కాంగ్రెస్ అధిష్టానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కాంగ్రెస్ అధిష్టానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా! - భండారు శ్రీనివాసరావు




కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
          

ముప్పయ్యేళ్ళ కిందటి మాట.

ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.

అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని భావించిన ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అతిరధులంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కిమ్మిన్నాస్తి.

మూడు దశాబ్దాల తరవాత మళ్ళీ రాష్ట్రంలో అవే పరిస్థితులు. ముఖ్యమంత్రి పై మంత్రుల ధిక్కార ధోరణి. సాటి మంత్రులపై తోటి మంత్రులే అవినీతి ఆరోపణలు చేసే పరిస్తితి. మంత్రులతో పాటు ఎమ్మేల్యేలది కూడా అదే వరస. కానీ నాటి ఇందిరలా రాజకీయ దృఢచిత్తంతో వ్యవహరించలేని అశక్తతలో నేటి అధిష్టానం.



మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఢిల్లీ పెద్దలు, వయసులో, అనుభవంలో పెద్ద అయిన రోశయ్యకు తాత్కాలిక ప్రాతిపదికపై ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. ఆయన కూడా చాలా రోజులు ముఖ్యమంత్రి పదవి తాత్కాలికమనే భావనలోనే రోజులు వెళ్ళబుచ్చారు. భేషజానికి పోకుండా ఆయన పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు.

వైఎస్సార్ దుర్మరణానికి కారణమయిన ప్రకృతి ప్రకోపం రోశయ్య పాలన తొలిరోజుల్లో కూడా కొనసాగింది. వర్షాలు, వరదలకు తోడు జగన్ రూపంలో బయటపడిన పార్టీలోని చీలికలు. ఈ చీకాకులకు అదనంగా టీ.ఆర్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమం బాగా వూపందుకోవడం - పరిపాలనపై, పార్టీపై ప్రభావం చూపింది. వెరసి, తాత్కాలిక ప్రాతిపదికపై శాశ్వితంగా కొనసాగుతారనుకున్న రోశయ్యను అర్ధాంతరంగా మార్చే పరిస్తితులు తలెత్తాయి.

ఈ పరిణామాలు సీ.ఎం. మార్పిడి దిశగా అధిష్టానాన్ని అడుగులు వేయించాయి. తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ని ఇందుకు ఎంపిక చేశారు. వై.ఎస్.తో సాన్నిహిత్యం కలిగిన గాలి జనార్ధన రెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చంచల్ గూడా జైలు దాకా వెడుతుందని తెలిసే వై.ఎస్. మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయినప్పటికీ అధిష్టానం సంగతి తెలిసిన వారికెవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఎందుకంటె, ఢిల్లీలో అధిష్టానదేవత చుట్టూ చుట్టుకునివుండి చిల్లర దేవుళ్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూడడానికి తెగ ఉత్సాహపడుతుంటారని రాజధానిలో ప్రతీతి. చూస్తూ చూస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెత్తనం చేసే మహత్తర అవకాశాన్ని వాళ్లు వొదులుకోలేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం జాతీయ పార్టీలయినా, ప్రాంతీయ పార్టీలయినా వాటి అధినాయకత్వం తీరూ, తరహా ఒకే విధంగా వుంటుంది. జాతీయ పార్టీలు తమ ముఖ్య మంత్రులతో వ్యవహరించే పధ్ధతి, ప్రాంతీయ పార్టీలు తమ జిల్లా పరిషత్ అధ్యక్షులతో వ్యవహరించే విధానం ఒకే రీతిలో వుంటాయన్నది జగమెరిగిన సత్యం.

అయితే వైఎస్సార్ విషయంలో అధిష్టానం కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించింది. కేంద్రంలో సంకీర్ణ





ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ నెత్తికెత్తుకున్న కొత్త బాధ్యతలు రాజశేఖరరెడ్డికి ఓ మేరకు

కలసివచ్చాయి. జాతీయ స్తాయిలో కుదురుకోవడానికి వారికి కూడా రాజశేఖరరెడ్డి వంటి ‘అన్నింటా సమర్ధుడయిన’ ఒక ప్రాంతీయ నాయకుడు అవసరమన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించిన రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేని దైన్య స్తితి పార్టీ అధిష్టానానిది. ఆ ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రతో, టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలతో ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని ముందుగానే రిజర్వ్ చేసుకున్నారనే అనుకోవాలి. వై.ఎస్. ముఖ్యమంత్రిగా వున్న మొదటి అయిదేళ్ళ కాలంలో ఆయన్ని మార్చాలని రాష్ట్రం లోని ఆయన వ్యతిరేకులు, అసమ్మతివాదులు కలసికట్టుగా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆ సాహసానికి పూనుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధి వ్యవహార శైలికి, సోనియా గాంధి పని తీరుకు పోల్చి చూపిస్తూ జాతీయ మీడియాలో వెలువడిన సోనియా అనుకూల కధనాలు కూడా - ముఖ్యమంత్రులను మార్చే విషయంలో ఆమె కాస్త గుంజాటన పడడానికి దోహదం చేసి వుండవచ్చు. కానీ, మరోసారి అత్తెసరు మెజారిటీతో రెండో పర్యాయం కేంద్రంలో యూ.పీ.యే. ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో కొంత మార్పువచ్చింది. కాని, వైఎస్సార్ మరణం వరకు అది బయట పడలేదు. తదనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర ముఖ్య మంత్రిపై వెనుకటి పట్టు బిగించాలన్న కోరిక ఢిల్లీ పెద్దలలో కలిగినట్టు వుంది. అది నెరవేర్చుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి కారణమయ్యాయి.

అనుభవశాలి అయిన రోశయ్యను తప్పించడానికి అధిష్టానం చెప్పిన కారణం ఆయన వయో భారం. ఆ కారణాన్ని కూడా ఆయన చేతనే చెప్పించారనుకోండి. అది ఢిల్లీ పెద్దల జాణతనం.

వృద్ధుడయిన రోశయ్య స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టారు. ఆయన యువకుడే కాదు విద్యాధికుడు కూడా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో వ్యవహరించిన తీరు, మంత్రుల శాఖల పంపిణీలో సీనియర్లను సైతం స్వతంత్రించి పక్కనబెట్టడం ఇవన్నీ చూసి ఆయనకు అధిష్టానం మద్దతు పూర్తిగా వుందనీ, స్వేచ్చగా వ్యవహరించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఒక గాడిలో పెడతారని ఆశ పడ్డవాళ్ళు వున్నారు.

కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అభిప్రాయం నీరు కారిపోవడం మొదలయింది. కొత్త ముఖ్యమంత్రి పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించి పదవిని పదిలం చేసుకుంటారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. అవినీతి రహిత పాలన అందించాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన విధాన సంస్కరణలు వై.ఎస్.ఆర్. ప్రారంభించిన



సంక్షేమ పధకాలకు గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి. వై.ఎస్.ఆర్. ఇప్పడు జీవించి వున్నా వీటిల్లో వున్న కొన్ని లొసుగులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై కూడా పడేది. కానీ, కొందరు అధికారుల అవాంచిత, అనాలోచిత చొరవల కారణంగా ఆ పధకాలను కిరణ్ ప్రభుత్వం కావాలనే అటకెక్కిస్తున్నదన్న భావన ఆ పధకాల లబ్ధిదారుల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం అటు మంత్రులు కానీ, ఇటు అధికారులు కానీ సమర్ధవంతంగా చేయకపోవడం వల్ల రాజకీయ ప్రత్యర్ధులకు అది ఒక ఆయుధంగా అంది వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా కాకుండా ఐ.ఏ.ఎస్. అధికారి లాగా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా పార్టీ వర్గాల్లో ప్రబలడానికి ఆయన వ్యవహారశైలి కొంత మేరకు దోహదం చేసింది. ఏఒక్క విషయంలోనూ తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న దురభిప్రాయం సీనియర్ మంత్రుల్లో ప్రతిఒక్కరికీ కలిగింది. ఖాళీగావున్న అసంఖ్యాక పదవులను పంపిణీ చేసి పార్టీ శ్రేణులను పటిష్టపరిచే చర్యలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ కార్యక్రమాలపట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాధారణంగా పదవుల పంపిణీ వ్యవహారం పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే అభిప్రాయం వుంది. అయితే, ఎన్నికలు సుదూరంలో వుండి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నప్పుడు అసమ్మతికి భయపడాల్సిన పరిస్తితి ముఖ్యమంత్రికి వుండదు.

కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన వైఫల్యం చెందారనే అనుకోవాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ తక్షణం హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు



సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. సీనియర్ల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించకపోవడం, జగన్ సానుకూల ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం తాత్సార వైఖరి అవలంబించడం, తెలంగాణా కారణంగా అన్ని పార్టీల్లో మాదిరిగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఏర్పడడం – ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కారణాలుగా పేర్కొంటూ వుంటారు. కానీ ఇవి వాదనకు నిలబడే విషయాలు కావు. ఇలాటివన్నీ, ఏదో ఒక రూపంలో ప్రతి ముఖ్య మంత్రీ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనక తప్పని సమస్యలే.

నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి. ఈ నేపధ్యంలో సంభవించిన దురదృష్టకర మరణం వై.ఎస్.ఆర్. ను సామాన్యుల మనస్సుల్లో చిరంజీవిని చేసింది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోకుండా, వై.ఎస్.జగన్ ను అడ్డుకునే క్రమంలో వై.ఎస్, పాలనను తప్పుబడుతూ చేసిన కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అవి ప్రత్యర్ధికి కలసి వచ్చాయి.

మరో అయిదు వారాల్లో అంటే నవంబర్ 24 నాటికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది కాలంలో ఆయన సాధించింది పూజ్యమనే చెప్పాలి. జనాలకు పనికొచ్చే పాత పధకాలు పక్కన పెట్టడమే కాకుండా పేరుకయినా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పధకం కూడా ఆయన హయాంలో శ్రీకారం చుట్టుకోలేదు. క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే గగనంగా మారిన రోజులు కిరణ్ పాలనలోనే కాంగ్రెస్ కళ్ళచూస్తోంది.

ఇప్పుడిప్పుడే ఈ అంశాలనన్నింటినీ కిరణ్ కుమార్ రెడ్డి పరిగణన లోకి తీసుకుంటున్నట్టు కానవస్తోంది. నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడానికి ఆర్భాటంగా చేస్తున్న పధకాల ప్రకటనలే ఇందుకు సాక్ష్యం.

అయితే, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిండా రెండేళ్ళ వ్యవధానం వుంది. మరో విషయం ఆలోచించకుండా పరిపాలనపై పట్టు బిగించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించలేకపోయినా మీద పడ్డ విమర్శలను కొంత మేరకయినా తొలగించుకోవచ్చు. నిజమే. ఇప్పడు ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం.

పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.

ఇది గమనంలో పెట్టుకునే పాలకులకు సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (29-09-2011)

30, డిసెంబర్ 2010, గురువారం

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

రెండువేల పదో సంవత్సరం మౌనంగా వీడుకోలు తీసుకుంటున్న వేళ ఒక్కసారి మన రాష్ట్రాన్ని విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే దృశ్యం ఏమిటి?

వరుస తుపానులు, అకాల వర్షాలు, నీట మునిగిన పైర్లు, నిండా మునిగిన రైతులు, గుండె ఆగి కొందరు, గుండె చెదరి మరి కొందరు, ఊపిరి వొదిలిన పేదవాళ్ళు -

ముదిరిన ప్రాంతీయ ద్వేషాలు, పలచపడ్డ మానవ సంబంధాలు, నిన్న మొన్నటి దాకా పాలూ నీళ్ళలా కలగలసిపోయిన జనం తాలూకు కనబడని ఆనవాళ్ళు -

మింటికెగసిన ధరలు, వెన్ను విరిగిన ప్రజలు,

ఆందోళనలు, ఊరేగింపులు, హర్తాళ్ళు, రాస్తా రోఖోలు, బందులు, దేశాన్ని చీల్చే చెండుకుతినే రాబందులు,

నాయకుల నిరాహార దీక్షలు, అనుచరుల వీరావేశ ప్రదర్సనలు,

దిష్టి బొమ్మల దహనాలు, ముష్టి యుద్ధాలను మరిపించే బుల్లి తెరల గోష్టులు,

ఒక్కటంటే ఒక్కరోజు ప్రశాంతంగా గడిచిందా? ఏటిపొడుగునా ఇవే గొడవలు. ఏడాది మొత్తం ఇదే తీరు.

‘జనం గమనిస్తున్నారు జాగ్రత్త’ అని ఒకరినొకరు హెచ్చరించుకోవడమే కానీ ఆ జనం నిజంగానే గమనిస్తున్నారన్న సోయ లేకపోవడమే నేటి రాజకీయం లోని ఓ కొత్త కోణం.

సమాజం లోని అన్ని రకాల రుగ్మతలకు పరిష్కారం చూపవలసిన రాజకీయ పార్టీలే వీటికి మూలాధారాలు కావడం మరో విషాదం.

ఎన్ని పార్టీలు రాష్ట్రంలో వున్నప్పటికీ, ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ,టీ ఆర్ యస్ ల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు గిరికీలు కొడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జగన్ పెట్టబోయే పార్టీ కూడా ఈ జాబితాలో చేరింది.

ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యెక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. తొమ్మిది సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు ఆ పార్టీకి అధినాయకుడు. రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం తధ్యం అని మనసావాచా నమ్మి దెబ్బతిన్న పరిస్తితి ఆయనది. ఎన్నికలముందు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ, తమ విజయావకాశాలను నీరు కార్చిందని కూడా నమ్ముతున్న వారు టీ డీ పీ లో అనేకులున్నారు. సరే. అది గతం. ముందు ముందు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని కాదని పట్టం కట్టడానికి వారి ముందు వున్న ఏకైక ప్రత్యామ్నాయం తమ పార్టీ మాత్రమె అని కూడా వారి నమ్మకాలు కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ నేడున్న పరిస్తితిని చూస్తే వారిది దురాశ అనుకోవడానికి కూడా వీలు లేదు. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి. ఈ నేపధ్యం లో- అకాల వర్షాలతో కుమిలిపోతున్న రైతుల దుస్తితి ఆ పార్టీకి ఒక రకంగా కలసి వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక బలమయిన అంశం దొరికిందని ఆ పార్టీ ఉత్సాహ పడింది. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా పార్టీ అధినేతే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించడం, జాతీయ మీడియాను ఆకర్షించే స్తాయికి ఈ అంశం ఎదగడం ఆ పార్టీకి కొంత లాభించినట్టే కనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో వ్యవసాయం గురించి ఆయన చేసిన కొన్ని ప్రస్తావనలను కొందరు పదేపదే పేర్కొనడం - రైతులపట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను అదే పనిగా ప్రశ్నించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

పొతే, టీ ఆర్ యస్.

తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు. అందువల్ల కుష్టు రోగులెవరూ ఇలాటి ప్రకటనలను సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఉద్యమ పార్టీ కాబట్టి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా కలిగిన పార్టీ కాబట్టి, మిగిలిన ఏ రాజకీయ పార్టీకి లేని కొన్ని వెసులుబాట్లు ఈ పార్టీకి వున్నాయి. విద్యార్ధులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్న ఏకైక డిమాండ్ తో- రైతుల సమస్యను కూడా పక్కకునెట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేసినా ప్రశ్నించే వారు లేకుండా పోవడం, ప్రస్తుత తరుణంలో భావోద్వేగాలకున్న పటిమను తెలియచేస్తుంది. తీరా ఇంత చేసినా, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు దీక్షకు పూనుకునేవరకు కేసుల విషయం పరిష్కారం కాని వైనం గమనిస్తే ఇందులోని మతలబు ఏమిటో ఎవరికీ అర్ధం కాని విషయం.

ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ కొందరు చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా అరంగేట్రం చేయబోతున్న ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది. వైఎస్ ఆర్ రాజకీయవారసుడిగా రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు గుర్తించకపోయినా, సామాన్య జనం గుర్తిస్తే చాలని మొండిగా ముందుకు సాగిపోతున్న జగన్ సాహసానికి కారణాలను అన్వేషించే పనిలో మరి కొందరు తలమునకలుగా వున్నారు.

పోతే, రాజశేఖరరెడ్డి జీవించి వున్నంత వరకు, ముఖ్య మంత్రుల విషయంలో పాత పోకడలను సమూలంగా మార్చుకున్నట్టు సంకేతాలు పంపి సాధారణ జనంలో మంచి మార్కులు కొట్టేసిన సోనియా, వై ఎస్ ఆర్ మరణానంతరం మళ్ళీ పాత పద్ధతులకు మళ్లిపోతున్నదన్న దురభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు విజయం సాధించడం జగన్ కు కలసి వచ్చింది. ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడం ద్వారా జగన్ పట్ల సానుభూతి పెరిగేలా చేసి అధిష్టానం మొదటి పొరబాటు చేసింది. ఆ తడబాటులో చేసిన మరి కొన్ని పొరబాట్లు జగన్ ని మాస్ హీరో గా మార్చివేశాయి. తిరుగులేని జనాదరణ కలిగిన నాయకుడిగా జనం లో గుర్తింపు పొందిన తరవాత కానీ అధిష్టానానికి తాను చేసిన తప్పు ఓ పట్టాన అర్ధం కాలేదు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆ దరిమిలా పన్నిన వ్యూహాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్న చందంగా అధిష్టానం వ్యవహారాన్ని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నష్ట నివారణకోసం - విద్యార్ధులపై పెట్టిన కేసుల అంశాన్ని ఆలస్యంగానయినా చేతిలోకి తీసుకుని - కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల నిరాహార దీక్ష రూపంలో చూపించిన పరిష్కారం - పోయిన ప్రతిష్టను ఏమేరకు పూడ్చగలిగిందన్నది అనుమానాస్పదంగానే మిగిలిపోయింది.

రాష్ట్రంలో నేడు నెలకొనివున్న పరిస్తితికి అన్ని పార్టీలకు అంతో ఇంతో బాధ్యత వున్నప్పటికీ – ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత మాత్రం అధికార పక్షానిది. ఇంకా సరిగా చెప్పాలంటే- ఢిల్లీ లో కొలువయివున్న ఆ పార్టీ అధిష్టానవర్గానిది. అంతే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్తితికి కూడా పూర్తి బాధ్యత అధిష్టానానిదే.

అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా ఏష్టత కలుగుతోందని బుల్లి తెరలపై జనం బల్ల గుద్ది చెబుతున్నారు. ఇలాటి వారికా మనం వోట్లు వేసి గెలిపించిందని చీదరించుకునే పరిస్తితి ఏర్పడుతోందని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు పేర్కొన్నట్టు - రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి చందాన తయారయింది.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వున్నప్పుడు ఇలాటి అంశాలన్నీ చాలా అత్యల్ప విషయాలుగా ఆ పార్టీ భావిస్తూ వుండవచ్చు. కానీ శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక వెలువడిన దరిమిలా రాష్ట్రం లో - భవిష్యత్ రాజకీయ స్వరూప స్వభావాలు నేడున్న విధంగానే వుంటాయని అనుకోవడానికి వీలు లేదు.
‘కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతరం ముంచుకు వస్తుందని, ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ఇటు తెలంగాణలో టీ ఆర్ యస్, అటు సీమాంధ్ర లో జగన్ పెట్టబోయే పార్టీ - అన్ని స్తానాల్లో అద్భుత విజయాలను సాధిస్తాయనీ, ఆ ఉప్పెనలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందనీ టీ ఆర్ యస్ నేత చంద్రశేఖర రావు తాజాగా చెబుతున్న ‘రాజకీయ జోస్యం’ - కొత్త ఊహాగానాలకు రెక్కలు తొడుగుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలు పంపుతోంది.

‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోందని’ తరచూ పేర్కొనే కాంగ్రెస్ నాయకులు – ఇటీవలి కాలంలో అధిష్టానం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణివల్ల పార్టీ పరిస్తితి మరింతగా దిగజారి పోతున్నదన్న వాస్తవాన్ని ఎందుకు ఢిల్లీ కి చేరవేయలేక పోతున్నారన్నది మరో యక్ష ప్రశ్నగా మిగిలిపోతోంది. (29-12-2010)