saptagiri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
saptagiri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఆగస్టు 2013, శుక్రవారం

ఎంతో బాధతో, ఆవేదనతో ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.


కేంద్రంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా జైపాల్ రెడ్డి గారు నాడు ఆకాశవాణి, దూరదర్శన్ లను ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి తొలగించి  ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన ‘ప్రసార భారతి ‘ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు సంతోషించిన ప్రజాస్వామ్య ప్రియుల్లో నేనూ ఒకడిని. కానీ, ఈ రోజు ఉదయం (30-08-2013) దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో ‘న్యూస్ అండ్ వ్యూస్’ అనే ఇంగ్లీష్ పేరు కలిగిన తెలుగు కార్యక్రమాన్ని చూసినప్పుడు ఆ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగిగా సిగ్గుతో తల దించుకున్నాను.
చర్చలో  పాల్గొంటున్న  రాజకీయ పార్టీల ప్రతినిధులిద్దరు - బహిరంగంగా, బాహాటంగా. నిస్సిగ్గుగా – “ముయ్యి, నువ్వు  మూస్కో, నోరు ముయ్యి,  నువ్వు నోరు మూస్కో’ అంటూ ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆ దృశ్యాలను చూడాల్సిన దయనీయమైన  పరిస్తితి దూరదర్శన్ వీక్షకులది కావడం ఎంతటి దురదృష్టం.

ఇదా దూరదర్శన్ కు  జనం కోరుకున్న ప్రత్యేక ప్రతిపత్తి. ఇదా ప్రజలు ఆశించిన స్వేచ్ఛ. రేటింగులతో నిమిత్తం లేని ప్రసార మాధ్యమం  కూడా ఈవిధమైన చౌకబారు విధానాలను అవలంబించడం ఎంతవరకు సమర్ధనీయం. వార్తల సేకరణలో, ప్రసారంలో స్వేచ్చను ఎవరూ తప్పుపట్టరు. కానీ, ప్రజాధనంతో నిర్వహించే సంస్థల్లో ఈరకమైన వైఖరి యెంతవరకు సబబో దూరదర్శన్ అధికారులే ఆలోచించుకోవాలి? స్వేచ్ఛకు సయితం హద్దులు వుంటాయన్న వాస్తవాన్ని గమనంలో వుంచుకోవాలి. – భండారు శ్రీనివాసరావు