వామ్మో! ఓస్ ఇంతేనా!
బజార్న పోతుంటే దారి పక్కన జూగుప్స కలిగించే దృశ్యం కనబడుతుంది. వెంటనే కళ్లు తిప్పుకుంటాం. సోషల్ మీడియాలో కూడా అంతే. ఇష్టం లేని వాటి వంక కన్నెత్తి చూడకూడదు. అప్పుడు మన బీపీ కంట్రోల్ లో వుంటుంది.
నిప్పుతో వంట చేసుకోవచ్చు వళ్ళు కాల్చుకోవచ్చు. ఫలితం ఏదైనా వాడుకునే తీరులో వుంటుంది.
మనలో చాలా మందిమి మనకు తెలియని సంగతులు లేవు అనుకుంటాము. నేనూ వారిలో ఒకడినే. ఇది ఒప్పుకోవడానికి ఎలాంటి భేషజం లేదు. అందరికీ అన్నీ తెలియాలని లేదు.
పద్నాలుగు పద్నాలుగులు ఎంత అంటే ఠకీమని జవాబు చెప్పడం నాకయితే కష్టం. అదే లెక్కలు బాగా తెలిసిన వాడయితే, ఓస్ ఇంతేనా! అంటాడు. క్షణంలో జవాబు చెప్పేస్తాడు. తెలియని నావంటి వాడయితే, ఇంత గొట్టు ప్రశ్నా! వామ్మో! అంటాడు.
వర్తమాన కాలంలో వయో వృద్ధులకు అన్నీ తెలిసినా కొన్ని కొన్ని తెలవ్వు. ముఖ్యంగా సాంకేతిక విషయాలు. తరానికి తరానికి నడుమ ఈ వైరుధ్యాలు తప్పవు. జెంజీల కాలం నడుస్తున్న ఈ కాలంలో అయితే, ఈ సమస్య మరీ ఎక్కువ.
నా చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు చెప్పిన నాలుగు అక్షరాలు వంటబట్టగానే, తల ఎగరేయడం మొదలయింది.
రామాయణ, భారత భాగవతాలు ఆశువుగా, ధారాళంగా చెప్పే మా బామ్మకు కానీ, మా అమ్మకు కానీ అక్షర జ్ఞానం లేదు. చదవ లేరు. వారిదంతా శృత పాండిత్యం. చెవులతో విని నేర్చుకున్నది.
ఏ అక్కయ్యో కార్డు ముక్క రాసేది. కాస్త చదివి పెట్టరా నాన్నా అని నన్ను బతిమిలాడేవాళ్ళు. ఇంత బెల్లం ముక్కో కొబ్బరి లౌజో చేతిలో పడేదాకా వాళ్ళ మాట వినకుండా చెట్టెక్కి కూర్చొనే వాడిని.
మొన్నీ మధ్య ఒక ధరకాస్తు పూరించాల్సిన పని పడింది. ఇన్నేళ్ళుగా ఫోటో అంటించడానికి అలవాటు పడ్డ ప్రాణాలకు ఫోటో అప్ లోడ్ చేయడం అనేది బొత్తిగా తెలవని విషయమే. పైగా ఫోటో ఇన్ని కేబీలు, సంతకం ఇన్ని కేబీలు వుండాలి అంటే, కేజీలు తప్ప కేబీలు తెలియని వాళ్ళు ఏమై పోవాలి. చిన్నప్పుడు మా బామ్మలు బతిమిలాడినట్టు విషయం తెలిసిన వాడిని పట్టుకుని పని చేయించుకోవాలి. తప్పదు. నాకు తెలియదు అంటే కుదరని కాలంలో జీవిస్తున్నాం.
నిన్నా మొన్నా నా మొబైల్ మొరాయింపుతో గతంలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే దేవుడు బుద్ధి చెబుతాడని తెలిసి వచ్చింది.
నాకసలు ఖాతాయే లేని HDFC బ్యాంకు నుంచి నిన్న ఏవో మెసేజ్ లు వచ్చాయి. సాంకేతిక నిరక్షరాస్యుడిని కనుక కంగారు పడిన మాట నిజం.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే అనేకమంది స్పందించారు. సలహాలు, సూచనలు చేశారు. నిజానికి ఇదెంత గొప్ప విషయం.
సమస్యతో సంబంధం లేని వాళ్లకి ఇదో సమస్యా అనిపించవచ్చు. కానీ సోషల్ మీడియా మితృలు అలా అనుకోలేదు. ఇది తమ సమస్యే అన్నట్టుగా వారు స్పందించిన తీరు నన్ను ముగ్ధుడిని చేసింది.
చంద్రశేఖర్ కోటిపల్లి Chandra Sekhar Kotipalli గారు రాసిన వివరణతో నా ఆందోళన పూర్తిగా సమసిపోయింది. ఆయన ఇలా రాసారు.
“మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకి HDFC వాళ్ళు UPI పేమెంట్స్ చేసే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు కొత్త ఫోన్ ద్వారా gpay/phone pe కి రిజిస్టర్ అయినప్పుడు ఈ మెసేజెస్ వస్తాయి, మరేం ఇబ్బందిలేదు. రేపటి నుంచి యధావిధిగా మీ gpay పని చేస్తుంది”
ఆయన అన్నట్టే జరిగింది. సమస్య పరిష్కారం అయింది.
నా ఒక్క విషయమే కాదు.
ఈ మీడియాలో ఎవరో పోస్టు పెడతారు. ‘ఈరోజు నా బిడ్డ పుట్టిన రోజు, మీ ఆశీస్సులు అందివ్వండి’ అని. వెంటనే డజన్ల కొద్దీ ఆశీర్వచనాలు ఆ బిడ్డకు అందుతాయి. మరెవరో నాకు ఒంట్లో బాగాలేదు అంటారు. త్వరగా కోలుకోవాలంటూ మెసేజులు వస్తాయి, అదీ ముక్కూ మొహం తెలియని వారి నుంచి. నిజానికి ఫేస్ బుక్ అనే పేరే కానీ దీనికే ఒక మొహమంటూ లేదు. నూటికి ఎనభయ్ మంది ఒకరికొకరు ముక్కూ మొహం తెలియని వారే. అయినా సొంత మనుషుల్లా ఆప్యాయత చూపుతారు. మంచిదే కదా!
ఇందులో మంచిని చూస్తే మంచే కనబడుతుంది. బయట ఉన్నట్టే అన్ని రంగాలకు చెందిన కుళ్ళు ఇక్కడ కూడా వరదలా పారుతుంది. మురికి కాలువ దాటేటప్పుడు ముక్కు మూసున్నట్టు కళ్ళూ ముక్కూ కాసేపు మూసుకోండి. అటు వైపు చూడకండి. అంతా మంచే కనబడుతుంది.
ముందే చెప్పినట్టు మీ బీపీ మీ కంట్రోల్ లో వుంటుంది.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి