29, జనవరి 2024, సోమవారం

ఒక తరం నిష్క్రమిస్తోంది – భండారు శ్రీనివాస రావు

 ఈ ఉదయం తెలంగాణా  రాష్ట్ర కాంగ్రెస్ కురువృద్ధుడు ఒకరు నిశ్శబ్దంగా తన జీవితాన్ని చాలించారు. వారి పేరు పి. నరసారెడ్డి. యాభయ్ ఏళ్ళ క్రితమే ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా,  ఎంపీగా , ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.  

చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా, మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కు  వెడతాను. నేను ఎవరన్నది మా పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుందని అన్నారు.  అయితే,  గొప్ప గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని కూడా చెప్పారు.

కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తే, కొంతకాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.

నర్సారెడ్డి గారితో నాకు ఓ పర్సనల్ టచ్ వుంది.

నేను రేడియో విలేకరిగా హైదరాబాదు వచ్చిన కాలంలో ఆయన రెవెన్యూ మంత్రి. నగరానికి కొత్తగా వచ్చాను కనుక రేషన్ కార్డు అవసరం పడింది. ఆ రోజుల్లో ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా రేషన్ కార్డు అవసరం అనేది అన్ని వర్గాలకు వుండేది. పాస్ పోర్టు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అంచేత ఆ కార్డు కోసం నా స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాను. తహసీల్ దారు (ఆ రోజుల్లో ఇదే పేరు) ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరిగి వేసారి, చివరకు రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గార్కి విషయం చెప్పాను. ఆయన నన్ను కూర్చోమని చెప్పి, పియ్యేకు ఏం చేయాలో చెప్పారు. కాసేపట్లో ఆ అధికారి ఉరుకులు పరుగుల మీద మంత్రి పేషీకి వచ్చారు. ముందే చెప్పడం వల్ల ఆయన తన ఆఫీసు స్టాంపు, స్టాంపు ప్యాడ్ తో సహా వచ్చారు. అక్కడికక్కడే నా వివరాలు తీసుకుని రేషన్ కార్డు మంజూరు చేస్తూ  సంతకం చేశారు. మర్నాడు ఆఫీసుకు వెళ్ళే సరికి రేషన్ కార్డు పుస్తకం టేబుల్ మీద వుంది.

29-01-2024   

 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది. మీరు మీ పరిచయాలు ఉపయోగించుకొని రేషన్ కార్డ్ టేబుల్ మీదికి తెప్పించుకున్నారు. ఇలాంటి సదుపాయాలు సౌకర్యాలు బాగానే పొందారు.

ఆ అవకాశం లేని సామాన్యులు నానా కష్టాలు పడేవారు.

ఆ రోజులలో రేషన్ కార్డుల పై ఇచ్చే పంచదార, గోధుమలు మధ్య తరగతి జీవులు ఎదురు చూసేవారు.