30, జనవరి 2024, మంగళవారం

మూడు దారుల్లో దేవులపల్లి అమర్

 నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి  ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్  జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్,  తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు.

చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో   కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్  ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు.

‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు.  పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని,  చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు.

‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను   ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం,  ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.  జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు  చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ  రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో  నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ.

మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని,   చంద్రబాబు అనుకూల, ప్రతికూల  జర్నలిస్టులు, రచయితలు  రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు.

తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన  మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది.

కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి.

నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది.

ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది.  ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మరోమారు జరగనుంది.

తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ:

‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’

(మూడు దారులు – రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు రచన: దేవులపల్లి అమర్, రూపా పబ్లికేషన్స్ ఢిల్లీ. రెండువందల పేజీలు , 395 రూపాయలు)



(30-01-2024)            

 

29, జనవరి 2024, సోమవారం

ఒక తరం నిష్క్రమిస్తోంది – భండారు శ్రీనివాస రావు

 ఈ ఉదయం తెలంగాణా  రాష్ట్ర కాంగ్రెస్ కురువృద్ధుడు ఒకరు నిశ్శబ్దంగా తన జీవితాన్ని చాలించారు. వారి పేరు పి. నరసారెడ్డి. యాభయ్ ఏళ్ళ క్రితమే ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా,  ఎంపీగా , ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.  

చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా, మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కు  వెడతాను. నేను ఎవరన్నది మా పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుందని అన్నారు.  అయితే,  గొప్ప గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని కూడా చెప్పారు.

కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తే, కొంతకాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.

నర్సారెడ్డి గారితో నాకు ఓ పర్సనల్ టచ్ వుంది.

నేను రేడియో విలేకరిగా హైదరాబాదు వచ్చిన కాలంలో ఆయన రెవెన్యూ మంత్రి. నగరానికి కొత్తగా వచ్చాను కనుక రేషన్ కార్డు అవసరం పడింది. ఆ రోజుల్లో ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా రేషన్ కార్డు అవసరం అనేది అన్ని వర్గాలకు వుండేది. పాస్ పోర్టు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అంచేత ఆ కార్డు కోసం నా స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాను. తహసీల్ దారు (ఆ రోజుల్లో ఇదే పేరు) ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరిగి వేసారి, చివరకు రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గార్కి విషయం చెప్పాను. ఆయన నన్ను కూర్చోమని చెప్పి, పియ్యేకు ఏం చేయాలో చెప్పారు. కాసేపట్లో ఆ అధికారి ఉరుకులు పరుగుల మీద మంత్రి పేషీకి వచ్చారు. ముందే చెప్పడం వల్ల ఆయన తన ఆఫీసు స్టాంపు, స్టాంపు ప్యాడ్ తో సహా వచ్చారు. అక్కడికక్కడే నా వివరాలు తీసుకుని రేషన్ కార్డు మంజూరు చేస్తూ  సంతకం చేశారు. మర్నాడు ఆఫీసుకు వెళ్ళే సరికి రేషన్ కార్డు పుస్తకం టేబుల్ మీద వుంది.

29-01-2024   

 

23, జనవరి 2024, మంగళవారం

జన నాయకుడికి భారత రత్న – భండారు శ్రీనివాసరావు

 వెనుకబడిన బీహారు రాష్ట్రానికి ఎప్పుడో అయిదు దశాబ్దాలకు పూర్వమే వెనుకబడిన తరగతులకు చెందిన ఒక నాయకుడు ఏకంగా ఆ రాష్ట్రానికి రెండు పర్యాయాలు  ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ రాష్ట్రంలో ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అన్నది అదే మొదటిసారి. అది కూడా నామినేటెడ్ వ్యవహారం కాదు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా పోటీ చేసి, తన పార్టీకి చెందిన బలమైన  ప్రత్యర్థిపై పెద్ద మెజారిటీతో గెలిచి సాధించుకున్న పదవి అది.  ఈ కీర్తి దక్కిన ఆ రాజకీయ నాయకుడి పేరు కర్పూరీ ఠాకూర్. ఆయనకు జనం మెచ్చి ఇచ్చిన గౌరవ పురస్కారం జన నాయక్. లోక్ నాయక్ జయప్రకాష్  నారాయణ్ గారికి ఈ జన నాయక్ కర్పూరీ ఠాకూర్ ప్రధమ శిష్యుడు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్స్ కు శ్రీకారం చుట్టిన ధీశాలి. రేపు అంటే జనవరి 24 ఆయన శత జయంతి.

కర్పూరీ ఠాకూర్ గురించి ఇంత వివరమైన ప్రస్తావన తీసుకురావడానికి మరో బలమైన కారణం వుంది. శతజయంతిని పురస్కరించుకుని, ఆయన చనిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత, బడుగు బలహీన వర్గాల వారికి కర్పూరీ ఠాకూర్ చేసిన సేవలకు  గుర్తింపుగా, కేంద్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగా అంటే ఈరోజున అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఈ పురస్కారానికి ఆయన పూర్తిగా అర్హులు అనడానికి సందేహం లేదు. ఆయన శిష్యులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్  పాశ్వాన్, నితీష్ కుమార్ లు తదనంతర కాలంలో ముఖ్యమంత్రులు అయ్యారు.

కర్పూరీ ఠాకూర్ 1988 లో పట్నాలో మరణించారు. వారి తండ్రి గోకుల్ ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు. కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆయన తన కుల వృత్తిని వదులుకోవడానికి ఇష్ట పడలేదు. ఈ విషయం తెలిసిన ఒక తెలుగుపత్రిక, ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా!’ అనే శీర్షికతో ఈ వార్తను బాక్స్ ఐటంగా  ఆ రోజుల్లో  ప్రచురించింది.

కేంద్రంలో మోడీ ప్రభుత్వ పనితీరుపై, భిన్నాభిప్రాయాలు కలిగిన వారు కూడా పద్మ అవార్డుల ఎంపిక జరుగుతున్న  జరిగే తీరును మాత్రం  ప్రశంసించక తప్పదు.



23-01-2024        

2, జనవరి 2024, మంగళవారం

కౌటూరి దుర్గాప్రసాద్

 అతడు కంప్యూటర్ రంగానికి చెందినవాడు కాదు, కనీసం కంప్యూటర్ రోజువారీగా ఉపయోగించేవాడు కూడా కాదు. అయినా ఒక కంప్యూటర్ సంస్థ ఒకటి అతడి పేరిట ఒక అవార్డ్ నెలకొల్పి తన సిబ్బందిలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారికి ఈ అవార్డ్ అందచేస్తోంది. అతడి పేరు కౌటూరి దుర్గాప్రసాద్. నిరుడు ఇదే రోజుల్లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. ‘దుర్గాప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం. మా సిబ్బందిలో ఆయన స్పూర్తిని నింపాలి అనే ఉద్దేశ్యంతో ఈ అవార్డ్లులు ఇస్తున్నాం’ అని చెప్పారు EDVENSWA అనే ఆ టెక్నాలజీ కంపెనీ   CEO శ్రీకాంత్ ఉప్పులూరి.

‘ దుర్గాప్రసాద్ గారు మా నాన్నగారు శ్రీ ఉప్పులూరి కృష్ణ మూర్తి  స్నేహితులు. ఆ విధంగా నేను చిన్నతనం నుంచి ఆయన్ని ఒక మార్గదర్శిగా భావించి పెరిగాను. ఒక పనిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఫలితాల సాధనలో ఒక్కో దారి. ఆ రకంగా చూస్తే దుర్గాప్రసాద్ గారి మార్గం నాకు బాగా నచ్చింది. ఆయన నిబద్ధత, నిజాయితీ లక్ష్య సాధనలో ఆయన అనుసరించే విధానాలు ప్రతి ఉద్యోగికి స్పూర్తిదాయకం అనే నమ్మకం, విశ్వాసంతోనే మా కంపెనీలో ఈ అవార్డులు ఇస్తున్నాం అన్నారాయన.

రిటైర్డ్ ఐ.పీ.ఎస్. అధికారి, రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు  సైబర్ టవర్స్ లోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అవార్డులు అందచేయడమే కాకుండా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.   

నిరుడు మరణించి నేటికీ జీవిస్తున్న దుర్గాప్రసాద్ నా మేనల్లుడు కావడమే ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడానికి ప్రధాన కారణం.

పాతిక ముప్పయ్యేళ్ల వయసులో తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్న వందమంది  యువతీయువకుల నడుమ ఓ కొంతసేపు గడపడం వల్ల  నా వయసుకూడా ఓ అయిదేళ్లు తగ్గిన భావనతో ఈరోజు గడుస్తోంది.







(02-01-2024)

1, జనవరి 2024, సోమవారం

అనుభవానికి వస్తే కానీ - భండారు శ్రీనివాసరావు

 

నో తాతయ్యా!

అంది కళ్ళతో,

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున.

 విన్నాను, పిల్లలు, దేవుడు చెప్పింది వినాలని అనిపించి.

సాలు తిరిగింది.

మళ్లీ అదే మాట.

‘నో తాతా!’ అంది. కాకపొతే ఈసారి నోటితో. మళ్లీ వింటాను. తప్పేదేముంది?

తప్పేమి వుంది?

డెబ్బయి ఏడు వసంతాల పైచిలుకు జీవితంలో మొట్టమొదటిసారి,  పాత సంవత్సరం కొత్త సంవత్సరంలోకి  కొత్త విధంగా జారిపోయింది నిరుడు. అప్పుడు  ఏడాది వయసున్న నా  మనుమరాలు జీవిక  ఆ రాత్రి  నాకు కంపెనీ ఇచ్చింది. అదేమిటో ఇంత రాత్రి వరకు అది  మేలుకునే వుంది.

పాత అలవాట్ల ప్రకారం ఏదైనా  చేయబోయినా, చక్రాలు లాంటి కళ్ళతో వద్దు అనే సంకేతం ఇచ్చింది.   కొన్ని విషయాల్లో ప్రాణానికి ప్రాణం అయిన మా ఆవిడ మాటే నేను వినలేదు.

అలాంటిది జీవిక తన  కళ్ళతోనే నన్ను కట్టి పడేసింది.

నన్ను మార్చేసింది.

ఒక్క రోజు నా చిట్టితల్లి చెప్పే మాట వింటే ఏం పోతుంది.

దేవుడు అంతటివాడే పిల్లల మాట వింటాడు అంటారు.

ఇక నేనెంత?  

విన్నాను, అంతే !

ఇంతకు ముందు ఎందుకు వినలేదు?

అదీ! అంతే!! అనుభవానికి వస్తే కానీ అర్ధం కాదు.








 

(31-12-23)