(Published in SURYA daily on 01-12-2019, SUNDAY)
వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ
వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ
కందుకూరి రామభద్రరావు గారు
వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా కవి, పండితుడు, రచయిత.
గోదావరీ తీర ప్రాంతంలో ప్రసిద్ధ కవులైన
దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, కాటూరి
వెంకటేశ్వరరావు మొదలైన భావకవులకు ఆయన సమకాలికులు. వీరందరూ కలిసి నవ్య సాహిత్య
పరిషత్ పేరుతొ ఒక సంస్థని నడిపేవారు. కందుకూరి రామభద్రరావు గారు కవిమాత్రమే కాదు, చక్కని వక్త కూడా. తదనంతర
కాలంలో భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి దిగ్గజాలు సయితం
రామభద్రరావుగారి ప్రసంగ పాటవానికి పరవశులయ్యారని చెప్పుకునేవారు. రేడియో ద్వారా
బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట – ఎంతపరిమళమోయి ఈ తోట పూలు’
అనే కవిత వీరి కలం నుంచి జాలువారినదే.
టీచరుగా పదవీ విరమణ పొందిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు పైగా విజయవాడ
ఆకాశవాణిలో విద్యావిషయిక కార్యక్రమాల ప్రొడ్యూసరుగా కూడా అయన పనిచేశారు.
ఈ రామభద్రరావుగారి పుత్రుడే ఈ
వ్యాసానికి ప్రేరణ అయిన శ్రీ కందుకూరి సూర్యనారాయణ.
వీరిది రాజమండ్రి దగ్గర రాజవరం.
(శ్రీ కందుకూరి సూర్యనారాయణ)
సూర్యనారాయణ మద్రాసులో ఎమ్మే చేసారు.
ఏడాది ఎదురు చూసినా సరైన ఉద్యోగం రాలేదు. అలా రోజులు దొర్లిస్తున్నప్పుడు,
1960 లో ఆంధ్రజ్యోతి
ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారు,
రామభద్రరావు గారిపట్ల ఉన్న మిత్రవాత్సల్యంతో, ఆయన కుమారుడు అయిన సూర్యనారాయణకు తమ
పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం ఇచ్చారు. విద్వాన్ విశ్వం అసిస్టెంట్ ఎడిటర్. నండూరి
రామమోహన రావు సీనియర్ సబ్ ఎడిటర్, తుర్లపాటి కుటుంబరావు, ఎల్లోరా,
వీరభద్రరావు ఇతర సహోద్యోగులు.
అలా ఓ ఏడాది గడిచిన తర్వాత, న్యూస్ రీడర్ ఉద్యోగాలకు రేడియో వాళ్ళు ఇచ్చిన ఒక ప్రకటన చూసి దరఖాస్తు చేసారు.
ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. హైదరాబాదులో ఇంటర్వ్యూ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. సూర్యనారాయణగారిని ఢిల్లీలో న్యూస్ రీడర్ గా
సెలక్ట్ చేసారు. అదే సమయంలో శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య, శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ
గార్లను కూడా న్యూస్ రీడర్లుగా ఎంపిక
చేశారు.
1962 లో ఢిల్లీ వెళ్లి ఆకాశవాణిలో తెలుగు
న్యూస్ రీడర్ గా చేరిపోయారు. అప్పటికే అక్కడి తెలుగు వార్తావిభాగంలో శ్రీయుతులు
పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి, తిరుమలశెట్టి
శ్రీరాములు పనిచేస్తున్నారు. శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ, మావిళ్ళపల్లి
రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు తరువాత
చేరారు.
1967 లో మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం
వచ్చింది. సూర్యనారాయణ గారికి మాస్కో
పోవాలని మనసులో పడింది. కానీ ఆయనది
రేడియోలో కాంట్రాక్టు ఉద్యోగం. స్టాఫ్ ఆర్టిస్ట్ కేటగిరీ. ప్రభుత్వ కొలువు కాదు.
మాస్కో పంపడానికి రేడియోవారికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడి ఉద్యోగానికి
రాజీనామా చేసి వెళ్ళాలి. మంచి ఉద్యోగం. ఎందుకు పోగొట్టుకోవాలి అని హితైషులు సలహా
చెప్పారు. ఉన్న ఉద్యోగం వదులుకోవాలి అనే షరతు నచ్చని కందుకూరివారు ఆ ఆఫర్ తిరస్కరించారు. దాంతో ఆఫీసు వారే దిగివచ్చి,
మూడేళ్ళ లోపు తిరిగొస్తే ఉద్యోగం ఉంటుందని హామీ ఇవ్వడంతో ఆయన మాస్కో ప్రయాణానికి
అవరోధం తొలిగి పోయింది.
1967 లో మాస్కో వెళ్ళారు. ప్రాస్పెక్ట్ మీరా
ప్రాంతంలో అపార్ట్ మెంటు ఇచ్చారు. కొన్నాళ్ళ తరువాత కుటుంబాన్ని పిలిపించుకున్నారు. అలా మాస్కో
రేడియోలో తెలుగు ప్రసారాలను ఆయన మొట్ట మొదటిసారి ప్రారంభించారు. (ఇక్కడ ఓ స్వవిషయం
ప్రస్తావించడం సముచితంగా వుంటుంది. సూర్యనారాయణ గారు మొదటి సారి మాస్కో నుంచి,
రేడియో మాస్కో ద్వారా తెలుగులో వార్తలు చదవడం
ప్రారంభిస్తే, 1991 లో నేను అదే మాస్కో నుంచి అదే రేడియో
మాస్కో ద్వారా చిట్టచివరిసారి తెలుగు వార్తలు చదివి అక్కడి తెలుగు ప్రసారాలకు మంగళం పాడాను. మా
ఇద్దరి నడుమ తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు గార్లు
రేడియో మాస్కోలో పనిచేశారు.)
రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన తరువాత
సూర్యనారాయణ గారి పనితీరు నచ్చి మరో ఏడాది పొడిగించారు. అలా మొత్తం మీద దాదాపు
మూడున్నరేళ్ళు మాస్కోలో గడిపి, 1970 లో ఢిల్లీ తిరిగివచ్చారు.
ఆశ్చర్యం. ఢిల్లీ రేడియోలో ఉద్యోగం
సిద్ధంగా వుంది. వెంటనే చేరిపోయారు. కానీ తరువాత తెలిసిందేమిటంటే ఉద్యోగం అయితే
ఇచ్చారు కానీ ఆయన సీనియారిటీ కోల్పోయారు. 1995 లో రిటైర్ అయ్యారు. ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. భార్య శ్రీమతి
కందుకూరి మహాలక్ష్మి. మంచి రచయిత్రి. నాలుగు కధా సంపుటాలు వెలువారించారు.
‘మీ రేడియో జీవితంలో ఏదైనా ఆసక్తికరమైన
సంఘటన జరిగిందా?’
ఫోనులో గంటకుపైగా హైదరాబాదు నుంచి
కందుకూరి సూర్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత నేను అడిగిన ప్రశ్న.
‘మీరూ రేడియోలో పనిచేసారు కదా! మీకు
తెలియంది కాదు. జనరల్ న్యూస్ రూమ్ లో అనేక భారతీయ భాషా విభాగాలు వుంటాయి.
అన్నింటికీ కలిపి ఉమ్మడిగా బులెటిన్ తయారు చేసి వివిధ విభాగాలకు పంపిస్తారు. మనం
కొత్తగా కలపడం కానీ, లేదా ఉన్నది తీసివేయడం కానీ జరగడానికి వీల్లేదు. ఒకసారి ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు నలుగురితో పాటు
నన్నూ పిలిచి సత్కరించారు. నాతొ పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు కూడా
పురస్కారాలు స్వీకరించారు. రేడియో తెలుగు వార్తల్లో చెప్పడానికి అధికారులు అభ్యంతర
పెట్టారు. చివరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ పేరు లేకుండా తెలుగు
వార్తల్లో చివరన చేర్చడానికి వారిని ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
‘సరే! మీరు అడిగారు కాబట్టి ఒక సంగతి
చెబుతాను. అరవైలలో కాబోలు గోవధను నిషేధించాలని కోరుతూ సాధువులు పార్లమెంటు
భవనాన్ని ముట్టడించారు. పార్లమెంటు భవనానికి దగ్గరగా వుండడం వల్ల రేడియో స్టేషన్
నుంచి ఇంటికి పోయే వీలు లేదు. ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చే అవకాశం లేదు. దాంతో
రెండ్రోజులు ఆఫీసులోనే వుండిపోవాల్సి వచ్చింది. అక్కడే పడక, అక్కడే భోజనాలు’
80 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన స్వరం స్పుటంగా
వుంది. అంతసేపు మాట్లాడినా అలసట కనబడలేదు. స్వరాన్ని వరంగా పొందిన ధన్యుల్లో ఆయన
ఒకరు.
అందుకే రేడియో వార్తలు చదివే రోజుల్లో
కందుకూరివారికి అంతమంది అభిమానులు.
(ఇంకా వుంది)