Voter List లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Voter List లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, డిసెంబర్ 2018, బుధవారం

దేవుడిని కాకపోయినా ఓటరుని

1976 నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నాను. అంటే సీనియర్ ఓటర్నే. కానీ నా సీనియారిటీ పోటీ చేస్తున్న అభ్యర్ధులకు తెలిసినట్టు లేదు. అయినా నా ఓటు వల్ల ఉపయోగం లేదనుకున్నారేమో తెలియదు. ఎవ్వరూ మా ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. దానికి బాధ లేదు. ఎలాంటి ఆబ్లిగేషన్ లేకుండా నా ఓటు నాకు నచ్చిన వారికి వేయవచ్చు. టీవీ చర్చల్లో నాతోపాటు పాల్గొనేవాళ్లు ఒకరిద్దరు కూడా మా నియోజకవర్గం నుంచి బరిలో వున్నారు. కలిసినప్పుడు చెప్పాను కూడా. అయినా ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. అంతవరకూ అదృష్టవంతుడినే.
ఇంతవరకు ఎవ్వరూ రాకపోయేసరికి, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళిచ్చే చీట్లు కూడా రాకపోయేసరికి అసలు జాబితాలో వున్నానా లేనా అనే సందేహం కలిగి సీఈఓ వెబ్ సైట్ శోధించాను. ఓటయితే వున్నది. పోలింగు కేంద్రం వివరాలు కూడా వున్నాయి. కాకపొతే పదడుగుల దూరంలో ఉన్న కేంద్రం కాకుండా పది ఫర్లాంగుల దూరంలో ఉన్న కేంద్రానికి వెళ్ళాలి. ఆటకు తక్కువ, నడక్కు ఎక్కువ. పరవాలేదు. మాఇంట్లో అందరికీ ఓట్లు వున్నట్టు నా శోధన తెలిపింది.
పొతే, మా అపార్ట్ మెంట్లో మరో డజను ఫ్లాట్లు వున్నాయి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాకబు చేసుకుంటున్నారు, చీట్లు వచ్చాయా లేదా అని. రాలేదు. రాకపోతే పాయె, ఓట్లయితే వున్నాయి.
అదే పది వేలు.
చిత్రం ఏమిటంటే మా ఏరియాలో ఉన్న అనేక మంది తెలిసిన వాళ్లకు ఫోటోతో ఉన్న ఓటరు చీట్లు వచ్చేసి చాలా రోజులయింది.