29, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (21) - భండారు శ్రీనివాసరావు

 


ఆడవాళ్ళ ప్రయాణాలకి మా ఇంట్లో ఒక మేనా వుండేది.  నేను హైస్కూలు చదువు చదివే రోజుల్లో కూడా ఇంటి మధ్య హాల్లో ఆ మేనాను మోకులు కట్టి పైన రెండు దూలాల మధ్య వేలాడదీసి ఉంచేవాళ్ళు. దాన్ని మోయడానికి ఆరుగురు బోయీలు. పరిస్తితుల ప్రాబల్యం వల్ల మేనా వైభోగం అటక ఎక్కింది. ఆ  తరువాత చాలా కాలం వరకూ  పంటలు రాగానే వాళ్లకు ‘మేర’ (ధాన్యం వాటా) ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. మేనా రోజులు అయిపోయిన తరువాత ఇంట్లో ఆడవాళ్ళు ఊళ్లకు పోవడానికి గుడిసె బండ్లు కట్టేవాళ్ళు. ఒక్క మగవాళ్ళ ప్రయాణాలకే అయితే గుడిసె కట్టకుండా కేవలం జల్ల బండ్లు మాత్రమే కట్టేవాళ్ళు. మా ఇంట్లో రాముడు భీముడు అని ఒక ఎడ్ల జత వుండేది. కాడి మెడ మీద పడగానే వాటికి ఎక్కడ లేని హుషారు. అవి లాగే బండి ఎక్కడానికి మేము పోటీలు పడేవాళ్ళం. బండి తొట్లో కూర్చుని, తోకలు మెలిపెడుతూ, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తుంటే అవి పరుగు మొదలు పెట్టేవి. వాటి మెడ పట్టెలలో గంటలు మోగుతుంటే అదో తమాషాగా అనిపించేది. బండి నడిపే మనిషి వాటితో ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ భాష వాటికి అర్ధం అవుతున్నట్టే అనిపించేది. ఒక ఈడు వచ్చిన తరువాత మేము రైలుకు పోవాలంటే మోటమర్రికి, బస్సు ఎక్కాలంటే పెనుగంచిప్రోలుకు మూడు, నాలుగు మైళ్ళు నడిచే వెళ్ళే వాళ్ళం. అలాగే పొరుగూరు వత్సవాయి టూరింగు టాకీసులో సినిమా చూడడానికి కూడా చాలామందిమి కలిసి కాళ్ళకు పనిచేప్పేవాళ్ళం. ఆ సినిమాల్లో రెండు మూడు ఇంటర్వెల్స్ ఉండేవి. పైన డేరా చిరుగులు పడి ఆకాశం కనిపిస్తూ వుండేది. హాలు బైట పెట్టిన మైకు మాత్రం గట్టిగా పనిచేసేది. సినిమాకు ముందు వేసే ‘నమో వెంకటేశా పాటలు చాలా దూరం వినిపించేవి. అవి వినపడడం లేదు అంటే సినిమా మొదలు పెట్టారని అర్ధం.

ఇంటి వెనుకనే శివాలయం.

కార్తీక మాసం నెల రోజులూ  చీకటి పడుతుండగానే గుడి ఆవరణలోవున్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీసేవాళ్ళు.  ఆకాశదీపం అంటే  – చిన్న చిన్న కంతలు కలిగిన మూత వుండే ఒక రకం దీపం. లోపల ప్రమిదెలోనూనె పోసి  వొత్తి  వెలిగించి దానిని ఈ ఆకాశదీపంలో వుంచేవారు. చీకట్లో అంత ఎత్తున  ధ్వజస్తంభం నుంచి వేలాడుతూ - చిరు కాంతులు వెదజల్లుతూ మా పిల్లలందరికీ అది నిజంగా  ఆకాశంలో వెలిగే దీపంలాగానే అనిపించేది.

పొరుగున పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరుణాల జరుగుతుంటే ఆ సంబరం ఛాయలు మా వూళ్ళో కనిపించేవి. రంగు కాగితాలతో రకరకాల ప్రభలు తయారు చేసి వాటిని బండ్లపై అమర్చేవారు. వాటికి కట్టే ఎడ్లను కూడా అందంగా అలంకరించేవారు. వాటిపై బుక్కా గులాములు చల్లేవాళ్ళు. మేళ తాళాలతో ఊరేగిస్తూ ప్రభలను పెనుగంచి ప్రోలు తీసుకువెళ్ళి ఏటి ఒడ్డున వున్న తిరుపతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించేవాళ్ళు. ఏటి ఒడ్డున మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు. గుడి పక్కన ఎత్తైన  పెద్ద ఇనుప ప్రభ వుంది. మా చిన్నతనంలో అదొక పెద్ద ఆకర్షణ. మామూలుగా వెదురు గడలతో ప్రభలు కడతారు. అలాంటిది తిరుపతమ్మ ప్రభను పూర్తిగా ఇనుముతో తయారు చేశారు. దాని చక్రాలు కూడా ఇనుమే. పైగా చాలా ఎత్తు. అంత ఎత్తైన  ప్రభ  ఊరేగింపుగా  ఊళ్ళో తిరుగుతుంటే  జనం ఎగబడి చూసేవాళ్ళు. ఇలాంటి ఇనుప ప్రభ వున్న గుడి మరోటి లేదని చెబుతారు. వూరికి కరెంటు వచ్చిన తరువాత  తీగెలు అడ్డం వస్తాయని ఆ ప్రభను కదలకుండా గుడి పక్కనే వుంచేసారు. తిరుపతమ్మ వారి ప్రభలు దశదిశలా వ్యాపించడంతో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద స్థలంలో చిన్నగా వున్న గుడి ఇప్పుడు చిన్న స్థలంలో పెద్ద దేవాలయంగా కనబడుతోంది. ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. గుడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గుడి పుణ్యమా అని పెనుగంచిప్రోలు స్థితిగతులు కూడా బాగా మెరుగుపడ్డాయి.  

పెనుగంచిప్రోలు దేవాలయాలకు ప్రసిద్ధి.  101 ప్రాచీన దేవాలయాలు వున్నాయని స్థల పురాణం. అందుచేత  పెద కంచీపురం అనేవారుట. శ్రీ  తిరుపతమ్మ కధ అనే పేరుతొ గతంలో ఒక సినిమా కూడా వచ్చింది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు, కృష్ణకుమారి 1963 లో విడుదల అయిన ఈ చిత్రంలో నటించారు. మా ఐదో అక్కయ్యగారు కొమరగిరి  అన్నపూర్ణ  తిరుపతమ్మ మీద ఒక పుస్తకం రాసింది. ప్రతి ఏటా గుడిలోని తిరుపతమ్మ, గోపయ్యల విగ్రహాలను పదకొండు జతల ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా జగ్గయ్యపేట తీసుకు వెళ్లి, అక్కడి రంగుల మడపంలో కొత్త రంగులు వేయించి తిరిగి పెనుగంచి ప్రోలు తీసుకువచ్చి మళ్ళీ గర్భ గుడిలో పునః ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది.       

తిరుపతమ్మకు ఏటా రెండు తిరుణాళ్ళు జరిగేవి. ఒకటి పెద్ద తిరుణాల. రెండోది చిన్న తిరుణాల. అదేమి చిత్రమో పెద్ద తిరుణాల జరిగిన సంగతే ఎవరికీ తెలిసేది కాదు. అదే చిన్న తిరుణాల చాలా అట్టహాసంగా జరిగేది. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. చిన్న తిరుణాల జరిగినన్నాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణమే. పెనుగంచిప్రోలు మీద జనం ఎగబడేవారు. ఊరుమీద ఊరు పడ్డట్టు వుండేది. ఆ వూళ్ళో మా బావగారి ఇల్లు తిరుణాలకు వచ్చిన చుట్టపక్కాలతో నిండిపోయేది.

తిరుణాల జరిగినన్నాళ్ళు ఏటి వడ్డున గుడి ప్రాంతం యావత్తూ సంబరాలతో మారుమ్రోగేది. బొమ్మల దుకాణాలు, మిఠాయి అంగళ్లు, కోలాటాలు, భజనలతో అంతవరకూ నిద్రాణంగా ఉన్న ప్రాంతం సందడి సందడిగా మారిపోయేది.     

తిరుణాల లేని రోజుల్లో ఏడాది పొడుగునా ఆ దేవాలయ ప్రదేశం నిర్మానుష్యంగా వుండేది.  రోజూ వచ్చే భక్తులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  అలాటిది గత కొన్నేళ్లుగా ఆ గుడి ప్రభలు జగజ్జేయమానంగా వెలిగిపోతున్నాయి. అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మొన్నీ మధ్య మా మేనల్లుడు రామచంద్రం ఆ వూరు వెళ్లి వచ్చి చెప్పాడు, ‘వెనక ఏడాదికి రెండు తిరుణాళ్ళే. ఇప్పుడు ఏడాది పొడుగునా రోజూ తిరుణాళ్ళే’ అని.

జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ఊరికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.  ప్రతి రోజూ అనేక ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయి. ఖరీదైన మోటారు వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వారికి తగిన వసతి సదుపాయాలు కూడా ఏర్పడ్డాయి.

మేము చదువు కునే రోజుల్లో బెజవాడ నుంచి పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్  లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్  మోగించేవాళ్ళు. అది వింటూనే  ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి  సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు. డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు. బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర  టిక్కెట్టు కొట్టించకుండా పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు.

 

కింది ఫోటోలు:


పెనుగంచిప్రోలులో ఒకప్పుడు ఇనుప ప్రభతో తిరుపతమ్మ గుడి


ఇప్పుడు అభివృద్ధి చేసిన తిరుపతమ్మ దేవాలయం







(ఇంకా వుంది)   

కామెంట్‌లు లేవు: