నేను అంతవరకూ మా ఊళ్ళో గడిపిన జీవితం వేరేగా వుండేది.
జారిపోతున్న నిక్కరును పైకి లాక్కుంటూ, కారుతున్న ముక్కును
చొక్కాతోటే తుడుచుకుంటూ బొందు (చెక్క ఫ్రేం ఉన్న) పలక బలపం పెట్టుకున్న గుడ్డ సంచీ ఊపుకుంటూ మిగిలిన
పిల్లలతో కలిసి మా ఇంటికి కొంచెం దూరంలో వున్న మా బడికి వెళ్ళేవాడిని. దారిలో ముత్యాలమ్మ గుడి దగ్గర ఆగి
అక్కడ చెట్టు నీడలో కాసేపు ఏవో ఆటలు ఆడి తీరికగా బడికి చేరే వాడిని. ఆలస్యంగా
వచ్చిన నన్ను చూసి అప్పయ్య మాస్టరు గుడ్లు ఉరిమి చూసేవాడు. చచ్చే భయం వేసేది.
ఇంటికి వచ్చి మా బామ్మతో చెబుతాడేమో అని. కానీ అది కాసేపే. పలక మీద అ ఆలు
దిద్దించే వారు. రాసిందే రాయడం అంటే చీకాకు వేసేది. దిద్ది దిద్ది అ అనే అక్షరం ఒక
పెద్ద సున్నా మాదిరిగా తయారయ్యేది. పైగా దిద్దేటప్పుడు అ అంటూ నోటితో పెద్దగా అంటూ
దిద్దాలి. క్లాసు క్లాసంతా అ ఆ అంటూ వుంటే ఏదో గుళ్ళో ఓంకార నాదంలా మారు మోగేది. మా చేత
ఇలా దిద్దించడం మొదలు పెట్టి అప్పయ్య మాస్టారు పై క్లాసు పిల్లల దగ్గరికి వెళ్ళే
వాడు. అదెక్కడో కాదు, మాకు అడుగు దూరంలో, మా పక్కనే. అలా అన్ని క్లాసులకు ఆయనే మాస్టారు. మాకు అ ఆ లు, మరో క్లాసు
వారికి ఎక్కాలు, ఇంకో క్లాసు వారికి గుణింతాలు. ఇలా మధ్యాన్నం దాకా సాగేది. అంతసేపు కుదురుగా
కూర్చోవడం చేతకాని, అలవాటులేని నేను మరికొందరం వెళ్లి చిటికిన వేలు చూపి, బయటకు
వెళ్ళాలి అని అడిగే వాళ్ళం. ఆయనకు ఇష్టం లేకపోయినా సరే పొమ్మని చేత్తో కసిరేవారు.
మేము బయట పడి దగ్గరలో వున్న చింతతోపులో దూరి మళ్ళీ ఆటలు. అక్కడికి దగ్గరలోనే ఉన్న నీలిబావి
వద్దకు వెళ్ళే వాళ్ళం. నిజానికి అది బావి కాదు. నీలి మందు తయారు చేయడం కోసం కోసం
గచ్చుతో దాన్ని నిర్మించారు. అసలు నీలి మందు అంటే ఏమిటో, ఎలా తయారు
చేస్తారో, ఎందుకు వాడతారో నాకు ఇప్పటికీ తెలియదు. మా ధ్యాసల్లా ఎక్కడో ఒకచోట
చేరి ఆడుకోవడం. మా ఈ పిల్ల చేష్టలు అన్నీ అప్పయ్య మాస్టారు నోటంట వినీ వినీ మా
అమ్మ నిర్ధారణకు వచ్చేసింది వీడు ఈ ఊళ్ళో ఇలా వుంటే చెడిపోవడం ఖాయం అని. ఇలా వుండగా, ఆ ఏకోపాధ్యాయ పాఠశాలకు భద్రయ్య గారని
మరో మాస్టారిని వేశారు. ఆయన రాకతో అప్పయ్య గారికి కొంత పని భారం తగ్గింది కానీ, మాకు కష్టాలు
పెరిగాయి. ఆయన బయట నుంచి వచ్చిన వాడు, కనుక ఊరివాళ్ళతో మొహమాటాలు లేవు.
కాబట్టి మా చిటికినవేలు ట్రిక్కులు పట్టించుకునేవాడు కాదు. దాంతో ఆయన్ని మంచి
చేసుకోవడానికి ఇంటి నుంచి కూరగాయలు, వేరు శనగ కాయలు పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. వద్దు అనకుండా
తీసుకునేవాడు. తర్వాత మామూలే. వంగతోట దగ్గర సామెత.
అసలు ఈ బడిని అప్పయ్య గారి తండ్రి శివరాజు నాగభూషణం గారు ఒక వీధి
బడి మాదిరిగా ఇంటి అరుగు మీద మొదలు పెట్టి, ఊరివారి సహకారంతో సంపాదించిన స్థలంలో
నాలుగు మట్టి గోడలు లేపి మధ్యలో ఒకే ఒక దూలంతో వేసిన పాకబడిగా మార్చారు. తరువాత
ప్రభుత్వం తీసుకున్నట్టుంది. మా అన్నయ్యల చదువులు అన్నీ ఈ బడిలోనే మొదలయ్యాయి. ఈ
బడి అరుగు బడిగానే వున్నప్పుడు రెబ్బారం నుంచో మరెక్కడి నుంచో గుర్తు లేదుకానీ ఒక
పంతులు గారు ఉపాధి నిమిత్తం మా ఊరు వచ్చి మా అన్నయ్యలకు ఇంట్లోనే చదువు నేర్పే వాడని
విన్నాను. ఆయన మహా కోపిష్టి. మాట వినకపోతే గోడకుర్చీ వేయించేవాడట. కోదండం వేయించడం
(దూలానికి తలకిందులుగా వేలాడ తీయడం) వంటి శిక్షలు కూడా వుండేవి. మా పెద్దన్నయ్య కాలంలో పలకలు, బలపాలు లేవని, ఇసుకలో వేలితో అక్షరాలు దిద్దించే వారని కూడా విన్నాను.
మొత్తానికి నా చదువు మొదటి తరగతి కూడా
పూర్తి కాకుండానే ముగిసింది. కంచికి చేరుతుంది అనుకున్న కధ కాస్తా మలుపు తిరిగి
బెజవాడ చేరింది.
బెజవాడ అనగానే చాలామందికి చాలా
గుర్తుకు వస్తాయి కానీ నాకు వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎల్వీ రమణ అనే లంక వెంకట
రమణ. ఈయన ఎవరంటారా? తెలుసుకోవాలంటే ఈ కధను
రెండు దశాబ్దాలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేయాలి. బెజవాడనుంచి విజయవాడకు మారాలి.
అవి నేను విజయవాడ లబ్బీపేట ఆంధ్రజ్యోతిలో
పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంధ్ర
ఆంగ్లభాషల్లో దిట్ట. మధ్యాన్న భోజనసమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయేవాళ్ళం.
ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే
నా భోజనం. ఆయన అక్కడే చాప మీద వరదరాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని, మధ్య మధ్య మా ఆవిడ చేసిపెట్టిన పకోడీలు
నోట్లో వేసుకుని నములుతూ అనేక కబుర్లు
చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి. అలా చెప్పిన
కబుర్లలో బెజవాడ గురించి తాను చేసిన పరిశోధన గురించి అనేక విషయాలు చెబుతూ
వుండేవారు.
“చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ చూసిన
బెజవాడ ఎలా ఉండేదో రమణ చెప్పాడు. క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో
పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు.
అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్యరాజ్యంలో
వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి
అమరావతి పుణ్యక్షేత్రం. (ప్రస్తుతం
రాజధాని అమరావతి కాదు). అప్పటి తెనకచక
దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా
వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు. బెజవాడ, సీతానగరం, ఉండవల్లి
గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల
పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక
స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లావాడు. ఆయన
ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.
ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే, నూట
యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు
పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం.
కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు
దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు
ఎగుమతి అయ్యేవి.
ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి.
బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో
చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ
శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు
కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక
రాజవంశాల ఏలుబడిలో ఉండేది.
హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి
వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు.
ఈ విషయాలు రమణ నోటంట విన్న తరువాత ఆయన మీద
నాకున్న గౌరవం వేయి రెట్లు పెరిగింది. కృష్ణానది మీద ప్రకాశం బరాజ్ కట్టక ముందు ఒక
ఆనకట్ట వుండేది. దాని పూర్వాపరాలు కూడా రమణ గ్రంధస్థం చేశాడు.
కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన
నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు
నిర్మించాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాలనుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల
తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన
చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం
ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి 134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు
గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణమూర్తి గారు ఉన్నతాధికారులతో
చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని
నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు
చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా
ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద
పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు
వేసిన స్టీమరుకు పంటును కట్టాలని,
సమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది
మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ, అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు
వచ్చి మునిగిపోతుందనీ, ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి
వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది. ప్రధానమైన నిర్మాణాలన్నీ
మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. కష్టం వుంది. చిందించిన
స్వేదం వుంది.
డెబ్బయ్ ఏళ్ళకు పూర్వమే తెలుగు
ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం. ఆ తర్వాత ప్రకాశం పంతులు
గారి పూనికతో ప్రస్తుతం ఉన్న కృష్ణా బ్యారేజి నిర్మాణం జరిగింది. ఆయన స్మృత్యర్థం
దానికి ప్రకాశం గారి పేరు పెట్టారు.
ఇక బెజవాడ అంటే చటుక్కున గుర్తుకు
వచ్చే మరో పేరు దాసు కృష్ణ మూర్తి. ఆయన తనను తను వలస పక్షిని
అని చెప్పుకుంటారు. అమెరికాలో స్థిర పడడానికి పూర్వం బెజవాడలో 27 ఏళ్ళు, హైదరాబాదులో 29 ఏళ్ళు, ఢిల్లీ లో 20 ఏళ్ళు నివసించారు.
ఇప్పుడు ఆయన వయసు 98. 2004 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. అద్భుతమైన జ్ఞాపక
శక్తి. హిందూ పత్రిక హైదరాబాదు రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన దాసు కేశవరావు గారికి
స్వయానా అన్నగారు. బ్లాగులో నేను రాసిన
బెజవాడ కబుర్లు చదివి తన బెజవాడ జ్ఞాపకాలు గురించి ఇంగ్లీష్ లో ఈ మెయిల్ చేశారు. దాన్ని తెలుగు చేశాను.
‘బెజవాడ గురించి చెప్పుకునే ముందు,
ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోవాలి
అనేది వారి ఉవాచ. ఎందుకంటె అనేక విషయాల్లో
దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి
వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషనులోకి ప్రవేశించే గ్రాండ్ ట్రంక్ ఎక్స్
ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.
‘జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు
చిమ్ముతూ, బిగ్గరగా కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ
దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది స్టేషను ఫుట్ బ్రిడ్జ్ మీద
గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్
పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ
రైలును గుర్తుపట్టేవారు.
‘ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత
పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పు, పడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న
సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్ డంకర్లీ అండ్ కంపెనీ,
రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన
నిర్మించేంతవరకు బెజవాడ రెండు భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని
లేదు. ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమో, పోవడమో జరిగేది. రైలు గేటు వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు
సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ
చిక్కులు తొలగిపోయాయి.
‘ఆ రోజుల్లో నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి.
నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది
పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలు, స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
‘బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే
ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు చెందిన విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు.
కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం
కనబడేది.
‘అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే
సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా
నాగేశ్వరరావు హాలంటే కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం
కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత
జెనరేటర్లు వుండేవి.
‘సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి
ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని
వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు
పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని
పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.
‘1937 లో పరిస్తితి కొంత మారింది.
నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని
రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల
ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా
వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది.
సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత - కరపత్రాలను
విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.
‘సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం
నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ
మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే
ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు
ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.
‘అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా.
రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ
చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లితో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్రనిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను
పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం బెజవాడలోనే’ అని దాసు కృష్ణమూర్తిగారు
రాసారు.
ఇలాంటి చరిత్ర కలిగిన బెజవాడలోకి నేను
అడుగుపెట్టాను, మా అక్కయ్య పుణ్యమా అని. లేకపోతే, ఆ మారు మూల పల్లెటూరిలో అడిగేవాడు, చెప్పేవాడు లేక
అల్లరిచిల్లరగా తిరిగి ఏమై పోయేవాడినో!
కంభంపాడులో మాదిరిగా కాకుండా, మా అక్కయ్య వాళ్లింట్లో
దినచర్య వేరు. అప్పటికే వాళ్లకు ఇద్దరు పిల్లలు. మా బావగారి అన్నగారు సత్యనారాయణ
గారు తుర్లపాడు కరణం. ఒక రోజు పొలంలో పాము కరిచి చనిపోయాడు. ఆయనకు ఇద్దరు
మొగపిల్లలు. రమణరావు (రమణప్ప), వెంకటేశ్వరరావు (వెంకటి), ఒక ఆడపిల్ల సీత. తండ్రిలేని ఆ పిల్లల్ని బెజవాడ తీసుకువచ్చి
పెంచుతున్నారు. అలాగే నరసింహమూర్తి అని దూరపు చుట్టం తాలూకు అబ్బాయి. మా బావగారి పిల్లలు, శాయిబాబు, సత్యవతి. మా
పెద్దన్నయ్య పర్వతాలరావు గారు కూడా అక్కడే వుండి చదువుకుని, తర్వాత
అన్నపూర్ణమ్మ హాస్టల్ లో చేరి ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుని ఎల్ ఎల్
బి కోర్స్ చేయడానికి హైదరాబాదు వెళ్ళాడు.
ఆరుగురు పిల్లలు ఉన్న ఇల్లు
రణగొణధ్వనులతో వుండాలి. కానీ నిశ్శబ్దంగా వుండేది. కారణం మా బావగారు. ఆయన చేతిలోని
పేనుబెత్తం.
కింది ఫోటోలు : (Courtesy image owner)
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి