23, ఫిబ్రవరి 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (271) : భండారు శ్రీనివాసరావు


పల్లెకు పోదాం రండి!
దేశంలో అభివృద్ధి పెరుగుతోందో, దరిద్ర నారాయణుల సంఖ్య పెరుగుతుందో లెక్కలు కట్టే విషయంలో రాజకీయ అభిప్రాయ విబేధాలు వుండవచ్చేమో కానీ, సార్వత్రిక సామాన్య జనాభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా పెరుగుతున్నది మాత్రం వయోవృద్ధుల సంఖ్య. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి పెద్దగా గణాంకాల అవసరం వుండదు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కరవు భత్యం పెంచినప్పుడల్లా కానవచ్చే సంఖ్యలు చూస్తే చాలు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య కన్నా పదవీ విరమణ చేసి పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అధికంగా వుండడమే ఇందుకు ఉదాహరణ.
నేను 2005 డిసెంబరు 31వ తేదీన హైదరాబాదు దూరదర్సన్ నుంచి అరవై ఏళ్ళు నిండగానే రిటైర్ అయ్యాను. అంటే ఇప్పటికి ఇరవై ఒక్క ఏళ్ళుగా రిటైర్ మెంట్ జీవితం గడుపుతున్నాను.
1975 లో ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చాను. దాదాపు ముప్పయ్ ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానం తర్వాత కూడా ఇంకా హైదరాబాదు లోనే వుండిపోయాను. ఏదో సొంత ఇల్లు వుంది ఇక్కడే స్థిరపడ్డాను అంటే కొంత అర్ధం వుంది.
యాభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు వచ్చినప్పుడు మాకు తెలిసిన/ బంధువుల కుటుంబాలు వేళ్ళ మీద లెక్క పెట్టేవిగా వుండేవి. ఇన్నేళ్ళలో వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. హైదరాబాదు కాకుండా ఇతర ఊళ్లలో వుంటున్న వారి సంఖ్య ఇప్పుడు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అంటే ఒక్క మా కుటుంబానికి చెందిన వారే ఇంతమంది హైదరాబాదు వాసులుగా మారిపోయారు. వారిలో చాలామంది రిటైర్ అయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు కూడా.
ఇలాగే గత అయిదు దశాబ్దాల కాలంలో ఉద్యోగాలకోసమో, ఉపాదికోసమో, వ్యాపారాల నిమిత్తమో, బతుకుతెరువు కోసమో ఈ నగరానికి వచ్చిన వారి సంఖ్య లక్షల్లో వుంటుంది. అలాగే పట్టణీకరణ ఫలితంగా ఇతర పట్టణాలు, నగరాల మీద కూడా జనాభా వత్తిడి బాగా పెరిగింది.
'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు మాత్రమే ఈ పని చేసి చూపించారు. హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి కాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ, పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.
చదువుల కోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే నగరాల మీద ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) భారం పడదని నా వాదన.
ఇంతే కాదు, చదువుకుని చిన్నా పెద్దా ఉద్యోగాలు చేసిన వాళ్ళు,రిటైర్ అయిన తర్వాత వాళ్ళ స్వగ్రామాలకు తరలి పొతే, ఆ పల్లెలకు కూడా ప్రయోజనం.
కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
కింది ఫోటో : మా స్వగ్రామంలో ఒకప్పటి మా పూర్వీకుల ఇల్లు. ఇప్పడు లేదు దాని స్థానంలో మా అన్నయ్య పిల్లలు ఒక చిన్న డాబా ఇల్లు కట్టించారు, నేటి అవసరాలకు తగ్గట్టుగా.



(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: