21, ఏప్రిల్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో ( 296 ) : – భండారు శ్రీనివాసరావు

 

‘ఉహు’ అనకుండా, ‘ఊ’ అంటే పోలా!
డెబ్బయ్యేళ్లు దాటాయా?
కింద ఫోటో చూసారు కదా!
‘పోట్లాడడం నాకిష్టం వుండదు. వాదులాటకు దిగను. నా జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. చిల్లరమల్లర తగాదాలతో, ఒకర్ని బాధ పెట్టి, మనం బాధ పడే అనవసరమైన వాదోపవాదాలతో, పంతాలు, పట్టింపులతో మిగిలివున్న కొద్ది విలువైన కాలాన్ని వృధా చేసుకోదలచుకోలేదు’ అనేది స్థూలంగా ఈ ఫోటో వ్యాఖ్య లోని భావం.
ఈ సూత్రం తెలియక జీవితంలో దాదాపు 78 ఏళ్ళు వృధా చేసుకున్నాను. రెండేళ్ల క్రితమే నాకీ జీవనసత్యం బోధపడింది. దాన్నే పాటిస్తూ వస్తున్నాను. గతంలో నన్ను పట్టి పీడించిన బీపీ షుగర్ ఇతర అనారోగ్య సమస్యలు చాలావరకు దూరం అయ్యాయి.
ఇందులో లేని మరొక అదనపు అలవాటు ఏమి చేసుకున్నాను అంటే, Facebook లో పొలిటికల్/ సినిమా పోస్టులు పెట్టకుండా వుండడం, ఇతరుల పొలిటికల్/ సినిమా పోస్టులకు కామెంట్ సరే, కనీసం LIKE కూడా కొట్టక పోవడం. అనేక దశాబ్దాలుగా అనుదినం రాజకీయ వార్తలు, ముప్పూటలా రాజకీయ వ్యాఖ్యలు రాస్తూ, చేస్తూ వున్న నేను, ఈ విషయంలో నిగ్రహించుకోవాల్సి రావడం ఒక విధంగా బాధాకరమే. కానీ మారిన పరిస్థితుల్లో నేను పంధా మార్చుకోక తప్పలేదు. ఇది వెనుకడుగు కాదు, మరింత ముందడుగు వేయడానికి వేస్తున్న వెనుకడుగు మాత్రమే.
నిజానికి ఇవే నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి.
‘ఉన్నరోజున వుంది’ అని కానీ, లేని రోజున ‘లేదు’ అని కానీ అనుకోకపోవడం కూడా ఈ చిట్కాల్లో వున్నాయి.
శరీరాన్ని, మనసుని కష్టపెట్టుకోనవసరం లేని, కాణీ ఖర్చు లేని ఉపాయాలు ఇవి. పాటించడం పెద్ద కష్టం కాదు. కాస్త నాలుకను అదుపులో వుంచుకోవాలి. అంతే! ప్రయత్నిస్తే పెద్ద కష్టమేమీ కాదు.
కోపం ముందు పుట్టి తరువాత నేను పుట్టాను. అవతల మనిషి ఎవరు అనేది చూడకుండా నోరు జారడం, మాట తూలడం నాకు పుటకలతో పుట్టిన బుద్దులు. వీటి వల్ల జీవితంలో చాలా నష్టపోయాను. ఇతరులని కష్టపెట్టాను. వారిలో చనిపోయిన నా భార్య కూడా వుంది. అయినా, ఇప్పుడు యేమని అనుకోని ఏమి లాభం!
అనుకోకుండా నా అంతట నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దీనివల్ల మిత్రులను, బంధువులను తరచూ కలవడం తగ్గిపోతోంది. కొంత బాధ కలిగించే విషయమే. కానీ నా అనారోగ్యంతో ఇతరులకు కలిగించిన కష్టంతో పోల్చుకుంటే ఇది తక్కువే. రెండేళ్ల క్రితం నేను తరచుగా అస్వస్థతకు గురి అవుతున్నప్పుడు, మా అన్నయ్య రామచంద్ర రావు గారు, మేనల్లుడు డాక్టర్ మనోహర్, జ్వాలా ఇలా అనేకమంది నా స్వస్టత కోసం శ్రమ పడ్డ సంగతి నాకు బాగా గుర్తుంది.
అంచేత నన్ను నేను బాగు చేసుకోవడానికి మొదలు పెట్టిన ఈ పద్దతులు, నాకయితే మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.
ఎనభయ్ అంకె చేరడానికి ఇంకా కొద్ది మాసాలే వ్యవధానం వుంది. ఈ వయసులో, ఈ ఒంటరి జీవితంలో ఇది కేవలం నా అవసరం మాత్రమే. ఇతరులు అనుసరించాలని కాదు.



ఫోటో కర్టెసి :Shri Satyam Vemuri
(20-04-2026)
ఇంకా వుంది

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

It's a very good policy