28, డిసెంబర్ 2022, బుధవారం

అమెరికాలో మంచు ముప్పు

 మంచు తుఫానులతో అతలాకుతలం అవుతున్న అమెరికా వార్తలు వింటున్నప్పుడు గుర్తుకు వచ్చిన అలనాటి మా మాస్కో జీవితం :

మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.
ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడుపడలేదు. కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు చలి గాలులు, మరికొన్నాళ్ళు మండే ఎండలు - ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం- తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే'
ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి - ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు,టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ చలి దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో - ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి.
ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకులమాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వానలో దుస్తులన్నీ 'మంచు కొట్టుకు పోతాయి' కానీ 'తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటె అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకు పోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను 'మంచు సమాధుల'లోనే ఉంచేసి , భూగర్భంలోని మెట్రో రైళ్ళలోనే రాకపోకలు సాగిస్తుంటారు.
కింది ఫోటో: మాస్కో రెడ్ స్క్వేర్ లో లెనిన్ మసోలియం క్యూ వద్ద మా ఆవిడ నిర్మల, కన్నడ న్యూస్ రీడర్ రామకృష్ణ గారి భార్య సరోజ



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఎలుగుబంటి దుస్తులు - 🐻 ha ha.