18, అక్టోబర్ 2011, మంగళవారం

ఫీకా టు బై న్ వ – భండారు శ్రీనివాసరావు

ఫీకా టు బై న్ వ – భండారు శ్రీనివాసరావు

ఇంతకు ముందు రాసిన ‘వన్ బై టు కాఫీ’ కి ఇది అచ్చంగా అద్దంలో అక్షరం లాటిది. అంటే పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. అందుకే - ‘ఫీకా టు బై న్ వ’ అని శీర్షికాసనం వేయాల్సి వచ్చింది.

అదేమో నలభైఏళ్ల కిందటి ముచ్చట. ఇదేమో ఈనాటి తాజా కధ.

రామానికి చదువంటే ఇష్టమే కానీ ఇంజినీరింగ్ అస్సలు ఇష్టం లేదు. తలిదండ్రుల ముచ్చట తీర్చడానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అమెరికా అంటే మాటలా. అవకాశాలకు పుట్టినిల్లు. వాటిని వెదుక్కుంటూ వెళ్ళే ధీశాలులకు అదొక పోతుగడ్డ. ఆ దేశపు గడ్డ మీద కాలుమోపగానే రామానికి జీవిత ధ్యేయం నెరవేరిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటె అమెరికా ఉద్యోగం అన్నది తన ఒక్కడి కల కాదు. కుటుంబం యావత్తు కలసి కన్న స్వప్నం.

రామం ఏమీ కలిగిన కుటుంబం నుంచి రాలేదు. అతడి తండ్రి చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.అప్పటికి వాళ్లకు మిగిలిన స్తిరాస్తి ఒక బెడ్ రూమ్ ఫ్లాట్.


అమెరికా రావడంలో అతగాడి లక్ష్యం ఒక్కటే. కనీసం ఇక్కడ అయిదేళ్ళు వుండాలి. వున్నన్ని రోజులు బాగా సంపాదించాలి. సంపాదించిన దానిలో చేతనయినంత కూడబెట్టాలి. కూడబెట్టిన డబ్బుతో ఇండియాకు తిరిగెళ్లి అమ్మానాన్నను బాగా సుఖపెట్టాలి.

ఆలోచన బాగానే వుంది కానీ, ఆచరణ అంత సులభం అనిపించలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఇంటి మీద ధ్యాస మళ్ళింది. ప్రతి క్షణం అమ్మా నాన్నా గుర్తొచ్చేవాళ్ళు.

వారం వారం ఫోను చేసి వారితో గంటలు గంటలు మాట్లాడేవాడు.ఇందుకోసం చౌకగా దొరికే ఇంటర్నేషనల్ టెలిఫోన్ కార్డులు వాడేవాడు.

రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లు మెక్ డొనాల్డ్ బర్గర్స్, డిస్కోలలో సాయం కాలక్షేపాలు.

అంతేనా అంటే అంతే కాదు. డాలరు విలువతో పోల్చి రూపాయి బలహీనపడుతుంటే ఎంతో సంతోషం వేసేది. మామూలుగా పంపే డాలర్లతోనే ఇంటికి ఇంకా ఎక్కువ డబ్బు పంపొచ్చుకదా అన్న అల్పానందం.



చేతినిండా డబ్బులు. పర్సు నిండా క్రెడిట్ కార్డులు. మనసు నిండా సంతృప్తి. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి?

అటు ఇండియాలో అతడి అమ్మానాన్నా పెళ్ళికి తొందర పెడుతున్నారు. వాళ్ల కోరిక తీర్చాలనిపించింది. ఇంటికి ఫోను చేసి చెప్పాడు వీలుచేసుకుని వస్తానని. ఈలోగా అమ్మాయిని చూడమని. వున్న సెలవులు తక్కువ. అంతా పది రోజుల్లో అయిపోవాలన్నాడు. నెట్లో వెతికి ఇండియా వెళ్లి రావడానికి అతి చౌకలో టిక్కెట్లు కొనేశాడు. పనిలో పనిగా మార్కెట్లన్నీ గాలించి చుట్టపక్కాలందరికీ చిన్న చిన్న గిఫ్ట్ వస్తువులు కొన్నాడు. లేకపోతే మాట దక్కదు మరి. పొరబాటున ఎవరినయినా మర్చిపోతే ఇక అంతే సంగతులు. మాటలు కటీఫ్.


