24, సెప్టెంబర్ 2019, మంగళవారం

హౌడీ మోడీ!


‘కుశలమా!’
‘క్షేమమా!’
‘బాగున్నారా!’
‘ఎలా వున్నారు’
ఎలా అడిగినా మనసులోని భావం ఒక్కటే. అలాగే ఇంగ్లీష్ లో కూడా కొన్ని పదాలు తమ రూపు రేఖలు మార్చుకుంటూ వుంటాయి. ప్రాంతాలను బట్టి నుడికారం మారుతూ వుంటుంది.
అలాంటిదే ఈ ‘హౌడీ’ కూడా.
దీనికి అసలు మూలం How do you do?  అది కాలక్రమంలో రూపం మార్చుకుని  అమెరికాలో కొన్ని చోట్ల ముఖ్యంగా టెక్సాస్ ప్రాంతంలో  Howdi గా మారిపోయి మొన్న ప్రధాని మోడీ గారి సభతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.  

23, సెప్టెంబర్ 2019, సోమవారం

క్రౌడ్ మేనేజ్మెంట్ – భండారు శ్రీనివాసరావు


శ్రీ ఆర్ ప్రభాకరరావు ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.  సున్నిత మనస్కులు. కఠినంగా మాట్లాడ్డం తెలియని ఈ పెద్దమనిషి పోలీసు శాఖలో ఎలా నిభాయించుకొచ్చారా అని ఆయనను సన్నిహితంగా తెలిసిన వాళ్ళు అనుకుంటూ వుంటారు.
పదవీవిరమణ అనంతరం ఒక సారి అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్లి, న్యూయార్క్ స్టేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు ఆహ్వానం మేరకు వారి ఇంటికి భోజనానికి వెళ్ళారు. ముచ్చట్ల నడుమ ప్రభాకర రావు గారు తాను హైదరాబాదు పోలీసు కమీషనర్ గా ఉన్నప్పటి ఓ అనుభవాన్ని పంచుకున్నారు.
ఆ రోజుల్లో క్రౌడ్ మేనేజ్ మెంట్ అంశాన్ని అధ్యయనం చేసేందుకు అమెరికా వెళ్లి న్యూయార్క్ నగర పోలీసు కమీషనర్ను (అక్కడ ఈ ఉద్యోగాన్ని యేమని పిలుస్తారో తెలవదు) కలిసారు.
‘మీ దేశంలో నాయకులు పాల్గొనే బహిరంగ సభలకు హాజరయ్యేవారి సంఖ్య ఏమాత్రం ఉంటుందని’ ఆ అమెరికా అధికారి ఆరా తీశారు. ఎన్టీఆర్ వంటి గ్లామర్ కలిగిన నాయకులు పాల్గొనే సభలకు ఇంచుమించు యాభయ్ అరవై వేలమంది వరకు జనాలు వస్తారని ప్రభాకరరావు గారు బదులు చెప్పారు.
దానికి అమెరికా పోలీసు అధికారి బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నారట.
“క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో మీరు మా దేశంలో నేర్చుకునేది కొత్తగా ఏమీ ఉండక పోవచ్చు. నిజానికి మేమే ఈ విషయంలో మీనుంచి చాలా నేర్చుకోవాలి’  

18, సెప్టెంబర్ 2019, బుధవారం

కల కాదా! నిజమా!! నా భ్రమా!!!


“ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక పిచ్చివాడితోనా!”
“ఆశ్చర్యంగా వుంది కదూ. నేనే మాట్లాడేది. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ పొద్దున్నే లేచి నా ఫోటోకి దణ్ణం పెడుతుంటే చూసి ఇక మాట్లాడక తప్పదు అనిపించింది.
“నేను ప్రతి రోజూ పూజలు చేస్తుంటే దేవుడి మండపంలో ఏనాడు దీపం కూడా  వెలిగించని నువ్వు ఇలా చేస్తుంటే నాకూ ఆశ్చర్యం అనిపించింది.
“నిన్ను ‘నువ్వు’ అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా. నిజమే! నా జీవితంలో నిన్ను ఏనాడూ ‘నువ్వు’ అని పిలిచి ఎరుగను. ఇప్పుడు జీవితమే లేని ‘జీవితం’ నాది. ఎల్లాగూ దణ్ణం పెడుతున్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను నేను నువ్వు అనే అంటాను.
“ఆ రాత్రి నువ్వు అంబులెన్స్ కోసం హడావిడి పడుతూ నా చివరి మాటలు వినే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నిజానికి నేనూ మాట్లాడే పరిస్తితి లేదు. ఏదో చెబుదామని నోరు తెరవబోయాను. మాట పెగల్లేదు. అంబులెన్స్, అడ్రసు చెప్పడాలు ఏవేవో మాటలు. అర్ధమయీ కాకుండా.
“అందుకే నెల రోజులు ఆగి ఇప్పుడు చెబుతున్నా విను.
“నువ్వు నువ్వులా వుండు. వేరేలా వుంటే నాకస్సలు నచ్చదు. బావగారూ, అక్కయ్యలు, మేనకోడళ్ళు  పిల్లలు అందరూ ఇదే చెబుతున్నారు, నీకు. వారి మాటే నా మాట కూడా.
“పెళ్లికాకముందు నుంచి నువ్వు ఎలా వుంటే బాగుంటుందో నాకో ఐడియా వుండేది. వేసుకుండే బట్టలు. నడిచే పద్దతి. మాట్లాడే తీరు. మూడోది నీదే, నేను మార్చింది ఏమీ లేదు.  గుర్తుందా. మద్రాసు నుంచి ఒక చొక్కా పోస్టులో పంపితే ఇదేం ఫ్యాషను అని వంకలు పెట్టావు. చివరికి అదే ఫ్యాషన్ అయింది. ఈ యావలోనే నేను ఒక పొరబాటు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ దుస్తుల సైజు నీకు తెలవదు. ఏ ప్యాంటుపై ఏ  కలర్ చొక్కా వేసుకోవాలో నేనే చెప్పేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అన్నది నీకే కాదు, నాకూ ప్రశ్నే.
“ఇన్నాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ప్రపంచమే నీ ప్రపంచమని వేళ్ళాడావు. ఇప్పుడు పట్టించుకోవడానికి ఇంట్లో నేనెట్లాగు లేను. మళ్ళీ నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయిపో. ఇంకో విషయం చెప్పనా! నువ్వు అలా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా వుంటాను. మాట వినే మొగుడు నా మొగుడని ముచ్చట పడతాను.
“ఒంటరిగా ఎలా నిభాయించుకుని వస్తావో తెలవదు. అదొక్కటే నా బాధ. కానీ నీ చుట్టూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్న మన వాళ్ళని చూసిన తర్వాత ఆ బాధ క్రమంగా తగ్గిపోతోంది.
“మళ్ళీ చెబుతున్నా విను. ఇదే ఫైనల్. మళ్ళీ  నా నోట ‘నువ్వొక పిచ్చివాడివి’ అనిపించకు”
నేనూ అందరిలాగే నిద్రలో అనేక కలలు కంటూ వుంటాను.
లేచిన తర్వాత ఒక్కటీ గుర్తు వుండదు. మరి ఇది ఎలా గుర్తుంది?
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!   

7, సెప్టెంబర్ 2019, శనివారం

శాస్త్రీయ ప్రయోగాలకు జయాలే కాని అపజయాలు వుండవు – భండారు శ్రీనివాసరావు


ప్రధాన మంత్రి మోడీ అన్నట్టు ‘ఇది అధైర్య పడే సమయం కాదు’.
చంద్రయాన్ – 2 ప్రయోగం తుట్టతుది ఘడియలో తలెత్తిన లోపం అపజయం ఎంతమాత్రం కాదు, అంతరాయం మాత్రమే.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు, అడ్డంకులు ఎదురయినప్పుడు భుజం తట్టి నేనున్నాను అని ఇస్తున్న భరోసాలు అణు పరీక్షల విషయంలో, అంతరిక్ష పరిశోధనల విషయంలో భారత శాత్రవేత్తలు సాగిస్తున్న మొక్కవోని కృషికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నది నిర్వివాదాంశం. ఈ తెల్లవారుఝామున ప్రయోగాన్ని వీక్షించడానికి స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు మరోమారు ఇచ్చిన భరోసా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
ఈ నేపధ్యంలో ఇలాంటిదే ఓ పాత జ్ఞాపకం.    
1987, మార్చి నెల  
ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు  రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.  
అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగా వున్నసమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.
రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.
అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని అనేక ప్రపంచ రికార్డులు  సొంతం చేసుకునేలా చేసింది.
అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.
నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు  వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.  (07-09-2019)



6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

చంద్రుడికో నూలుపోగు – భండారు శ్రీనివాసరావు


ట్రిగ్గర్ నిక్కగానే ఒక పిస్టల్ నుంచో లేక ఒక తుపాకీ నుంచో బయటకు దూసుకువచ్చే బుల్లెట్ తొలివేగం గంటకు సుమారు రెండువేల కిలోమీటర్లు ఉంటుందని అంటారు.
చంద్రుడు, చంద్రయాన్ గురించి ముచ్చటించుకునేటప్పుడు ఈ బులెట్ల గోలేమిటంటారా!
1969 లో కాబోలు మొదటి మానవ రహిత ఉపగ్రహం చంద్రుడిమీద దిగింది. ఆ రోజుల్లో సమాచారం తెలుసుకోవాలనే ఉత్సాహం మాత్రం పుష్కలంగా వుండేది. అయితే, సమాచారాన్ని తెలిపే సాధనాలు ఇప్పట్లోలా ఇన్ని లేవు. కొన్ని తెలుగు పత్రికల్లో అనువదించి ప్రచురించే వార్తలు మాత్రమే ఆధారం. అవీ ఈరోజు పత్రిక పల్లెటూళ్ళకు మరునాటి సాయంత్రమో, మూడో రోజు పొద్దున్నో వచ్చేవి. అదే పదివేలనుకుని చదివుకుని మురిసిపోయేవాళ్ళం.
బహుశా ఆంధ్రపత్రికలో కాబోలు ఇలాంటి సమాచారం చదివిన గుర్తు.
ఒక గుండెకు గురి పెట్టి పేల్చిన తుపాకీ గుండు అంత వేగంతో దూసుకుని వెళ్లి, ఒక అరా సెంటీ మీటరు దూరంలో వున్నప్పుడు తన వేగాన్ని పూర్తిగా తగ్గించుకుని ఓ పూవు మాదిరిగా సుతారంగా  గుండెను తాకితే ఎలా వుంటుందో ఊహించుకుంటే చంద్రుడి మీద దిగిన ఆ శాటిలైట్ గొప్పతనం అర్ధం అవుతుందని ఆ వార్త టీకా తాత్పర్యం. ఆ ఉపగ్రహం కూడా చంద్రుడి మీదకు ప్రచండ వేగంతో దిగుతూ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు (అంటే పైన చెప్పిన అర సెంటీ మీటరు మాదిరిగా, అంతేకాని నిజంగా అర సెంటీ మీటరు కాదు) హఠాత్తుగా తన  వేగాన్ని జీరో స్థాయికి తగ్గించుకుని ఒక పువ్వు మాదిరిగా అక్కడి నేలపై (?) వాలడం అన్నమాట.   ఇందులో అతిశయోక్తి ఏమేరకు వుందో ఇట్టే కనిపెట్టి ఎదురు వాదన చేయడానికి అప్పట్లో ఈ గూగులమ్మ లేదు. అంచేత అలాంటి వార్తలను చాలా ఉత్సాహంతో చదవడమే కాకుండా దాన్ని మరింత ఉత్సాహంతో నలుగురితో పంచుకునేవాళ్ళం. ఈ కాలపు పిల్లలు ఈ థ్రిల్ బాగా మిస్సయితున్నట్టే లెక్క.   
భారత అంతరిక్ష పరిశోధనాసంస్త ఈ అర్ధరాత్రి ఒక గొప్ప కీర్తిని మూటగట్టుకోబోతోంది. తెల్లారే లోపలే ఆ శుభ వార్త తెలుసుకోవాలనే ఉత్సుకతతో లక్షలాదిమంది భారతీయులు ఈ రాత్రి జాగరణకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ పాత జ్ఞాపకం.

తరాల అంతరం – భండారు శ్రీనివాసరావు

చనిపోయే ముందు కొడుక్కు చెప్పాడు తండ్రి.
‘నేను ప్రతి రోజూ ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అని కోరుకుంటూ ఉండేవాడిని. నువ్వూ అలాగే కోరుకో’ అని కన్నుమూశాడు.
కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. కాకపోతే కొద్దిగా మార్చి దేవుడ్ని వేడుకున్నాడు.
‘నేను బాగుండాలి. అందరూ బాగుండాలి’
అతడికీ ఒకరోజు చివరి రోజు వచ్చేసింది.
తన కొడుకుని పిలిచి తనకు తన తండ్రి చెప్పినట్టే చెప్పి చనిపోయాడు.
అతడి కొడుకూ తండ్రి చివరి కోరికను కొద్దిగా మార్చి నెరవేర్చాడు.
‘ముందు నేను బాగుంటేనే కదా! ఇతరుల బాగోగులు చూసేది. కాబట్టి నేను బాగుండేటట్టు చూడు స్వామీ!’


అనేది అతడి ప్రార్ధన.

2, సెప్టెంబర్ 2019, సోమవారం

మాట పెగల్లేదు


‘ఏరా సీనప్పా! (మా ఇంట్లో పెద్దవాళ్లందరూ ఇలాగే పిలుస్తారు) ఎలా ఉన్నావురా! హైదరాబాదు వద్దామనుకున్నా. కానీ విషయం నీకూ తెలుసు కదా!’
ఆమె మా పెద్దత్తయ్య కూతురు. వయసు ఎనభయ్  పైమాటే. ఇంట్లో అందరూ చిట్టీ అనేవారు. ఇన్నేళ్ళుగా అదే పేరు. అసలు పేరు అందరూ మరచిపోయారు. పదిహేనో ఏట పెళ్లయింది. పుట్టిల్లు ఖమ్మం మామిళ్ళగూడెం నుంచి అత్తగారిల్లు నల్గొండ రామగిరికి చేరింది. అప్పటినుంచీ ఆ భార్యాభర్తలు విడిగా వున్నది లేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసే.
నా భార్య ఆగస్టు పదిహేడో తేదీ రాత్రి చనిపోతే మా చిట్టి వదిన భర్త శ్రీ కొమర్రాజు మురళీధరరావు గారు తన 87వ ఏట ఆగస్టు 24న కన్నుమూశారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న ఈ మనిషి నాకు ఫోను చేసి ఊరడింపు వాక్యాలు చెబుతుంటే నాకు నోటెంట మాట పెగల్లేదు.
కింది ఫోటోలో: మంచం మీద కూర్చుని (ఎర్రచీర) ఆట షో చూపిస్తున్న పెద్దావిడ మా వదిన గారు. భార్య పేకాటలో గెలిచి షో చూపిస్తుంటే మందహాసంతో గమనిస్తున్నది ఎవరో కాదు, పరిపూర్ణ జీవితం గడిపి ఈ మధ్యనే తనువు చాలించిన మురళీధరరావుగారే.  


      

ఆ రాత్రి ఏం జరిగింది?


ఆగస్టు 17 రాత్రి పదిగంటలు. మామూలుగా నిద్రపోవడానికి ముందు ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు కార్డ్సు ఆడాలని అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. ఎప్పుడూ ఘంటసాల పాత పాటలు వచ్చేవి. ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది. తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ పిలిపించాను. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావుకబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!
Top of Form

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

గరుడపురాణం – భండారు శ్రీనివాసరావు


గరుడ పురాణంలో పాపులకు విధించే శిక్షలు జ్ఞాపకం ఉన్నాయా!


అనగనగా ఓ అమ్మాయి. బుద్ధి తక్కువై ఓ అబ్బాయిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది. దాంతో మొదలయ్యాయి ఆ అమ్మాయికి అంతులేని కష్టాలు.
అలాగని అతడు పెళ్ళాన్ని రాచిరంపాన పెట్టే బాపతు కాదు. ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించినంత గాఢంగా, ఘాటుగా కాకపోయినా  భార్యపై ఓ మోస్తరు ప్రేమకి తక్కువేమీలేదు.
మరిక కష్టాలు ఏమిటంటారా!
అతడికి దేవుడు అంటే నమ్మకమే. కానీ మూఢ భక్తి కాదు. గ్రహణాల పేరుతొ చూలింతలను చీకటి గదిలో పగలంతా  పడుకోబెట్టడం వగయిరాలు నచ్చవు. భార్య తొలిచూలుతో వున్నప్పుడు సూర్య గ్రహణం వచ్చింది. చుట్టపక్కాల మాటల్ని, సలహాల్ని  ఖాతరు చేయకుండా గర్భిణి అయిన భార్య చేత గోధుమ పిండి తడిపించాడు. ముద్దలు చేసి, చపాతీలు చేయించాడు. ఉల్లిపాయలు కోయించాడు.  రోజువారీ పనులన్నీ పట్టుబట్టి అవసరం లేకపోయినా చేయించాడు. మూర్ఖంగా ఇవన్నీ  చేయించాడే కానీ మనసు మూలల్లో ఏదో కలవరం. గ్రహణ కారణంగా పుట్టబోయే శిశువు అవకరంగా పుడితే... ఆ భయం అతడికి ఏ కొద్దోగొప్పో  వుండివుండవచ్చేమో కానీ ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె ప్రేమలో ఏమాత్రం స్వార్ధం లేదు. అందుకే అతడు చెప్పినవన్నీ నిశ్చింతగా చేసేసింది. తన భర్తపై ఆమెకు ఉన్న నమ్మకమే మూఢనమ్మకాలను జయించేలా చేసింది.  మూఢాచారాలపై తన భర్త పెంచుకున్న అపనమ్మకాలకు ఒక విలువ దక్కేలా చూసింది. ఈ క్రమంలో అంత చిన్న వయస్సులోనే అంతులేని ధైర్య సాహసాలను  ప్రదర్శించింది.
ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం నిజమే అయితే,  భార్యను మానసికంగా ఇన్ని చిత్ర హింసలు పెట్టిన నాకు ఆ శిక్షలు పడాలంటారా లేదా!