీర్చుకోవాలని సంకల్పించుకున్నాడు. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ అయి ప్రజలకు తన చేతనయిన  సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఐఏఎస్ అనే మూడు అక్షరాలను  తన పేరుకు జోడించుకోవడం ద్వారా ప్రజాసేవకు ద్వారాలు తెరుచుకుంటాయని అనుకున్నాడే కాని, ఆ పదవిని వాడుకుని తన ద్వారా  నల్ల ధనం సంపాదించాలనే  నల్ల తాచులు తన చుట్టూ  పొంచి వుంటాయని మాత్రం వూహించలేక పోయాడు.
సబ్  కలక్టర్ గా మొదటి పోస్టింగ్ లోనే అతడికి ఐఏఎస్ గురించిన కన్న కలలన్నీ  కల్లలేనని తేలిపోయింది.తను అనుకున్నది అనుకున్నట్టు  చేయడం కాకుండా ఎవరో అనుకున్నది వాళ్లు అనుకున్నట్టు చేయడమే  అధికారిగా తన విధి అని అర్ధం అయింది. అయినా స్వామి తన తీరు మార్చుకోలేదు. తన దారి మార్చుకోలేదు. తనను తమ అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని చూసిన అనధికార శక్తులకు పంటి కింద రాయిలా మారాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసాడు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో మొదలయిన ఈ కయ్యం స్వామిని పేద ప్రజల దృష్టిలో దేవుడిని చేస్తే, రాజకీయనాయకుల దృష్టిలో ఎందుకూ పనికిరాని అధికారిగా ముద్ర వేసింది.
అల్లుడు జిల్లా కలెక్టర్ కాబట్టి తనని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో స్వామి మామగారు తన ఇంటి స్థలం చుట్టూ అనుమతి లేకుండా  ప్రహరీ గోడ కట్టాడు. ఆ గోడ కారణంగా తమ కాలనీ నుంచి రాకపోకలకు వీలులేకుండా పోతోందని కొందరు బీదా  బిక్కీ కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారు. తనిఖీ చేసిన స్వామి, మామగారు కట్టించిన గోడను పడగొట్టించాడు. ఫలితం. ఇంట్లో గొడవలు, భార్యతో కలతలు. చివరికి విచ్చిన్నమయిన కాపురం.        
పేద ప్రజలు నివాసం వుండే ఒక ప్రాంతంలో వరదల వల్ల భయం లేకుండా ఒక కరకట్ట నిర్మించారు. కట్ట నిర్మించిన కంట్రాక్టర్ ఎనిమిది కోట్లకు బిల్లు పెట్టాడు. నిర్మాణంలో లొసుగులు వున్నాయని అనుమానించిన నారాయణ స్వామి బిల్లును చెల్లించకుండా వర్షాకాలం వచ్చేవరకు నిలుపు చేయించాడు. నాలుగు వానలు పడ్డాయో లేదో కరకట్ట ఆనమాలు లేకుండా పోయింది. కంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. ఆవిధంగా   ప్రజాధనం ఎనిమిది కోట్లు కాపాడి ప్రజల అభిమాన ధనం సంపాదించుకోగలిగాడు కానీ  అదేసమయంలో అనేక మంది శత్రువులను కూడా సంపాదించుకున్నట్టయింది.       
     ఇంతలో మరో పరిణామం. వూళ్ళో ఒక  మద్యం వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పదకొండు కోట్ల రూపాయలు ఎగగొట్టాడు. స్వామి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి అతడి గోళ్ళూడగొట్టి బాకీ వసూలు చేసాడు. అవతల వాడు సామాన్యుడు కాదు. నిమిషాల మీద ఓ మంత్రి ఫోను. కుదరదని స్వామి సమాధానం. పర్యవసానం క్షణాల మీద బదిలీ,  పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాల సంరక్షకాధికారిగా.
విసుగు చెందిన స్వామి కేంద్ర సర్వీసులకు వెళ్ళాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆ అభ్యర్ధనను కూడా తిరస్కరించింది.
ఎంతో చేద్దామనుకుని వచ్చి  ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో స్వామి ఉద్యోగం వొదిలి పెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. పారిస్ లో ఐక్యరాజ్యసమితి ఉద్యోగం ఆఫర్ కూడా వచ్చింది. స్వామిలాంటి  వారికి ఉద్యోగాల కొరత వుండదు. బయట ఎక్కడయినా వారిని నెత్తిమీద పెట్టుకుంటారు.
స్వామి లాటి అధికారి వెళ్లిపోతున్నాడంటే  రాజకీయులకు చీమకుట్టినట్టుకూడా వుండదు. పైపెచ్చు తమ ఆటలకు అడ్డూ అదుపూ వుండదని సంతోషిస్తారు కూడా.
అయితే జనాలకు ఏదో చేద్దామని ఆశ పడ్డ స్వామి లాటి అధికారులను కాపాడుకునేందుకు మనం ఏమీ చెయ్యలేమా? అన్నదే ప్రశ్న. వారి బదిలీ ఆపే అధికారం జనాలకు లేకపోవచ్చు. అలా బదిలీ చేసే రాజకీయులు  తిరిగి  ఎన్నిక కాకుండా చేయగల -  ‘వోటు’ అనే ‘పాశుపతాస్త్రం’ - జనం చేతిలోనే వుందన్న విషయం మాత్రం మరచిపోకూడదు.
ఏమంటారు? కాస్త ఆలోచించండి. (21-05-2012)