ఇంటికి రాగానే వారం రోజులు ఇంట్లోనే మఠం వేసుకు కూర్చున్నాడు. ఉదయం లేచిన దగ్గరనుంచి ఒకటే పని. అమ్మానాన్నా ఎంపికచేసిన అమ్మాయిల ఫోటోలు చూడడం. నచ్చలేదని టిక్కుబెట్టడం. చూస్తుండగానే తిరుగు ప్రయాణం తేదీ దగ్గరపడింది. దాంతో హడావిడిగా ఒక పెళ్లికూతురును సెలక్ట్ చేసుకోవాల్సి వచ్చింది.

రెండంటే రెండురోజుల్లో పెళ్లి జరిగిపోయింది. వచ్చిన వాళ్లు వచ్చారు. రానివాళ్ళు రాలేకపోయినందుకు విచారిస్తూ గ్రీటింగులు పంపారు. వాటిల్లో కొన్ని అందాయి. మరికొన్ని అతడు ఇండియా వొదిలివెళ్ళిన తరువాత చేరాయి. ‘ఇదా తను కోరుకున్న పెళ్లి. ఇదా ఇన్నాళ్ళుగా కలలు కన్న పెళ్లి.

అమెరికా జీవితాలు అంతే. నచ్చిన పిల్ల దొరకకపోతే వచ్చిన పిల్ల నచ్చిందని సరిపుచ్చుకోవాలి’


అమ్మా నాన్న చేతిలో కొంత డబ్బు పెట్టి, భార్యను తీసుకుని అమెరికా విమానమెక్కాడు.


అందరిలాగే రామం భార్య కూడా అమెరికా వైభోగం చూసి చాలా సంతోషపడింది. ప్రతి వీకెండ్ పనికట్టుకుని ఒక కొత్త ప్రదేశం చూపించాడు. కొత్త కాపురమాయే. వున్న ఇల్లు మార్చి పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఆదాయంలో తేడాలేదు. తేడా అల్లా ఖర్చుల్లోనే. మునపటికీ, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల భారం పెరిగింది. బ్యాంకులో బాలన్స్ తరిగింది.

మరో రెండేళ్లు గడిచాయి. ఇద్దరు పిల్లలు పుట్టారు. అమ్మానాన్నని అమెరికా పిలిపించుకోవాలన్న ఆరాటం మొదలయింది. కానీ, ఆచారం ప్రకారం పురిటికి రామం అత్తా మామా వచ్చారు. వారికి తమ వైభోగం చూపించాలనే తాపత్రయంలో అలవికి మించి ఖర్చు పెట్టాడు. ఫలితం బ్యాంక్ బాలన్స్ సున్నా అయింది. క్రెడిట్ కార్డుల భారం బాగా పెరిగింది.

ఇండియాలో రామం అమ్మానాన్నకు మనుమడినీ, మనుమరాలినీ చూడాలనే తాపత్రయం పెరిగింది. ఫోను చేసిన ప్రతిసారీ ఇండియా రమ్మనే వారు. ఉద్యోగ బాధ్యతలవల్ల కొంత, డబ్బు సమస్యవల్ల కొంత ప్రయాణం పెట్టుకోవడానికి వీలుకాలేదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఇండియా వెళ్లి అమ్మానాన్నను చూడాలనే కోరిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది.

హఠాత్తుగా ఒక రోజు తల్లీతండ్రికి వొంట్లో బాగాలేదనే కబురు తెలిసింది. వెంటనే వెళ్ళడానికి ఆఫీసులో తీరుబడి లేని పని. నిజానికి వారిద్దరూ యాత్ర కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. ఆ కబురు రామం చుట్టపక్కాలకు కూడా ఆలశ్యంగా తెలిసిందట. దానితో అమెరికా వరకు ఆ సమాచారం చేరేసరికి మరికొంత ఆలశ్యం జరిగింది. రామం తలిదండ్రులకు రామం ఒక్కడే సంతానం. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎవ్వరూ లేరు. అమెరికాలో కూడా ఒంటరే. ఆఫీసులో రామం పని అతడు లేనప్పుడు చూసేవారు లేరు. చేసేవారు లేరు. అందుకే ఓ పట్టాన సెలవు దొరకదు. ఇండియా పోలేక వుసూరుమనిపించినా ఆసుపత్రి ఖర్చులకు డబ్బు పంపి వూరుకోవాల్సివచ్చింది.



రోజులన్నీ ఒక్కలాగే వుండవనడానికి అమెరికా ఒక పెద్ద ఉదాహరణ. ఆర్ధిక మాంద్యం కారణంగా చేస్తున్న రామం ఉద్యోగం పోయింది. కొత్తది దొరకడం అసాధ్యంగా మారింది. కాస్తో కూస్తో కూడబెట్టింది అప్పులు తీర్చడానికి సరిపోయింది.


విధిలేని స్తితిలో ఇండియాకు తిరిగొచ్చారు. వాళ్లని చూసి రామం అమ్మా నాన్నా ఎంతో సంతోషించారు. వున్న ఒకేవొక్క బెడ్ రూమ్ వాళ్లకు ఇచ్చారు. పిల్లలు ముందు ఇబ్బంది పడ్డా తరువాత సర్డుకున్నారు. ఎందుకంటె అమెరికాలో కలికానికి కూడా దొరకని ఆపేక్షలు, అనురాగాలు వారికి ఆ ముసలివారిదగ్గర లభించాయి.

కూడబెట్టింది ఏమీ లేదు అమెరికా అనుభవం తప్ప. తండ్రి సంపాదించి కొన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఒక్కటే చివరకి అవసరానికి అక్కరకు వచ్చింది.

ఎండమావి వెంట పరుగులు తీస్తే దాహం తీరదన్న నగ్న సత్యం తెలిసివచ్చింది.(18-10-2011)

(ఎన్నారై ఒకరు ఈమధ్య నెట్లో ఇంగ్లీష్ లో ఒక పోస్టింగ్ పెట్టారు. మూలాంశం అందులోనిదే. కాకపోతే ముగింపు నచ్చలేదు. కన్నబిడ్డను చూడకుండానే తలితండ్రులు చనిపోతారు. పిల్లలు అమెరికన్లను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతారు. అమెరికన్ స్వేఛ్చా జీవితానికి అలవాటుపడిన భార్య విడిపోతుంది. నిరాశావాదంతో ఆ గల్పిక ముగుస్తుంది. అందుకే కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. పేరు తెలియని ఒరిజినల్ రచయితకు మనః పూర్వక ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు)

17, అక్టోబర్ 2011, సోమవారం

వన్ బై టు కాఫీ - భండారు శ్రీనివాసరావు

వన్ బై టు కాఫీ - భండారు శ్రీనివాసరావు







నలభై ఏళ్ళ కిందటి మాట.

ఆ రోజుల్లో విజయవాడ గాంధీ నగరంలోని వెల్ కం హోటలుకు కాఫీ తాగడానికి ఓ రోజు వెళ్లాను. నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఓ పెద్ద మనిషి ప్రవర్తన నన్ను ఆకర్షించింది. సర్వర్ ను పిలిచి వన్ బై టు కాఫీ తెమ్మన్నాడు. ఆయన వెంట మరెవరయినా వున్నారా అని చూసాను. ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రెండు కప్పుల్లో తెచ్చిన ఒక్క కాఫీని కాసేపు అటూ ఇటూ మార్చుకుంటూ తాగి వెళ్ళిపోయాడు.



మరో సారి కూడా ఆ హోటల్లో అదే పెద్దమనిషి తారస పడ్డాడు. మళ్ళీ అదే సీను. ఒక్కడే మనిషి. వన్ బై టు కాఫీ. ఇక మనసు ఉగ్గపట్టుకోలేకపోయాను. కలిసి కదిలిస్తే కదిలిన కధ ఇది.

ఆయనో ఎలిమెంటరీ స్కూలు మాస్టారు. ఒక్కడే కొడుకు. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి కరుణ అపారం. క్లాసులో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్. హోల్ మొత్తం ఆ ఏరియాలోనే చదువులో ఫస్ట్. ఇరుగు పొరుగు పిల్లాడిని మెచ్చుకుంటూ మాట్లాడే మాటలే వాళ్లకు కొండంత బలం ఇచ్చేవి. ‘పిల్లాడంటే మీ వాడు మాస్టారు. మా పిల్లలూ వున్నారు ఎందుకు తిండి దండగ” అంటుంటే ఆ తలిదండ్రులు మురిసి ముక్కచెక్కలయ్యేవారు.


కొడుకు చదువుపై మాస్టారికి కాణీ ఖర్చు లేదు. అంతా స్కాలర్ షిప్పుల మీదనే నడిచిపోయింది. అతగాడు కూడా - చిన్న చదువులప్పుడు మాత్రమే కనిపెంచిన వారితో కలసి వున్నాడు. ఆ తరువాత పొరుగూర్లలోని పెద్ద కాలేజీల్లో పెద్ద చదువులు చదివాడు. కొన్నాళ్ళకు అవీ అయిపోయాయి. పై చదువులు చదవడానికి ఈ చిన్న దేశం సరిపోలేదు. అమెరికా వెళ్లాడు. అక్కడా చదువులో మెరిక అనిపించుకున్నాడు. ఆ చదువులకు తగ్గ పెద్ద ఉద్యోగం అక్కడే దొరికింది. కానీ, ఇండియాకు వచ్చి తలిదండ్రులను చూసే తీరిక దొరకలేదు. అది దొరికే లోపలే అక్కడే ఓ దొరసానిని పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ల ఫోటోలు చూపిస్తూ ‘మా మనవళ్ళు’ అని వూళ్ళో వాళ్లకు చెప్పుకుని మురవడమే ఆ ముసలి తలిదండ్రులకు మిగిలింది. డబ్బుకు కొదవలేదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్లు ఇండియా బ్యాంకులో రూపాయల పిల్లలు పెడుతున్నాయి. కానీ ఒక్కగానొక్క పిల్లాడు కళ్ళెదుట లేకుండా, ఎక్కడో దూరంగా వుంటూ పంపే ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్తితి. ఇది వాళ్లకు కొత్తేమీ కాదు. చిన్నప్పటినుంచి చదువుల పేరుతొ పరాయి చోట్లనే పెరిగాడు. పట్టుమని పది రోజులు కలసివున్నది లేదు.

‘ఇంకా వస్తారు వస్తారు’ అనుకుంటూ వుండగానే, పిల్లాడిని, వాడి పిల్లల్ని కళ్ళారా చూడకుండానే ఆ కన్న తల్లి కన్ను మూసింది.

కబురు తెలిసి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని అమెరికానుంచి ఆర్చుకుని, తీర్చుకుని వచ్చేసరికే కర్మకాండ అంతా ముగిసిపోయింది.

వచ్చిన వాళ్లకు ఇంట్లో సౌకర్యంగా వుండదని వున్న నాలుగు రోజులు పెద్ద హోటల్లో గదులు అద్దెకు తీసుకుని వున్నారు. మనుమళ్లని దగ్గరకు తీసుకోవాలని వున్నా ఏదో జంకు. ‘తిస్ యువర్ గ్రాండ్ పా’ అని తండ్రి పరిచయం చేస్తే ‘య్యా! హౌ డూ’ అని పలకరించారు. వాళ్లు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే జవాబు చెప్పలేని అశక్తత. రెండో తరగతి టిక్కెట్టు కొనుక్కుని ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్న అనుభూతి.

అమెరికా తమతో రమ్మన్నారు. తాను రానన్నాడు. భార్య కలిసిన మట్టిలోనే కలసిపోవాలన్నది తన కోరిక.


వొంటరి జీవితంతో వొంటరి పోరాటం మళ్ళీ మొదలు.

కానీ, ఈసారి మొదలుపెట్టే జీవన యానంలో తాను వొంటరి కాదు. తనతో పాటు మరొకరు వున్నారు. ఆ వ్యక్తి మరో లోకానికి వెళ్ళిన భార్యా? మరో దేశానికి వెళ్ళిన కొడుకా? యేమో.

‘అందుకే ఈ వన్ బై టు కాఫీ’ ముగించాడు ముసలాయన. (17-10-2011)

15, అక్టోబర్ 2011, శనివారం

దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు

దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు

తర్డ్ రేట్ తెలుగు సినిమాల్లో తరచుగా వినవచ్చే  ఈ రెండు పదాలు ఈ మధ్యకాలంలో బుల్లి తెరల వార్తల్లో, చర్చల్లో పదే పదే వినబడుతున్నాయి.


మాటలు కోటలు - చేతలు బీటలు






‘జగన్ కు దమ్ముందా? చంద్రబాబుకు దమ్ముందా? రాజీనామాలు ఆమోదించే ధైర్యం దమ్మూ స్పీకర్ నాదెండ్ల కు వున్నాయా? ఆమోదించమని చెప్పే దమ్ము సీఎం కిరణ్ కు వుందా? రాజీనామాలు ఆమోదింపచేసుకునే దమ్ము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వుందా?’


ఇలా ఎవరికి వారు ఎదుటివారిపై చెలరేగిపోయేవారే. ధైర్యం దమ్మూ తమకే వుందనీ, ఎదుటివారికి ఈ రెండూ సున్నా అని ఎగబడిచెప్పే వారే.


ఈ సవాళ్ళ అర్ధం ఏమిటి? అసలెవరికీ దమ్మూ ధైర్యం లేవనా?


ఒకటి మాత్రం వీరందరికీ తెలుసు.


అసలు సిసలు ధైర్యం దమ్మూ వున్నవాళ్ళు జనంలో వున్నారు.


కానీ వారు వాటిని బయటకు చూపడానికి ఇంకా రెండేళ్లకు పైగా టైముంది.


అదే వీళ్ళకున్న దమ్మూ ధైర్యం! (15-10-2011)

11, అక్టోబర్ 2011, మంగళవారం

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు?

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు?
ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు  

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.



సంపుటం - 43 సంచిక - 4 బుధవారం 4-4-1956 6 పేజీలు 1 అణా

‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి

కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం

అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన

(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)

కర్నూలు, ఏప్రిల్ 3

‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.

ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.

నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.

హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.

'ఆంధ్ర' లో దోషం లేదు

తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.

‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’

చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.


(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – రచయిత, 11-10-2011)

10, అక్టోబర్ 2011, సోమవారం

అయితే ఒకే!

అయితే ఒకే!





ఏకాంబరం కొడుకును పిల్చి చెప్పాడు.


‘నాకు నచ్చిన పిల్లనే నువ్వు పెళ్లి చేసుకోవాలి.’


‘అది కుదిరే పని కాదు.’ కొడుకు ఖరాఖండిగా జవాబిచ్చాడు.


‘నేను ఎంపిక చేసే అమ్మాయి ఎవరనుకున్నావు. బిల్ గేట్స్ కూతురు.’


‘అలా అయితే నాకు ఓకే!’


కొడుకు టక్కున ఒప్పేసుకున్నాడు.


ఏకాంబరం బిల్ గేట్స్ దగ్గరకు వెళ్లి తన కొడుక్కు ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమన్నాడు.


బిల్ మహాశయుడు కుదరదు కాక కుదరదు పో! అన్నాడు.


‘నా కొడుకు వరల్డ్ బ్యాంక్ సీఈఓ’ చెప్పాడు ఏకాంబరం.


‘అయితే నాకు ఓకె’ అన్నాడు బిల్ గేట్స్.


ఏకాంబరం నేరుగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లాడు.


వెళ్లి తన కొడుక్కు వరల్డ్ బ్యాంక్ సీ.ఈ.ఓ. గా ఉద్యోగం ఇమ్మన్నాడు.


అది అయ్యేపని కాదని ఆయన తేల్చి చెప్పాడు.


‘నా కొడుకంటే ఎవరనుకున్నావు? వాడు సాక్షాత్తు బిల్ గేట్స్ కు కాబోయే అల్లుడు.’ బదులిచ్చాడు ఏకాంబరం.


‘అయితే నాకూ ఓకే!’


ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు వరల్డ్ బ్యాక్ ప్రెసిడెంట్.


ఇలా వుంటాయిట పెద్దోళ్ల బిజినెస్ వ్యవహారాలు.

నెట్లో అందిన ఇంగిలీసు జోక్కి- మక్కికి మక్కి కాని తెలుగు అనువాదం – భండారు శ్రీనివాసరావు
(10-10-2011)

3, అక్టోబర్ 2011, సోమవారం

సేకరించిన ‘శ్రీ’ సూక్తాలు – భండారు శ్రీనివాసరావు





‘శ్రీకరా! అంటే ఒట్టు – సూకరా అంటే తిట్టు – అన్నాడు మహాకవి’


‘తొక్కితే రాయి – మొక్కితే సాయి’


‘శాస్త్రం – చట్టం ఒప్పుకుంటే దొంగే దొర’


‘రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం’


‘పిసినారిని మించిన దాత లేడు’


‘కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని ఆహ్వానించ లేనివాళ్ళు పాత మోడల్ కారు మాదిరిగా మిగిలిపోతారు.’


‘భక్తులందు వీ.ఐ.పీ. భక్తులు వేరయా అన్నాడు వేమన్న’


‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు - కానీ, ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా అనే డౌటు.


‘కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది. నిజమే! కానీ టైం కు కూడా టైం ఇవ్వకపోతే పాపం టైం మాత్రం ఏం చేస్తుంది?’


‘చిన్న దొంగలు జిల్లాలో జైళ్ళలో మగ్గుతుంటారు. పెద్ద దొంగలు జనం మధ్యే దొరల్లా తిరుగుతుంటారు’


‘విన్నది మరచిపోతాము. చూసింది గుర్తుంటుంది. చెయ్యడం వల్ల విషయం బోధపడుతుంది.’


‘నాలికతో ఎలా మాట్లాడాలో తెలియడానికి మనిషికి మూడేళ్ళు పడుతుంది. కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలియడానికి జేవితకాలం కూడా సరిపోకపోవచ్చు’

(03-10-2011)





1, అక్టోబర్ 2011, శనివారం

సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణం సాగిస్తోంది. కంప్యూటర్ పుణ్యమా అని నాకు ఈ పుణ్యమూర్తి పరిచయ భాగ్యం కలిగింది. అదెలాగో తెలుసుకోవాలంటే- కొద్దిగా వెనక్కు వెళ్ళాలి.

2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకుని వుంటున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి. బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ దగ్గర కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాను. ఈ క్రమంలోనే నాకు సీతమ్మ పరిచయం అయింది. తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మను చూస్తూ నా వాకింగ్ మొదలయ్యేది.


'ఆ మహాతల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఆమె బొమ్మ పెట్టడం లేదు'

అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్టపడేది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటువుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు.

అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ , వస్తూనో పోతూనో కాసేపు ఆగి ఆమెతో మాటలు కలిపేవాడిని. అన్ని విషయాలు ఒక్కసారే చెప్పకపోయినా కొద్ది కొద్దిగా ఆమె తన గురించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది.

సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్న తనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవుకానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. అప్పటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.

ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళ ల్లో పాచిపనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొ ప్పుకోలేదు. వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటివాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్టచెబుతుంది.

సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పడు పది రూపాయలనోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.

బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.

‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తుంది.

(01 - 10 - 2011)