28, ఆగస్టు 2010, శనివారం

విన్నంతలో- కన్నంతలో అమెరికా -5 -భండారు శ్రీనివాసరావు

విన్నంతలో- కన్నంతలో అమెరికా -5         -భండారు శ్రీనివాసరావు

“చెబితే నమ్మరు కానీ - పిన్నిగారూ ఆ దేశంలో పనివాళ్ళు కూడా ఎంచక్కా ఇంగ్లీషే మాట్లాడుతారు”
కూతురు పురిటికోసం అమెరికా వెళ్ళివచ్చిన ఒకావిడ ఆ దేశపు విశేషాలు పొరుగావిడతో చెబుతూఅన్నమాటలివి.
నమ్మక పోవడానికి ఏమీ లేకపోయినా నమ్మలేని నిజం మరోటి వుంది. ఆ దేశంలో చాలామందికి ఇంగ్లీష్ అర్ధంకాదు. అంటే ఇంగ్లీష్ రాదని కాదు. మన ఇంగ్లీష్ ఉచ్చారణకు వాళ్ళు మాట్లాడేదానికీ తేడావుండడమే దీనికి కారణం. అయితే వాళ్ళు సంభాషించేటప్పుడు హావభావాలు కూడా ప్రదర్శిస్తారు కాబట్టి కాస్తో కూస్తో భావం అర్ధం అయ్యే అవకాశం వుంటుంది.

భాష సంగతి అటుంచి, అమెరికన్లు ‘అంటరానితనం’ పాటిస్తారేమోనని అనిపిస్తుంది
.

 బెల్ వ్యూ  స్క్వేర్ మాల్

 పార్కులు, సినిమా థియేటర్లు, షాపులు, మాల్స్ – ఎక్కడైనాసరే, యెంత రద్దీగా వున్న ప్రదేశాలలో అయినా సరే ఎక్కడా ఒకరిని ఒకరు తోసుకోకుండా, ఒకరిపై మరొకరు పడకుండా జాగ్రత్తపడతారు. సన్నిహితులయిన ఆడా మగా రాసుకుపూసుకు తిరగడం తప్పిస్తే, అమెరికన్లు కనీసం ఒకళ్ళనొకళ్ళు తాకను కూడా తాకరు.

డిస్నీలాండ్ లో సందర్శకులు

 డిస్నీలాండ్ లాటి కిటకిటలాడే టూరిస్ట్ కేంద్రాలలోలో సయితం వాళ్ళది ఇదే తీరు. తోసుకు పోవడం, రాసుకు తిరగడం వాళ్ళ దృష్టిలో అనాగరికం. క్యూలలో నిలబడేటప్పుడు కూడా ఒకరినొకరు తాకకుండా ఎడం వుండేలా చూసుకుంటారు. ఇతరులు కూడా తమ పట్ల ఇలాగే మసలుకోవాలని కోరుకుంటారు.

కార్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాగరీకం మరీ ముదిరిపోతుంది. పార్కింగ్ చేసే చోట మర్యాదలు చూసి తీరాలి. చాలాసేపు వేచివుండయినా ఎవరికీ అసౌకర్యం లేకుండా పార్క్ చేయడానికి ప్రయత్నిస్తారు.

వికలాంగుల కార్లకోసం రిజర్వ్ చేసిన పార్కింగ్

 పెద్ద పెద్ద మాల్స్ ప్రవేశ ద్వారాలకు దగ్గరగా వికలాంగుల కోసం పార్కింగ్ లాట్లు రిజర్వ్ చేసి వుంటాయి. అవి ఖాళీగా వున్నాసరే, దూరంగా వెళ్లి కారు నిలుపుకుంటారు కానీ అక్కడ పార్క్ చేయరు. ఇక, హారన్ మోగించడం అంటే అవతలవారిని అవమానించడమే అని వారి ప్రగాఢ నమ్మకం. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి, అటునుంచో ఇటునుంచో పక్కనుంచో వెనకనుంచో మరో వాహనం తెలియకుండా దూసుకు వచ్చేస్తుందన్న భయం వారికి వుండదు.

ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.

నడిచే వాడిదే రోడ్డు

మరో మంచి విషయం ఏమిటంటే కార్లలో వెళ్లేవాళ్ళు - కాలినడకన వెళ్ళేవారిని చిన్నచూపు చూడరు. సరికదా, వారిపట్ల ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. రోడ్డు దాటేవారిని చూసినప్పుడు ఈ మర్యాద కాసింత ముదిరి కూసింత భయంగా మారడం కద్దు. రోడ్డు కూడళ్ళ వద్ద – కాలినడకన వెళ్లే మనిషి కనిపిస్తే చాలు వేగంగా వెళ్లే వాహనాలు కూడా టక్కున ఆగిపోయి దారి ఇస్తాయి. ఏదన్నా జరగరానిది జరిగితే, ఆ నేరం మెడకు చుట్టుకుండేది వాహనాలు నడిపేవారికే.

NOTE:All images in the blog are copy righted to respective owners

26, ఆగస్టు 2010, గురువారం

పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు

పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు


ఇది జరిగి నలభయ్ ఏళ్ళు కావస్తున్నది.


 ఇప్పుడు నవ్య వారపత్రిక (ఆంధ్రజ్యోతి) లో ఉద్యోగ విజయాలు వారం వారం ఆసక్తికరంగా రాస్తూవస్తున్న రావులపాటి సీతారామారావు గారు, తన ఉద్యోగ జీవితం తొలినాళ్ళలో విజయవాడకు రూరల్ డీఎస్పీ గా వచ్చారు. అప్పుడు నేను ఆంద్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా సీనియర్ పోలీసు అధికారి అయినా ప్రవృత్తి రీత్యా రచయిత కావడంవల్ల సాటి రచయితలను కలుసుకోవాలనే ఆసక్తి వుండేది. విజయవాడ రచయితలకూ, ప్రచురణకర్తలకూ పుట్టినిల్లు కావడం మూలాన ఈ చిరు కోరిక తీర్చుకోవడం కష్టమేమీకాలేదు. ఇలా చిన్నా పెద్దా రచయితలను కలుసుకునే చక్రభ్రమణంలో ఒకరోజు మాకు అప్పటికే బాగా చేయి తిరిగిన బోలెడు పెద్ద నవలాకారుడు తారసపడ్డారు. ఉభయకుశలోపరి - పరస్పర పరిచయాలనంతరం సీతారామారావు గారు- ఆంద్ర పత్రిక వారపత్రికలో రాసిన కొన్ని కధలు గురించి నేను ప్రస్తావించాను.
‘నేను ఇతరులు రాసిన కధలు చదవనండీ” అని ఆయన కుండబద్దలుకొట్టినట్టు మొహం మీదే అనేశారు. ‘అలా చదవడం వల్ల వారి రచనల ప్రభావంతో మనం రాసేవాటిలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం వుంది’ అని ఒక ధర్మ సూక్ష్మం కూడా బోధించారు.
ఇది జ్ఞాపకం రావడానికి ఒక నేపధ్యం వుంది. చదివేవాళ్ళు బొత్తిగా తగ్గిపోతున్నారని ఒక సంపాదక మిత్రుడు ఈ మధ్య మాటల సందర్భంలో అన్నారు. ఆయన ఆందోళన చెందడానికి వేరే కారణాలు వుండవచ్చు. ఇంతమంది ఇలా రెండు చేతుల్తో పుంఖానుపుంఖాలుగా రాసేస్తూ వాటిని ప్రచురణార్ధం పంపించేస్తూ (ఈరోజుల్లో పోస్ట్ ఖర్చుల బెడద కూడా లేదు – నెట్లో రాసేసి క్లిక్ చేస్తే చాలు - బంతి ఎడిటర్ కోర్టులో పడేసి చేతులు దులిపేసుకోవచ్చు) మా ప్రాణాలు తోడే బదులు వీరిలో కొంతమందయినా చదివే సద్బుద్ధిని అలవరచుకుంటే తమ పత్రిక సర్క్యులేషన్ పెరగకపోతుందా అన్నది ఆయన బాధలోని మరోకోణం కావచ్చు.
‘ఇలా రాసేసి అలా పంపేసి నా కధ వచ్చేవారం వీక్లీలో అచ్చేస్తారా’ అని వేధించుకు తినేవాళ్ళతోనే కాలం చెల్లిపోతోంది. ఇక మంచి కధల ఎంపికకు సమయం ఎక్కడ?’ అని కూడా సంపాదక మిత్రుడు బాధపడ్డాడు. నిజమే ఎవరి ఇబ్బందులు వారివి. పీత కష్టాలు పీతవి.
ఒక వర్ధమాన రచయిత అభిప్రాయం వేరేలావుంది. “ఎన్నాళ్ళు ఇలా చదువుతూ గడుపుతాం గురూగారూ! ఆ మాత్రం మనం రాయలేమా అని ఓ మంచిరోజు చూసి కలం పట్టేసాను” అన్నాడతగాడు.
“మనం రాసింది మనం చదువుకోవడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు, ఇక వేరేవారి రచనలు చదివే వ్యవధి ఎక్కడుంది మాస్టారూ!” అని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చాడు. ఏ పత్రికలో రాస్తుంటాడని మరీ హైరాన పడకండి. స్వయంగా రాసినవాటిని సొంతంగా చదువుకోవడానికి స్వయానా ఒక బ్లాగు పెట్టుకున్నాడు. రాసినవారికి రాసినంత – చదివేవారికి చదివినంత.
ఓ పాతికేళ్ళ క్రితం రేడియోలో తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివేవారిని సెలక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ లు జరిగాయి. ఇసక వేస్తె రాలనంతగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిలో చాలామంది ‘లక్ష వొత్తుల నోము’ నోచుకోవాల్సినవారే వున్నారు. వొత్తులు పలకవు. ‘వార్తలు చదవాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగిందని ఒక అమ్మాయిని అడిగితే ‘ రోజూ రేడియోలో వార్తలు వింటున్నాను, ఆ మాత్రం నువ్వూ చదవగలవులే చిన్నా అని మా నాన్న పట్టుబట్టి పంపించాడు’ అన్నది ఆ చిన్నది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు కదా.
దీనికి కొసమెరుపుగా ఆ రోజు న్యాయనిర్ణేతగా వచ్చిన ఒక పెద్దమనిషి – ఆ అమ్మడు చదివిన ‘న్యూస్ బులెటిన్ ను భద్రపరచమని’ చెప్పాడు. ‘అంతబాగా చదివిందా’ అని అడిగితే – ‘కాదు. బులెటిన్ ఎలా చదవకూడదో భవిష్యత్ తరాల న్యూస్ రీడర్లకు తెలియచెప్పడానికి పనికివస్తుంద’ని ఆయనగారు వాకృచ్చారు.

 (25-08-2010)

25, ఆగస్టు 2010, బుధవారం

ట్రాఫిక్ జామ్ లో పది రోజులు - భండారు శ్రీనివాసరావు

హైదరాబాదులో కార్లమీద వెళ్లే వాళ్ళకీ – కాళ్ళీడ్చుకుంటూ వెళ్లే వాళ్ళకీ ట్రాఫిక్ జామ్ అనేది ఒకేరకమయిన సమస్య. ఆబిడ్స్ అయినా, అమీర్ పేట్ అయినా - రోడ్లమీద పరిస్తితి అదే . రాత్రయినా పగలయినా తేడా వుండదు. వీళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలిగించే ఒక సమాచారం మీడియా ద్వారా వెల్లడయింది.   బ్రేకింగ్ న్యూస్ అనుకునేరు ఈ న్యూస్ బ్రేకయి చాలారోజులయింది. దీనివల్ల  - రాత్రికి  రాత్రే  ఏదో జరిగిపోయి ఈ  జటిల సమస్య పరిష్కారమై పోతుందని కాదు. ఈ విషయంలో మనల్ని మించిన నగరాలు వున్నాయని తెలియరావడమే ఆ శుభవార్త. మన ఇంట్లో కరెంట్ పొతే పక్క ఇంట్లోకి తొంగి చూసి అక్కడా లేకపోతె కలిగే పైశాచిక ఆనందంలాటిదని అనుకుందాం పోనీ. అయితే , అంతకు ముందు కొంత  వెనకా ముందూ చూద్దాం.

శ్రీమతి ఇందిరాగాంధీ

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో - ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమె రాజ్యమేలుతున్న రోజుల్లో – వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటిమీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష.

రాజీవ్ గాంధి

 ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు - అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ - మిహాయిల్ గోర్బచెవ్ – టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తరవాత కానీ ఈ విమర్శలు అర్ధం పర్దం లేనివన్న సంగతి అర్ధం కాలేదు. మేము అలా అనుకుంటూ ఆ కార్యక్రమాలు చూస్తూ ప్రశాంతంగా రోజులు గడుపుతున్న రోజుల్లో ఒకానొక రోజున ఇరాన్ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి – మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు  చూస్తూ  ఎంతగానో రిలీఫ్ ఫీలవడం చూసి  మాకు మతి పోయినంత పనయింది.

మిహాయిల్  గోర్భచెవ్ 

కదిలిస్తే అతగాడు చెప్పిన కధ – అర్జున విషాద యోగాన్ని తలపించింది. ఆ దేశంలో టీవీ తెరపై - ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధనలు ఇస్తూ, సూక్తులూ ప్రవచిస్తూ ఒకేఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట.

 ఆ ప్రోగ్రాములు చూసి చూసి వచ్చిన ఆ పెద్దమనిషికి రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయిట. కాబట్టే  అన్నారు మనుషుల బాధలన్నీ సాపేక్షం (రిలెటివ్) అని.  అందుకే కాబోలు - ఇతరులతో పోల్చి చూసుకుంటే బాధ సగం తగ్గిపోతుందంటారు. ఇప్పుడు చెప్పబోతున్నది కూడా అదే.

అయతుల్లా ఖొమేని

చైనాలో ఆ మధ్య జరిగిన ఒక విషయం ఈ మధ్య వెలుగు చూసింది. మరి అక్కడ మన మాదిరిగా ‘ఏ టు జడ్’ టీవీ చానళ్ళు లేవుకదా. అదన్న మాట సంగతి.

బీజింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్

ఇంతకీ అసలు కధాకమామిషూ ఏమిటంటే – ఈ ఆగస్ట్ పదునాలుగో తేదీన బీజింగ్ సమీపంలో ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటారేమో. కానీ ఈ ట్రాఫిక్  జామ్ తరహానే వేరు.  రోడ్డు విస్తరణ కారణంగా బీజింగ్ – టిబెట్ ఎక్స్ ప్రెస్ వే మీద మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం   వందంటే వంద కిలోమీటర్ల మేర మాత్రమే  వాహనాలు నిలిచిపోయాయి.  గంటో రెండు గంటలో కాదు, పూటో రెండు పూటలో కాదు ఏకంగా పదిరోజుల పాటు ఈ జామ్ ‘ఝాం ఝాం ‘ గా కొనసాగింది. రోడ్డు నిర్మాణం పనులు సెప్టెంబర్ పదమూడుదాకా జరుగుతాయి కనుక  ప్రజలందరూ  ఎప్పటిమాదిరిగానే సంయమనంతో సహకరించాలనీ, వాహనాల రాకపోకలు మరికొద్ది రోజుల్లో సాధారణ స్తితికి చేరుకుండే అవకాశాలు లేకపోనూ లేవనీ – మొన్న ఆదివారం నాడు తొలిసారిగా ఈ అసాధారణ ట్రాఫిక్ జామ్ గురించి చైనా నేషనల్ రేడియో అతి సాధారణంగా ప్రజలకు తెలియచేసింది. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టు ఆ ట్రాఫిక్ జామ్ లో దారీతెన్నూ కానకుండా అన్నన్ని రోజులు చిక్కుకుపోయిన వాహనదారులు కూడా అదేమీ పట్టనట్టు -' నట్టిల్లు  అయితే యేమిరా! నడి రోడ్డు అయితే యేమిరా!' అని మిట్ట వేదాంత గీతాలు పాడుకుంటూ,  పేకాట  ఆడుకుంటూ కాలక్షేపం చేసారు. వారికి కోపం రాలేదని కాదు. వచ్చింది. అదీ దేనికటా! ఆ పది రోజులూ తమకు తిండీ తిప్పలు కనుక్కుని పెట్టిన ఇరుగు పొరుగు గ్రామాల వారు - తాము కొనుక్కుని తిన్న ఆ తినుబండారాలకు గాను ఒకటికి నాలుగు రెట్లు రేట్లు అదనంగా వసూలు చేసారన్నదే  వారి అభియోగం. ప్రభుత్వం మీదా అధికారుల మీదా వారు నోరు విప్పలేదు సరికదా అంతంత అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం ఇబ్బందులు సహజమే కదా అని సన్నాయి నొక్కులు నొక్కారు.

అంతటి సహనశీలులను చూసి నిజానికి  మనమూ మన మీడియా ఎంతో నేర్చుకోవాలి.  అలాగే-  అలా, అంతగా అడక్కుండానే సర్డుకుపోయే ప్రజలుండడం అక్కడి పాలకుల అదృష్టం కదా అని మన పాలకులు  మధన పడాలి.

ఇక - పనిలో పనిగా ‘నవ చైనా’ గురించిన మరికొన్ని విశేషాలు కూడా ముచ్చటించుకోవడం భావ్యంగా వుంటుందేమో.


బీజింగ్ నగరంపై 'కారు మేఘాలు' 

నిరుడు మొత్తం అమెరికాలో అమ్ముడుపోయిన కార్ల కంటే ఎక్కువ కార్లు చైనాలో అమ్ముడుపోయాయి. చైనా రాజధాని బీజింగ్ నగరవాసులు పోటీ పడి రోజూ రెండువేల కొత్త కార్లు కొంటున్నారు. ఈ లెక్కన ఒక్క బీజింగ్ లోనే కార్ల సంఖ్య మరో అయిదేళ్ళలో డెబ్భయి లక్షలకు చేరుకుంటుందని అంచనా. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించడానికి - ప్రైవేట్ కార్లు వారానికి ఒక్క రోజయినా రోడ్ల మీదకు రాకూడదన్న నిబంధనలు ఇప్పటికే అమలులో వున్నాయి. అయినా చైనా రాజధానిలో వాహనాల వేగం చాలా వేగంగా తగ్గిపోతూ వుండడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే చాలా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసి రోడ్ల వెడల్పును భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ వస్తున్నారు.

మౌలిక వసతుల అభివృద్ధి పధంలో చైనా

వీటన్నిటి వల్ల - ముందు ముందు మంచి జరగబోతున్నదన్న నమ్మకం ప్రజల్లో అంతగా వుండడం వల్ల - తాత్కాలిక ఇబ్బందులను  శాశ్వితంగా  పట్టించుకోకుండా జనం అంతగా సర్డుకుపోతున్నారని ప్రభుత్వ వర్గాలవాళ్ళు నమ్మకంగా సెలవిస్తున్నారు. అయితే బీజింగ్ సమీపంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ పూర్తిగా తొలగించడానికీ, వాహనాల రాకపోకలను మునుపటి మాదిరిగా  పునరుద్ధరించడానికీ - యెట్లా లేదన్నా - మరో నెల రోజులు పట్టగలదని పేరు చెప్పడానికి ఇష్ట పడని మరో అధికారి వున్న విషయం చల్లగా బయట పెట్టాడు.
(24-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

24, ఆగస్టు 2010, మంగళవారం

విన్నంతలో - కన్నంతలో - అమెరికా - 4 - భండారు శ్రీనివాసరావు

శ్రావణ  త్రయోదశి మా అమ్మగారి ఆబ్దీకం. ఏటా హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి ‘అమ్మలగన్నమా అమ్మను’ మనసారా స్మరించుకోవడానికి ఆమె పిల్లలతో పాటు ఆ పిల్లల పిల్లలుకూడా వచ్చేవారు.

కానీ ఈసారి అమెరికాలో వున్నాము.
 ‘ఎలా?’ అనే ప్రశ్నకు సియాటిల్ లోని హిందూ టెంపుల్ పూజారి సుధీర్ ఝా రూపంలో జవాబు లభించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ హిందూ దేవాలయ సముదాయం నిర్మాణానికి భూరివిరాళం ఇవ్వడంవల్ల దీన్ని మైక్రోసాఫ్ట్ టెంపుల్ అని పిలవడం కద్దు.( హైదరాబాదులో ‘బిర్లా టెంపుల్ మాదిరిగా )

ఎక్కడున్నా ఏడుకొండలవాడికి యెనలేని వైభోగమే

ఈ దేవాలయం విశాలమయిన ప్రాంగణంలో వుంది. ఒక ఎత్తయిన వేదిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గణేష్ మొదలయిన దేవతామూర్తులను కొలువు తీర్చారు. పుష్పశోభితమయిన ఉద్యానవనం నడుమ నిర్మించిన ఈ దేవాలయం ప్రశాంతతకు, పరిశుభ్రతతకు నిలయంగా వుంది.

మనుషులను కలిపేదే దైవత్వం
 శని ఆదివారాల్లో నగరంలోని భారతీయ కుటుంబాల వాళ్ళు ఈ మందిరాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహిస్తూ వుంటారు. గతంలో ఈ గుడిలో దీక్షితులుగారనే తెలుగు పూజారి వుండేవారు. ఇప్పుడాయన సియాటిల్ లోనే రెడ్మండ్ అనే ప్రాంతంలో వున్న మరో హిందూ టెంపుల్ లో పనిచేస్తున్నారు.

భజగోవిందం

మైక్రోసాఫ్ట్ హిందూ టెంపుల్ లో ఆబ్దీకం పెట్టుకోవడానికి యాభయి ఒక్క డాలర్లు తీసుకుని టెంపుల్ కమిటీ వాళ్ళు రసీదు ఇచ్చారు. ఆ ప్రాంగణంలోనే ఒక గదిలో మా కార్యక్రమం పూర్తిచేసుకున్నాము.

 అసలు ఆబ్దీకాలవంటి కర్మకాండలపై అంతగా నమ్మకం లేనిస్తితిలో  గత యాభయి సంవత్సరాలకు పైగా మా నాన్న గారి తద్దినాలు  పెడుతూ వస్తున్నాము. ఒక పండగ మాదిరిగా ఏటా జరిగే ఈ కార్యక్రమానికి చుట్ట పక్కాలందరూ వచ్చేవాళ్ళు. ఏడాదికొకసారి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకునే సందర్భంగా భావిస్తూ దాన్ని ఒక ఆనవాయితీగా మార్చేసారు. ఈ కర్మ కాండ మొత్తంలో ఒక ఆసక్తికరమయిన విషయం నేను గమనిస్తూ వచ్చాను. అదేమిటంటే మనకు జన్మ నిచ్చిన తలిదండ్రులతో పాటు మూడు తరాల పూర్వీకులను సయితం పేర్లతో సహా స్మరించుకునే సందర్భం ఇది. తండ్రి, తండ్రి తండ్రి పేరు చెప్పగలిగినవాళ్ళు కూడా తాత తండ్రి పేరు గుర్తుకుతెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వంశాన్ని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ  వంశస్తులను ఏడాదికి ఒక్కమారయినా స్మరించుకునే అవకాశం ఇచ్చే తద్దినాలు పెట్టడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయం క్రమంగా మనస్సులో పడిపోయింది.

తల్లీ నీకు వందనం

 ఉత్తరాది పద్దతిలో నిర్వహించినా సుధీర్ ఝా గారు - ఎంతో సంతృప్తికరంగా మా తల్లిగారు వెంకట్రావమ్మ, పితామహి రుక్మిణమ్మ, ప్రపితామహి చెల్లాయమ్మలకు తర్పణ క్రియలు నాచేత జరిపించారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తరవాత – ఇంటి నుంచి తయారు చేసుకొచ్చిన గారెలు, పరవాన్నం ఇతర పదార్ధాలను  గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా అందచేసి – అమెరికాలో ఇటువంటి క్రతువులు సాధ్యమా అని మొదట్లో  కలిగిన సందేహాలను పటాపంచలు చేసుకుని ఇంటి దారి పట్టాము.

చెప్పడం మరిచాను. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమయిన సమస్త సామాగ్రి సియాటిల్ లో వున్న ఒక ఇండియన్ స్టోర్ లో లభించింది.

ఇక పేరెందుకు - మన బజారే!

 శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కోసం ఈ స్టోర్ లో ఒక లారీ లోడ్ కొబ్బరికాయలు అమ్ముడుపోయాయంటే
ఇక్కడివారు సంప్రదాయ వేడుకలను యెంత శ్రద్ధగా జరుపుకుంటున్నారో అర్ధమవుతుంది.

ఏమిలేదో చెప్పండి?

 మొత్తం వ్రత కధను, పూజావిదానాన్ని ‘నెట్’ నుంచి డౌన్ లోడ్ చేసుకుని – నిర్దేశించిన పద్దతిలో వ్రతం ఆచరించి ముత్తయిదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించి సంప్రదాయాలపట్ల తమకున్న మక్కువను వ్యక్తం చేసారు. సియాటిల్ లో మాకు తెలిసిన తెలుగు లోగిళ్ళ వద్ద ఆ నాటి ఉదయం రంగురంగుల రంగవల్లులు కొలువుతీరాయి.

NOTE:All images in the blog are copy righted to respective owners

23, ఆగస్టు 2010, సోమవారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా - 3 భండారు శ్రీనివాసరావు


“అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల - శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలూ చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.

ఓవల్ ఆఫీస్
 ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్ద వయస్సులేని ఆ అమ్మడు చిరునవ్వు నవ్వి ఇలా అంది. “ మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.”
తెలియని విషయాలను గురించి మామూలుగా  మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై - ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్ – సియాటిల్ లోని -  ‘లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు పెద్ద మర బోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది.

లేక్  వాషింగ్టన్ లో నౌకావిహారం

నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్ - చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ - “అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది “ అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.

సాఫ్ట్ గేట్స్

బిల్ గేట్స్ నెలసరి ఆదాయం – సరిగ్గా చెప్పాలంటే చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట – కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి. ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే - దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం – ఓస్ ఇంతేనా అనిపించింది.

దూరపు కొండలు నునుపు కాదు

 కానీ లేడీ గైడ్ చెప్పే విశేషాలు మాత్రం ఇన్నీ అన్నీ కాదు మరి
పాత కొత్తల మేలుకలయికగా ఆ ఇంటిని డిజైన్ చేసారని చెబుతారు.

పాత చింతకాయ కాదు - ఖరీదు చూస్తే కోట్లలోనే

సోఫాలు,కుర్చీలు,మంచాలు ఇలాటివన్నీ చాలా పాత కాలానికి చెందిన ‘యాంటిక్ ఫర్నిచర్’ గా కనిపిస్తాయి. ఇతర ఉపకరణాలన్నీ భవిష్యత్ తరానికి తగ్గట్టుగా రూపొందించారు. అవి చూసినా విన్నా ‘అదరహో’ అనాల్సిందే.
యావత్ ప్రపంచానికే టెక్నాలజీ సమకూర్చి పెట్టినవాడికి తన ఇంటిని ఒక ‘సాంకేతిక అద్భుతం’గా తీర్చిదిద్దుకోవడం పెద్ద విశేషమేమీ  కాకపోవచ్చు. కానీ కనే వారికీ, వినే వారికీ ఆ నివాసం వింతల్లో వింతే.

మాయామహలుకు దారి
ఇంటికి వచ్చే అతిధులకు ఓ రకం చిప్ అమర్చిన బ్రేస్లేట్ ఇస్తారు. అంటే దేశ దేశాల్లోని వారెవరయినా వారిని కాంటాక్ట్ చేయాలనుకుంటే వేరే ఫోన్లు, సెల్ ఫోన్లు అవసరం లేదు. ఆ అతిధి యే గదిలో వుంటే ఆగదిలో అతడికి అతి దగ్గరలో వున్న ఫోనుకి ఆ ’ కాల్’ ’ కనెక్ట్ అవుతుంది. మరో విశేషం ఏమిటంటే- బయటనుంచి వచ్చిన అతిధి శరీర తత్వానికి తగినట్టుగా అక్కడి ఉష్ణోగ్రతలు మారిపోతుంటాయి. అంటే, వెచ్చదనం కావాలనుకునే వారికి అందుకు తగినట్టుగానూ, చల్లదనం కోరుకునేవారికి అందుకు అనుగుణంగానూ - ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.

గోడలా అవి కావు   రసరమ్య కుడ్యాలు

 అక్కడి పెయింటింగులు కూడా వచ్చినవారి అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంటాయి. పికాసా పెయింటింగులు కోరుకునేవారికి అవే కనిపిస్తాయి. అదే సమయంలో రవివర్మ చిత్రాలు ఇష్టపడేవారికి అవే కనువిందు చేస్తాయి. మాయాబజారు సినిమా చూస్తున్నట్టు వుంది కదూ ఇవన్నీ వింటుంటే.

యద్దనపూడి సులోచనారాణి నవలలలో  కలల హీరో కారు ఇతడి స్వంతం

బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం.  అతగాడెవరో కాదు,  ఒక సాధారణ పిజియో తెరపిస్ట్ అంటే నమ్మగలరా!  గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం  అతగాడికి ఇది ఎలా సాధ్యమయిందంటే-  బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ సంస్త పెట్టిన కొత్తల్లో అందులో  కొన్ని షేర్లు కొన్నాడు.  కాలక్రమేణా  ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా  పెరిగిపోయాయి. దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా- కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద  ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి  బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు..
అంతేకాదు – బిల్ గేట్స్   మైక్రోసాఫ్ట్ పెట్టిన తొలి రోజుల్లో ఆయన ఆహ్వానంపై  అందులో చేరిన సిమోనీ అనే హంగేరియన్ అమెరికన్ జీవితంలో  ఎంతగా ఎదిగి పోయాడంటే , అతడు వందల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని రెండు సార్లు అంతరిక్షం లోకి వెళ్లి రాగల సంపన్నుడయ్యాడు.
అదీ మైక్రో సాఫ్ట్ షేర్ల మహాత్మ్యం అంటే.

 కాకపొతే గత రెండు మూడేళ్లుగా ఆ షేర్లలో పెద్ద ఎదుగుదల కనబడడం లేదని షేర్ సింగ్ లు అంటుంటారు. అయితే, దానితో మీ లాటి వారికీ, నాలాటి వారికీ ఎంతమాత్రం సంబంధం లేదనుకోండి. – భండారు శ్రీనివాసరావు

NOTE : Images in the blog are copy righted to respective owners

22, ఆగస్టు 2010, ఆదివారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా –2 - భండారు శ్రీనివాసరావు

అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే  'తొమ్మిదివేల'ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి -  ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల  ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట  తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ  చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.
ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క డిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్,బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ దేశంలోని పట్టణాలకు వున్నాయి.

లీవెన్  వర్త్ లో కుటుంబ సభ్యులతో రచయిత (ఎడమనుంచి రెండో వ్యక్తి)   

వాషింగ్టన్ స్టేట్ (అమెరికా రాజధాని వేరు- ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు) లో లీవెన్ వర్త్ అనే ఒక టూరిస్ట్ పట్టణం వుంది. జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి.వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి.

బవేరియన్ సంస్కృతి ఉట్టిపడే నిర్మాణాలు

ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి- తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
ఆహ్లాద వీధులు
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ వంటివాటిని అనేక పర్యాయాలు రుచి చూస్తూ కాలక్షేపం చేసేవారిని - ఇక్కడ ఒక రకం ‘సాస్’ (మిరపకాయల రసం తో తయారు చేస్తారు) దిమ్మదిరిగేలా చేయడం కళ్ళారా చూసాము. అదేమిటో , దాన్ని ఎలా తయారు చేసారో తెలియదు కానీ – ఒక్కటంటే ఒక్కచుక్క నాలిక తాకగానే - శరీరం ఆపాదమస్తకం నిలువునా దహించిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది రుచి చూసి గింగిరాలు తిరిగిపోతున్నవారిని చూస్తుంటే మన వైపు ‘గుంటూరు మిరప ఘాటు’ మించిన పదార్ధం వుందనిపించింది. ఒక సీసా కొనుక్కువచ్చాము కానీ రుచి చూసే సాహసం మాత్రం చేయలేదు.

డిసెప్షన్ ఫాల్స్

సియాటిల్ తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.

NOTE:All images in the blog are copy righted to the respective owners

21, ఆగస్టు 2010, శనివారం

విన్నంతలో - కన్నంతలో అమెరికా - 1 - భండారు శ్రీనివాసరావు

  
పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారివెంట వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.

పసిఫిక్ తీరంలో

వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్  నుంచి  ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు  చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము.డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల – కార్లో వున్న జీ పీ ఎస్  సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని  ఇంటి ముందువున్న  ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి  తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.

'ఏ హోం ఎవే ఫ్రం హోం'  

 మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది.  పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్,  అతి పెద్ద ప్లాస్మా టీవీ,  ఫైర్ ప్లేస్,  సోఫాలు వున్నాయి.  పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి. స్నాన పానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.

నిజం కాదు బొమ్మ షార్క్

 పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హటాత్తుగా పైనబడే అవకాశం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. వున్న మూడు రోజులూ ఈ వూళ్ళన్నీ చూసాము. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.

ఆక్వేరియంలో మాత్రం నిజం షార్కే

 ప్రతిచోట ఏదో ఒక ప్రత్యెక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలావుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్  ఆక్వేరియం చూసాము.

కొండంత ఆనకొండ

 షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.


జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. కారు ఎక్కగానే వూరి పేరు, వీధి నెంబరు, ఇంటి నెంబరు, లేదా షాపు, రెస్టారెంట్ వివరాలు ఫీడ్ చేస్తే చాలు - ఎక్కడికక్కడే అది గైడ్ చేస్తూ దారి చూపుతుంటుంది. మాటల్లో పడి, దారి తప్పినా అది వెంటనే హెచ్చరికలు వినిపిస్తూ మరో ప్రత్యామ్నాయ మార్గం చెప్పి మళ్ళీ సరయిన దోవకు చేరేలా సూచనలు ఇస్తుంది. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు. అంతేకాదు, మార్గమధ్యంలో మరమ్మతుల నిమిత్తం కానీ మరో అవసరం కోసం కానీ ఎక్కడయినా రహదారులు మూసివేసినా లేక వాహనాలను దారి మళ్ళించాల్సివచ్చినా - ఆ తాజా సమాచారం కూడా అది గ్రహించి అప్పటికప్పుడు కొత్త దోవలను సూచించడం ఇందులోని మరో సౌలభ్యం.
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.


అతి చిన్న నదిని చూద్దాం రండి

‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తె అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రం లో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు  కేవలం 440 అడుగులు. అంత ‘చిన్న’ నది వచ్చి కలుస్తున్నది దేనిలో?  సముద్రాలు అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో.  అది మరో విశేషం. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే – ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డ కట్టెంత చల్లగా వుంటాయి.

మహా సంగమం

సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ- సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు.  మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.

హేస్టాక్  రాక్

 అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది దాన్ని చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్  రోడ్డు ఎక్కాము.

(భండారు శ్రీనివాసరావు, 10-08-2010)

NOTE:All the images in the blog are copy righted to the respective owners.