Press Freedom లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Press Freedom లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2014, శనివారం

కడుపుకోత



(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)
పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా,  ఆ రంగానికి ఒకప్పుడు చెందిన మనిషిగా ఒక్కోసారి  కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. చదవం, చూడం అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. అవి ఏం రాస్తున్నాయి అనే దానికంటే వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల  నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని  పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు. నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం  ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ  కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే తెలుగునాట దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ  ఎదురవుతాయి.

ఎందుకంటే  అన్నం తింటున్నది గొంగట్లో కనుక.

(NOTE: Courtesy Image Owner) 

28, ఫిబ్రవరి 2013, గురువారం

పాత చింతకాయ పచ్చడి కబుర్లు - 3



 ఈ వ్యాసాలు రాసి నాలుగయిదేళ్ళు  గడిచిపోయాయి. ఆనాటి  సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాశం  వుంది కాబట్టి ఈ వినతి. -  రచయిత

స్వేచ్ఛకు సైతం హద్దులు వుండాలి 





పత్రికలు చదవను.  టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.
భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల  ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.
“విద్యా సంస్థలు బంద్  అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది.యెంత చెప్పినా వినదు. ఇక  స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.
ఈ మాటలు అన్నది సాక్షాత్తూ హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మ శక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.
నిన్నబుధవారం నాడు  నగరంలో జరిగిన ఒక  సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”
కొత్వాల్ గారు అంతటితో ఆగలేదు.
“ఉస్మానియా యూనివర్సిటీ లో చిన్న సంఘటన జరిగితే చాలు. మీడియా దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తుంది.విశ్వవిద్యాలయం గేటువద్ద జరిగే సంఘటనలను నగరమంతటా జరుగుతున్నట్టు చూపించడం ఏమిటి?” అని ఒక ప్రశ్నను కూడా మీడియాకు సంధించారు.
ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.
“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం  కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.
ఖాన్ గారి ఈ  భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.  
 

 ‘చేతులు  బార్లా   జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతివేలి  కొనభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఆ  స్వేచ్చ  అని ఓ ఆంగ్ల సామెత వుంది.  అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.

పైకి చెప్పుకునే కారణాలు ఏమైనప్పటికీ, ఎన్ని వున్నప్పటికీ, ప్రజాస్వామ్య మూలసౌధాలన్నీ పత్రికా స్వేచ్ఛకు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అసలు సిసలు పునాది రాయి వంటి సామాన్య వోటరుతో నిమిత్తం లేకుండా, అతడి ప్రమేయం లేకుండా ఈ రభస సాగుతూ వుండడమే  ఇందులోని  విషాదం.

మన దేశ ప్రజాస్వామ్యం ఇంత బలంగా వేళ్ళూనుకుని వుండడానికి కారణం మేమంటే మేమని ఎందరు బడాయిలకు పోయినా ఈ ఘనత సాధారణ వోటరుదని ఒప్పుకుని తీరాలి. అత్యధిక శాతం నిరక్షురాస్యులయిన వోటర్లు పత్రికలూ చదవకుండానే, మీడియా విశ్లేషణలతో నిమిత్తం లేకుండానే గతంలో జరిగిన ఎన్నో ఎన్నికలలో తమ పరిణతిని ప్రపంచానికి చాటి చూపారు. భారత దేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన ఇరుగు పొరుగు దేశాల్లోని  ప్రజాస్వామ్య వ్యవస్థలు  కుప్పకూలిపోయి, సైన్యం సాయంతో నియంతలు రాజ్యం చేయాల్సిన దుస్తితి దాపురిస్తుంటే, మన వోటర్లు మాత్రం కేవలం వోటు హక్కుతో ప్రభుత్వాలను మారుస్తున్నారు. గిట్టని పార్టీలకు బుద్ధి చెప్పి, తాము  మెచ్చిన పార్టీలను గద్దెనెక్కిస్తున్నారు.

మేధావులమని అనుకుంటున్నవాళ్ళు  గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్థలన్నీ  ఈ ఆరుదశాబ్దాల పై చిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్థానాల్లో , చట్ట సభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు ప్రతి విమర్శలు, వాదోపవాదాలు,నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు-
పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ-
వ్యాపార కళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి.  పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్థలు కాలక్రమేణా ప్రత్యర్ధులపై   పైచేయి కోసం కత్తులు దూస్తున్నాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని  ప్రభుత్వాలు  సాగించే అక్రమాలతో పోలిస్తే-
పత్రికలను  అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని  చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.
తాము ప్రాతినిధ్యం వహించే సంస్థల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ
తమ రాతలతో, చేతలతో సమాజానికి సంకటంగా తయారయిన వారు
వారు ఎవరయినా సరే-
ఆ వ్యక్తి,
గ్రామస్తాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు-
బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు-
ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు-
రాష్ట్రాన్ని పాలించే అధినేత కావచ్చు-
పార్ట్ టైం విలేకరి కావచ్చు-
ప్రధాన సంపాదకుడు కావచ్చు-
ఏ స్తాయిలో వున్నా, ఏ  హోదాలో వున్నా ఖండనకు అర్హులే.
ఏదో ఒక పేరుతొ ఏదో ఒక సాకుతో
అలాటివారిని కాపాడాలని అనుకోవడం
కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది. (13-01-2011)
NOTE: Courtesy Image Owner