పలుకుబడి దుర్వినియోగంలో నేనే నెంబర్ వన్
రేడియో విలేకరిగా ఆ స్థానాన్ని నా అంతగా దుర్వినియోగం చేసిన వాళ్ళు మరొకరు వుండరు అనేది నా నమ్మకం. ఎవరు ఏది అడిగినా సరే, అదేదో నా చేతిలో పని అయినట్టు, ఆ పనిచేయాల్సిన వాళ్లకు చెప్పి చేయించేవాడిని. అయితే నా ఈ తత్వం నాకు రేడియోలో మంచి పేరు తీసుకురావడమే ఆశ్చర్యం.
ఆకాశవాణి, దూరదర్సన్ లకు కలిపి ఏర్పాటు చేసిన ప్రసార భారతి సీ ఈ ఓ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఓ. పీ. కేజరి వాల్ ఒకసారి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం కోసం హైదరాబాదు వచ్చారు.
ఆయన రెండు రోజులు వుండే నిమిత్తం వస్తే, జరూరుగా ఢిల్లీ రావాలని పైనుంచి కబురు వచ్చింది. ఆయన రిజర్వ్ చేసుకున్న విమానం టిక్కెట్టు మర్నాటికి. కానీ సాయంత్రమే బయలుదేరి వెళ్ళాలి.
మా స్టేషన్ డైరెక్టర్ నన్ను పిలిపించారు. ‘నో ప్రాబ్లం’ అని బేగం పేట ఎయిర్ పోర్టుకి తీసుకు వెళ్ళాను. ఆ రోజుల్లో నా గుర్తింపు కార్డు ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా పనికి వచ్చేది.
అప్పటికే బోర్డింగు పాసులు ఇచ్చేశారు. ఎయిర్ పోర్ట్ అధికారికి విషయం చెప్పి ‘ఏమైనా సాయం చేయగలరా’ అని అడిగాను. ‘మీరు వెళ్లి ఎవరిదైనా బోర్డింగు పాసు తీసుకువస్తే ప్రయత్నం చేస్తాను’ అన్నాడు. వెంటనే వెళ్లి వీ.ఐ.పీ. లాంజులో వెయిట్ చేస్తున్న వారెవ్వరని పరికించి చూసాను. బాగా పరిచయం, చనువు వున్న ఓ ఎంపీ దగ్గరికి వెళ్లి, ‘ఈ రోజే ఢిల్లీ వెళ్ళాలా, రేపు వెళ్ళినా పరవాలేదా’ అని అడిగాను. ఆయన నవ్వి ‘ఈ రాత్రి అక్కడికి పోయి చేసేదేమీ లేద’న్నాడు.
వెంటనే ఆయన బోర్డింగు పాసు తీసుకుని మా సీయీవోకు ఇచ్చాను. ‘పదండి పోదాం’ అంటూ టార్మాక్ మీద ఆగివున్న విమానం ఎక్కించాను. నేను కూడా విమానం మెట్లెక్కుతుంటే ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ‘మీరు కూడా ఢిల్లీ వస్తున్నారా!’ అని. నేను నవ్వేసి బై బై చెప్పేసి బయటకు వచ్చాను. సీఈవో విమానం ఎక్కారన్న విషయం తెలుసుకుని బయట వెయిట్ చేస్తున్న మా అధికారులు చాల సంతోష పడ్డారు.
తర్వాత నా పేర స్టేషన్ డైరెక్టర్ కు ఒక ఉత్తరం వచ్చింది.
‘హైదారాబాదు ఎయిర్ పోర్టులో మీరు చేసిన మిరకిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా కూడా జరుగుతుందా అనే ఆలోచన నుంచి ఇప్పటికీ బయటపడ లేకుండా వున్నాను’
అని రాసారు అందులో నన్ను ఉద్దేశించి.
ఆ రోజులు కాబట్టి ఇవన్నీ చెల్లాయి. ఈ కంప్యూటర్ కాలంలో ఇలా సాయాలు చేయడం అధికారులకు కూడా సాధ్యం కాని పని.
కొంత కాలం క్రితం కాబోలు, జర్నలిస్టులు ఫోను కనెక్షన్లు గురించి హిందూ సాయి శేఖర్ A. Saye Sekhar (హిందూ పేపర్ ఆయన వదిలేసినా నేను అలానే పిలుస్తాను) అద్భుతమైన, ఆసక్తికరమైన సొంత అనుభవం ఒకటి పోస్ట్ చేశారు. దుర్వినియోగం అంటారో, వినియోగం అంటారో తెలియదు కానీ ప్రతి పాత్రికేయుడూ ఎప్పుడో ఒకసారి కొన్ని పనులు ఇలాంటివి (రైలు టిక్కెట్లు, విమానం టిక్కెట్లు చివరి క్షణంలో కన్ఫర్మ్ చేయించడం వగయిరా) వృత్తిరీత్యా చేయక తప్పదు. బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.
ముందు టెలిఫోన్ సంగతి. రేడియోలో చేరినప్పుడు మా ఇంట్లో ఫోను వుండేది కాదు. వార్త ఇవ్వాలంటే మేముంటున్న చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న టెలిఫోన్ (తంతి, తపాలా కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో, లేదా అశోక్ నగర్ లో ఉన్న జ్వాలా ఇంటికో వెళ్ళాలి. (ఆయనకీ ఈ సౌకర్యం లేదు కాని వాళ్ళ బావగారి (మా మేనల్లుడు డాక్టర్ రంగారావు) ఫోను అక్కడ వుండేది.
కొన్నాళ్ళు అలా గడిచిన తరువాత ఫోను కావాలనే విషయం అప్పటి జనరల్ మేనేజర్ బాల సుబ్రహ్మణ్యం గారి (అప్పట్లో హోల్ మొత్తం ఇరవై మూడు జిల్లాలకు ఆయనే సర్వాధికారి) దృష్టికి తీసుకు వెడితే, ఆయన మారుమాట్లాడకుండా ఒకే ఒక్క రోజులో మా ఇంట్లో ఫోను పెట్టించారు. ఏరియా సబ్ డివిజినల్ మేనేజర్ స్వయంగా వచ్చి ఫస్ట్ కాల్ కనెక్ట్ చేసి మాట్లాడారు.
ముందు నేను కోరుకున్న నెంబర్ 65758 ఇచ్చారు. మొదటి బిల్లు కూడా కట్టక మునుపే ఆ నెంబరు మీద మొహం మొత్తింది. 66066 కావాలంటే మళ్ళీ దానికి మార్చారు. టెలిఫోన్ డైరెక్టరీలో బోల్డ్ అక్షరాల్లో నా పేరు వేసేవారు. బెజవాడ రేడియో స్టేషన్ కు కాల్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ మాదిరిగా వెంటనే కలిపేవారు. అప్పటికీ ఎస్. టి. డి. విధానం రాలేదు.
తర్వాత రేడియో మాస్కో ఉద్యోగం కోసం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాము.
అయిదేళ్ళ తర్వాత తిరిగొచ్చాము. పంజాగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్ లో మా అన్నయ్య ఇంట్లో ఉంటూ, అద్దె ఇంటికోసం వెతుకులాట మొదలు పెట్టాము.
ఎందుకో ఓ రోజు బేగంపేట ఎయిర్ పోర్టుకి వెడితే అక్కడ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రంగయ్య నాయుడు కలిసారు. ‘ఎన్నాళ్ళయింది మాస్కో నుంచి వచ్చి’ అని అడిగారు. ఇంటి కోసం చూస్తున్నాను అని చెప్పాను.
మర్నాడు మధ్యాన్నం రేడియోకి వెళ్ళే సరికి ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ డిపార్ట్ మెంటు వాళ్ళు కనిపించారు.
‘మీకు ఫోన్ శాంక్షన్ చేస్తూ రాత్రి ఢిల్లీ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఈ ఫారం పూర్తి చేసి, అడ్రసు వివరాలు ఇవ్వండి’ అన్నారు. ‘ఇల్లే ఇంకా దొరకలేదు ఫోను ఎక్కడ పెట్టుకోను’ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఇల్లు దొరికిన తర్వాత చెప్పండని వెళ్ళిపోయారు.
పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఇల్లు తీసుకుని పాలు పొంగించక ముందే ఫోను, లాంగ్ కార్డుతో సహా ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు మళ్ళీ నెంబరు సమస్య. నేను అడిగిన 22011 ఇచ్చారు. ఇస్తూనే చెప్పారు. ఇలా వరస నెంబర్లతో కొంత ఇబ్బంది పడతారు జాగ్రత్త అని. అయినా నేను వినలేదు.
మర్నాటి నుంచి రాంగ్ కాల్స్. పలానా వారు వున్నారా అంటే పరవాలేదు. “హిందూ స్మశానమా! రాత్రి మా బంధువు చనిపోయారు, దహనం చెయ్యాలి’ అని ఒకరు, “పోలీసు కంట్రోల్ రూమా” అని మరొకరు, “గ్యాస్ బుకింగా” అని ఇంకొకరు ... ఇలా కాల్స్ వచ్చేవి.
అయినా సాయి శేఖర్ చెప్పినట్టు, ఆ రోజుల్లో ఫోను ఒక అపురూపమైన వస్తువు. ఇంట్లో ఫోను మోగుతుంటే అదో దర్జా! అదో వైభోగం!
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి