మొన్న ఒక రోజు తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్
శ్రీ కె.శ్రీనివాసరెడ్డి నుంచి ఫోన్. ‘లీడర్ ఏమిటి విశేషం?’ అన్నాను. ఆయన్ని లీడర్
అని పిలవడం నాకు అలవాటు. ‘వచ్చే రెండు మూడు రోజుల్లో మనం ఒకసారి కలుద్దాం. మా
వాళ్ళు టచ్ లో వుంటారు’ అన్నారు.
కొన్నేళ్ళ క్రితం, నేను రిటైర్ అయిన కొత్త రోజులు.
నా మేనకోడలు విజయలక్ష్మి, నా
మిత్రుడు జ్వాల నరసింహారావు దంపతుల జేష్ఠ పుత్రిక మేమందరం ముద్దుగా బుంటీ అని
పిలుచుకునే జర్నలిస్ట్ ప్రేమ, మాటల సందర్భంలో అన్నది. ‘చూస్తుండు మామయ్యా! మరో
పదేళ్ళలో డిజిటల్ జర్నలిజం ఒక్కటే రాజ్యమేలుతుంది. రెండు చేతులతో పట్టుకునే చదివే
వార్తాపత్రికలు ఒక్క చేతిలోకి వచ్చేస్తాయి. అన్నీ స్మార్ట్ ఫోన్ లోనే. అంతే కాదు, ఏమిటీ
డిజిటల్ మీడియా అంటున్నారు కదా! మెయిన్ స్ట్రీం మీడియా స్థానంలో రాబోతున్నది అదే!’
నా జర్నలిజం కెరీర్ 1970 ప్రాంతంలో మొదలైంది. అప్పుడు ఆరు పేజీల పత్రిక బయటకు
రావడానికి నానా హైరాణా. హాండ్ కంపోజింగ్. అన్ని పేజీల్లో మనకు కనబడే ప్రతి అక్షరాన్ని కళ్ళు కుట్టుకుని చూస్తూ, కంపోజిటర్లు చేతితో కూర్చాల్సి వచ్చేది. ఇక ఫోటో ప్రింట్
చేయాలి అంటే అదో బ్రహ్మ ప్రళయం. పత్రికాఫీసుల్లో కుదిరేపని కాదు. బయటకు
వెళ్లి బ్లాక్ మేకింగ్ వర్క్స్ లో
చేయించుకుని రావాలి. నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పటి పరిస్థితులు అవి.
చూస్తుండగానే కొత్త ముద్రణా యంత్రాలు రంగప్రవేశం
చేశాయి. నలుపు తెలుపు స్థానంలో రంగు రంగుల హంగులు వచ్చాయి. ముద్రణలో వేగం
పెరిగింది. చదువరులు పెరిగారు. పల్లెల్లో మూడో నాటికి చేరే పత్రికలు, తెల్లవారక
ముందే ఇళ్ళ తలుపులు తడుతున్నాయి. కానీ ఎక్కడో ఏదో లోటు. తొందరలో తప్పులు తొక్కుతున్న భావన. ఆ భావన కూడా పెరుగుతోందే కానీ తరగడం లేదు.
దాన్ని ఏమంటారో! నిబద్ధత అని నేను అనుకుంటున్నాను.
మార్పును సహజంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ లేదు. కొత్తతరం తరహా
అదే. ప్రతిదీ తేలికగా తీసుకోవడం వారి స్వభావం. అలా అని వాళ్ళు మౌన ప్రేక్షకులు
మాత్రం కాదు. ‘ఇదే మా రోజుల్లో అయితే..’ అని మొదలు పెట్టడానికి రోజులు చెల్లాయి.
శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు మే పందొమ్మిదవ తేదీన (19-05-2026) హైదరాబాదు లోని తెలంగాణా మీడియా అకాడమీకి
వెళ్లాను.
పాతతరం లేదా ఒక తరానికి చెందిన పాత్రికేయ ఘనాపాటీలు
అక్కడ కనిపించారు. ఒకరా ఇద్దరా! ప్రముఖ సంపాదకులు శ్రీయుతులు ఇనగంటి వెంకట్రావు, కె.
రామచంద్రమూర్తి, దాసు కేశవ
రావు, నగేష్
కుమార్, ఎంపీ
రవీంద్ర నాద్,
దిలీప్ రెడ్డి, మాఢభూషి
శ్రీధరాచార్య, ఆర్వీ
రామారావు,
దేవులపల్లి అమర్, వినయ్
కుమార్, ఎం.
సుబ్బారావు, ఉడుముల సుధాకర్ రెడ్డి, జగన్, నరేంద్ర రెడ్డి, విరాహత్ ఆలి, అమెర్
ఆలీ ఖాన్ ఇత్యాదయః. ముఖ్యంగా పేర్కొనాల్సిన పేరు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్
జి. ముకుందరెడ్డి.
ఇదొక సమావేశం అనాలా! నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే
ఇందులో అందరూ వక్తలే! సభికులు, శ్రోతలు లేరు. అందరికీ మాట్లాడే అవకాశం వచ్చింది అనడం
కంటే, ఇచ్చారు అనడం సముచితం.
చాలామంది పాత్రికేయ వృత్తిలో పండిపోయిన
అనుభవజ్ఞులు. ఐ. వెంకట్రావు గారి తర్వాత వయసులో నేనే పెద్దవాడిని. వీరందరితో
కాకపోయినా వీరిలో చాలామందితో ఒకానొక కాలంలో రాసుకు పూసుకు తిరిగిన అనుభవం నాకుంది. ఎనభయ్యవ
ఏట అందర్నీ ఒక్క చోట చూడగలగడం నేను చేసుకున్న అదృష్టం.
మధ్యాన్న భోజనం తర్వాత అకాడమీ చైర్మన్
శ్రీనివాసరెడ్డి శాలువాలతో సీనియర్లను సత్కరించారు. ఆయన సౌహార్దానికి ధన్యవాదాలు.
ఒక్కోరోజు అలా ఆనందంగా,
ఆహ్లాదంగా గడిచిపోతుంది.
ఈరోజు, మే పందొమ్మిది అలాంటిదే. ఇలా ప్రతిరోజూ గడవకపోవచ్చు. గడవాలని ఆశించడం
కూడా అత్యాశే.
ఇంతకీ అందరూ ఎందుకు కలిసారు? ఏం
మాట్లాడారు? చాలా
మాట్లాడారు. తమ అనుభవాలు చెప్పారు. బహుశా అక్కడికి వచ్చిన జర్నలిజం విద్యార్ధులు
వాటిని నోట్ చేసుకుంటూ కనిపించారు.
నిజంగా ఈ సీనియర్ పాత్రికేయుల అనుభవాలు పుస్తక
రూపంలోకి తేదగ్గవే! మీడియా అకాడమీ చేయదగ్గ పనే.
మరి డిజిటల్ మీడియా ప్రసక్తి ఎందుకు అంటే ,
మొదట్లో ఎప్పుడో నా మేనకోడలు కుమార్తె జర్నలిస్ట్ ప్రేమ చెప్పిన మాటలే, వీరందరిలో
వయసులో చిన్నవాడయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి శ్రీ ఉడుముల సుధాకర్ రెడ్డి నోట
విన్నాను. నమ్మినా నమ్మకపోయినా జెన్ జీ సిద్ధాంతం సరైనదే అనిపిస్తోంది. పుస్తకాల
బదులు, ఆడియో,
వీడియో రూపంలో తెస్తే కొత్త తరానికి సులభంగా అందుబాటులో వుంటాయని ఆయన అభిప్రాయ
పడ్డారు.
(ఇంకావుంది)
1 కామెంట్:
ఒక సందేహం. రాజకీయ నాయకులకు, కవులు, కళాకారులకు, విశిష్ట వ్యక్తులకు ఎన్నో శాలువాలు కప్పుతుంటారు కదా. అన్ని శాలువాలు ఏమి చేస్తారు ?
ఖరీదైన పుష్ప గుచ్చాలు కూడా ఇస్తుంటారు. కనీసం వాటి వంక చూడకుండా పక్కన ఉన్న సహాయకులకు ఇస్తుంటారు పెద్ద నాయకులు.
ఇంత ఎండల్లో కూడా కొంత మంది సూట్ వేసుకుని తిరుగుతుంటారు. అసలు భారత దేశం లో సూట్ బూట్ ధరించడం విచిత్రం.
అనేక మీడియా ఛానెల్స్ లో కూడా సూట్ వేసుకుని వార్తలు చదువుతుంటారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి