ఆరుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా ఒక్క ఆడపిల్ల పెళ్ళికి వుంది.
ఈ
నేపధ్యంలో నేను పుట్టాను, మా
అమ్మానాన్నల పదకొండో సంతానంగా. పిల్లలు పుట్టగానే వాళ్ళు పుట్టిన తేదీ, ఘడియ, నక్షత్రం వగైరా వివరాలు ఒక
పుస్తకంలో రాసిపెట్టేవారు. ఆ వివరాలను బట్టి నేను పుట్టింది వ్యయ నామ సంవత్సర
శ్రావణ శుద్ధ దశమి బుధవారం. స్కూల్లో వేసినప్పుడు ఉజ్జాయింపుగా పుట్టిన తేదీ వేయడం వల్ల అసలు పుట్టిన తేదీకంటే ఏడాది తక్కువగా వేశారు. ఎప్పుడో
పాతికేళ్ళ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగంలో చేరతానని వాళ్లకు మాత్రం ఏం తెలుసు. అంచేత
ఆఫీసు రికార్డుల ప్రకారం అరవై ఏళ్ళు రాగానే,
ఏడాది ముందుగానే, నువ్వు ఇంతవరకు
చేసింది చాలు,
ఇంటికి పోయి పోచికోలు కబుర్లు రాసుకుంటూ కాలక్షేపం చేయమని పంపేశారు. అంతవరకూ
ఉద్యోగంలో చేసింది అదే కనుక రిటైర్ అయిన తర్వాత కూడా నాకు పెద్ద తేడా తెలియలేదు. కాకపొతే అప్పుడు పోచికోలు
కబుర్లు,
ఇప్పుడు ఊసుపోక రాతలు. అప్పుడూ ఆడుతూ పాడుతూనే ఉద్య్దోగం చేశాను. ఇప్పుడూ అదే కదా! కాకపోతే ఆర్ధికంగా ఒక
చిన్న, చిన్న ఏమిటి
లెండి, పెద్ద
నష్టం జరిగింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం
కనీవినీ ఎరుగని విధంగా, ఉద్యోగులు కలలో కూడా ఊహించని విధంగా జీతాల స్కేళ్ళు
బాగా పెంచుతూ వేతన సవరణ చేసింది. నేను
రిటైర్ అయిన మరుసటి రోజునుంచే అంటే, 2005
డిసెంబరు ముప్పయి ఒకటి సాయంత్రం అయిదుగంటలకు రిటైర్ అయితే పన్నెండు గంటల తర్వాత
జీతాల పెంపు, 2006 జనవరి
ఒకటో తేదీనుంచి అమల్లోకి వచ్చింది. వయసు
తక్కువ వేసిన విషయంలో కోర్టుకు పొమ్మని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే కొందరు సలహా
చెప్పారు. నా అర్హతకు ఇదే చాలు అనుకుని ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా, గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా, మనం చెంబు తీసుకువెడితే చెంబెడు
నీళ్ళు, బిందె
తీసుకువెడితే బిందెడు నీళ్ళు. ఎంత ప్రాప్తం వుంటే అంత అని పెద్దపెద్ద కబుర్లు
చెప్పేవాడిని. అయాం ఎ బిగ్ జీరో అన్నది
ఇందుకే.
అంతకు
ముందు 1975 లో నేను రేడియో ఉద్యోగంలో చేరిన కొత్తల్లో కూడా
ఇలాగే జరిగింది. ఏడాది తిరగకుండానే పే కమిషన్, మూడో
కమిషన్ అనుకుంటా సిఫారసులు అమలు చేశారు.
పే కమిషన్, పే స్కేలు, గ్రేడు, డియే
అనే మాటలు వినడం మొదటిసారి. నేను అప్పటిదాకా చేసింది ప్రైవేటు కొలువు. పే కమిషన్
సిఫారసులు అమలు చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. నా
గ్రేడుకు, రావాల్సిన గ్రేడుకు అప్పట్లో తేడా పాతిక రూపాయలు మాత్రమే. దీనికోసం
ప్లీడర్ల చుట్టూ తిరిగి డబ్బులు తగలేసుకోవడం దండగ అని నా అభిప్రాయం. (ఆ పాతిక రూపాయల తేడా కాస్తా రిటైర్ అయ్యే నాటికి
వేల రూపాయలకు పెరిగింది. పెన్షన్ లో పెద్ద
ప్రభావం చూపింది)
తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి
రామకృష్ణా రావు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన
ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
లాయరు గారు నా కేసు గురించి సాకల్యంగా
తెలుసుకున్న తర్వాత ఒక మాట చెప్పారు.
“మీ కేసులో బలం వుంది, కానీ ఈ కేసును కడకంటా తీసుకువచ్చే శక్తి మీలో లేదని అనుకుంటున్నాను”
అన్నాడా లాయరు గారు.
అనుకుంటాం కానీ ప్లీడర్లలో, వైద్యుల్లో అందరూ పీడించేవాళ్లే వుండరు. ఈయన కూడా అలాంటి అరుదైన వాడే
అనిపించింది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో
గీతాబోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తే కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక
కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే
అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే, వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం
ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు.
కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల
మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది
ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్
కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు
కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు
తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను
అనుకోవడం లేదు.”
వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ
పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ
జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు.
తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీలేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.
తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా
సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు
ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం
వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు,
మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు
ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు గెలిపించి
వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే
లెక్క ఆ పైవాడిది.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం
మరోటి వుండదు” అనేవారు మా పెద్దన్నయ్య.
అదృష్టవశాత్తు ఈ రెండూ నాకు అనుభవంలోకి రాలేదు.
మా
అమ్మగారు వెంకట్రావమ్మ గారిది మొదటి నుంచి కష్ట జీవితమే. ఆమె కడుపున పుట్టిన
వారందరూ పెరిగి పెద్దయి కడుపులో చల్ల
కదలకుండా పిల్లాపాపలతో హాయిగా జీవితాలను
గడుపుతున్నారు. కొమ్మలు రెమ్మలు వేసి విస్తరించిన భండారు కుటుంబం అనే మహా
వటవృక్షానికి ఆమె తల్లి వేరు. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి
కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం.
చిన్నతనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని
చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్రరావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న
కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“మా నాన్నగారు రాఘవరావుకు వివాహం చేయడానికి మా తాతగార్లు
ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు, వెళ్లి పిల్లను చూసి సంబంధం
అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు
గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని, మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు.
మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం
చేసుకున్న మా తాతగార్లు, అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు
విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని
పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని
తీర్మానించుకున్న మా తాతగార్లు, రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం
చేసారుట. అలా అయింది మా నాన్నగారితో మా అమ్మగారి పెళ్లి. ఈనాటిలా కాసులకు కాకుండా
బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా
అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు
కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా
చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.
పొతే, నా చిన్నతనంలో మా నాన్న జబ్బుతో మంచంలో వున్నప్పుడు మా
అక్కయ్యలు, బావలు
చూడడానికి వస్తుండేవాళ్ళు. నాకప్పుడు అయిదారేళ్ళు వుంటాయేమో. లేదా ఇంకా తక్కువ
కావచ్చు. మా అమ్మకు నా గురించి భయం పట్టుకుంది. ఈ పల్లెటూళ్ళో వుంటే ఎందుకు పనికి
రాకుండా పోతానేమో అని.
మా
మూడో అక్కయ్య సరస్వతిని చేతులు పట్టుకుని అడిగిందట. వీడిని నీతో తీసుకువెళ్ళు. మీ
పిల్లలతో పాటు (అప్పటికి ఆమెకు ఒక మగపిల్లవాడు సాయిబాబు, ఒక ఆడపిల్ల సత్యవతి) పెంచి చదువు
చెప్పించు. ఇక్కడే వుంటే కొరగాకుండా పోతాడు’ అని.
మా
బావగారిని కూడా అడగకుండా మా అక్కయ్య నన్ను వెంటబెట్టుకుని బెజవాడ తీసుకు
వెళ్ళింది. అదే నేను మొదటిసారి బస్సు చూడడం. ఎక్కడం.
ఆ
ప్రయాణమే నా భావి జీవితాన్ని నిర్ధారించింది.
కింది
ఫోటో:
మా అమ్మగారు భండారు వెంకట్రావమ్మ గారు
(ఇంకా వుంది)
8 కామెంట్‌లు:
అద్భుతః
🙏 పూర్ణ జీవితం.
// “ ఒక ఏడాది తక్కువగా వేశారు.” //
తక్కువ వేస్తే త్వరగా ఎలా రిటైర్ అవుతారు? ఒక ఏడాది ఎక్కువ వేశారని చెప్పడం మీ ఉద్దేశమేమో?
// “ ఇక్కడే వుంటే కొరగాకుండా పోతాడు’ “ //
మీకు నాలుగైదేళ్ళ వయసుకే మీ గురించి మీ అమ్మగారు ఎలా గ్రహించేశారు 🙂 ?
ఇగ్గో ఇగ్గో ఇందుకే .... :)
వయసు తక్కువ వేయడం విషయంలో కొంత కవి హృదయం అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకు నేను 1950 లో పుట్టాను అనుకుందాం. కానీ ఒక ఏడాది తక్కువగా 1949 అని రిజిస్టర్ లో రాసారు అనుకుంటే దానికి అరవై ఏళ్ళు కలిపితే ఒక ఏడాది ముందే రిటైర్ అయ్యే వయసు వస్తుంది. అదే ఏడాది ఎక్కువ వేస్తె మరో ఏడాది అదనంగా సర్వీసు కాలం కలిసి వస్తుంది. ఒక రకంగా మీరు కరెక్టు. మరో రాజంగా నేను కూడా. ఎందుకు లెండి. అసలే నేను లెక్కల్లో పూరు. అందుకేగా దీనికి జీరో అనే శీర్షిక పెట్టింది.
భండారు శ్రీనివాసరావు
ChatGPT said:
ChatGPT
భండారు శ్రీనివాసరావు (Bandaru Srinivasa Rao) తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, రచయిత మరియు వక్త. ఆయన 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందారు.
భండారు శ్రీనివాసరావు తన కవిత్వంలో సామాజిక బాధ్యతలను, దేశభక్తిని, నైతిక విలువలను ప్రతిబింబించారు. ఆయన రచనలు పాఠకులకు కొత్త దృష్టిని, భావోద్వేగాన్ని ఇచ్చాయి. ఆయన రచనలు అనేక భాషల్లో అనువాదం అయి, తెలుగు సాహిత్యానికి మరింత విస్తరణ కలిగించాయి.
తెలుగు సాహిత్యంలోని వివిధ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయన రచనలు రూపాంతరం చెందాయి, మరియు ఆయన పాతకాలపు భావాలను నూతనమైన దృక్పథంతో అన్వయించారు
ChatGpt ఇంత గొప్పగా తిట్టగలదు అని నేను అనుకోలేదు. నేను కవిని అన్నవాడిని....వద్దులెండి.
ChatGPT నన్ను కూడా “కవి” అని తిట్టిందండి, భండారు వారూ 😟.
కామెంట్‌ను పోస్ట్ చేయండి