నిన్న అంటే మే పద్నాలుగో తేదీ గురువారం
నాడు దాదాపు అన్ని టీవీ ఛానళ్ళు ఒకే అంశాన్ని పదేపదే పలుసార్లు ప్రసారం చేశాయి,
హైదరాబాదు మహా నగరంలో చిరుతపులి సంచారం అంటూ. ఆ చిరుత నగర రహదారులపై తచ్చాడుతున్న
దృశ్యాలను అనేకసార్లు టీవీల్లో చూపెట్టారు.
పోలీసులు, జూ అధికారులు ఆ చిరుతను పట్టి బంధించడానికి నానా శ్రమ పడ్డారు. చివరికి
అది, చెట్లూ చేమలతో నిండిన, ఎవరూ నివాసం ఉండని ఓ విశాలమైన ఫాం హౌస్ ఆవరణలోకి తప్పించుకు వెళ్లిందని
సమాచారం. పులివేట కొనసాగుతుందని అధికారులు చెప్పినట్టు ఓ స్క్రోలింగు వేసి ఆ వార్తకు ఆ పూటతో మంగళం పాడేసి కొత్త వార్తల
వేటలో పడిపోయారు ఛానళ్లవాళ్ళు.
చిన్నప్పుడు స్కూళ్ళలో మాస్టార్లు ఒక
విషయాన్ని విశదంగా వివరించడానికి, లేదా పిల్లలకు దానిపై అవగాహన కలిగించడానికి ఏదో
ఒక పోలిక చెప్పి దానికీ దీనికీ ముడిపెట్టి చెప్పేవాళ్ళు. నిజానికి అలా అరటిపండు
ఒలిచినట్టు పాఠం చెప్పే అయ్యవార్లు అంటే పిల్లలకు కూడా అభిమానం వుండేది.
పులికీ, ఈ పాఠాలకు సామ్యం ఏమిటి అనే
అనుమానం రావచ్చు. వుంది. కానీ, ఎలాగూ ఇది
చదివిన తర్వాత, ఇలా వివరణ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది వెలిబుచ్చే సందేహం ఇదే.
ఇదేం పోలిక బాబూ అని అన్నాఅనవచ్చు.
పులి ఊళ్లోకి వచ్చింది. అది పచ్చి
నిజం. అందరూ టీవీల్లో చూసారు. అడవిలోకి వెళ్ళింది అన్నారు. ఎవరూ చూడలేదు. కానీ
జనాలు నమ్మారు. అది ఆ అడవిలోనైనా వుండిఉండొచ్చు. లేదా నగరంలోనే ఎక్కడైనా దాక్కుని
వుండిఉండొచ్చు. కానీ ఎవరూ చూసిన వాళ్ళు లేరు. అలాగే పులి తను నివాసం వుండే నిజమైన
అడవిలోకి వెళ్లి ఉండవచ్చు. ఇదీ చూసిన వాళ్ళు లేరు. ఇవన్నీ ఊహాగానాలే.
ఒకవేళ పులి నిజంగా నగరం పొలిమేరల్లోని
ఆ ఫాం హౌస్ లో వుంటే... అంటే అది మన పక్కలో ఉన్నట్టే. కానీ కనబడలేదు కాబట్టి దాని
గురించి పట్టించుకోవడం లేదు.
ఇక్కడే మేస్టార్లు చెప్పిన పాఠంలో
పేర్కొన్న పోలిక.
పులి కూడా కనబడకుండా పోయింది. కానీ
పక్కనే ఎక్కడో కనబడకుండా వుంది. అది పట్టుపడేదాకా
లేదా పట్టుకునేదాకా నగరం అలానే స్తబ్దుగా
వుండిపోదు కదా! అందుకే పులి వుంది అనే అనుమానం ఉన్నప్పటికీ నగర ప్రజలు నిన్నా నేడూ
కూడా తమ మానాన తమ జీవనం యధావిధిగా కొనసాగించారు.
అలాగే కరోనా. కరోనా కూడా కనబడని
శత్రువు. కానీ వుందని తెలుసు. మందు కనుక్కునేదాకా ఏమీ చేయలేమనీ తెలుసు.
అందుకే, కరోనాకు సరైన వాక్సిన్ కనుక్కునేదాకా దానితో యుద్ధమూ చేయాలి. దానితోనే సహజీవనమూ సాగించాలి.
3 కామెంట్లు:
పులికి కరోనా కి ఒకే విధానం అతకదు. పులి కనిపిస్తే కేకలేసో, దగ్గర్లో ఉన్న దుడ్డుకర్రతో సన్మానం చేసో లేక పులిరాజాకి ఎయిడ్స్ వచ్చే కారణాలు వివరించో వదిలించుకోవచ్చు. కానీ కరోనా అలా కాదు. కనబడకుండా దాడి చేస్తుంది.
@సూర్య : పోస్టులో ఇదే రాశాను. ఒకసారి చదవండి ప్లీజ్: "......పులికీ, ఈ పాఠాలకు సామ్యం ఏమిటి అనే అనుమానం రావచ్చు. వుంది. కానీ, ఎలాగూ ఇది చదివిన తర్వాత, ఇలా వివరణ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది వెలిబుచ్చే సందేహం ఇదే. ఇదేం పోలిక బాబూ అని అన్నాఅనవచ్చు. ......"
@సూర్య: పులికీ కరోనాకు పోలిక కాదు. మన మధ్యనే వున్నాయని తెలిసీ (అంటే ఈ రెండూ) కలిసి బతకాల్సిన ఆవశ్యకత గురించి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి