ప్రశ్నోపనిషత్!
ఒకానొక కాలంలో మనిషి పుట్టుకే ప్రశ్నతో మొదలయ్యేది. ‘ప్రసవం బాగా జరిగింది’ అని మంత్రసానో, ఆసుపత్రి నరసమ్మో చెప్పగానే మొదట వినవచ్చే ప్రశ్న: ‘మగపిల్లవాడా? ఆడపిల్లా?’
‘వెనుకటి రోజుల్లో ఏది రాయాల్సివచ్చినా, మనసుకు తోచింది రాసుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడాపరిస్తితి లేదు’ అన్నారు ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు ఒకరు నాతో. ‘డోలు వచ్చి మద్దెలతో చెప్పుకున్నట్టు వుంది’ అనబోయి, నాలుక మడతేసి, ‘రాయడానికే కాదు, మాటలాడడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన రోజులివి’ అని ముక్తాయించాను.
అన్నానే కానీ, మళ్ళీ ఆలోచిస్తే, ‘ప్రశ్నోపనిషత్’ అని మొదలు పెట్టడం కూడా మంచిది కాదేమో అనిపించింది. ఎందుకంటే, ‘ప్రశ్నించడం మా జన్మ హక్కు అని కొందరు, అలాంటి హక్కు మీకీ జన్మలో లేదు, రాదు’ అని మరి కొందరూ తీవ్రాతితీవ్రంగా వాదులాడుకుంటున్న వర్తమానంలో జీవిస్తున్నాం కనుక. కానీ పుడకలతో వచ్చిన అలవాటు ఇది. ఒక పట్టాన పోతుందా!
నేను బెజవాడలో బీ కాం చదివేటప్పుడు పడమట గోరాగారి నాస్తికాశ్రమంలో జరిగే సమావేశాలకు వెడుతుండేవాడిని. ప్రశ్నించడాన్ని ప్రోత్సహించేవారు.
ఆయన దేవుడిని నమ్మరు. మహాత్మా గాంధీ అనుయాయులు అయినా, నాస్తిక ఉద్యమ ప్రచారానికే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చే వారు.
ఆ రోజుల్లో అమెరికా వెళ్ళడం అనేది కలలో మాట. అదేమిటో విదేశాల్లోని నాస్తిక ఉద్యమ సంస్థలు, గోరాగారి సంతానానికే ఆహ్వానం పంపేవి. వారిలో ఇద్దరు, ముగ్గురు అలా అమెరికా వెళ్లివచ్చారు కూడా.
నేను ఒకరోజు నాస్తికాశ్రమానికి వెళ్ళిన రోజు అమెరికా వెళ్ళే గోరాగారి పుత్రుడు ఒకరికి వీడ్కోలు సమావేశం జరుగుతోంది. ప్రశ్న అడగడం మీ హక్కు అనేవారు కనుక గోరాగారు ఏమీ అనుకోరులే అని, ‘ఒక్క మీ కుటుంబానికే ఈ ఆహ్వానాలు వస్తాయి, ఇతరులకు రావెందుకు? అనే ప్రశ్నతో నేను సిద్ధంగా వున్నాను. అది అడగబోయేలోపు పట్టణ వైశ్య ప్రముఖుడు ఒకరు లేచి నిలబడ్డారు. ఆయన పెద్దవారు కనుక నేను వెనక్కి తగ్గాను. నిజానికి నేను అడగాలి అనుకున్నదే ఆయన అడిగారు. నేను క్లుప్తంగా వేయబోయిన ప్రశ్నను ఆయన కొంత హాస్యం పాలు కలిపి అడిగారు. ఆయన మాటల్లో:
“సువిశాల ప్రపంచం. అనేకానేక దేశాలు. వాటిల్లో ఒకటి భారతదేశం. భారత దేశంలో అనేక రాష్ట్రాలు. వాటిల్లో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. అందులో అనేక జిల్లాలు. వాటిల్లో ఒకటి కృష్ణాజిల్లా. అందులో అనేక పట్టణాలు. వాటిల్లో ఒకటి బెజవాడ. బెజవాడలో అనేక వాడలు. వాటిల్లో ఒకటి పడమట. పడమటలో అనేక ప్రదేశాలు. వాటిల్లో ఒకటి మీ నాస్తికాశ్రమం. అందులో మళ్ళీ అందరూ కాదు. కేవలం మీ పిల్లలకే ఎందుకు అమెరికా నుంచి ఆహ్వానాలు వస్తాయి? ఇతరులకు ఎందుకు రావు? “
ఇదీ ఆయన అడిగిన ప్రశ్న.
దీనికి గోరాగారి స్పందన ఏమో కానీ, సభికుల నుంచి మాత్రం ముసిముసి నవ్వులు వినవచ్చాయి.
అప్పుడు అనిపించింది, ప్రశ్న అడగడం తేలికే, జవాబు చెప్పడమే ఇబ్బంది.
తోకటపా:
‘అమ్మా! పెరుగు ఎలా వస్తుంది’
‘ఏవిటే అర్ధంలేని ప్రశ్నలు. పాలు కాచి పెరుగు తోడు పెడితే పెరుగు వస్తుంది’
‘మరి తోడు పెట్టడానికి పెరుగు ఎక్కడినుంచి వస్తుంది?’
‘ఏవండీ నన్ను పనిచేసుకోనీకుండా చంటిది ప్రశ్నలతో చంపేస్తోంది. కాస్త దీన్ని దగ్గరకు తీసుకోండి’
చలపతి ఆలోచనలో పడ్డాడు. తన చిన్నతనంలో తనకు ఇన్ని అనుమానాలు వచ్చేవా?
వచ్చేవి. కానీ వాటిని విసుక్కోకుండా తీర్చేందుకు బామ్మా తాతయ్యా వుండేవారు.
తాతయ్య వేలు పట్టుకుని తాను బడికి వెళ్ళేవాడు. ఇప్పుడో! తన పిల్లల్ని ‘ఆటో అంకుల్’ స్కూలుకు ‘తోలుకు’ పోతున్నాడు.
బామ్మ పొద్దుగుంకుతుండగానే గోరుముద్దలు తినిపించి, వొళ్ళో పండుకోబెట్టుకుని చిచ్చెకొడుతూ ‘అనగనగా ఒక రాజు కధలు’ చెప్పేది. ఇప్పుడో! పిల్లలు తమ గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ‘గేములు’ ఆడుకుంటున్నారు.
చిన్నప్పుడు తనకు చిన్నగా వొళ్ళు వెచ్చబడ్డా బామ్మా తాతయ్యా పెద్దగా గిలగిలలాడిపోయేవాళ్ళు. ఆడుకుంటూ కిందపడి మోకాలు చెక్కుకుపోతే అప్పుడు బామ్మ పడే ఆదుర్దా చూసితీరాలి. ఇప్పుడు అంతటి ప్రేమ పిల్లలపై తమకూ వున్నా, చూపించే తీరిక లేని జీవితాలు తమ ఇద్దరివీ. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. సాయంత్రం ఇంటికి చేరేసరికి వున్న కాస్త వోపిక వొండుకు తినడానికే సరిపోతుంది.
తాను తన పిల్లలకు అన్నీ అమర్చాడు. మంచి స్కూల్లో చేర్పించాడు. విడిగా వారిద్దరికీ పడక గది ఏర్పాటు చేసాడు. కొంచెం ఖర్చయినా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాడు. వారం విడిచి వారం మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తాడు. ఖరీదయిన రెస్టారెంటు తీసుకువెడతాడు. ఇక అరుణ మాట చెప్పనక్కరలేదు. ఇంట్లో వున్న కాసేపు ఆమెకు పిల్లల తోడిదే లోకం.
అయినా ఎక్కడో ఏదో లోపం జరుగుతుందోన్న అనుమానం. తాము ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేవరకు వాళ్ళిద్దరూ పక్కింటి ఆంటీ ఇంట్లో వుంటారు. తాము కనబడగానే వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగు చూసినప్పుడు, జరుగుతున్న ‘లోపం’ గురించిన ఆ అనుమానం పెనుభూతంగా మారి భయపెడుతుంది. కానీ, అవసరం అనుమానాలను అణచిపెడుతుంది.
అమ్మానాన్నా ఎక్కడో వుంటారు. నెలకు ఇంత అని క్రమం తప్పకుండా డబ్బు పంపుతూనే ఉంటాడు. తెచ్చి తమ దగ్గరే అట్టిపెట్టుకునే ఆలోచన వచ్చినా, ఇంకేదో ఆలోచన పట్టి ఆపుతుంది.
కానీ పిల్లలు ఏదో కోల్పోతున్నారు. బామ్మా తాతల ఆప్యాయత. అది తాము పూడ్చలేనిది.
వాళ్లకు మేధో వికాసం కలిగించే కంప్యూటర్లు ఇస్తే సరిపోతుందా? మానసిక స్వాంతన కలిగించే బామ్మా తాతల ప్రేమను అందివ్వాలా?
ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?
(ఇంకా వుంది)